ధారావాహికలు

రామాయణ సంగ్రహం

అప్పుడు కార్త్యవీరుడి మంత్రులు ‘ముందు మాతో యుద్ధం చేయండి’ అని రావణుడి మంత్రులను కోరారు. రావణుడి మంత్రులు కోపంతో వాళ్ళను చంపివేశారు. అప్పుడు కార్త్యవీరుడి సేనాపరివారంలో గొప్ప గగ్గోలు పుట్టింది. సంక్షోభం బయలు దేరింది.
కొందరు పరిచారకులు వెళ్ళి నదిలో ఉన్న కార్త్య వీరుడికి ఈ సంగతి విన్నవించారు. కార్త్యవీరుడప్పుడు మహాకోపోద్రిక్తుడైనాడు. తనతో జలక్రీడలాడుతున్న సుందరీమణులకు అభయం పలికి ఆయన గొప్ప గద ధరించి గట్టుమీదికి వచ్చాడు. ముందుగా అతడు రావణుడి మంత్రి అయిన ప్రహస్తుడితో తలపడ్డాడు. వాళ్ళిద్దరి మధ్యా పోరు భీకరంగా సాగింది. తన గదతో బలంగా ప్రహస్తుణ్ణి ప్రహరించాడు కార్త్యవీర్యార్జునుడు.. రావణుడి మంత్రి తలపగిలి కిందపడి పోయినాడు. తరువాత తక్కిన మంత్రులు కార్త్యవీర్యార్జునుణ్ణి ఎదుర్కొన్నారు. వాళ్ళను అవలీలగా పరాజితుల్ని చేసి రావణుణ్ణి బంధించి మాహిష్మతీ నగరం తీసుకొని పోయినాడు కార్త్యవీరార్జునుడు. నగరమంతా తమ ప్రభువు విజయాన్ని ప్రశంసించింది. ‘ఒక్క యోగులే తప్ప వాయువును ఇతరులు ఎవరూ బంధించలేరు. అట్లానే రావణుణ్ణి ఎవరూ బంధించలేరు ఇదివరకు’ అని పొగిడారు ప్రజలు.

కార్త్యవీర్యార్జునుడు రావణుణ్ణి బంధించాడన్న వార్త దేవతల వల్ల పులస్త్యబ్రహ్మ తెలుసుకొన్నాడు. ఆయనకు తన పుత్రుడిపైన, పుత్రుడి పైనా అగ్గలమైన ప్రేమ కలిగింది. కరుణ కలిగింది. రావణుణ్ణి విడిపించాలనే కోరిక కలిగిందాయనకు. అప్పుడాయన దివోమార్గాన మాహిష్మతీపురానికి చేరుకున్నాడు. సూర్యుడే పాదచారియై వస్తున్నాడా? అని మాహిష్మతీపురం జనులందరూ విభ్రమం పొందారు.
పులస్త్యబ్రహ్మ రాకను సంభ్రమచిత్తులై చారులు వెళ్ళి కార్త్యవీర్యార్జునుడికి తెలియజేశారు. హైహయుడు ఆర్ఘ్యపాద్యాదిసహితంగా ఆయనకు ఎదుర్కోలుగా వెళ్ళాడు.
‘పరమబ్రహ్మణ్యుడా! నీవు మహిష్మతీపురం రావడం వల్ల నాకు ఇంద్రపదవి లభించినట్లుగా సంతోషిస్తున్నాను. నా పురం అమరావతితో తుల్యత పొందింది. నాజన్మ ఫలించింది. నా రాజ్యము, వంశమూ కృతార్థత పొందాయి. సఫలత పొందాయి. ఏం చెయ్యాలో నన్ను ఆజ్ఞాపించండి’ అని వినయంగా పులస్త్యుణ్ణి వేడుకున్నాడు కార్త్యవీర్యార్జునుడు. పులస్త్యుడిందుకు ఎంతో ప్రీతుడైనాడు. ‘నాయనా! నీ పలుకులు నాకెంతో సంతోషానిస్తున్నాయి. నీవంటి అసమాన బలపరాక్రమవంతుడు ఈ పుడమిలోనే లేడు. రావణుణ్ణి నీవు బంధించావంటే అది నీకు సాటిలేని కీర్తి తెచ్చిపెట్టింది. ‘రావణవిజేత’ వని ముల్లోకాలలోనూ నీ గూర్చి చెప్పుకుంటున్నారు. నా కోరిక ఏమిటో నీవు అడిగావు కాబట్టి నా మనవడైన రావణుణ్ణి విడిచి పెట్టటమే నా కోరిక’ అని చెప్పాడు పులస్త్యుడు మాహిష్మతీపురాధిపతితో.
పులస్త్యుడి కోరిక విని కార్త్యవీర్యార్జునుడు రావణుణ్ణి వెంటనే బంధ విముక్తుణ్ణి చేశాడు. విలువైన ఆభరణాలు, ప్రసస్తమైన నూత్నవస్త్రాలు, పూలదండలు రావణుడికి సమర్పించి ‘నీవు నా స్నేహితుడివి’ అన్నాడు.
తాతను చూసి రావణుడు ఎంతగానో సిగ్గుపడ్డాడు. ‘ముందైనా వివేకంతో జాగ్రత్తగా ప్రవర్తించు’ అని రావణుడికి చెప్పి పులస్త్యుడు స్వస్థానానికి మరలి పోయినాడు.
ఏవం బలిభ్యో బలినః సంతి రాఘవనందన,
నా వజ్ఞా హాయ్ పారే కార్యా య ఇచ్చేత్ ప్రియమాత్మనః. (ఉత్తర 33.22)

‘బలవంతుడు నాకేమని ఎవరూ అహంకరించకూడదు. తనకంటే బలవంతుడెవరూ లేడనీ, ఉండడనీ అనుకోకూడదు. బలవంతులను మించిన బలవంతులూ ఉంటారు. కాబట్టి తన బాగు కోరుకొనేవాడెవడూ ఇతరులను అవమానించకూడదు’ అన్నాడు అగస్త్యమహర్షి శ్రీరాముడితో.

‘అయితే రావణుడు బుద్ధి తెచ్చుకోలేదు. ఈ భూలోకంలో నాకంటే బలశాలి, పరాక్రమవంతుడు ఎవడున్నాడని మళ్ళీ లోకసంచారానికి బయలుదేరాడు. యుద్ధం, యుద్ధం అని దురద పుట్టినట్లు ప్రలాపించాడు. వాలిని గూర్చి విని కిష్కింధకు వెళ్ళి తాను వాలితో యుద్ధం చేయడానికి వచ్చినట్లు నగరంలోకి కబురు పంపించాడు. అయితే వాలి మంత్రి తారుడు, మామ సుషేణుడు, యువరాజు సుగ్రీవుడూ రావణుడి దగ్గరకు వచ్చి ‘రావణా! నీకు యుద్ధభిక్ష పెట్టడానికి కిష్కింధాపురాధీశుడు మా వాలి ఒక్కడే సమర్ధుడూ, తగినవాడున్నూ. అయితే సమయానికి ఇక్కడ లేడు మా ప్రభువు. సూర్యోదయాత్పూర్వమే ఆయన నాలుగు సంద్రాలలో స్నానసంధ్యోపాస్తులు నిర్వర్తించుకొని రావడం తన నిత్యవిధిగా పాటిస్తున్నాడు. అప్పటి దాకా నీవు నిరీక్షించలేకపోతే దక్షిణ సముద్రతీరానికి పో! అక్కడ నీకాయన కనపడతాడు. నీ రణకుండూతి తీర్చుకోవచ్చు. నీ సంగతేమిటో అక్కడ తేలిపోతుంది’ అని చెప్పారు వాళ్ళు. రావణుడు పెడ నవ్వు నవ్వి ‘పొండిరా కోతుల్లారా!’ అని వాళ్ళను పరాచికంగా ఆటలు పట్టించి కామగమనంకల తన పుష్పకం ఎక్కి వెంటనే సముద్రతీరం చేరాడు. అక్కడ వాలి సంధ్యను ఉపాసిస్తూ మేరుగిరి ప్రభాభాసమానుడై ఉండటం రావణుడు చూశాడు. వెనుకపాటుగా వెళ్లి వాలిని ఆక్రమించి అతడికి సంభ్రమం కలిగించాలని రావణుడు విడ్డూరమైన ఆలోచనతో వెళ్లి వాలిని వెనుకనుంచి వాటేసి పట్టుకున్నాడు. రావణుడు రావడం వాలి గమనించాడు కాని చలించలేదు. సింహం కుందేలును, గరుత్మంతుడు పామునూ చూసి విభ్రమం పొందటమా! ఇట్లా రావణుడు వెనుక నుంచి తనను పట్టుకోగానే వాలి చటుక్కున వాణ్ణి ముందుకు లాగి చంకలో ఇరికించుకున్నాడు. ఆ సముద్రంలో రావణుణ్ణి ఒకసారి ముంచి రివ్వున ఎగిరిపోయి మూడు సముద్రాలలో చంకలో ఇరికించుకునే రావణుణ్ణి ముంచి తేల్చాడు. తన కట్టుబట్ట జారిపోతుండగా సవరించుకోవటానికి కూడా సాధ్యం కాక రావణుడు సిగ్గుతో కుంగి పోయినాడు. చచ్చినంత పనైంది రావణుడికి. వాలి తక్కిన మూడు సముద్రాలలో వాణ్ణి ముంచినా తన సంధ్యావందన కలాపంలో ఏమీ లోపం రానియ్యలేదు. వాలి ధర్మమా అని నాలుగు సముద్రాలలో స్నానం చేసిన పుణ్యం అప్రయత్నంగా, అనాయాసంగా సంపాదించుకున్నాడు రావణుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked