ధారావాహికలు

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

శ్రీరామరావణుల ప్రచండయుద్ధం – రావణసంహారం

అప్పుడు శ్రీరాముడు భూమిమీద నిలిచి రథస్థుడై ఉన్న రావణుడితో పోరాడటం బాగాలేదని దేవతలంతా మాతలి సారథిగా ఆయన రథాన్ని రాముడికి సాయం కోసం పంపవలసిందని ఇంద్రుణ్ణి కోరారు. అప్పుడు మాతలి రాముడి దగ్గరకు ఇంద్రుడి రథాన్ని తీసుకొని వచ్చాడు. రాముడు సంతోషంతో దాని నెక్కి పరమభయంకరంగా రావణుడితో యుద్ధం చేశాడు. రావణుడు ఏ అస్త్రం ప్రయోగిస్తే మళ్ళీ ఆ అస్త్రంతోనే దాన్ని నిస్తేజం చేశాడు రాముడు. మహాసర్పసంభరితమైన రాక్షసాస్త్రాన్ని రావణుడు రాముడిపై ప్రయోగించగా రాముడు గరుడాస్త్రంతో దాన్ని రూపుమాపాడు.
అప్పుడు రావణాసురుడు మహోగ్రుడైనాడు. బాణవర్షం రాముడిమీద కురిపించాడు. రాముణ్ణి ఆయన రథసారథి మాతలిని నొప్పించాడు. ఆ రథధ్వజాన్ని ఒక బాణంతో కొల్చాడు. దేవేంద్రుడి గుర్రాలకు కూడా తన ప్రతాపం చూపాడు. ఆకాశంలో దేవతలు, గంధర్వులు, చారణులు, సిద్ధులు, మహర్షులు కూడా రాముడి ఈ సంకటస్థితి చూసి విషాదం పొందారు. రాముడి ఈ క్లిష్టపరిస్థితి చూసి విభీషణుడూ, వానరవీరులూ కూడా వ్యథ చెందారు.
మహాసముద్రంలో మైనాకపర్వతం పైకి లేచినట్లు రావణుడు తన పదితలలతో ఇరవై చేతులతో రణరంగంలో ప్రత్యక్షమైనాడు. రాముడికి పట్టరాని కోపం వచ్చింది. అంత కోపంతో రాముడి బాణసంధానం కూడా తడబడింది.

రామున్ని చూసి సర్వజగత్తూ సందలించింది. రావణుడికి ఎన్నో దుర్నిమిత్తాలు, దుశ్శకునాలు ఎదురైనాయి. అప్పుడు రావణుడు మహా భయంకరమైన శూలాయుధాన్ని ధరించాడు. అప్పుడు వాళ్ళ మధ్య మహా ఘోరయుద్ధం జరిగింది. రావణాసురిడి చేతిలోని శూలాయుధం, వజ్రాయుధంతో సమానమైనది. అతడు ఆ శూలాన్ని చేతిలో పట్టుకొని అటు ఇటూ తిప్పుతూ రాక్షససైన్యాన్ని సంతోషపెట్టాడు. దిక్కులు పిక్కటిల్లేట్లు సింహనాదం చేశాడు. ఆ శూలాన్ని రాముడిపైకి విసిరివేశాడు. ఆ మాహాశూలమూ దానికి అలంకరించిన ఎనిమిది ఘంటలూ చెవులు గింగురుమనేలాగా తన మీదికి వస్తుండగా రాముడు అడ్డుకున్నాడు. కాని అది ఆగక రాముడిపై విఙృంభించింది. అప్పుడు దేవేంద్రుడు మాతలితో పంపిన మహాశక్త్యాయుధాన్ని దానిపైకి ప్రయోగించాడు రాముడు. అది ప్రళయకాలపు మహోగ్ర ఉల్కలాగా రావణుడి శూలాయుధాన్ని తాకింది. ఆ శూలం ముక్కలైపోయింది.
అప్పుడు రాముడు విక్రమించి పదునైన బాణాలు వేసి రావణాసురుడి గుర్రాలను కూల్చాడు. మరి మూడు బాణాలు రావణుడి ఫాలభాగంపైన గురిచూసి వదిలాడు. రావణుడి దేహం అంతా రక్తపరిప్లుతం అయిపొయింది. రామరావణుల శరసంధానం అక్కడి రణభూమిని కప్పివేసింది. ఇద్దరూ పరస్పరం అధిక్షేపించుకున్నారు, నిందించుకున్నారు, ఎత్తిపొడుచుకున్నారు. రాముడు, రావణుడిపై బాణవర్షం కురిపించగా వానరులు ఆ దశకంఠుడిపై రాళ్ళవాన కురిపించారు. రావణుడు ఉక్కిరిబిక్కిరైనాడు. రావణుడి సారథి అతడి అవస్థ చూసి రావణుణ్ణి రణరంగం నుంచి రక్షించి దూరంగా తీసుకొని పోయినాడు.

తెప్పరిల్లుకున్న తర్వాత రావణుడు తన సారథిని తీవ్రంగా నిందించాడు. ఆ సారథి “ప్రాణాపాయం నుంచి నిన్ను రక్షించటానికే ఈ విధంగా చేశాన’’ని చెప్పడంతో సమాధానపడ్డాడు. మళ్ళీ నూతనోత్సాహంతో రణరంగంలో ప్రవేశించాడు రావణుడు. అప్పుడు అగస్త్యమహర్షి యుద్ధభూమిలో సన్నద్ధుడై ఉన్న రాముడి దగ్గరకు వచ్చి రాముడికి ఆదిత్యహృదయం ఉపదేశించాడు. ‘ఈ మంత్రం జపించు, నీకు జయం తథ్యం’ అని చెప్పాడు అగస్త్యమహర్షి. ఆయన చెప్పిన విధంగా చేశాడు రాముడు. దేవేంద్రుడి రథసారథిని ఉత్సాహపరిచాడు శ్రీరాముడు.

అప్పుడు రెండు సింహాలు పరస్పరం తలపడినట్లు పోరు సలిపారు రామరావణులు. అప్పుడు ఆ మహాఘోరరణరంగాన్ని చూడటానికి దేవతలంతా ఆకాశంలో సమావేశమైనారు. రావణుడికెన్నో అపశకునాలు ఎదురైనాయి. రాముడికి శుభశకునాలు తోచాయి. రాక్షసులూ, వానరులూ కూడా ఘోరంగా పోరాటం సాగించారు. రామరావణులు అట్లా ఘోరయుద్ధం చేస్తూ ఉంటే మేఘాలే బాణాలు కురిపిస్తున్నాయా అనిపించింది. లోకం అంతా క్షోభించింది.

అప్పుడు రాముడి రథం నడుపుతున్న మాతలి, “ఈ రావణుడికిప్పుడు వినాశకాలం సంప్రాప్తించింది. వీడిమీద బ్రహ్మాస్త్రం సంధించు. పూర్వం ఇంద్రుడికోసం ఈ అస్త్రాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. దేవేంద్రుడీ మహాస్త్రాన్ని అగస్త్య మహామునికిచ్చాడు. దండకారణ్యంలో తనను దర్శించిన శ్రీరాముడికి అగస్త్యమహర్షి ఈ అస్త్రాన్ని కానుకగా ఇచ్చాడు. ఈ బ్రహ్మాస్త్రం రెక్కలు వాయుదేవతాకమైనవి. అందువల్ల అది వాయువేగంతో దూసుకొని పోతుంది. మేరుమందరపర్వతాల ప్రభావం కలది ఈ అస్త్రం. మండుతున్న విషసర్పంలాగా అది రివ్వునపోతుంది’’ అని చెప్పాడు. రాముడు ఆ అస్త్రాన్ని అభిమంత్రించి రావణాసురుడిపై ప్రయోగించాడు. అది వజ్రాయుధంలా తాకి రావణుడి వక్షఃవాటపాటవం చేసింది. అతడి ప్రాణం తీసింది. తీవ్రవేగంతో భూమిలో ప్రవేశించి వచ్చి మళ్ళీ రాముణ్ణి చేరింది.

అప్పుడు వానరులు జయజయధ్వానాలు చేశారు, సింహనాదాలు వెలువరించారు. దేవతలంతా రాముణ్ణి స్తుతించారు. సుగ్రీవుడూ, విభీషణుడు, ఇంకా వానర ప్రముఖులూ రాముణ్ణి కొనియాడారు, అర్చించారు. ఆ తరువాత యుద్ధభూమిలో మృతుడై పడివున్న తన అన్నను చూసి విభీషణుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. రాక్షసులే తన తోకగా, తన మూపురంగా, తన కొమ్ములుగా ప్రతాపం చూపిన రావణుడనే ఆబోతును రాముడనే పెద్దపులి చీల్చి సంహరించింది అని విభీషణుడు రోదించాడు. అన్నను తలచుకొని దుఃఖిస్తున్న విభీషణుణ్ణి, రాముడు ఓదార్చాడు. రావణుడి పరాక్రమాన్ని తానూ ప్రశంసించాడు.

రావణుడి భార్యలంతా అక్కడకు వచ్చి పెద్దపెట్టున విలపించారు. నెత్తీనోరూ బాదుకున్నారు. రావణుడి పట్టపురాణి మండోదరి శోకదేవతలాగా అక్కడకు వచ్చింది. రావణుడి పరాక్రమాన్ని తలచుకొని శోకవిహ్వల అయింది. “నీవు రాముడి పరాక్రమం తెలుసుకోలేక చేటు తెచ్చుకున్నావు. ఎవరిమాటా విన్నావు కాదు. ఆ సృష్టికర్త సీతాదేవిని నీ మృత్యుదేవతగా సృష్టించినట్లున్నది’’ అని మండోదరి రోదించింది. “రాముడు మానవమాత్రుడుకాడని తెలుసుకోలేకపోయినావు’’ అని పరిదేవనం చేసింది. “మహారాజా! నీ తమ్ముడు విభీషణుడు, శ్రీరాముడి శరణువేడి సమస్త శుభాలు, సుఖాలు పొందనున్నాడు. నీవు నీ పాపకార్యానికి బలి అయినావు’’ అని ఎడతెగని బాష్పధారలతో జరిగిన యావద్వ్రుత్తాంతము తలచుకొన్నది మండోదరి. ‘ఎందరు భార్యలున్నా వాళ్ళతో సంతృప్తిపడలేక నీ చావు నీవే కోరి తెచ్చుకున్నావు’ అని శోకిస్తూ మృతుడైన భర్తను నిష్ఠూరాలాడింది మండోదరి. యుద్ధానంతరం శ్రీరాముడు మాతలిని సత్కరించి వెనుకకు పంపివేశాడు.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked