కథా భారతి

వలస

-ఆర్ శర్మ దంతుర్తి

ఆఫీసునుంచి సాయంత్రం ఇంటికొచ్చిన రమణ లోపలికి వస్తూ అరిచేడు, “ఈ రోజు కొత్త న్యూస్; శాన్ ఆంటానియోలో నాకో మంచి ఉద్యోగం వచ్చింది మనం టెక్సాస్ వెళ్ళిపోతున్నాం.”
“అదేమిటి, మరి ఇక్కడ ఈశ్వరి చదువో? మధుని ఇప్పుడే డే-కేర్ లో చేర్పించాం. వాడు కుర్రాడు కనక ఎలాగోలా తట్టుకున్నా, అమ్మాయి అక్కడ కలవగలదా? టెక్సాస్ అంటే అక్కడ స్పానిష్ మాట్లాడే మెక్సికన్లు ఎక్కువగా ఉంటారంటారు కదా?” కల్పన అడిగింది రమణని అనుమానంగా చూస్తూ. ఈ లోపుల, నాలుగో తరగతి చదివే అమ్మాయి ఈశ్వరికి ఇది అర్ధం అయిందో లేదో కానీ వీళ్ళ మధ్యలోకి వచ్చి ఈ తతంగం ఏమిటో చూడబోయింది.
“మొన్నామధ్య ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, మొదట్లో ఉత్తి ఫేమిలీ కేర్ డాక్టర్ లా పనిచేస్తావా అని అడిగారు. ఆలోచిస్తాను అని చెప్పాను. కానీ ఈ రోజు ఫోన్ చేసి చెప్పారు మళ్ళీ, ఫేమిలీ కేర్, డయాబెటిక్ కేర్ కి కలిపి ఓ క్లినిక్ ఓపెన్ చేస్తున్నారుట. వస్తావా అని అడిగారు. వెంఠనే సరే అని చెప్పాను. వచ్చేనెల నాలుగో తారీఖుకి అక్కడుండాలి.”
“అంత త్వరగా ఎలా? ఇక్కడ అపార్ట్ మెంట్ ఖాళీ చేయాలి. దీన్ని స్కూల్లోంచి తీసుకెళ్ళి అక్కడ చేర్పించాలి. సామాను సర్దుకోవాలి. అవన్నీ నాలుగో తారీఖు అంటే మరో ఇరవై మూడు రోజుల్లో ఎలా కుదురుతాయ్?” కల్పన కేలెండర్ చూసి లెక్కలు కడుతూ అడుగుతోంది.
“ఎలాగో ఒకలా కుదుర్చుకోవడమే. ఇప్పుడు ఈ పెన్సిల్వేనియా చలిలో వణకడం కన్నా టెక్సాస్ వెళ్ళడం మంచిది. రెండో విషయం, టెక్సాస్ లో డాక్టర్ల మాల్ ప్రాక్టీస్ కి లిమిట్ ఉంది. అల్లాటప్పాగా ఇష్టం వచ్చినట్టూ నన్ను ఎవడూ కోర్ట్ కి ఈడవడు. వాతావరణం ఇక్కడకన్నా వందరెట్లు నయం. ఈశ్వరి స్కూల్ దేముంది ఇంకా ఎలిమెంటరీలోనే కదా? వెంఠనే అక్కడ స్కూల్లో సీటు దొరుకుతుంది. సామాను సర్దడం గురించి నీకు ప్రోబ్లెం లేనేలేదు. మూవర్స్ వచ్చి వాళ్ళే ఇక్కడ పేక్ చేసి అక్కడ డెలివరీ చేస్తారు. మన మూవింగ్ కి మొత్తం డబ్బులు ఇస్తారని చెప్పారు. వెళ్ళాక మొదటి రెండు నెలలు ఇంటి అద్దె వాళ్ళదే. ఈ లోపున కొనుక్కోవడానికి ఇల్లు చూసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ విను డార్లింగ్, జీతం మరో పదిహేనువేలు పెరుగుతోంది. కేక్ మీద ఐసింగ్ ఏమిటో తెలుసా? టెక్సాస్ లో స్టేట్ టేక్స్ కట్టక్కర్లేదు. అంటే జేబులో పెరిగిన జీతం, స్టేట్ టేక్స్ డబ్బులు మరో పదివేల పైన మిగుల్తాయి. ఇళ్ళు ఇక్కడ కన్నా చవక. వెంఠనే మనం ఒక ఐదు బెడ్రూంలు ఉన్న ఇల్లు కొనబోతున్నాం.” ఉత్సాహంగా చెప్పుకుపోయేడు రమణ.
“ఇంతకీ ఉద్యోగం బాగుంటుందా? అర్ధరాత్రీ, అపరాత్రి పిలుస్తారేమో?”
“డయాబెటిక్ కేర్, ఫేమిలీ కేర్ అన్నారు. అంటే దాదాపు అర్ధరాత్రి పిలవకపోవచ్చు. కానీ డాక్టర్ అన్నాక ఎప్పుడైనా ఒక్కోసారి ఎమర్జన్సీకి వెళ్ళాల్సి రావడం తప్పకపోవచ్చు. మరీ అంత రోజూ రాత్రి పిలవరనుకుంటా.”
“డాడీ, మరి నా స్కూల్లో ఫ్రెండ్స్ ఎలా?” ఏడుపు మొహంతో అడిగింది ఈశ్వరి. ఈ లోపున కల్పన ఏదో పని మీద వంటింట్లోకి వెళ్ళడం చూసి రమణ చెప్పాడు.
“అక్కడ నీకు బోల్డుమంది స్నేహితులు దొరుకుతారుగా? శాన్ ఆంటోనియోలో మంచి స్కూళ్ళు ఉన్నాయి. చాలామంది మనవాళ్ళు ఉంటారు. గుడికి వెళ్ళొచ్చు. ఇక్కడలాగా ఎక్కువ స్నో పడదు. రోజూ కోటు వేసుకోనక్కర్లేదు. రివర్ వాక్ అనేది ఉంది. స్పానిష్ నేర్చుకోవచ్చు. ఇంకో రహస్యం ఉంది చెప్పమంటావా? అది కావాలిస్తే నాకో ముద్దివ్వాలి మరి.”
“చెప్పు మరి? ఏమిటది?” దగ్గిరకి వచ్చి నాన్న చెంపమీద ముద్దు ఇచ్చి అడిగింది ఈశ్వరి.
చిన్న గొంతుతో అన్నాడు రమణ, “అమ్మకి చెప్పకూడదు మరి. సరేనా? శాన్ ఆంటోనియోకి బీచ్ చాలా దగ్గిర. పొద్దున్నే వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చేయవచ్చు. ప్రతీ శనివారం ఇంక బీచ్, చీచ్, గీచ్! ఇంకో విషయం తెలుసా, టెక్సాస్ లో అన్నీ సైజు పెద్దవిట. అంటే తినే శాండ్ విచ్, తాగే కోలా, తినే ఐస్ క్రీం అన్నీ బిగ్, బిగ్ అంటూ అమ్ముతారు.”
“అయితే మనం శాన్ ఆంటోనియో వెళ్ళిపోదాం,” బీచ్, ఐస్ క్రీమ్ అనేవి వినగానే మెరుస్తున్న కళ్ళతో అంది ఈశ్వరి.
రమణ అరిచేడు వెంఠనే, “అమ్మాయిగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారోయ్, కల్పనా!”
* * * * * * *
మర్నాడు రమణ పిట్స్ బర్గ్ లో చేసే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి టెక్సాస్ వెళ్ళడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదటగా కావాల్సినది ఒక అపార్ట్ మెంట్ రెండు నెలలకి. అది ఒకటి కుదిరిపోతే మిగతావి ఈజీ వీజీ. తెలుసున్నవాళ్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా రెండు మూడు ఏరియాలలో అపార్ట్ మెంట్ ఎక్కడ వెతకాలో చూడడం, కొన్ని ఫోన్లు కొట్టాక తెలిసిన విషయం, రాబోయే శనివారం లోపు వస్తే అపార్ట్ మెంట్ చూసుకోవచ్చు.
శుక్రవారం శెలవు పెట్టి రమణ శాన్ ఆంటోనియో బయల్దేరాడు పొద్దున్నే. మొదట్లో తాను పనిచేయబోయే ఆఫీసుకి వెళ్ళి కాబోయే బాస్ ని పలకరిచాక, ఇంటికోసం రోజంతా ఊర్లో తిరిగితే సాయంత్రం అవుతుండగా కాస్త మంచి అపార్ట్ మెంట్ దొరికింది. రెండు నెలలకే అని చెప్పి డిపాజిట్, మొదటి నెల అద్దె
చ్చి సాయంత్రం ఊరు చూడ్డానికి బయల్దేరాడు. ఊర్లో బతుకెలా ఉంటుందో, సరుకులెలా ఉంటాయో చూడాలంటే సులువైన దారి ఓ గ్రోసరీ స్టోర్ లో దూరడం. పాలు, కూరలూ, పప్పూ ఉప్పూ, కారుకి కావాల్సిన గేస్ ఎంతకి అమ్ముతున్నారో తెలిస్తే ఊర్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందో చిటికెలో చెప్పొచ్చు కదా? బాగా పొద్దుపోయి, ఊరి గుడి లో దేవుడి దర్శనం అయ్యేక, ఒకాయన్ని పట్టుకుని ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఎడ్రస్ అదీ సంపాదించి వెళ్ళాడు చూడ్డానికి. ఫర్వాలేదు చాలామటుక్కి అన్నీ పిట్స్ బర్గ్ అంత ఖరీదు కాకపోయినా అక్కడకన్నా ఎక్కువకాదు. కొన్ని టెక్సాస్ లో చవక కూడా. అన్నింటికన్నా మంచి విషయం కావాల్సినన్ని ఇండియన్ స్టోర్లు ఉన్నై.
శనివారం పొద్దున్నే స్కూల్ సంగతి వాకబు చేస్తే తెల్సిన విషయం – స్కూల్ బస్ అపార్ట్ మెంట్ దగ్గిరలోకి వస్తుంది. కొంతమంది స్పానిష్, ఇండియన్ పిల్లలూ ఉన్నారు. భయంలేదు. అన్నీ కుదిరాక ఎయిర్ పోర్ట్ లో తీసుకున్న కారు వెనక్కి ఇచ్చేసి పిట్స్ బర్గ్ వచ్చేసాడు రమణ శనివారం రాత్రికి.
మర్నాడు తాము ఉండబోయే అపార్ట్ మెంట్ ఫోటోలు, అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్ అన్నీ చూపించాడు కల్పనకీ, ఈశ్వరికీను. కల్పన కి కావాల్సింది ఉండేచోట కాస్త సుఖంగా ఉంటే చాలు, పాపకి స్కూల్, బీచ్, స్విమ్మింగ్ పూల్ అనేవే కావాలి ఆ వయసుకి. కుర్రాడికి ఇంకా నాలుగేళ్ళు. వాడి సంతోషం వాడి లోకం వాడిది.
మరో వారానికి మూవర్స్ వచ్చి సామానంతా పేక్ చేసి పట్టుకెళ్ళాక, ఇల్లు ఖాళీ చేసి శాన్ ఆంటోనియా జేరిపోయింది రమణ కుటుంబం. అదే రోజు సాయంత్రం మరోసారి గుడికెళ్ళి దేవుణ్ణి చూసాక మర్నాటినుండి ఈశ్వరిని స్కూల్లో పెట్టి, రమణ కొత్త ఉద్యోగంలో జేరిపోయాడు.
* * * * * * *
మూడువారాలకి బండి దారిలో పడుతుండగా ఓ రోజు అర్ధరాత్రి రమణకి ఎమర్జన్సీ నుంచి ఫోనొచ్చింది. ఎవరో స్పానిష్ పేషెంట్ కి బ్లడ్ సుగర్ బాగా ఎక్కువైందిట, దాంతోబాటే, రక్తపోటూ అవీను. అక్కడే ఉన్న తెల్ల, నల్ల డాక్టర్లని ఎవర్నీ లోపలకి రానీయకుండా అరుస్తున్నాడు పేషెంట్. రమణ తెలుపూ, నలుపూ కాదు కనక ఆయనొచ్చి పేషెంట్ ని చూడగలడా అని అడుగుతున్నారు. అలా రాత్రి పదకొండింటికి హాస్పిటల్ ఎమర్జన్సీలో తేలాడు రమణ మొదటిసారి.
పేషెంట్ పేరు ఫెర్నాండెజ్. ఎక్కడివాడో ఎలా అమెరికా వచ్చాడో తెలియదు కానీ దాదాపు పది ఏళ్ళనుండీ టెక్సాస్ లో ఉండిపోయాడు. రమణ చార్ట్ పట్టుకుని పేషెంట్ ఉన్న రూంలోకి వెళ్లబోతూంటే ఫెర్నాండెజ్ పెద్దగా అరవడం వినిపిస్తోంది “నన్ను ఇమ్మిగ్రేషన్ కి పట్టి ఇప్పిద్దామనా? ఎవరూ లోపలకి రాకండి,” అంటూ.
రమణ గుమ్మం దగ్గిరే నుంచుని చెప్పాడు, “నేను డాక్టర్ ని. మీ ఇమిగ్రేషన్ కీ నాకూ ఏమీ సంబంధం లేదు. మీకు వంట్లో బ్లడ్ సుగర్ బాగా ఎక్కువగా ఉంది. అది చూడడానికి వచ్చాను. వచ్చి చూడమంటే చూస్తా.”
“ఈ వంక పెట్టి నన్ను ఇమ్మిగ్రేషన్ కి పట్టి ఇద్దామనా? ముందో సారి వస్తే అలా చేయబోయేరు, పక్కగదిలోంచి పారిపోయాను. ఇప్పుడు అసలే నాకు వంట్లో బాగాలేదు కళ్ళు తిరుగుతున్నాయి….”
“చూడండి, నేనూ మీలాగే ఇమ్మిగ్రంట్ ని. మిమ్మల్ని పట్టి ఇస్తే నాకేమీ లాభం లేదు. మీ ఆరోగ్యం తప్ప మరో విషయం నాకు అనవసరం. లోపలకి వచ్చి ఈ బ్లడ్ సుగర్ సంగతి చూడమంటారా, లేకపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. మీ ఆరోగ్యం, మీ ఇష్టం; నాదేం లేదు మధ్యలో” రమణ చెప్పేడు కామ్ గా.
ఏ కళనున్నాడో, మరోసారి తీరిగ్గా రమణ కేసి అనుమానం తీరేలా చూసి, “మీరూ ఇమ్మిగ్రంటేనా, అయితే రండి,” ఫెర్నాండెజ్ రమణని లోపలని రానిచ్చేడు తన ఆరోగ్యం సంగతి చూడ్డానికి.
పేషెంట్ కి బ్లడ్ సుగర్ ఎక్కువగా ఉంది; తినే తిండిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకోవాలి, బ్లడ్ ప్రెషర్ కి మందు ఇస్తారు ఇప్పుడు, కానీ రోజూ వ్యాయామం చేయాలి, రమణ ఇవన్నీ చెప్పుకొచ్చాడు.
అన్నీ విన్న ఫెర్నాండెజ్ ఏడుపు మొహంతో అన్నాడు, “మేము రోజూ తినే బురిటోలూ, బీన్స్ అవీ వద్దంటారు. ఇంకేముంది తినడానికి? అన్నింటికన్నా నాకింకా గ్రీన్ కార్డ్ లేదు, రోజూ ఇమ్మిగ్రేషన్ వాళ్ళు పట్టుకుంటారేమో వెనక్కి నన్ను మా దేశానికి పంపించేస్తారేమో అని టెన్షన్. ఇంట్లో ఇద్దరు చిన్న అమ్మాయిలున్నారు నాకు. పెద్దమ్మాయి నాలుగో క్లాస్ చదువుతోంది డాల్టన్ ఎలెమెంటరీ స్కూల్లో. వాళ్ళు ఇక్కడపుట్టినవాళ్ళే. నన్ను డిపోర్ట్ చేస్తే పిల్లలని ఎవరు చూస్తారు? దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్నట్టూ ఉంది నా బతుకు….”
“మీ ఆవిడ ఉంటుందిగా పిల్లల్ని చూడ్డానికి? అయినా ఇమిగ్రేషన్ వారు అలా వెంఠనే పంపించేయరనుకుంటా, వాళ్ళు కూడా కాస్త సానుకూలంగా ఉండరా, పిల్లల్ని చూపిస్తే?” రమణ అడిగేడు.
“మా ఆవిడ కేన్సర్ వచ్చి పోయింది నాలుగేళ్ల క్రితం. నా చెల్లెలూ, తమ్ముడూ వాళ్ల కుటుంబాలతో ఈ పక్కనే ఉంటారు. పిల్లల్ని వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు. మీరు చెప్పండి డాక్టర్, నా జీవితం ఎలా? ముప్ఫై అయిదేళ్లకే సుగర్, బ్లడ్ ప్రెషర్ అన్నీ వచ్చేసాయి. నేను పోతే…” దాదాపు ఏడుస్తున్నట్టూ చెప్పాడు ఫెర్నాండెజ్.
“మేము ఈ మధ్యనే శాన్ ఆంటోనియోకి వచ్చాం. మా అమ్మాయి కూడా డాల్టన్ స్కూల్లో నాలుగో క్లాస్ లో ఉంది. మీ ఆవిడ విషయంలో అయాం సారీ ఫెర్నాండెజ్, మీరేం చేస్తూ ఉంటారు? అంటే ఏం ఉద్యోగం?”
“నేను హాండీమాన్ ని. అంటే చిల్లరగా ఎవరికైనా ఎలెక్ట్రికల్ పనులూ, వైరింగ్ పనులూ చేస్తా. అప్పుడప్పుడూ స్పానిష్ వంటవాడి అవతారం ఎత్తడం కూడా ఉంది. బిల్డింగ్ లో ఏదైనా పని ఉంటే మా మేనేజర్ పిలుస్తాడు. ఎక్కడా ఇమిగ్రేషన్ వారికి కనపడకుండా అంతా కేష్ ఇస్తాడు. అలా ఇన్నాళ్ళూ నెట్టుకొచ్చాను. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా పనికి కావాలిస్తే నన్ను పిలవండి సర్. నా బతుకు ఇప్పుడేమౌతుందో?”
“మీకు ఖాళీ ఉన్నప్పుడు కాక, రోజూ ఏదో ఒక సమయంలో ఖాళీ చేసుకుని వ్యాయమం చేసి తీరాలి. లేకపోతే ఈ సుగర్ రక్తపోటూ తగ్గవు. మందులు వేసుకున్నా వ్యాయామం తప్పనిసరి. ఇమిగ్రేషన్ గురించి నేనేమీ సహాయం చేయలేను. ఎప్పుడైనా మీకు నా వల్ల సహాయం కావాలిస్తే ఆరోగ్యం మీద, అది చేయగలను. నేను పనిచేసేది, నా ఆఫీసు, సెయింట్ లూక్ హాస్పిటల్ లో. మరి అక్కడకి వచ్చి నన్నుకలవాలంటే అపాయింట్ మెంట్ అదీ తీసుకోవాలి. ఏం చేయమంటారు?”
ఫెర్నాండెజ్ నోరు మెదపకపోవడం చూసి రమణ లేచాడు వెళ్ళడానికి. వచ్చేటప్పుడు ఫెర్నాండెజ్ ఇచ్చిన ఫోన్ నెంబర్ జేబులో పెట్టుకుని రాత్రి ఇంటికి వచ్చేస్తూంటే అనేక సందేహాలు. టెక్సాస్ బోర్డర్ లోంచి అమెరికాలోకి వచ్చే స్పానిష్ జనాలకి వాళ్ళ దేశంలో ఉంటే హత్యలూ, టెర్రరిజం, మానభంగాలూ, నిరుద్యోగం, అనేకానేక తలనెప్పులు. ఇక్కడకి వచ్చి ఉద్యోగం చేసుకుందామంటే ఇమిగ్రేషన్ వారు గ్రీన్ కార్డ్ ఇస్తారో లేదో అనే శంక. బోర్డర్ దగ్గిర ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి. అది ఎప్పుడు సరే అంటారో, అనరో, అసలు ఏదైనా అంటారో లేదో తెలియదు. పీత కష్టాలు పీతవి అన్నట్టూ, ఇలా వచ్చే వలస జనాభా ఇచ్చే అప్లికేషన్ లు చూడడానికి అమెరికా గవర్నమెంట్ కి ఉన్న జనం సరిపోవట్లేదు. అయినా వలస అనేది ఎంతమందికని ఇస్తారు? ఇస్తున్నారని తెలిస్తే మొత్తం ప్రపంచంలోంచి ఎంతమందైనా రావడానికి సిద్ధంగా ఉండరూ? ఎప్పటికి తేలుతుంది ఈ విషయం? చిన్న పిల్లల విషయం సరే, పెద్దవాళ్ళు ఈ ఇమిగ్రేషన్ వల్ల ఇలా ఫెర్నాండెజ్ లాగా సుగర్, బ్లడ్ ప్రెషరూ తెచ్చుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు కదా? అంటే చిన్న చిన్న విషయాలే మొత్తం ఆరోగ్య వ్యవస్థ మీద పడుతున్నాయి. ఈ కోవలోకి వచ్చేవే, పుట్టిన పిల్లలకి టీకాలు వేయించం అనే వాదనా వగైరాలు. ఎవరో తల్లి ఎక్కడో చదివిన, విన్న విషయం పట్టుకుని నా కుర్రాడికి ఫలానా టీకా వద్దు దాని మూలాన ఆటిజం అనో మరోటో జబ్బు వచ్చేస్తుంది అని మొదలుపెడుతుంది. ఆ కుర్రాడు అదృష్టం కొద్దీ ఆరోగ్యంగా పెరిగితే సరే లేకపోతే ఎప్పుడో ఓ అమ్మవారి లాంటి చికెన్ పాక్స్ అంటుకుంటే దాన్ని మిగతావాళ్లకి అంటిస్తాడు. అలా మొత్తం దేశం అంతటికీ ఆరోగ్యం మీద గోల, దెబ్బలాటలూ. టీకాలు మంచివే అంటే ఒకరికి కోపం. కాదంటే మరొకరికి కోపం. ఈ వాదనల్తో దెబ్బలాటల్తో “మొత్తం దేశ ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటోంది వినరే?” అంటే “నువ్వెవడవి? నువ్వు నోరు ముయ్యవోయ్” అని ప్రతివాదన. ఎవర్నీ సమర్థించడం? మింగమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం.
ఓ రోజు సాయంత్రం ఈశ్వరి స్కూల్ నుంచి ఇంటికొచ్చాక తనకి దొరికిన కొత్త స్నేహితుల గురించి చెప్తుంటే తెల్సిన విషయం – ఫెర్నాండెజ్ కూతురు జెనీవా, ఈశ్వరీ ఒకటే సెక్షన్ లో ఉన్నారు. ఫెర్నాండెజ్ చెప్పినది కూడా అదే. రమణ చెప్పాడు ఈశ్వరితో “ఎప్పుడైనా జెనీవాని ఓ సారి మన ఇంటికి తీసుకురా సరదాగా ప్లే డేట్ కి.”
* * * * * * *
అనుకున్న ప్రకారం రమణ కుటుంబానికి అయిదు బెడ్రూంల ఇంట్లోకి మారడానికి మరో నెల పట్టింది. అయితే అపార్ట్ మెంట్ ఉన్న ఏరియాలోనే దొరికింది మంచి ఇల్లు. ప్రస్తుతానికి స్కూల్ మారక్కర్లేదు. రాబోయే రోజుల్లో మిడిల్ స్కూల్ కి ఎలాగా వేరే స్కూల్ కి వెళ్ళాలి. ఆ వేసవిలో కొత్త ఇంట్లోకి మారాక బయట యార్డ్ లో నీళ్ళ కుళాయి సరిగ్గా పనిచేయకపోతే ప్లంబర్ నో ఎవర్నో పిలవాలనుకున్నప్పుడు ఫెర్నాండెజ్ గుర్తొచ్చాడు రమణకి. ఏ ప్లంబింగ్ కంపెనీనైనా పిలుస్తే వాళ్ళేం చేసినా చేయకపోయినా మొదట వచ్చినందుకు డబ్భై డాలర్లు ఇచ్చుకోవాల్సిందే. ఫెర్నాండెజ్ ఏమైనా చేయవచ్చు. ఎక్కడో దాచిన ఫెర్నాండెజ్ ఫోన్ నెంబర్ బయటకి తీసి కాల్ చేసాడు.
గంటలో వచ్చి చూసి నీళ్ళ కుళాయి కొత్తది బిగించాక రమణ డబ్బులు ఇస్తానంటే ఫెర్నాండెజ్ వద్దన్నాడు కానీ రమణే మొత్తం యాభై డాలర్లు కేష్ ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు మరోసారి తన ఆరోగ్యం గురించీ, అతని కూతురు జెనీవా, రమణ కూతురు ఈశ్వరీ క్లాస్ మేట్ లనీ చెప్తే రమణ చెప్పాడు, “ఈ వేసవిలో ఖాళీ ఉంటే మీ అమ్మాయిని ఓ రోజు మా ఇంట్లో దింపు, పిల్లలు ఆడుకుంటారు. మా ఆవిడ చూస్తుంది.”
అలా దిన దిన ప్రవర్ధమానంగా రమణ ఫెర్నాండెజ్ కూతుర్ల స్నేహం పెరుగుతోంది. ఎప్పుడైనా అతనొచ్చి రమణ కి ఏదో పని చేసిపెడుతున్నాడు, ఇంట్లోనో, బయటో. రమణ సంగతి ఎలా వున్నా, ఫెర్నాండెజ్ గ్రీన్ కార్డ్ సంగతి ఏమీ తేలలేదని తెలుస్తూనే ఉంది. కాంగ్రెస్ వారూ, అధ్యక్షుల వారూ ఒకరిమీద ఒకరు విసుర్లు విసురుకుంటూ ఈ విషయం సాగదీస్తున్నారు ఒక కొలిక్కి తీసుకురాలేక. మామూలుగా కంపెనీలు స్పాన్సర్ చేసే ఉద్యోగస్తులకైతేనే గ్రీన్ కార్డ్ రావడానికి ఏళ్ళూ పూళ్ళూ పడుతుంటే ఏ స్పాన్సరూ లేని స్పానిష్ జనాలకి ఎక్కువ టైం పట్టడంలో ఆశ్చర్యం ఏవుంది? ఆ సంగతెలా ఉన్నా ఫెర్నాండెజ్ మాత్రం ఆరోగ్యంగా ఉన్నట్టే. మొదట్లో ఎమెర్జన్సీలో కనిపించిన అతను ఈ మధ్యనెప్పుడూ రమణ దగ్గిరకి మరోసారి ఆరోగ్యం గురించి రాలేదు. ఎప్పుడైనా ఇంట్లో పనికి పిలిస్తే రమణ అడిగేవాడు, ఆరోగ్యం సంగతి. మందులు వాడుతున్నాడుట, బాగానే ఉందని విన్నాక ఇంక దాని గురించి రెట్టించలేదు. వ్యాయామం సంగతి ఆయన చెప్పలేదు కనక రమణ అడగలేదు కూడా.
* * * * * * *
రెండేళ్ళు గడిచి ఈశ్వరి మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఓ గురువారం సాయంత్రం ఏడింటికి, ఉరుమూ మెరుపూ లేనట్టూ కూతుర్ని తీసుకొచ్చి ఫెర్నాండెజ్ దిగేడు రమణ ఇంటికి. వస్తూనే కూతుర్ని ఈశ్వరి గదిలోకి పంపాక ఇలా చెప్పాపెట్టకుండా వచ్చినందుకు ఆశ్చర్యపోయిన రమణతో విషయం చెప్పేడు “ఓ విషయంలో అర్జెంట్ గా మీ సహాయం కావాలి. మీరు తప్ప ఎవరూ చేయరనిపించి ఇలా వచ్చాను.”
“నేను తప్ప ఎవరూ సహాయం చేయరంటున్నావు ఏమిటి, నీ ఆరోగ్యం సంగతా?”
“కాదు. మా స్పానిష్ స్నేహితుల్లో కొంతమంది కలిసి రివర్ వాక్ ఒడ్డున ఒక కొత్త రెస్టారెంట్ మొదలుపెడుతున్నాం. మొత్తం అంతా కలిపి ఈ పది మంది ఉన్నాం. అందరం కలిసి తలో పాతికవేలు వేసుకుంటే అది బిజినెస్ అని రిజిస్టర్ చేసి అందరికీ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తాం అని ఓ లాయర్ అన్నాడు. ఇప్పుడు నేను ఉన్నదంతా ఊడిస్తే అయిదువేలు ఉన్నాయి. మీరు ఓ ఇరవై సర్దితే నా చర్మం తో చెప్పులు కుట్టిస్తా. మీరు చేయలేకపోతే ఎవరూ చేయరు. మేము నట్టేట్లో ములిగిపోతాం. నా గురించి కాకపోయినా, నా పిల్లలమొహం చూసి …” ఏడుపువల్ల గొంతులోంచి మాటరాక అలా చూస్తూండిపోయేడు ఫెర్నాండెజ్.
రమణకి వణుకు పుట్టుకొచ్చింది. ఇందులో బోల్డు లొసుగులు. మొదటిది ఇరవైవేల డాలర్లు మామూలు విషయంకాదు. రెండోది. ఇలా తాను డబ్బులిచ్చి ఇల్లిగల్ ఇమ్మిగ్రేషన్ ప్రోత్సహిస్తున్నాడని ఎవరైనా కేసు వేస్తే తన పీకలమీదకి వస్తుంది. మూడు, ఫెర్నాండెజ్ ఈ డబ్బులు వెనక్కి ఇస్తానని అనలేదు. అంటే వాటికి నీళ్ళధారేనా? అదే అడిగేడు, ముందు,
“ఈ డబ్బులు నీకిస్తే మళ్ళీ నాకెలా వస్తాయ్?”
“మెల్లిగా వీలు చూసుకుని నెలకింత అనో ఏడాదికింత అనో మీకు ఇచ్చేస్తాను.”
“ఇరవై వేలంటే అంత చిన్న మొత్తంకాదు, అంత ఈజీగా ఏమీ చెప్పలేను. మా ఆవిడతో మాట్లాడాలి కదా?”
“అమ్మగార్ని పిలవడం కుదురుతుందా మాట్లాడ్డానికి ఇప్పుడు?”
“ఏదో పనిలో ఉన్నారులే. నేను మాట్లాడి శనివారం చెప్తా, దీనిమీద ఏమీ ఆశలు పెట్టుకోకు. ఏదో వందో, రెండు వందలో అయితే వెంఠనే ఇద్దును కానీ ఇరవైవేలు అడుగుతున్నావ్ నువ్వు. ఇది ఎటుతిరిగి ఎటు వస్తుందో?”
“మీరే అలా అంటే ఎలా డాక్టర్, మీరు తప్ప ఎవరూ సర్దలేరు ఇది. మా చుట్టాల్లో, స్నేహితుల్లో ఎవరి దగ్గిర చూసినా వెయ్యి డాలర్ల కంటే ఉండదు. మాది రెక్కాడితే కానీ డొక్కాడని బతుకు. మీరే ఏదో దారి చూడాలి.” చేతులు పట్టుకుని మరీ చెప్పేడు ఫెర్నాండెజ్.
“నేనేం చెప్పలేను, ముందు నన్ను మా ఆవిడతో మాట్లాడనీయ్!”
* * * * * * *
ఫెర్నాండెజ్ కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయేక కధంతా కల్పనతో చెప్పాడు రమణ.
కల్పన అడిగింది కొంచెం ఆశ్చర్యంగా, “ఈ రెండేళ్ళలో మనం ఇతన్ని ఓ పది సార్లు కలిసి ఉంటాం. వాళ్లమ్మాయి ఎప్పుడైనా ఇక్కడకి వస్తుంది. తల్లిలేని పిల్ల అని తప్ప, మనం ఇతనికి ఎందుకు అంత అప్పు ఇవ్వాలి? ఆ డబ్బులు బేంక్ లో పెడితే మనకి కాస్తో కూస్తో వడ్డీయేనా వస్తుంది. ఇతన్ని నమ్మడం ఎలా?”
“నమ్మకం మనిషిని బట్టి ఉన్నదే. ఓ సారి అంత డబ్బు ఇచ్చాక ఎవరు ఎలా మారతారో అనేది బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. మనకి ఇవ్వాలని ఉంటే ఇవ్వడమే. ఏదో సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడని తప్ప మరో కారణం ఏదీ లేదు.”
“ఆ డబ్బులు అతను ఇవ్వకపోతే?”
“తూర్పు తిరిగి దణ్ణం పెట్టడమే. కానీ రివర్ వాక్ లో రెస్టారెంట్ అన్నాడు కనక అక్కడ నుంచి ఎక్కడకీ పారిపోడనుకుంటా,” నవ్వేడు రమణ.
మరి కాసేపు కిందా మీదా పడ్డాక శనివారం ఫెర్నాండెజ్ ని మరిన్ని విషయాలు అడగడానికీ, అతని సమాధానాలు నచ్చితే డబ్బులివ్వడానికీ నిర్ణయించుకున్నాడు రమణ. ముఖ్య కారణం, తమ డబ్బులకి ఎగనామం పెట్టినా ఫెర్నాండెజ్ కుటుంబం ఓ గాడిలో పడుతుందనే కోరికా, నమ్మకం తప్ప మరోటి ఏమీ లేదు.
శనివారం వచ్చిన ఫెర్నాండెజ్ ని అడిగేడు విషయాలు అన్నీ, పెట్టబోయే రెస్టారెంట్ పేరూ, ఎక్కడ, జనం ఎలా ఎంత మంది రావొచ్చు అనేవన్నీ.
“మూడు నెలల్లో రెస్టారెంట్ మొదలుపెడుతున్నాం. అది ఓపెన్ చేసిన మొదటిరోజు నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను చూపించడానికి. అక్కడ యజమాని పేరు ఫెలిక్స్. నమ్మకం లేకపోతే ఈ సాయంత్రం ఓ సారి ఫలానా చోటికి వెళ్ళి చూడండి రివర్ వాక్ మీద. అక్కడ బోర్డ్ కూడా పెట్టాం – రాబోయే రెస్టారెంట్, యజమాని ఫెలిక్స్ అంటూ. రివర్ వాక్ కనక బిజినెస్ అద్భుతం గా ఉంటుంది, మీకు తెలియన్దేవుంది? మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను.”
“అన్నీ బాగానే ఉన్నై. కానీ లెక్కా పత్రం లేకుండా ఎలా?”
“నేను చెక్కూ, బేంక్ ఎకౌంట్ అవీ వాడనని మీకు తెలుసు ఎవరు నన్ను ట్రేక్ చేస్తారో అనే భయం మాకు. ఏం చేయమంటారు మీరే చెప్పండి.”
“మనిద్దరి మధ్యా కనీసం అప్పు తీసుకున్నట్టూ ఓ పత్రం ఉంటే మంచిది కదా?”
“మీ కంప్యూటర్ మీద ఒకటి ప్రింట్ చేయండి. ఇప్పుడే నేను దానిమీద సంతకం పెడతా.”
అరగంటలో పత్రం తయారైంది. “ఫలానా ఎడ్రస్ దగ్గిర ఉండే ఫెర్నాండెజ్ ఫలానా రెస్టారెంట్, ఫలానా రివర్ వాక్ ఎడ్రస్ లో మొదలుపెడుతున్నాడు కనక ఇలా ఇరవైవేల డాలర్లు కేష్ అప్పు ఇవ్వడమైనది. అది నెలకింత చొప్పున వెనక్కి ఇస్తానని ఫెర్నాండెజ్ ఒప్పుకుంటున్నాడు. వీలుంటే ధర్మవడ్డీ రెండు శాతం ఇస్తారు. ఇవ్వకపోయినా అప్పు ఇచ్చే కల్పన ఏమీ అనుకోరు కానీ అసలు మొత్తం ఇవ్వడానికి ఫెర్నాండెజ్ ఒప్పుకున్నారు.”
ఫెర్నాండెజ్ కి ఏ సోషల్ సెక్యూరిటీ నెంబరూ, బేంక్ అకౌంట్ నెంబరూ అవీ లేకపోవడం వల్ల అవి లేవు పత్రంలో. ఈ విషయంలో ఏదీ రమణ పీకలమీదకి రాకుండా డబ్బు కల్పన ఇచ్చినట్టూ రాసాడు. అదంతా చెప్పాక ఫెర్నాండెజ్ ఒప్పుకుని సంతోషంగా సంతకం పెట్టాడు. డబ్బులు తీసుకున్న ఫెర్నాండెజ్ మళ్ళీ కనిపిస్తానని చెప్పి వెళ్ళాడు.
* * * * * * *
తర్వాత రెండు నెలల్లో ఫెర్నాండెజ్ అప్పుడప్పుడూ కనిపిస్తూ చిన్న చిన్న పనులు చేసిపెడుతూనే ఉన్నాడు రమణకి. ఎండలు పెరుగుతూ ఈశ్వరి స్కూల్ మూసాక సమ్మర్ లో ఉండే స్విమ్మింగ్, సాకర్ అవీ అవగొట్టేసరికి ఇట్టే గడిచిపోయింది వేసవి. స్కూళ్ళు మొదలయ్యేసరికి ఫెర్నాండెజ్ చెప్పిన చోట రివర్ వాక్ రెస్టారెంట్ పూర్తవడం రమణ గమనిస్తూనే ఉన్నాడు అటు వెళ్ళినప్పుడల్లా. పెద్దదై మిడిల్ స్కూల్లో చేరిన ఈశ్వరి స్కూళ్ళు తీసిన మూడోరోజున చెప్పింది రమణతో, “జెనీవా స్కూల్ నుంచి వెళ్ళిపోయింది. ఇంక రాదుట.”
“అదేం? మరో స్కూల్ డిస్ట్రిక్ట్ కి మారారేమో?”
“తెలీదు డాడ్, మరో అమ్మాయి చెప్పింది జెనీవా ఇంక స్కూల్ కి రాదని.”
మనసులో ఏదో కీడు శంకించినా రమణ ఏమీ అనలేదు పైకి. అప్పుడు గుర్తొచ్చిన విషయం – ఫెర్నాండెజ్ తమని రెస్టారెంట్ పెట్టిన మొదటిరోజుకి పిలుస్తానన్నాడు కానీ పిలవలేదు. వారాంతం రివర్ వాక్ కేసి బయల్దేరాడు ఫెర్నాండెజ్ కొత్తగా పెట్టిన రెస్టారెంట్ చూడ్డానికి.
కిటకిటలాడుతోంది కొత్త జాయింట్. లోపలకి వెళ్ళాక మేనేజర్ ఫెలిక్స్ ఉన్నాడా అని అడిగి అతనితో మాట్లాడాడు, “ఫెర్నాండెజ్ ఉన్నాడా ఇక్కడ?”
“ఏ ఫెర్నాండెజ్? మా దగ్గిర ముగ్గురున్నారు ఆ పేరుతో. ఇంతకీ మీరెవరు?”
“పూర్తి పేరు మారియో ఫెర్నాండెజ్, అతని కూతురు జెనీవా మా అమ్మాయి ఈశ్వరి క్లాస్ మేట్స్ స్కూల్లో. నా పేరు రమణ, నేను సెయింట్ లూక్ హాస్పిటల్లో డాక్టర్ని” తన విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చి చెప్పేడు రమణ.
“మారియో ఫెర్నాండెజ్ పేరుతో ఇక్కడెవరూ లేరు. మా దగ్గిర వాళ్ల పేర్లు హ్యూగో, లేనార్డో, అలెక్స్ ఫెర్నాండెజ్ లనే వాళ్ళు. మీకేం పని అతనితో?”
“అవునా, మారియో మా ఇంటికి వచ్చి చిన్న చిన్న పనులు చేసిపెడుతూ ఉండేవాడు. అతనితో చిన్న పని పడింది. ఫోన్ చేస్తే ఎవరూ ఆన్సర్ చేయడంలేదు. ఇక్కడ రెస్టారెంట్లో మారియో పార్టనర్ షిప్ తీసుకున్నాననీ ఇక్కడకి రమ్మనీ ఓ సారి చెప్పాడు, ఇంతకీ మీ పేరు ఫెలిక్స్ అవునా కాదా?” తాను మారియో కి ఇచ్చిన డబ్బుల సంగతి చెప్పకుండా మిగతావి చెప్పేడు రమణ.
“ఆవును, ఫెలిక్స్ అనేది నేనే. నేను ఈ రెస్టారెంట్ ఓనర్ని. కానీ మీరు చెప్పిన మారియో ఇక్కడ పార్టనర్ షిప్ తీసుకున్నాడనేది శుద్ధ అబద్ధం. ఇక్కడ నాకు పార్టనర్స్ ఎవరూ లేరు. ఇదంతా నాదే. అతని ఎడ్రస్ కానీ ఫోన్ కానీ ఉందా? అక్కడ చూడండి. సారీ.”
ఒక్కోమాటా సమ్మెటలా తగుల్తుంటే బయటకొచ్చేడు రమణ. తమ డబ్బులు గంగలో పోయినట్టేనా? ఎంత పని చేసాడు? పోనీ కదా అని కన్నీళ్ళు పెట్టుకుని చేతులు పట్టుకున్నాడని నమ్మి డబ్బులిస్తే? అయినా డాక్టర్ గిరీ వెలిగించిన తన తెలివి ఏమైంది? ఇక్కడ ఎవరో ‘కొత్త రెస్టారెంట్, యజమాని ఫెలిక్స్’ అని బోర్డు చూడగానే ఫెర్నాండెజ్ ని గుడ్డిగా నమ్మేసి డబ్బులిచ్చేసాడు. మాడిపోయిన మొహంతో ఇంటికొచ్చాడు రమణ.
కల్పనతో చెప్పాడు జరిగినదంతా. “వెధవ! ఎంతపని చేసాడు, నేను మొదట్నుంచీ అనుకుంటూనే ఉన్నా వీడి గురించి. అయినా ఈ స్పానిష్ వాళ్లందరూ అంతే,” అందావిడ, అందరి ఆడవాళ్లలాగానే తప్పంతా రమణదే అయినట్టూ.
“రేపోసారి అతనుండే చోటకి వెళ్ళి కనుక్కుంటాలే. కంగారు పడకు. మనదగ్గిర అతను సంతకం పెట్టిన కాయితం ఎలాగా ఉంది కదా?”
“ఏం, ఆ కాయితం పట్టుకుని కోర్ట్ కి వెళతారా? జడ్జ్ అడిగితే ఏం చెప్తారు? ఇలా ఇల్లిగల్ ఇమ్మిగ్రెంట్ కి నేను డబ్బులు సర్దాను గ్రీన్ కార్డ్ కోసం అనీ?”
రమణ ఏం మాట్లాడాలో తెలియక నోరుమూసుకున్నాడు. చాలా నమ్మకస్థుడైన ఫెర్నాండెజ్ ఇలా చేస్తాడని తాను మాత్రం ఊహించాడా? ఎంత నమ్మకంగా మాట్లాడాడు తనతో?
మర్నాడు ఫెర్నాండెజ్ కాయితంలో రాసిన ఎడ్రస్ పట్టుకుని బయల్దేరాడు. ఎంతమందిని కల్సినా ఎవర్నడిగినా ఒకటే సమాధానం. మారియో ఫెర్నాండెజ్ అనే అతను అక్కడెవరూ లేరు. ఇంతకు ముందు ఉన్నాడేమో తెలియదు. కాసేపు అక్కడుండి ఆ ఏరియాలో రోడ్డుమీద తిరిగే జనం, వాళ్ల తీరూ నచ్చక తిరిగి వెనక్కొచ్చేసాడు రమణ. వచ్చేటప్పుడు రమణకి అనిపించిన విషయం – ఎవరు మాత్రం, స్నేహితులో చుట్టాలో, మారియో గురించి తెల్సినా చెప్తారు తనకి? తాను వెళ్ళి అడిగితే ఏ ఇమిగ్రేషన్ ఆఫీసరో అనుకుని వాళ్లకి ఏమి తెలిసినా, తనకి చెప్తారా? అసలు ఈ ఏరియాకి వచ్చి కనుక్కోవడమే ఓ శుధ్ధ తప్పు.
ఇచ్చిన డబ్బులకి తిలోదకాలే అని తెలిసినా ఎక్కడో లోపల మిణుకుమిణుకనే ఆశ ఫెర్నాండెజ్ అలాంటివాడు కాదనీ, నిజంగానే తన డబ్బులు తనకి వస్తాయనీను.
* * * * * * *
వారాలు నెలలై, నెలలు సంవత్సరం అయ్యేక పూర్తిగా తెలిసొచ్చిన విషయం – ఫెర్నాండెజ్ తనని పూర్తిగా మోసం చేసాడు. అప్పట్నుంచి ఏ స్పానిష్ వాడితోనైనా మాట్లాడ్డానిక్కూడా అసహ్యం రమణకి. ఎంత నిజాయితీగా తాను ఫెర్నాండెజ్ కి సహాయం చేద్దామనుకున్నా తననో అమాయకుడిలా జమకట్టి అతను తన చెవుల్లో పువ్వులు పెట్టాడు. లోపలనుంచి తన్నుకొచ్చే విద్వేషం. ఏమీ చేయలేని పరిస్థితి.
మూడేళ్ళు గడిచి ఈశ్వరి హైస్కూల్లోకి వచ్చేసరికి ఫెర్నాండెజ్ సంగతీ అతనికిచ్చిన ఇరవైవేలూ లోలోపల గుర్తున్నా ఇప్పుడు మొదట్లో ఉన్నంత బాధలేదు రమణకి. ఎప్పుడో ఓ సారి తన డబ్బులొస్తాయనే ఆశ పూర్తిగా చచ్చిపోయింది. మరో ఏడాదికి తొమ్మిదో తరగతిలోంచి పదిలోకి వచ్చింది ఈశ్వరి. కుర్రాడు మధు ఇంకా ఎలిమెంటరీ క్లాసులో ఉన్నాడు. వేసవికి పిల్లలు పోరుతూంటే కుటుంబంతో సహా ఫ్లోరిడా ప్రయాణం పెట్టుకున్నాడు రమణ.
ఫ్లోరిడా అంటే తెల్సిందే కదా ఓ రోజు డిస్నీ వారికి, ఓ రోజు యూనివర్సల్ స్టూడియో వారికీ టికెట్లకి తలో అయిదేసి వందలు సమర్పయామి. అక్కడ ఎండలో మొహాలు మాడ్చుకుంటూ పిల్లల్ని తీసుకుని తిరగడం. ఆ పిల్లలు ఇష్టం వచ్చినట్టూ ఎగురుతుంటే ఓ సంతోషం, వాళ్ళు తప్పిపోకుండా ఓ కంట కనిపెట్టడం, ఏ చెయ్యో కాలో విరుగుతుందో అని ఓ మూల భయం, గేలన్ల కొద్దీ సోడాలూ, కోలాలు తాగడం, మనకి దొరికే, మనం తినగలిగే ఏ దుంప ముక్కలో తినడం. ఈ ప్రహసనం అయ్యేక కాళ్ళు పీక్కుపోయి వళ్ళు తూలిపోతూంటే అప్పటికే నిద్రతో జోగుతున్న పిల్లల్ని తీసుకొచ్చి హోటల్లో పడుకోబెట్టడం. మర్నాడు మరో చోట ఇదంతా రివైండ్ అండ్ ప్లేబేక్. ఇవన్నీ చూసేసాక మిగతారోజుల్లో ఏదో మాల్ అదీ చూడ్డం, రాత్రి కనబడిన, వీలు కుదిరిన చోట ఏదో కతకడం, మళ్ళీ వళ్ళు హూనం వగైరా.
అలా ప్రతీరోజూ గడిచేక మర్నాడు వెనక్కి టెక్సాస్ వచ్చేస్తారనగా ఈశ్వరి రమణతో అంది, “డాడ్, ఈ రోజు రాత్రి స్పానిష్ రెస్టారెంట్ లో డిన్నర్ చేద్దాం. ఇక్కడ ఒకచోట ‘ఎల్ టారో’ అనేది ఉందిట, బాగుంటుంది వెళ్లమని మా క్లాసులో స్నేహితురాలు చెప్పింది మనం వచ్చేటప్పుడు.”
ఇంటర్నెట్ మీద పడి ఆ రెస్టారెంట్ ఎడ్రస్ పట్టుకుని బయల్దేరారు. అసలే వారాంతం, అందులో మళ్ళీ సమ్మర్, ఫ్లోరిడా. ఇసుకేస్తే రాలనంత జనం. అరగంట వెయిట్ చేసాక పిల్చేరు లోపలకి. కూర్చున్న చుట్టూ చూసేడు రమణ. దాదాపు అందరూ అమెరికన్ జనమే. కొంతమంది ఇండియన్స్ ఉన్నా అసలు స్పానిష్ వాళ్ళు ఒకరో ఇద్దరో. భోజనం చేస్తూ చూసి ఆనందించడానికి చుట్టూరా గోడలకి పెద్ద, పెద్ద టి.వి.లు, ఎవరైనా దెబ్బలాడుకుంటే అదంతా రికార్డ్ చేయడానికన్నట్టూ కెమెరాలూ అమర్చారు. బిజినెస్ అద్భుతంగా ఉందని చెప్పకనే చెప్త్రున్నాయి ఈ హంగులన్నీ.
ఈ లోపున వచ్చిన కుర్రాడికి ఈశ్వరి ఆర్డర్ చెప్పింది మెన్యూ అదీ చదివి, బురిట్టో, టాకో, చలూపా ఇంకా గ్లాకోమోల్ వగైరా. అందరికీ తలోటీ, అవి వచ్చాక పంచుకుని అందరూ అన్నీ తినొచ్చు కదా? తాగడానికి సోడాలూ, ఐస్ వాటర్, చివరిలో ఇదంతా లోపలకి ఎక్కించాక మరి ఓ చిన్న స్వీటులాంటి కేకు. హో హో, బాగానే ఉంది మొత్తం యాభై ఆరు డాలర్లు మాత్రమే, టేక్స్ లేకుండా. మీరెంత మంచివాళ్లండి, టిప్ అదీ దయచేసి ఇవ్వండి, మర్చిపోరు కదూ?
రమణ ఈ ఖర్చు చూసి ఏదో అనబోతూంటే ఈశ్వరి అంది, “డాడ్, ఫ్లోరిడా అంత దూరం వచ్చి ఇలా ఓ అరవై డాలర్లకి చూసుకుంటే ఎలా?”
రమణకి ఎందుకో అనిపించింది, “ఈ ఈశ్వరికేనా తాను కొన్నేళ్ల క్రితం ఎత్తుకుని జోకొట్టి నిద్రపుచ్చింది, ఈ అమ్మాయికేనా ఒకప్పుడు తాను డైపర్లు మార్చింది?” పిల్లలు ఎంత తొందరగా ఎదికిపోతారో? లోపల నవ్వుకున్నాడు.
గంటన్నరకి భోజనం అయ్యేక వచ్చిన బిల్లుకి క్రెడిట్ కార్డ్ ఇచ్చి ఇప్పుడే వస్తా అంటూ బాత్రూంలోకి దూరేడు. తాగిన కోలాకి, తిన్న బురిటోలకీ ఖాళీ చేయమని బ్లేడర్ గొడవపెడుతుంటే.
కూర్చున్న బల్ల దగ్గిర తిరిగొచ్చాక తెల్సిన విషయం, తన క్రెడిట్ కార్డ్ పనిచేయలేదుట, మేనేజర్ పిలుస్తున్నాడు రమణని ఓ సారి రమ్మని. ‘ఇలా పనికిరాని కార్డ్ ఇస్తారా మాకు?’ అని అడుగుతున్నాడు వెయిటర్.
రమణకి చిర్రెత్తుకొచ్చింది. తాను డాక్టర్! ఇన్నేళ్ళలో ఎప్పుడూ ఒక్కసారి కూడా తన కార్డ్ పనిచేయకపోవడం అనేదే లేదు. అదే చెప్పాడు వెయిటర్ తో. గొంతు పెరుగుతుంటే ఈశ్వరి అంది, “డాడ్, కాస్త మెల్లిగా మాట్లాడు.”
వెయిటర్ చెప్పేడు, “సార్ మా మేనేజర్ మిమ్మల్ని రమ్మన్నాడు. ఈ కార్డ్ ఎందుకు పనిచేయలేదో అవీ నాకు ఎలా తెలుస్తాయి? మీరు ఆయనతో మాట్లాడితే బాగుంటుంది.”
“నేను రాను, కావాలిస్తే ఈ రెండో వీసా కార్డ్ ట్రై చేయండి,” రమణ ఖరాఖండీగా చెప్పాడు.
ఆ కార్డ్ పట్టుకెళ్ళిన వెయిటర్ పది నిముషాల్లో తిరిగొచ్చడు, “ఇది కూడా పనిచేయడం లేదని చెప్పారు మా మేనేజర్. మీరు ఇలా పనికిరాని కార్డ్ ఇస్తారని మాకు తెలియదు. ఇదిగో చూడండి, దీనిమీద “రిజెక్టెడ్” అని వచ్చింది.
ఈ సారి రమణ కొంచెం కంగారు పడ్డాడు, ఎవరైనా తన కార్డ్ నెంబర్లన్నీ దొంగతనం చేయలేదు కదా? మొహంలో రంగులు మారుతుంటే మరో ఇద్దరు వెయిటర్స్ రమణ కుటుంబం కూర్చున్న టేబుల్ దగ్గిరకొచ్చారు. మొదటి వెయిటర్ చెప్పాడు, “ఇప్పటికే మీరిచ్చిన రెండు కార్డ్ లు ట్రై చేసాం. మొదట్లో మిమ్మల్ని మేనేజర్ దగ్గిరకి రమ్మంటే రానన్నారు. ఇప్పుడు మొత్తం మీరు కేష్ ఇచ్చినా సరే లేకపోతే వచ్చిమా మానేజర్ ని కల్సినా సరే.”
“ఇదేం గొడవ, నేను డాక్టర్ని కావాలిస్తే ఇదిగోచూసుకోండి నా విజిటింగ్ కార్డ్, నేను కేష్ ఇవ్వను. కార్డ్ పనిచేస్తుంది, మీరెందుకు ఇలా బుకాయిస్తున్నారో.”
“సర్, ఆ విషయం మీరు మేనేజర్ కి చెప్పుకోండి, మాకేం తెలుస్తుంది?”
ఈ గొడవకి రెస్టారెంట్లో ఉన్న జనం అంతా ఇటు చూడబోయేసరికి రమణ లేచాడు ఇంక తప్పదన్నట్టూ. అసలే కోపంగా ఉన్న రమణ ఎలా మాట్లాడతోడో అనే సందేహం రాగానే కల్పన తాను కూడా లేచింది రమణతో వెళ్లడానికి. వెంఠనే పిల్లలిద్దరూ కూడా బయల్దేరారు లేచి. ఏమౌతుందో అని అందరికీ గుండెలదురుతున్నై.
మేనేజర్ అంటే ముందు కౌంటర్లో ఉన్న మనిషి అని రమణ అనుకున్నాడు కానీ వేరే గదిలోకి తీసుకెళ్ళాడు వెయిటర్. ఓ టేబిల్ దగ్గిర కూర్చున్న ఒకాయన పేపర్లేవో చూసుకుంటున్నాడు. రమణ రాగానే లేచి చెప్పాడు, “కూర్చోండి, మేనేజర్ ఇప్పుడే వస్తారు.”
పావుగంట గడిచేక తలుపు తోసుకుని లోపలకొచ్చాడు మేనేజర్ బిగ్గరగా నవ్వుతూ.
రమణకి కల్పనకీ నోటమాట రాలేదు మేనేజర్ ని చూసి. ఒకప్పుడు తనదగ్గిర ఇరవైవేలు కొట్టేసిన ఫెర్నాండెజ్! వస్తూనే రమణని కౌగలించుకుని చెప్పాడు, “మీ కోసం సరదాగా ఆడాను ఈ నాటకం. ఎలా ఉన్నారు డాక్టర్ గారూ?”
కల్పన కోపంగా అంది, “మా డబ్బులు కొట్టేసి ఇదేం పని? బుద్ది ఉండక్కర్లా?”
“నా మాట చెప్పనీయండి మేడం, మీ దగ్గిర డబ్బులు కొట్టేసాననుకోకండి. నేను డబ్బులు తీసుకుని పెట్టుబడి పెట్టడానికి బయల్దేరేసరికి ఆ రెస్టారెంట్ దగ్గిర ఇమ్మిగ్రేషన్ దాడి జరగబోతోంది అనే వార్త వచ్చింది. అక్కడకి వెళ్తే నేను ఈ పాటికి జైల్లో ఉండి ఉండేవాణ్ణి, ఆ డబ్బులు ఏమై ఉండేవో? ఉన్నపాటున కట్టుబట్టలో వెంఠనే అక్కడ్నుంచి బయల్దేరి ఫ్లోరిడా వచ్చేసాం. మా సరుకులు కూడా ఏవీ తెచ్చుకోలేదు. మీకు ఫోన్ చేద్దామంటే ఏమో అది ఎవరు వింటారో ఎలా ట్రాక్ చేస్తారో అని భయం. దిన దినగండం నూరేళ్ళ అయుష్షు అన్నట్టూ గడిచింది. మీరిచ్చిన డబ్బులు జేబులో లేకపోతే ఏమై ఉండేవాళ్లమో! ఇక్కడకొచ్చాక మెల్లిగా ఓ ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాం. మీ అమ్మాయి పెద్దదైంది. మా జెనీవాకూడా దాదాపు నా అంత ఎత్తు ఉంది ఇప్పుడు….”
“అంటే నీ ఇష్టం వచ్చినట్టూ మా డబ్బులు తగలేసి ఇదా మాకు చేసే సహాయం?” కల్పన అంది.
“మరీ అంత కోప్పడకండి మేడం, మీ డబ్బులు ఎగ్గొట్టేసేంత నీచుణ్ణి కాదు. మీకు అసలు మొదట్లోనే నెలకింత పంపుదాం అనుకున్నాను. కానీ బేంక్ ద్వారా నేను ఏ పనీ చేయనని మీకు తెలుసు. కేష్ మెయిల్లో పంపకూడదు రూల్స్ ప్రకారం. పంపినా ఎవరైనా కొట్టేస్తారేమో అని భయం. చెప్పాను కదండీ మీరు చేసిన సహాయం ఎప్పుడూ మర్చిపోలేదు. మిమ్మల్ని మా కుటుంబం రోజూ గుర్తుపెట్టుకుంటాం. మీరు రేపు పొద్దున్నే మా ఇంటికి రండి. ఇదిగో ఎడ్రస్. మీరు ఇలా రెస్టారెంట్ లోకి వచ్చి భోజనం చేస్తుంటే కెమెరాలోంచి చూసి ఎంత సంతోషపడ్డానో? మిమ్మల్ని ఇలా సర్ప్రైజ్ చేద్దామని తప్ప మరోటి ఏమీ లేదు. మీకు ఏదైనా మనసులో అనిపిస్తే క్షమించాలి. జెనీవా ఇప్పుడు మీ పాప లాగా హై స్కూల్లో చదువుకుంటోంది. రేపు వచ్చినప్పుడు చూద్దురుగాని. మీ డబ్బులు తప్పకుండా ఇస్తా. మాకు ఇంత సహాయం చేసిన మీకే మోసం చేస్తే దేవుడు మమ్మల్ని క్షమించడు….”
“మరి నీ గ్రీన్ కార్డ్ సంగతీ ఆరోగ్యం సంగతీ ఏమైంది?” ఈ సరికి బాగా రిలాక్స్ అయిన రమణ అడిగేడు.
“అమెరికా అధ్యక్షులు, కాంగ్రెస్ వారు అందరూ ఒప్పుకుని తయారు చేసిన కొత్త రూల్స్ ప్రకారం ఇప్పటివరకూ ఉన్న ఇల్లిగల్ ఇమ్మిగ్రంట్స్ అందర్నీ లీగల్ చేస్తూ క్రితం ఏడు ఆమ్నెస్టీ అంటూ ఓ ప్రకటన చేసారు మీరు చూసే ఉండొచ్చు. అలా మేం లీగల్ అయ్యాం. గుండెలమీదనుంచి పెద్ద బరువు దిగిపోయింది. అయినా ఆ పేపర్లు ఇంకా పూర్తవలేదు కానీ ఈ ఏడు వస్తున్నాయి. ఆ బరువు దిగిపోయాక ఇప్పుడు తిండి మీద ధ్యాస పెట్టి అన్నీ డాక్టర్ చెప్పినట్టూ తింటూ మందులు వేసుకుంటున్నాను. పిల్లలు పెద్దవాళ్ళయ్యేరు, ఇప్పుడు బాగానే ఉన్నాం. ఇక్కడకొచ్చాక మెల్లిగా ఒక్కొక్క మెట్టూ ఎదుగుతూ ఇలా ఇప్పుడు మేనేజర్ ని అయ్యాను. మీరు లేకపోతే ఏమై ఉండే వాళ్ళమో. మీకెంత థేంక్స్ చెప్పుకున్నా మీ ఋణం తీర్చుకోలేం.” మళ్ళీ రమణ చేతులు పట్టుకుని చెప్పాడు ఫెర్నాండెజ్.
మరో అరగంట మిగతా విషయాలు చెప్పాక లేవడానికి వెళ్లబోతూ రమణ అడిగేడు, “మరి నేను ఇప్పుడు ఇక్కడ భోజనానికి కట్టవలసిన డబ్బులో? కార్డ్ పని చేయలేదన్నారుగా?”
“మీరు సరిగ్గా చూళ్ళేదేమో, ఆ రిజెక్టెడ్ అని వచ్ఛిన కార్డ్ మీది కాదు, అది నేను సరదాగా ఆడిన నాటకం. ఛా, మీ దగ్గిరా డబ్బులు తీసుకోవడం? హాయిగా వెళ్ళండి. పొద్దునే మా ఇంటికి రావడం మర్చిపోవద్దు సుమా. నేను ఫోన్ చేస్తా పొద్దున్నే మళ్ళీ,” ఫెర్నాండెజ్ ఈ మాట చెప్తూ ఈశ్వరి తలమీద చేయివేసి చెప్పాడు, “జెనీవా నీ అంత ఉందమ్మా, తప్పకుండా మీరిద్దరూ మరో సారి కలుసుకోవాలి రేపు.”
లేచి బయటకెళ్లబోయే రమణ ఓ సారి దగ్గిరకొచ్చి ఫెర్నాండెజ్ ని కౌగలించుకుని చెప్పాడు, “వెల్ డన్, మేము కూడా సంతోషపడుతున్నాం మీ కుటుంబం గాడిలో పడినందుకు, మళ్ళీ రేపు కలుద్దాం, గుడ్ నైట్!”

[ఈ కధలో ఉన్న ఆమ్నెస్టీ – అధ్యక్షులైన రీగన్ గారు చేసినదే కొంతకాలం క్రితం (1986). ప్రస్తుత కాలంలో జరిగే వలస విధానాలకీ, వాటిమీద జరిగే వాద ప్రతివాదనలకీ, ఈ కధకీ ఎటువంటి సంబంధం లేదు. ఇలా ఇండియన్ డాక్టర్ డబ్బు అప్పుచ్చాడనేది ఈ కధకి సంబంధించిన ఊహ మాత్రమే. మరోలా ఎవరికైనా తోస్తే నా భాధ్యత లేదు.]

 

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked