ధారావాహికలు

విశ్వామిత్ర 2015 – నవల ( 17వ భాగము )

– యస్. యస్. వి రమణారావు

మర్నాడు పొద్దున్న ఉదయం పొద్దున్న ఎనిమిదింటికి త్రీటౌన్ కానిస్టేబుల్ రాజు సెల్ ఫోన్ గట్టిగా మోగడంతో ఉలి్క్కిపడి లేచాడు. ఎస్సై కేతుబాబు నుంచి ఫోన్. “హోమ్ కొడుకు సురేష్ ఫోన్ చేశాడు. నిన్నేదో గొడవైందంట గదా,నీకు తెలుసంట గదా. అమ్మాయంట గదా. కంప్లయింట్ గూడా ఇచ్చారంట గదా?ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి బొక్కలోకి తోసెయ్యమంటున్నాడు.ఇంకా అరెస్ట్ చేయలేదా అని చిందులు తొక్కుతున్నాడు.మనకెవడు బాసో నాకైతే అర్థం కావటం లేదు.అది సరేలే సురేష్ మనోడే కదా. నిన్నరాత్రే ఎందుకు అరెస్ట్ చేయలేదు?”
“సురేష్ ఫ్రెండ్స్ కి దెబ్బలు చాలా బలంగా తగిలాయి సార్.నేను నిన్న వాళ్ళని హాస్పటల్ లో చేర్పించక పోయుంటే కండిషన్ ఇంకా చాలా క్రిటికల్ గా ఉండేది సార్. వాళ్ళని హాస్పటల్ లో జేర్పించడం, వాళ్ళ దగ్గర్నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం ఇవన్నీ పూర్తిచేశాను సార్.అవన్నీ పూర్తయ్యేసరికే తెల్లవారుఝాము ఐదయిపోయింది సార్. ఇంకొక్క విషయం సార్ ఆ దెబ్బలు చూశాక కొంచెం ఎక్సట్రా ఫోర్స్ ఉంటే మంచిదని అనిపించింది సార్”
కేతుబాబు ఆశ్చర్యపోయాడు.”ఆ అమ్మాయెనకాల పెద్దగేంగ్ ఏదైనా ఉందేమో?సురేష్ మనల్నెలాంటి కేసులో ఇరికించేస్తున్నాడో? సరే జీప్ లో నలుగురం వెళదాం”ఫోన్ పెట్టేశాడు.

ప్రశాంతి మేన్షన్స్,ఫ్లాట్ నంబర్ 501 కాలింగ్ బెల్ మోగింది.ఒక మధ్య వయసులో ఉన్నావిడ తలుపు తెరిచింది.ఎదురుగుండా పోలీసులు.ఆమె వెనక్కు తిరిగి ఏదో మాట్లాడేలోపే ఆమెను తోసుకుంటూ లోపలకు ప్రవేశించాడు కేతుబాబు. డైనింగ్ టేబుల్ దగ్గర శివహైమ,ఇంకొక ఏభైఏళ్ళ వయసున్న మధ్యవయస్కొడొకాయన కూర్చొని ఉన్నాడు. ఇద్దరూ పోలీసులని చూసి లేచారు.కేతుబాబు శివహైమని చూస్తూనే అడిగాడు”నువ్వూ నీగేంగేనా నిన్న బీచ్ లో ముగ్గురు కుర్రాళ్ళని కొట్టింది?” శివహైమ సూటిగా కేతుబాబు కళ్ళలోకి చూసింది.ఆ కళ్ళలో కనబడే భావం కేతుబాబుకి అర్థం కాలేదు.
“చెప్పు”రెట్టించి అడిగాడు.

“కాదు”చెప్పింది శివహైమ.నవ్వాడు కేతుబాబు.”అదేదో పోలీస్ స్టేషన్ కి వచ్చి చెప్పు” అప్పుడు శివహైమ అడిగిన ప్రశ్న అతడిని దిగ్భాంత్రికి గురిచేసింది”ఏం నువు పోలీసువు కాదా?కాన్ట్ యు రికార్డ్ మై స్టేట్మెంట్ హియర్?” ఎస్సైని ఎదురు ప్రశ్న అడగడమా?అదీగాక ఏకవచనంలో.కేతుబాబు కళ్ళు ఎర్రబడ్డాయి. “ఏంటే,రెచ్చిపోతున్నావు? “స్పీడ్ గా ముందుకు అడుగు వేయబోయాడు. అంతవరకూ నిశ్శబ్దంగా ఉన్న ఆ యాభైఎళ్ళ వయసాయన కేతుబాబుకి శివహైమకి మధ్యగా వచ్చాడు”చూడండి ఎస్సైగారూ,షి ఈజ్ ఏ డాక్టర్. ఒక డాక్టర్ తో మాట్లాడే పద్ధతి ఇది కాదు..”అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. కేతుబాబు ఇంక ఆగలేదు”ఏంట్రా అందరూ నాకు నీతులు చెపుతున్నారు”విసురుగా ఆయన్ని పక్కకు తోశాడు.ఆయన పడిపోయేవాడే,కానీ శివహైమ ఆయన పడిపోకుండా చటుక్కున ఎడంచేత్తో పట్టుకుంది.ఆయన్ని అలా పట్టుకునే షార్ప్ గా కుడికాలు పైకెత్తి కాలివేళ్ళతో కేతుబాబు ఛాతీమీద బలంగా తన్నింది.సడన్ గా కాలుని చాపడంద్వారా వచ్చే స్పీడ్ కి, హిప్ తో బలాన్ని జోడించి ఎటాక్ చేస్తున్న వ్యక్తి ఛాతీమీద గాని,పొట్టమీదగాని తన్నడంద్వారా తీవ్రమైన బాధని కలిగించే ఫ్రంట్ స్నాప్ కిక్ “అబ్బా”అంటూ ఒక్కసారిగా నేలమీద కుప్పకూలిపోయాడు కేతుబాబు. వచ్చిన ముగ్గురు కానిస్టేబుల్స్ ,రాజుతో సహా జరిగిన సంఘటన చూసి అదిరిపోయారు.శివహైమ మీదకు దూకబోతున్న ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ని రాజు వారించాడు “మీరిద్దరూ ఎస్సైగారిని బయటకు హాస్పటల్ కు తీసుకు వెళ్ళండి.ఇక్కడ సంగతి నేను చూస్తాను “చెప్పి వారిని బయటకు పంపించేశాడు. ఆ ఏభై ఏళ్ళ వయసతన్ని అడిగాడు. “మీరేమౌతారు ఈమెకి ?”

” మేం ఇదే ఎపార్ట్మెంట్స్ లో ఉంటాం. ఈ రోజు అమ్మాయితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేద్దామని వచ్చాం”
“మీతో ఒక విషయం మాట్లాడాలి” ఆయన భుజం మీద చెయ్యేసి పక్కకు తీసుకెళ్ళాడు రాజు. ఆయనతో నెమ్మదిగా సీరియస్ నెస్ ధ్వనిస్తున్న లోగొంతుకతో అడిగాడు
“మీపిల్లలెక్కడున్నారు?”
“యుఎస్ లో”
రాజు తల పంకించాడు

“ఈ అమ్మాయి మీకేం కాదు.అనవసరంగా ఈ కేసులో ఇన్వాల్వ్ కాకండి. నిజం చెపుతున్నాను. ఇందులో హోమ్ మినిస్టర్ కొడుకు ఉన్నాడు. అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పండి.”ఆయన రాజుకేసే ఆలోచనగా చూశాడు
“మళ్ళీ చెపుతున్నాను. అనవసరంగా ఈ కేసులో ఇన్వాల్వ్ కాకండి. ఇన్వాల్వ్ అయితే పోలీసుల చుట్టూ తిరగాల్సొస్తుంది. జైళ్ళలో ఉండాల్సొస్తుంది. ఈవయసులో అవన్నీ మీకు చాలా కష్టం. అనుభవంతో చెపుతున్నాను, వినండి” సీరియస్ గా చెప్పాడు
ట్రాక్ సూట్, టీషర్ట్ వేసుకున్న ఆయన తన భుజంమీదనుంచి రాజు చెయ్యి నెమ్మదిగా తీసేశాడు.తనచెయ్యి తీసి రాజు భుజం మీద వేశాడు.నడిపిస్తూ బాల్కనీలోకి తీసుకెళ్ళాడు”ఇందాక నువ్వేమన్నావ్. మీతో ఒక విషయం మాట్లాడాలి అని కదా?” ఆయన జేబులోంచి సెల్ ఫోన్ బయటకు తీశాడు.”నేను నీకో విషయం చూపించాలి”
వాట్సాప్ ఓపెన్ చేసి అందులో ఒక వీడియో ప్లే చేశాడు. ఆ వీడియో చూస్తున్న రాజు కళ్ళు పెద్దవయ్యాయి.

అది నిన్న రాత్రి బీచ్ లో శివహైమ తనను ఎటాక్ చేసిన ఆముగ్గురి దుండగుల్ని తంతున్న వీడియో.”వెరీ షార్ట్ వీడియో.త్రీమినిట్స్ అంతే. మొత్తం చూశావుకదా. హై డెఫినిషన్ క్వాలిటీ. అమ్మాయి ఒక్కత్తే ఉంటోంది కదా, అబ్బాయిలకి చెప్పి, అమెరికానుంచి నేనే తెప్పించా. ఇంకొక్క విషయం.” ఒక్క క్షణం ఆగాడాయన. “నాపేరు కృష్ణకుమార్. క్రిమినల్ లాయర్ ని. నేను తమిళు. మాఆవిడ తెలుగు. అందుకని ఇక్కడ ఉంటున్నా. మీహోమ్ గారు నాకు బాగా తెలుసు. అదీ సంగతి. “మళ్ళీ ఆగాడు కృష్ణకుమార్. రాజు భుజం మీంచి చెయ్యి తీసేశాడు. రాజు కళ్ళలోకిచూస్తూ అన్నాడు”నీకింకో విషయం చెప్పాలి”అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆయన ఫోన్ లో మళ్ళీ వాట్సాప్ మోగింది. ఆయన ఫోన్ తీసి చూశాడు.ఆయన మొహం వికసించింది” ఇంకా చెప్పాలనుకున్నాను. వీడియోనే వచ్చేసింది. లేటెస్ట్ చూడు” అంటూ చూపించాడు. అది కేతుబాబు, కానిస్టేబుల్స్ నలుగురు ఇంటిలోకి వచ్చినప్పట్నుంచి తీసిన వీడియో. “ఈ రెండు వీడియోలు కోర్ట్ లో ప్రొడ్యూస్ చేశాననుకో…ఈ వయసులో సస్పెన్షన్ లు, పెన్షన్ ఆగిపోవడాలు, ఇవన్నీ తట్టుకోవడం చాలా కష్టం. ఇలాంటి కేసులు నాకు చాలా తెలుసు. అనుభవంతో చెపుతున్నాను”

రెండు వీడియోలు చూసిన రాజు ఒక్కసారిగా కమెడియన్ బ్రహ్మానందం అయిపోయాడు.ఇంకేం మాట్లాడకుండా వెంటనే వెళిపోయాడు.హాలు తలుపు దగ్గరికి వెళ్ళి గడప బయటకు అడుగు వేస్తూ వెనక్కు తిరిగి కృష్ణకుమార్ కి శాల్యూట్ చేసి మరీ వెళ్ళాడు. రాజు వెళిపోయిన వెంటనే కృష్ణకుమార్, అతని భార్య, శివహైమ ఒక్కసారిగా విరగబడి నవ్వారు.

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked