ధారావాహికలు

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

విభీషణా! నా మాట కాదని ఈ వానరుల్ని ఎందుకు బాధిస్తున్నావు? వారిని తొలగించవద్దు. వాళ్ళంతా నావాళ్ళు.

న గృహాణి న వస్త్రాణి న ప్రాకారా స్తిరస్క్రియాః
నేదృశా రాజసత్కారాః వృత్త మావరణం స్త్రియాః (యుద్ధ. 117.27)

స్త్రీని మరుగుపరచి కాపాడేవి ఇళ్ళు కావు, వస్త్రాలు కావు, ప్రాకారాలు కావు, తెరలు కావు, రాజసత్కారాలు కావు, మంచి నడవడియే ఆమెకు ఆభరణం.

వ్యసనేషు న క్రుచ్చేషు న యుద్ధేషు స్వయంవరే,
న క్రతౌ న వివాహే చ దర్శనం దుష్యతి స్త్రియాః    (యుద్ధ. 117.28)

తనకు ఇష్టమైన వారితో ఎడబాటు వంటి కష్టాలు వచ్చినప్పుడూ, రాజ్యంలో కల్లోలాల వంటి సందర్భాల్లోనూ, యుద్ధాల్లో, స్వయంవరాల్లో, యజ్ఞప్రదేశాలల్లో, వివాహాల్లో స్త్రీలు ఇతరులకు కనపడటం దోషం కాదు. కాబట్టి సీతాదేవి పల్లకీ విడిచిపెట్టి కాలినడకనే నావద్దకు రావచ్చు. ఈ వానరులంతా ఆమెను చూస్తారు. నా సమీపంలో ఉండగా
మిత్రులతోకూడిన నన్ను ఆమె కూడా చూస్తుంది” అన్నాడు.
అప్పుడు సీతాదేవి శ్రీరాముడి దగ్గరకు చేరి ఆయనను చూసి ఎంతో సంతోషించింది. కాని సీతమ్మ అత్యంత పవిత్రురాలని తనకు తెలిసినా ఆమెను పరీక్షించడానికీ, ఆమె పరుశుద్ధహృదయ, అత్యంత పవిత్రురాలు అని లోకానికి తెలియజేయటానికీ, శ్రీరాముడు సీతాదేవితో కొన్ని అప్రియవచనాలు, కఠినోక్తులు, నిష్టురోక్తులు పలికాడు.

సీతాదేవికి అప్పుడు కూడా అవమానమూ, దుఃఖమూ తప్పలేదు. శ్రీరాముడి మాటలు తనను బాణంతో కొట్టినట్లు ఆమెను బాధించాయి. నాకేమిటీ పరీక్ష? అని సీతాదేవి శోకవిహ్వలచిత్త అయింది. “ప్రభూ! అప్పుడు నేను అరక్షితురాలిని, అవివశురాలను కాబట్టి రావణుడు నన్ను స్పృశించాడు. ఇందులో నా దోషం ఏమీ లేదు’’ అని ఏడ్చింది. ‘ఒక సాధారణ అల్పమానవుడిలాగా మీరు నన్ను తప్పుపట్టకూడదు’ అని శ్రీరాముడికి చెప్పింది. ‘నన్ను నేను పరిశుద్ధురాలిగా అంతఃకరణపవిత్రత కలదానినిగా నిరూపించుకోవటానికి నాకిప్పుడు అగ్నిప్రవేశం కన్న గత్యంతరం లేదు’ అన్నది. లక్ష్మణుడప్పుడు పరిదీనవదనుడూ, పరమదుఃఖితుడూ అయినాడు. శ్రీరాముడి వైపు చూశాడు. ఆయన మనోగతం అర్థం చేసుకున్నాడు.
అక్కడ ఆయన అగ్నికుండం ఏర్పాటుచేశాడు. అప్పుడు సీతాదేవి, శ్రీరాముడికి ప్రదక్షిణం చేసి అగ్నిని సమీపించింది. “నీవు లోకసాక్షివి. నా భర్తమీదనే నా మనస్సు ఎప్పుడూ నిమగ్నమై ఉన్నదని నీకు తెలియదా?

నేను అత్యంతపవిత్రురాలిని అయితే అగ్నిదేవా! నన్ను రక్షించు. సూర్యచంద్రులూ, వాయుదేవుడూ, అహోరాత్రాలూ, ఉభయసంధ్యలు, ఈ పృథివి నా శీలపవిత్రతకు సాక్షులు. కాబట్టి ఓ అగ్నిదేవుడా! నన్ను రక్షించు’’ అని సీతాదేవి అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేసి మండుతున్న అగ్నిలో ప్రవేశించింది.

అప్పుడు దేవలోకం నుంచి బ్రహ్మ, మహేశ్వరుడు, ఇంద్రుడు, వరణుడు, యముడు, కుబేరుడు పితృదేవతలతో సహా విమానంలో అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి శ్రీరాముడు చేతులెత్తి అంజలి ఘటించి నిలబడ్డాడు. ఆ దేవతలు, “ప్రభూ! నువ్వు సర్వలోకాలకూ కర్తవు. జ్ఞానులలో శ్రేష్టుడివి, సర్వసమర్థుడివి, దేవతాగణాలలో అగ్రగణ్యుడివి. ఎందుకిలా నీ గురించి నువ్వు ఏమీ తెలుసుకోకుండా ఉన్నావు? సీతాదేవి అగ్నిప్రవేశం చేస్తుంటే ఎందుకు ఉపేక్షిస్తున్నావు”? అన్నారు.
శ్రీరాముడు వినయంగా బ్రహ్మను అడిగాడు.

ఆత్మానం మానుషం మన్యే రామం దాశరథాత్మజమ్,
సో హం యస్య యతశ్చాహం భగవాంస్తద్బ్రవీతు మే.    (యుద్ధ. 117.11)

నాకు తెలిసినంతవరకూ నేను మానవుణ్ణి. దశరథుడి కొడుకుని. నాపేరు రాముడు. (అది కాకపొతే) నేనెవరినో. ఎందుకిలా ఉన్నానో నువ్వే చెప్పు’’

“శ్రీరామా! నీగురించి సత్యం చెప్తున్నాను, విను. నువ్వు స్వప్రకాశకుడివి, లక్ష్మీసమేతుడివి, చక్రాయుధుడివి, నారాయణుడివి. ఆదిమధ్యాంతాలు లేని సత్యమైన అక్షరపరబ్రహ్మవి, పురుషోత్తముడివి, సేనానాయకుడివి, ఉపేంద్రుడివి, పద్మనాభుడివి, మధుసూదనుడివి. క్షమదమాలు నువ్వే. సృష్టిలయాలు నువ్వే. వేదాలు నీ ఆత్మా. నువ్వే యజ్ఞం. నువ్వే ఓంకారం. నువ్వే వషట్కారం. నువ్వే సర్వమయుడివి. సర్వోత్క్రుష్టుడివి. అనాదివి. విశ్వవ్యాపివి.
నేను నీ హృదయాన్ని. సరస్వతి నీ నాలుక. నీ స్థిరత్వమే భూమి. నీకోపం అగ్ని, నీ అనుగ్రహం చంద్రుడు.
నువ్వు విష్ణువువి. సీతమ్మతల్లి లక్ష్మీదేవి’’ అన్నాడు బ్రహ్మ.
అప్పుడు శ్రీరాముడు అన్నీ తెలిసిగూడా ఏమీ తెలియనివాడిలాగా మౌనంగా వుండిపోయాడు.
నిలువెత్తు మంటలలోకి దూకిన సీతను అగ్ని దహించలేదు.

అప్పుడు అగ్నిదేవుడు సీతాదేవిని ఎన్నోవిధాలా స్తుతించాడు. శ్రీరాముడికి ఆమెను అప్పగించాడు. శ్రీరాముడప్పుడు ‘సీతాదేవి ఎంత ఉన్నతురాలో నాకు తెలియక కాదు; సమస్త లోకాలకు ఆమె పాతివ్రత్యం తెలియాలనీ, ఎవరూ నన్ను చపలచిత్తుడు, కాముకుడూ అనుకోరాదనీ ఇట్లా ప్రవర్తించానని’ సమస్త దేవతల మన్నన కోరాడు. ‘ఈమెను ఎవరూ సమీపించలేరు. ఈమె జ్వలించే అగ్నిశిఖ అని నాకు తెలుసు’ అని వాళ్ళకు వివరించాడు.
సీతాదేవిని ఆయన ఆదరించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked