సారస్వతం

విశ్వనాథ గారి సినిమా సమీక్ష

పేరడీ రచన — శ్రీరమణ

సేకరణ–శారదాప్రసాద్

 

పేరడీ అనేది ఆంగ్ల సాహిత్యం నుండి మనం దిగుమతి చేసుకున్న ఒక సాహితీ ప్రక్రియ . సూక్ష్మంగా చెప్పాలంటే ఒక విధంగా అనుకరణను ​పేరడీ అనవచ్చు.​పేరడీలు వ్రాయటం కష్టతరమైన పని. చాలామంది అనుకున్నట్లుగా మూలాన్ని వ్రాసిన కవిని ఎగతాళి చేయటం కాదు ​పేరడీ అంటే!మూలాన్ని వ్రాసిన రచయితను దగ్గరగా చూసి,ఆయన రచనా శైలిని క్షుణ్ణంగా అనుక(స)రించి వ్రాయటమే ​పేరడీ. కాకపోతే మూలంలో భావగర్భితంగా,గంభీరంగా ఉన్న దానికి కొద్దిగా హాస్యాన్ని, వ్యంగ్యాన్ని జోడించి వ్రాస్తుంటారు ​పేరడీలు వ్రాసే కవులు. శ్రీశ్రీ మొదలుకొని శ్రీ రమణ గారి దాకా ఎందరో ఈ ​పేరడీ ప్రక్రియతో పాఠకులను రంజింపచేసారు. ఈ ​పేరడీకి వన్నె తెచ్చిన వాడు శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి గారు. వీరు శ్రీశ్రీ కి అత్యంత ఆప్తులు. శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి గారు వ్రాసిన ఈ పేరడీనిని చూడండి!

నేను సైతం
కిళ్ళీకొట్లో పాత బాకీ
లెగర గొట్టాను.
నేను సైతం
జనాభాలో సంఖ్య నొక్కటి
వృద్ధి చేసాను.

 

అనే పేరడీ గీతం వినగానే శ్రీ శ్రీ జ్ఞాపకం వచ్చి తీరుతాడు!
చలం గారు శ్రీశ్రీ గారి మహాప్రస్థానానికి ‘యోగ్యతాపత్రం’ ఇవ్వటానికి ​శ్రీ జలసూత్రం వారే కారకులని అంటారు. ఈ రోజుల్లో చిత్ర విచిత్ర కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ​పేరడీలను చక్కగా వ్రాస్తున్నారు.​(నేను మరో కొత్త ప్రక్రియను నాకు ఇష్టమైన కవులను,రచయితలను గురించి వ్రాయటం మొదలు పెట్టాను!వీలుచూసుకొని వాటిని మీతో పంచుకుంటాను.)​ శ్రీ రమణ గారు వారు వ్రాసిన ​పేరడీలను ఒక గ్రంధ రూపంలో తెచ్చారు. ఈ ​పేరడీలు చదువుతుంటే-ఆయా కవులు,వ్యక్తులు మన కళ్ళముందు నిలబడి మనతో మాట్లాడుతున్నట్లనిపిస్తుంది.​కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు ఒక సినిమాకు సమీక్ష వ్రాస్తే ఎలాగుంటుందో, శ్రీ రమణ గారు ​పేరడీ ప్రక్రియ ద్వారా శ్రీ విశ్వనాధ గారిని మన ముందు సాక్షాత్కరింప చేసారు. అభిమానమున్న చోటే అనుకరణ ఉంటుందంటారు . విశ్వనాథ వారు మన స్మృతులలో ఉన్నారు కనుక, వారిని అమితంగా అభిమానించే శ్రీరమణ గారు ఇక్కడ విశ్వనాథ వారిని అనుకరించి
​ కృతకృత్యులయ్యారు. కవిసమ్రాట్ విశ్వనాధ గారికి స్మృత్యంజలితో,విలక్షణ రచయిత శ్రీ రమణ గారికి కృతజ్ఞలతో,ఈ క్రింది ​పేరడీని మీకు సేకరించి అందిస్తున్నాను. అందుకొని ఆనందించటం మీ వంతు!

విశ్వనాథ గారి సినిమా సమీక్ష—పేరడీ రచన– శ్రీరమణ

విశ్వనాథవారు ఏ విషయంలోనైనా నిర్మొహమాటముగా తన అభిప్రాయాలను వ్యక్త పరుస్తారని అందరికీ తెలుసు. “పిచ్చిప్రేమ” అనే సినిమాచూపించి, తమ అమూల్య అభిప్రాయం తెలుపమని అడిగితే,వారి సమీక్ష ఇలా సాగుతుంది:
“శ్రమ పలు విధములు.నా వంటివానికి ఇట్టివి జూచుటయే శ్రమ! దానిని సమీక్షించుట మరియొక శ్రమ. వారు సగౌరవముగా “ పిచ్చిప్రేమ”యనునొక సాంఘిక చిత్రమును జూపి నా యభిప్రాయ మడుగ కాదనుటెట్లు?జూచితిని కదా, ఆద్యంతమొక్క తీరుగ నడచినది. ఇందు నాయిక మొదట నాతనిని సందేహించును. అతడు యనగా నాయకుడు. ఆమె ఖండిత. ఆతడేదియో ఇచ్చకములు చెప్పి యామెను రంజింప యత్నించును. ఆమె భీష్మించును. సన్నివేశములు క్రమముగా జూపుచు సమయమెరిగి పాటల బాడించుచు, నాటల నాడించుచు కథ నడిపించుట దర్శక దామోదరుని ప్రతిభయే ననవలెను. ప్రాచీన కాలమున మనకు తోలుబొమ్మలాట లుండెడివి.అచట నేపధ్యమున గాయకులు స్వయముగా బాడుచుందురు. ఇచ్చట బాడినదానిని ​ బద్దీపై నిక్షేపించి మరల మరల వినిపింప జేతురు.
నాయకుడు గెంతుచు ‘ఆహా…హా …యని ఏమో పాడును. ఆ పాట కర్ణపేయముగానున్నది.కాని యతడట్లు వెర్రివానివలే నేల గెంతులు వేయునో మనకు తెలియదు. బహుశః అది నటనయై యుండునని నేనూహించితిని. నాయిక చిత్రముగ నుండును. ఆమె యందరివలే లేదు. పాదరక్షలతోనే పడకగది బ్రవేశించును. అందట్లే పరుండును. నాయకుడు అభ్యంతరము దెల్పడు. అనురాగమనిన యట్లుండునని యనుకొంటిని. హాస్యరసము పోషించుటకు వేరుగ నొకండు కలడు. ఆతడప్పుడప్పుడు ప్రత్యక్షమై ప్రేక్షకులను నవ్వింప యత్నించును. కాని, కథతో నతనికి కొంత సంబంధ ముండును.”పిచ్చిప్రేమ” యను పేరు చిత్రమునకు బాగుగా యతికినది….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked