ధారావాహికలు

విశ్వామిత్ర 2015 – నవల ( 13వ భాగము )

– యస్. యస్. వి రమణారావు

`సాయిరామ్ దాబా’ పెద్ద అక్షరాలు. క్రిందనే ప్రొ|| రవిబాబు కొంచెం చిన్న అక్షరాలు. దాబా మరీ అంత చిన్నదేం కాదు. కనీసం ఇరవై మంది కూర్చోగలిగే టేబుల్స్. కారులు పార్క్ చేసుకోవడానికి పక్కనే పెద్ద ఓపెన్ స్పేస్. మూడు పెడస్టల్ ఫేన్స్. కనబడుతున్న కిచెన్. నాలుగుపక్కలా కర్రలతో నిర్మించబడిన ఫెన్సింగ్. సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు,లంచ్ టైమ్ కావడంవల్ల కాబోలు అన్ని టేబుల్స్ ఫుల్ గా ఉన్నాయి, ఒక్క నాలుగు తప్ప. ఆ నాలుగు పక్క పక్కన లేవు. మూడు ఒకపక్క, ఒకటి ఇంకొక పక్క ఉన్నాయి. రెండు టేబుల్ రోస్ మధ్యలో దాదాపు నలుగురు మనుషులు పట్టే స్థలం ఉంది. రిజర్వడ్ అని రాసిఉన్న కార్డ్స్ ఆ టేబుల్ మీద పెట్టి ఉన్నాయి. విశాఖపట్టణం, భీమిలి స్టేట్ హైవేలో రోడ్డుమీదే ఉంది విశాలమైన ఆదాబా. చుట్టుపక్కల ఏవో ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాబాకు వచ్చిన అభిషేక్,రాజులకి కనబడిన దృశ్యం అది. రవిబాబు ఇద్దరిని దగ్గరుండి ఖాళీగా ఉన్న ఒక టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ముగ్గురూ కూర్చున్నారు. రవిబాబు, రాజు ఒకవైపు, అభిషేక్ ఇంకొక వైపు కూర్చున్నారు. పరిచయలాయ్యాక

“చాలా రష్ గా వుందే!అన్ని టేబుల్స్ ఫుల్ అయిపోయినట్టున్నాయి.ఎప్పుడూ ఇలాగే ఉంటుందా?”అడిగాడు అభిషేక్
“లేదుసార్. ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. సండే మటుకు భీమిలికి వెళ్ళేవాళ్ళు కొంచెంసేపు ఆగి వెళుతూ ఉంటారు. వీక్ డేస్ లో ఈ పక్కనే కొన్ని ఫాబ్రికేషన్ ఇండస్ట్రీస్, కాంక్రీట్ పైప్స్ అండ్ పిల్లర్స్ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అందులో పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడకి వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు. ఈరోజే ఎందుకో వర్కింగ్ డే అయినప్పటికీ రష్ గా ఉంది”కూల్డ్రింక్స్ వచ్చాయి.
“ఇంకొక్క అయిదు నిమిషాల్లో వస్తారు సార్”అన్నాడు రవిబాబు
“ఎవరు?”అడిగాడు అభిషేక్

“ఈ పక్కనే ఏవో ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పాను కద సార్.అందులో ఎవరో ఇవాళ పొద్దున్నే ఫోన్ చేసి `చిన్నపార్టీ ఉంది,మూడు టేబుల్స్ రిజర్వ్’ చేయమన్నారు.`ఎవరు’ అని అడిగితే `మేం రెగ్యులర్ గా వచ్చేవాళ్ళమేలే’ అన్నారు. ఇక్కడకి రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందువల్ల ఆ వచ్చేవాళ్ళు బాగా గుర్తుంటారు”ఒక్కక్షణం ఆగాడు రవిబాబు. తల ఊపాడు అభిషేక్.
“వాళ్ళలో ఒకవ్యక్తి నలభై అయిదు, ఏభై మధ్యలో ఉంటుంది వయసు, అప్పుడప్పుడు గ్రాండియోర్ కి వచ్చేవాడు. వచ్చినప్పుడు ఒక రెండు, మూడు రోజులు ఖచ్చితంగా ఉండేవాడు. ఇప్పుడు ఇక్కడకి రెగ్యులర్ గా వచ్చేవాళ్ళలో ఆయనకూడా ఉన్నాడు”
“అయితే ఏంటి?”అడిగాడు రాజు

“కాకతాళీయమో ఏమో తెలియదుగాని ఆయన వచ్చినప్పుడల్లా విశ్వామిత్ర గ్రాండియోర్ కి వచ్చేవాడు. అదే ఫ్లోర్ లో సూట్ తీసుకునేవాడు.ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది.అది ఏమిటంటే..”ఇంకా ఏదో చెప్పబోతూ అప్పుడే దాబాలోకి ఎంటర్ అవుతున్న పదిమంది మనుషులని చూసి మాట్లాడడం ఆపాడు రవిబాబు.
అభిషేక్ వెంటనే నెమ్మదిగా తలతిప్పి చూశాడు.
“ఆ మధ్యలో ఉన్న మనిషిని చూడండి సార్. అతని గురించే నేను చెప్పింది”నెమ్మదిగా లోగొంతుకతో అన్నాడు రవిబాబు. “అతనె కాదు సార్. అతని పక్కనే ఉన్న

వ్యక్తికూడా అప్పుడప్పుడు వచ్చేవాడు”
అభిషేక్,రాజు ఆ ఇద్దరి వ్యక్తులవంక చూశారు. ఆఇద్దరిలో ఒక వ్యక్తి భారతీయుడు కాడు. చైనీస్. ముప్ఫై, ముప్ఫైఅయిదు మధ్య ఉంటుంది వయసు.రెండవ వ్యక్తి ఇండియనే. అతని వయసు, నలభై, నలభై అయిదు మధ్య ఉంటుంది.ఇద్దరూ బాగా చదువుకున్నవాళ్ళలాగా కనబడుతున్నారు.
అప్పుడు జరిగింది ఎవరూ ఊహించని సంఘటన.ఆ పదిమంది వారికి రిజర్వ్ చేయబడిన టేబుల్స్ వైపు నడుస్తుండగానే. అభిషేక్, రాజుల కంటే ముందుగా వచ్చి కూర్చున్న

దాదాపు ఇరవైమంది ఉంటారు.అందరూ ఒక్కసారిగా లేచి ఆ పదిమందికి ఎదురుగా వేగంగా నడవడం ప్రారంభించారు.
“గెట్ రెడీ. రాజూ టేక్ కవర్”అభిషేక్ ఒక్కసారిగా లేచాడు. కానీ అప్పటికే లేట్ అయింది.ఆ ఇరవైమందిలో ఒక నలుగురు గన్స్ తీసి ఆ పదిమంది మీద ఫైర్ చేయడం ప్రారంభించారు. ఆ పదిమందీ ఒక్కసారిగా బిత్తరపోయి చెల్లాచెదరుగా పరుగెట్టడం ప్రారంభించారు. అభిషేక్ జేబులోంచి గన్ తీసి ఆ ఇరవైమంది మీద ఫైర్ చేయడం ప్రారంభించాడు. కొంచెంసేపు ఫైరింగ్ అవగానే అభిషేక్ దగ్గర బుల్లెట్స్ అయిపోయాయి. ఇక అభిషేక్ కి కూడా కవర్ తీసుకుని పారిపోక తప్పలేదు.కాని అతని కౌంటర్ ఎటాక్ కొంతవరకు ఫలించింది. ఎటాక్ కి గురి కాబడ్డ పదిమందిలో ఏడుగురు ప్రాణాలతో తప్పించుకున్నారు. చేసిన ఇరవైమందిలో నలుగురు చనిపోగా ఇంకొక నలుగురికి తీవ్రమైన గాయాలయ్యాయి. డెడ్ బాడీస్ తో సహా ఆ నలుగురిని తీసుకుని వాళ్ళుకూడా పారిపోయారు. వెనక్కి తిరిగి వచ్చి చూసిన అభిషేక్, రాజు, రవిబాబులకి ఆ పదిమందిలోని ముగ్గురి శవాలు తప్ప ఇంక ఎవరూ కనపడలేదు.

* * * * * * * * *

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked