ఈ మాసం సిలికానాంధ్ర

వీక్షణం సాహితీ సమావేశం-61

రచన : అన్నే లెనిన్

అయిదేళ్ళు జయప్రదంగా పూర్తి చేసుకొని ఆరో ఏడాదిలోకి విజయవంతంగా అడుగుపెట్టిన బే ఏరియా సాహితీ వీక్షణం 61 వ సమావేశం మిల్పీటస్ లోని స్వాగత్ హోటల్ ప్రాంగణం లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కార్యాలయంలో అక్టోబరు 17 న జరిగింది.

శ్రీ రావ్ తల్లాప్రగడ అధ్యక్షత వహించిన ఈ సమావేశాన్ని మొదట శ్రీ వేణు ఆసూరి తమ స్వాగత వచనాలతో ప్రారంభించారు. ఇకనుంచీ క్రమం తప్పకుండా ప్రతి సమావేశంలోనూ ఆధునిక సాహిత్యంతో పాటు, ప్రాచీన సంప్రదాయ సాహిత్యంపై కూడా ప్రత్యేక ప్రసంగాలు ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఇవేళ్టి ‘కాళిదాసు కావ్య వైభవం’ అనే ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల ప్రసంగకర్త , వృత్తికి సాఫ్టువేర్ ఇంజనీరయినా సంస్కృత భాషాప్రచారానికి అంకితమైన శ్రీ విశ్వాస్ వాసుకి గారిని సభకు పరిచయం చేశారు.

శ్రీ విశ్వాస్ గారు కాళిదాసు కావ్య ప్రాశస్త్యాన్ని వివరిస్తూ, భారతీయ సాహిత్యాన్ని కాళిదాసు పూర్వం, కాళిదాసు తరువాత అని విడదీసి చూడొచ్చని, అంతగా ఆయన భారతీయ సాహిత్య సంప్రదాయాన్ని ప్రభావితం చేశారని సోదాహరణ ప్రాయంగా విశదీకరించారు. అలాగే ఆయన కావ్యాలలో దర్శనమిచ్చే ఆనాటి భారతదేశ స్వరూపాన్ని కూడా విపులీకరించారు. దేశమంటే కేవలం భౌగోళిక రూపం కాదనీ, ఒక సాంస్కృతిక వాస్తవమనీ స్పష్టం చేశారు.

ఆ తరువాత ముఖ్యకార్యక్రమం శ్రీ నాగరాజు రామస్వామిగారు తెలుగులోకి అనువదించిన నోబెల్ బహుమతి గ్రహీత ఆక్టోవియా పాజ్ కావ్యం ‘సూర్య శిల’ (సన్ స్టోన్) ఆవిష్కరణ. అధ్యక్షులు, శ్రీ తల్లాప్రగడ రామచంద్రరావుగారు పుస్తకాన్ని ఆవిష్కరించి, పాజ్ గూర్చి, పాజ్ అనుసరించిన సర్రియలిజం విధానాన్ని గూర్చి, రామస్వామిగారి అనువాద ప్రాశస్త్యాన్ని గూర్చి సభకు పరిచయం చేశారు. అంకిత మందుకొన్న ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ సర్రియలిస్టిక్ శైలి గూర్చి మరికొంత వివరించారు. ప్రముఖ సాహిత్య సౌందర్యవేత్త హెర్బర్ట్ రీడ్, మార్క్సిజం+ ఫ్రాయిడిజం = సర్రియలిజం అని నిర్వచించాడనీ, జీవన వాస్తవాలని మానవ సుప్తచిత్తం శకలాలు, శకలాలుగా గ్రహిస్తూ తనకు తోచిన రీతిలో పరివర్తనం చేసుకొంటుందనీ, అందువల్ల సర్రియలిజం ధోరణిలో సహజంగానే ఒక సంక్లిష్టత చోటుచేసుకొంటుందనీ, అర్థం చేసుకోడానికే కష్టమైనదాన్ని అనువదించాలనుకోవడం గొప్ప సాహసమనీ , దాన్ని సునాయాసంగా నెరవేర్చి, తెలుగు సాహిత్యానికి శ్రీరామస్వామి గారు గొప్ప కానుక ఇచ్చారనీ, దీన్ని అంకితమందుకోవడం తన భాగ్యమనీ పేర్కొన్నారు.
అనువాదకులు శ్రీ నాగరాజు రామస్వామి గారు, మెక్సికన్ కవి అయిన ఆక్టోవియో పాజ్ భావ నేపథ్యం గూర్చి , కవిగా, వ్యక్తిగా ఆయన గొప్పదనం గూర్చి సమగ్రంగా వివరించారు. భారత దేశంలో అమెరికా రాయబారిగా ఉన్న పాజ్ ఏ పరిస్థితుల్లో ,మెక్సికన్ గౌరవం కోసం తన పదవిని త్యజించారో తెలియజేశారు. ఆయనలో పాశ్చాత్య నాగరకత పరిధి దాటి బౌద్ధ హిందూ సంస్కృతి అభిమానం బలంగా అగుపిస్తుందనీ, అదే తనను ఈ అనువాదానికి ప్రేరేపించిందనీ పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక వైవిధ్యంలో తలెత్తిన భావ సంక్లిష్టతను తెలుగు నుడికారంలో ఇమిడించడానికి తనకెదురైన సమస్యలు, అందుకు తానెంచుకొన్న పరిష్కార మార్గాలను గూర్చి సంక్షిప్తంగానే అయినా సమగ్రంగా వివరించారు. సమగ్రత కోసమే ‘సూర్య శిల’ తోపాటు మరో ఏభై ఖండికలను కూడా అనువదించి ఈ సంపుటిలో చేర్చినట్లు తెలిపారు శ్రీ నాగరాజు రామస్వామి గారు . తరువాత ప్రథమ ప్రతిని వీక్షణం సమన్వయకర్త డా. గీతామాధవికి బహూకరించారు.

పుస్తక ప్రచురణకు తోడ్పడిన అందరికి పేరుపేరున కృతజ్ఞత తెలుపుకున్నారు. పాలపిట్ట పబ్లికేషన్ అధిపతి శ్రీ గుడిపాటి గారికి, దీర్ఘమైన ముందుమాటను అనుగ్రహించిన వాడ్రేవు చిన వీరభద్రుడు గారికి, అంకిత గ్రహీత ఆచార్య గంగిశెట్టి లక్ష్మి నారాయణ గారికి, అధ్యక్షుల వారికి, “వీక్షణం” కు ధన్యవాదాలు తెలిపారు. విశిష్ట కవి, విమర్శకులు, చిత్రకారులు, తాత్వికులు, నడిచే విజ్ఞాన సర్వస్వమైన శ్రీ చినవీరభద్రుడు గారు తన కవితా సంపుటికి పీఠిక రాయడం మహా అదృష్టంగా భావిస్తున్నాని విన్నవించుకున్నారు.

తదుపరి కార్యక్రమం సాహిత్య క్విజ్. చతుర సాహిత్య కళా కేళి ! శ్రీ కిరణ్ ప్రభ గారు నిర్వహించిన క్విజ్ అందరినీ ఆకట్టుకుంది.

పిదప కవితాపఠనం కార్యక్రమంలో శ్రీమతి గీతామాధవి, శ్రీమతి తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం, శ్రీమతి షంషాద్ బేగం, శ్రీ వెంకట రెడ్డి, శ్రీ వికాస్ విన్నకోట మొదలగు వారు కవితలను వినిపించారు.

ఆద్యంతం ఆసక్తికరంగా మూడు గంటల పాటు ఆత్మీయంగా సాగిన సాహిత్య సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి కాంతి కిరణ్,  శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి కోటేశ్వరమ్మ, శ్రీమతి మాధవి, శ్రీమతి శారద, శ్రీమతి జ్యోత్స్న తల్లాప్రగడ, శ్రీ లెనిన్, శ్రీ చిమటా శ్రీనివాస్, శ్రీ అబ్దుల్లా మహమ్మద్, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, శ్రీ గాంధీ ప్రసాద్, శ్రీ శ్రీ చరణ్, శ్రీ భువన్, శ్రీ మారుతీ కుమార్, శ్రీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked