శీర్షికలు

వీక్షణం సాహితీ గవాక్షం-69 సమీక్ష

– విద్యార్థి

వీక్షణం 69వ సమావేశము విలంబి నామ సంవత్సరం వైశాఖ మాసం బహుళ త్రయోదశి నాడు, అనగా మే 13వ తారీఖున శ్రీయుతులు గీతా మాధవి, సత్యనారాయణ గార్ల స్వగృహమునందు జరిగినది. ఈ రోజు అమెరికా దేశస్తుల మాతృ దినోత్సవం అవటం కూడా ఒక ప్రత్యేకత.

ఈ సభకు శ్రీ తాటిపాముల మృత్యుంజయడు గారు అధ్యక్షత వహించారు. అధ్యక్షుల వారు ఈ నాటి ముఖ్య అతిధి శ్రీ చెన్నకేశవ రెడ్డి గారిని సభకు పరిచయం చేస్తూ, “వారు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయములో తెలుగు ఎన్సైక్లోపేడియా విభాగాధిపధిపత్యం తో బాటు పలు బాధ్యతలు నిర్వహించారు”. శ్రీ చెన్నకేశవ రెడ్డిగారిని తెలుగులో గేయ రచన గురించి చేసిన పరిశోధనని ప్రశంసించారు.

శ్రీ చెన్నకేశవ రెడ్డిగారి ప్రసంగ విశేషములు ‘ గేయం గతి ప్రధానమైనది. గతులు నాలుగు. అవి త్రిశ్ర, చతురస్ర, ఖండ, మిశ్ర గతులు. కావ్యమంటే కథ, పాత్రలు, రసపోషణ, ధ్వని, వస్త్వైక్యం, అలంకారాలు, వర్ణనలు మొదలగు కావ్యాంగాలతో కూడిన రచన. ఈ దృష్ట్యా గేయంతో మొదటి కావ్యం రాసిన వారు సినారె. కావ్యమే కాదు, గేయ నాటికలు, గేయ ఖండికలు, ముక్తకాలు, రుబాయిలూ వంటి పంచ పదులు, గజళ్లు, బుర్ర కథలు, రూపకాలు, అనుసృజనలు, లలిత గీతాలు, సినిమా పాటలూ. సినారే లాగా ఒక కవితా రూపములో ఇన్ని ప్రక్రియలు చేసిన కవి ఏ భాషలోనూ, ఏ కాలంలోనూ లేరని చెప్పాలి.

సినారే రచించిన గేయ కావ్యాలు
1. నాగార్జున సాగరం (మొట్ట మొదటి కాల్పనిక గేయ కావ్యం
2. కర్పూర వసంత రాయలు (మొట్ట మొదటి చారిత్రాత్మక గేయ కావ్యం)
3. విశ్వనాథ నాయకుడు (వీర రస ప్రధాన కావ్యం)
4. ఋతుచక్రం (ఆత్మ కథాత్మక కావ్యం 5. జాతి రత్నం (నెహ్రూ జీవిత చరిత్ర)
6. భూమిక (కవితా చరిత్ర, తాత్విక కావ్యం).”

సమయా భావం వల్ల కేవలం నాగార్జున సాగరం, కర్పూర వసంత రాయలులోని ఇతివృత్తాలను గురించి రేఖా మాత్రముగా చెప్పి, ఆ కావ్యములలోని రచనా సంవిధానాన్ని (లయ పోషణా, పాత్ర పోషణ మొదలైనవి) ఉదాహరణలతో సహా వివరించడం జరిగింది.

తరువాత డా|| కె.గీత కవిత్వాన్నుద్దేశించి మాట్లాడుతూ “శ్రీమతి గీతా మాధవి గృహ ప్రవేశం చేసిన నాడే ఆమె ఇంట ఆమె కవితా మాధురిని గురించి తొలి ప్రసంగం చేయడం ఒకస్వర్ణావకాశము. ఆమె కవితల్లో ఎంతో వస్తు వైవిధ్యమున్నది. కార్మికులు, బాల కార్మికులు, కష్టజీవులు, స్వీయానుభూతులు, స్త్రీవాద కవితలు, అమ్మా నాన్నల మీద, భక్తి మీద, సంతానం మీద, ప్రకృతి, విహార స్థలాలు, కాలిఫోర్నియా రాష్ట్రం మీదా – ఇలా ఎన్నో విషయాల మీద కవితలున్నాయి. “నిరంతరం ఎగిరి దుమికే గాలి పంపులా, సన్నని డొక్కలతో మెకానిక్ కుర్రాడు, నువ్వు బాలుడవన్న దృష్టి మా పిల్లలను చూసైనా తట్టదు”, అని ఎంతో హృద్యముగా “మెకానిక్ కుర్రాడు”  లో గీత కవిత్వికరించారని శ్రీ చెన్నకేశవ రెడ్డి అన్నారు.

గీత శీర్షికలు కూడా ఉన్నతంగా, భావ గర్భితంగా పెడతారు. ఉదాహరణకు “బంగాళాఖాతం”. ఈ శీర్షిక బంగాళాఖాతాన్ని విరిచి, శ్లేషించి, కవితాత్మకంగా విశ్లేషించి తీరు చాలా గొప్పగా ఉంది. ఇది స్త్రీవాద కవితలలో ఉత్తమమైనది. “ఈ రోజంతా” అనే కవితలో, ఒక వీధిని, ఆ వీధిని పోయే జనాలని గురించి, ఒక్కొక్కరి గురించి ఒక వాక్యం రాస్తూ, బహు విధ రేఖా చిత్రంలా దృశ్యమానం చేయటం జరిగింది. అమ్మ మీద, తమ పిల్లల మీద రాసిన కవితలు గుండెను తడుపుతాయి. మెటఫర్లను, మెట్ల వరసగా పేర్చి, కవిత్వాన్ని ఉన్నత స్థితిగా తీసుకు వెళుతుందని, నూతన పద కల్పన శక్తిని గురించి చెప్పారు. ఆమె శైలి ప్రవాహక శైలి. సూటిగా, సుందరంగా, భావ గంభీరంగా చెప్పటం ఆమెకు అలవడినది.

గీతా మాధవికి అమెరికా వచ్చినా ద్రవ్య భాష అలవడలేదని, “స్ట్రాబెరీలకన్నా కాకెంగిలి జామకాయ రుచి సాక్షి” అని ఆమె కవితల్లో మాతృ దేశం మీద, మాతృ భాష మీద మమకారం కనిపిస్తుందన్నది. కేవలం కవయిత్రిగానే కాకుండా, వీక్షణం కార్యక్రమాల ద్వారా మాతృ భాష కు సేవ చేస్తున్నది. ప్రతి ఏటా మాతృ దినోత్సవం నాడు ఆమె ఇంట ఇలాగే మాతృ భాష తో కూడిన ఉత్సవం జరగాలి” అని శుభాకాంక్షలు తెలిపారు.”
ఆ తరువాత శ్రీ వేమూరి “అమెరికాలో తెలుగు నేర్పడం” గురించి మాట్లాడేరు.
ఆ తరువాతి కార్యక్రమం ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారయణ గారి “భాష – భాషాభివృద్ధి”, “తెలుగు వర్ణమాల: విశిష్ఠతలు” పుస్తక ఆవిష్కరణ, పరిచయాలు.   ఈ రెండు పుస్తకములూ తెలుగు భాషా బోధనకూ, అభివృద్ధికీ ప్రామాణికము కాగలవు. తెలుగు వర్ణమాలకు ఉన్న విశిష్ఠత గంగిశెట్టిగారు “శ్రీకారం” యొక్క తెలుగు అక్షరరూపాన్ని ఈ విధముగా నిర్వచించారు:

ఓంకారంలో ఏముంది నేస్తం?
తెల్గు ‘శ్రీ’ కారంలో ఉంది యోగరహస్యం!
ధ్యానించి చూడు, ఆ వంపుల్లో
దర్శనమిస్తుంది కుండలినీ సర్వస్వం
అండ, పిండ,బ్రహ్మాండ సమస్తం…

కడుపులాటి వృత్తం అండమైతే,
నడుమ సంధిరేఖలో శోభించే పిండం
శిరసున సుడితిరుగుతున్నది  బ్రహ్మాండం
అడుగున విడివడి సకలసృష్టికారక రజో రేఫం
కన్నతల్లిజోలలాటి అమృతాంశురూపం…

*కడుపున శబ్దబ్రహ్మమ్మట
ఆ పై శబల బ్రహ్మమ్మట
అటుపై అనంతమే మన
బ్రహ్మాండావరణమ్మట..

సకలశుభకార్యాలకు ‘శ్రీ’కారమే ఆద్యక్షరం
ఇహ-పర సుఖసంధాయక బీజాక్షరం
యోగశాస్త్రసారాన్ని ఒక్క అక్షరంలో మలిచిన
అక్షరబ్రహ్మ  తెలుగుశిల్పికిదే  పాదాభివందనం!

తదుపరి కార్యక్రమం కిరణ్ ప్రభ గారి క్విజ్. మాతృ దినోత్సవ సందర్భముగా తెలుగు ప్రముఖులూ, తెలుగు కవితలు, గేయ రచనలనుండి ఉందహరించబడిన “మాతృ” అంశముతో  జరిగిన కార్యకమము ఎప్పటివలనే ఉత్సాహముగా జరిగినది.

చివరగా జరిగిన కవి సమ్మేళనము కార్యక్రమములో చదివిన కవితలు:  డా||  గీతా మాధవి “కొత్త జీవితం” కవితను, డా||  జి. చెన్నకేశవ రెడ్డి – బేబీ సిట్టీంగ్ “ముద్దుల మనవణ్ణి మనసు పడి, రెక్కలు కట్టుకుని వస్తే చుక్కలు చూపించావు” అంటూ మనవణ్ణి ఉద్దేశించి, షంషాద్ “ఆసిఫా” కు జరిగిన అన్యాయం గురించి  కవితలు వినిపించారు. ఆర్. దమయంతి గారు  తమ రచనలనే కాకుండా చక్కని పాటలను కూడా పాడి అందరినీ అలరించారు.

ఇంకా శ్రీమతి ఉమా వేమూరి, శ్రీమతి మధురిమ, శ్రీమతి శిరీష, చిన్నారులు ఇందు, ఈశా మున్నగు వారు చక్కని గాత్రంతో కూడిన పాటలతో అందరినీ ఓలలాడించారు.

అన్నిటినీ మించి వెంట్రిలాక్విజం, మిమిక్రి చేసి సభలోని వారందరినీ శ్రీ రాంపల్లి సదాశివ గారు ఆకట్టుకుని  వీక్షణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అనేక మంది పుర ప్రముఖులు హాజరైన ఈ వీక్షణం ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా జరిగింది.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked