వీక్షణం

వీక్షణం 55వ సమావేశం

కాలిఫోర్నియా క్యూపర్టినోలోని నాగసాయి బాబా గారి ఇంట్లో ఈ నెల 12న వీక్షణం 55వ సమావేశం జరిగింది. అతిధేయ దంపతుల ఆత్మీయ ఆహ్వానం తరువాత, అధ్యక్షులు శ్రీ నరసింహాచార్యులు గారు సమావేశాన్ని తమ అధ్యక్షోపన్యాసం తో ప్రారంభించారు. ఆచార్యులవారు బమ్మెర పోతన విరచితమైన శ్రీమద్భాగవతం లోని భక్తి తత్వాన్ని, సాంప్రదాయ నవనవోన్మేష కవిత్వ వైభవాన్ని సాధికార సమగ్రతతో కొనియాడారు. స్థాలీపులాక న్యాయంగా ఉటంకిస్తాను అంటూనే, పోతన బాల్య ఉదంతాల నుండి గజేంద్ర మోక్ష ఘట్టాల దాకా ఆసక్తికరంగా వివరించారు. ఆచంద్ర తారార్కా లైన  సెలయేళ్ళ గిరిసీమలో ఆదిశంకరుణ్ణి నెలకొల్పుకొని, తన నోట రామభద్రునిచే భాగవత బృహద్రచనను పలికించుకున్న హరిహరాద్వైత భక్త కవితల్లజుడు బమ్మెర. ఆచార్యుల వారి ప్రసంగంలో ఆణిముత్యాల లాంటి అనేక పోతన పద్యాలు అలవోకగా దొర్లాయి. “పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట”,  “అలవైకుంఠ పురములో”, “మందార మకరంద మాధుర్యమును గ్రోలు ” వంటి పద్య రత్నాలు పరిఢవిల్లాయి. వసుచరిత్రను ఉటంకిస్తూ కోలాహల పర్వతం, శుక్తిమతి, గిరిక ఆదిగల అభిధానాలలోని అర్థ స్ఫూర్తి ని అబేధ లింగ సామ్యంగా సమన్వయించారు. నేటి “పరుస” పండుగల వంటి ఆనాటి ఉత్సవాలలోని బాలపోతన అనుభవ కథనాలను వివరిస్తూ, “చొప్పదంటు ప్రశ్నలు”గా తలపించే ఆతని సందేహాల వెనుక దాగిన సర్వేశ్వర ఏకతను ఏకరువు పెట్టారు. కవయా క్రాంతి దర్శనః – పోతనామాత్యుడు క్రాంతిదర్శకుడు ఐనందుననే రవికాంచని వైకుంఠాపురాన్ని కవిగా అంత సాంగోపాంగంగా సందర్శించుకున్నాడు. నానృషే కురుతే కావ్యం – బమ్మెర ఋషి తుల్యుడైనందుననే సంకాశ సుభగంగా ‘పాహి పాహి యని కుయ్యాలించిన విఫల గజేంద్రుని’ మొరను ఆలకించ గలిగాడు, “ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్క నొత్తకుండా”, హుటాహుటిగా పరుగెత్తిన ‘ఆర్త త్రాణ పరాయణున్ని’ అంత విస్పష్టంగా దర్శించుకో గలిగాడు. ‘ఇంతింతై నభోవీధి పర్యంతమై’ ఎదిగిన వటుని పరమ పావన పాద పీఠాన్నీ భావించ గలిగాడు. ఇలా, అధ్యక్షులు గారు పోతనార్యున్ని భక్త కవిగా, క్రాంత దర్శకుడిగా అభివర్ణిస్తూ, సాంప్రదాయంలో కవిత్వం ఉన్నందు వల్లే ఈనాటికీ సాహిత్యంలో నవనవోన్మేష నవీనత మిగిలి ఉందని ముగించారు.

ఈ నాటి విశిష్ట అతిథులు ప్రఖ్యాత సాహిత్య మూర్తి త్రిపురనేని గోపీచంద్ గారి కూతురు, విఖ్యాత హేతువాద వేత్త త్రిపురనేని రామస్వామి చౌదరి గారి పౌత్రి  శ్రీమతి రజని కాట్రగడ్డ గారు.  బెంగళూరు నుండి విచ్చేసిన రజని గారు సభలోని సభ్యులను ఎంతో ఆసక్తి తో పేరుపేరునా పరిచయం చేసుకోవడం అందరినీ ఆనందపరిచింది. శ్రోతల అభ్యర్థన మేరకు వారు తన జీవిత విశేషాలను వివరించారు. లబ్ధప్రతిష్టులైన వారి కుటుంబ సభ్యుల, ముఖ్యంగా వారి తండ్రి గారైన గోపీచంద్ గారి వ్యక్తిత్వాన్ని అభివ్యక్తీకరిస్తూ వారు రచన వేరు జీవితం వేరు అనేలా కాకుండా, తమ రచనను జీవన విధానాన్ని ఏకీకృతం గావించుకున్న ఆత్మశుద్ధి  గలిగి ఉండే వారని తెలిపారు. చిన్ననాటి నుండీ తన సందేహాలకు నాన్నగారి పుస్తకాల్లో సమాధానం లభించేదని అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గోపీచందుల మధ్య, ముఖ్యంగా ‘వేనరాజు’ నవలా విషయంలో అభిప్రాయం బేధాలు ఉన్నా వాళ్ళిద్దరితో మిత్రబంధం బలంగా ఉండేదని తెలిపారు. హేతువాది ఐన తన తాతగారు రామస్వామి చౌదరి, సాంప్రదాయ విషయ బద్ధుడైన ఉన్నవ లక్ష్మినారాయణ గారి మధ్య ఎన్ని భావ పరమైన బేధాలు ఉన్నా వారి స్నేహం ఏనాడూ చెడలేదని తెలిపారు. వారిది జ్ఞాన సంపన్నమైన కుటుంబమనీ, నారాయణగూడా లోని వాళ్ళ ఇల్లు నిత్యనూతన సరస్వతీ నిలయంగా ఉండేదని హర్షం వెలిబుచ్చారు. సోదరులు చంద్ర, జ్యోత్స, శాయి తనకన్నా పెద్దవారు కనుక ఆనాటి మా కుటుంబ సాహిత్య కళా నేపథ్యం వారికి కలిసి వచ్చిందని వివరించారు. తన రచనలోని మానసిక విశ్లేషణ అందరికీ అందిరావాలని, ఏ రచన కైనా సాహిత్య ప్రయోజనంతో పాటు సామాజిక ప్రయోజనం కూడా ఉండి తీరాలని గోపీచందుగారు తపించే వారని చెప్పుకొచ్చారు. సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’, ‘అసమర్థుని జీవిత యాత్ర’, ‘విశ్వదర్శనం’ (తాత్విక గ్రంధం ౧ &౨) ఇత్యాది గ్రంధాలు ఎంతో పేరుప్రతిష్టలు తెచ్చిపెట్టాయని , అసమర్థుని జీవిత యాత్ర మూడేళ్ళలో ఐదు సార్లు పునర్ముద్రణ పొందిందని, వారి శతజయంత్రి సందర్భంలో అలకనందావారు సమగ్ర సాహిత్యాన్ని వేశారని, లత గారు కూర్చి పెట్టిన ‘చీకటి గదులు’ అసంపూర్ణంగానే మిగిలిపోయిందని తెలిపారు. అసమర్థుని జీవనయాత్ర చైతన్య స్రవంతి ప్రక్రియలో సాగిన మనోవిజ్ఞాన విశ్లేషణాత్మక రచన. దాన్ని తండ్రి గారైన రామస్వామి చౌదరి గారికి అంకితమిస్తూ “ఎందుకు అన్న ప్రశ్న వేసిన నాన్నకు అంకితం” అని రాసుకున్నారు. గోపీచందుగారు రానురాను ఆశువుగా చెబుతూ రచనలు సాగించే వారని అన్నారు. నాస్తికవాదిగా ముద్రపడిన తాతగారు, హేతువాదులూ, ఎం ఎన్ రాయ్ అనుయాయులూ ఐన తండ్రి గారు సాహిత్యకారులే కాక సమాజ సంస్కరణా కంకణ బద్ధులని, మారుమూల గ్రామాలకు వెళ్లి  తాము సంస్కరించి రూపొందించిన ముక్తసరి వివాహ తంతును జరిపించే వారని, భోగం మేళా దేవదాసీ వేశ్యాది వృత్తులను నిర్మూలించేందుకు కృషి చేసే వారని, వయోజన విద్యా వ్యాప్తికి పాటుపడే వారని రజని గారు కొనియాడారు.  అప్పుడెప్పుడో తన కథ ” అచ్చినానమ్మ కథ” ను కౌముదిలో ప్రచురించినందుకు రజని గారు ధన్యవాదాలు తెలుపగా, త్వరలో తన రేడియో టాక్ షోలో గోపీచంద్ గారి గురించిన ప్రసంగం ఉంటుందని కిరణ్ ప్రభ గారు తెలిపారు. ఆరోజుల్లో విశ్వనాథుల వారు ” గొప్ప గోపీచంద్” అనే గేయాన్ని రాసినట్టు గుర్తు చేశారు.  52 ఏళ్లకే పరమపదించిన హేతువాదైన తన తండ్రి గోపీచంద్ గారు చరమాంక దశలో పాండిచ్చేరీ లోని మహర్షి అరవింద్ ఘోష్ తాత్విక భావ ప్రభావానికి లోనై శుద్ధ ఆధ్యాత్మికతను ఆశ్రయించిన విశేష ఉదంతాన్ని రజని గారు అరమరికలు లేకుండా విన్నవించారు. రజని గారి ప్రసంగం ఆత్మీయంగా ముచ్చట్ల మృదు భాషణంగా సాగి అందరినీ మురిపించింది.

తరువాతి కార్యక్రమం నెలనెలా క్రమం తప్పకుండా కిరణ్ ప్రభ గారు నిర్వహిస్తున్న ‘చతుర ప్రశ్నావళి’ (క్విజ్). సాహిత్య సినీ కళా రంగ సంబంధితమైన 20 ఆసక్తి కరమైన ప్రశ్నలకు శ్రోతలు స్పందించి  పుస్తకాలను బహుమతులుగా గెలుచుకున్నారు.

కవిసమ్మేళనంలో డా|| కె.గీత గారు సమకాలీన అమెరికా సమాజంలో జరుగుతున్న భారతీయ హత్యల నేపధ్యంలో రాసిన “డాలరు మరక” కవితను , శ్రీచరణ్ గారు”శివ తత్వాన్ని”, నాగసాయి బాబా గారు హాస్య స్ఫోరక కవితను, లెనిన్ గారు ఆత్మ సిద్దాంతాన్ని  చదివి శ్రోతలను రంజింప చేశారు. నాగరాజు రామస్వామి తమ కవితలను చదవడమే కాకుండా కవిత్వం రాయడం లో ఎన్నుకోవలసిన పదజాలాల్ని, కవిత్వంలో నిగూఢత ఆవశ్యకతను విశదీకరించారు.

శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ గాంధీ ప్రసాద్, శ్రీ ప్రసాద్ నల్లమోతు, శ్రీ చుక్కా శ్రీనివాస్ , శ్రీ శిల్పేష్, శ్రీ రాజేశ్వర్, శ్రీ  రావు తల్లా ప్రగడ, శ్రీ సుభాష్ పెద్దు ,  శ్రీ వికాస్, శ్రీమతి శారద మొదలైన స్థానిక ప్రముఖులు పాల్గొన్న  ఈనాటి వీక్షణం సమావేశం ఆసక్తికరంగా సాగి, ఆహ్లాదకరంగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked