కథా భారతి

సంపాదకుడు

ఆర్. శర్మ దంతుర్తి

(విశ్వనాధ సత్యన్నారాయణ గారి ‘చిన్న కధలు’ పుస్తకంలో ‘రాజు’ అనే కధ చదివాక రాసినది ఇది. ఆయనని తల్చుకుంటూ, ఓ పాద నమస్కారంతో…)

“మీరోజు” పత్రిక మొదటిసారిగా స్థాపించినప్పుడు సుధర్ముడనే ఆయన సంపాదకుడిగా ఉండేవాడు. ఆయన మహా కర్మిష్టి. పొద్దున కోడికూయడంతోనే లేచి ప్రక్షాణాదులయ్యేక కాస్త ఎంగిలిపడగానే నడుచుకుంటూ ఆఫీసుకొచ్చేవాడు దారిలో రాత్రి ప్రింటు చేసిన పత్రిక స్వంత డబ్బుల్తో కొని చంకలో పెట్టుకుని పట్టుకొస్తూ. ఆయనలా ఆఫీసుకి పోవడం పోవడం మళ్ళీ ఆయన ఇంటికొచ్చేసరికి చీకటి పడ్డాకే. ఈయన వెనక్కి వచ్చి పూజ గదిలో దీపం పెట్టుకుని ధ్యానం అయ్యేక భోజనానిక్కూచునే సరికి ఎనిమిదేళ్ళ పిల్లాడు హోమ్ వర్క్ చేసుకుంటూంటే వాడడిగిన దానికి సమాధానం చెప్పడం, పెళ్ళాం తో పిచ్చాపాటి మాట్లాడ్డం అయ్యేది. ఆ తర్వాత మళ్ళీ కూడా తెచ్చుకున్న ఆఫీసు కాయితాల మీద పడి కధలూ కాకరకాయలూ అన్నీ దిద్దుకుని జామురాత్రి మంచం ఎక్కేవాడు. సంపాదకుడు పత్రిక ఇలా సమర్ధంగా నడుపుతూంటే పత్రిక చక్కగా నడిచింది. కధలు రాసేవాళ్ళు ఒళ్ళు దగ్గిరపెట్టుకుని అక్షర దోషాలు రాకుండా మంచి వస్తువుతో ఏదైనా రాస్తే మీరోజులో పడేది. ఓ పేద బ్రాహ్మడు మొగలాయీ రాజు దగ్గిరకెళ్ళి యాచన చేస్తే ఆయన “ఆకుంటే, ఈకుంటే, మీకుంటే, మాకుంటే” అనేది ఇచ్చి పద్యం పూరించమన్నాడనీ, దాన్ని బ్రాహ్మడు

ఆకుంటే వృక్షంబగు
ఈకుంటే హీనుడగు హీనాత్ముండౌ
మీకుంటే మాకియ్యిడు
మాకుంటే మేము రాము మల్కిభరామా

అని పూరించాడనీ, ఆ రాజుని మల్కిభరాముడనేవారనీ ఇటువంటి తెలియని ఎన్నో విషయాలు, విచిత్రమైనవి – మల్కిభరాముడి పద్యాల్లాగా – ప్రజలకి దగ్గిరకొచ్చేవి చదువుకుని ఆనందించడానికి. గడినుడులూ, కవితలూ, సమస్యాపూరణాలూ, ఆటలూ, పాటలూ, ముగ్గులూ, మురిపాలూ అవీ పత్రికలో చక్కగా నడిచినై.

సంపాదకుడు ఇలా ఉండబట్టి పత్రికలో వార్తలూ, కధలూ పడాలంటే ఓ స్థాయిలో రాయాలనే తపన పెరిగింది. సుధర్ముడి కాలంలో ఏ ప్రింటరూ కధలు రాయలేదు. ఏ రచయితా నేను ప్రింటర్ ని అవుతాననీ అననేలేదు. ఎవరిపని వాళ్ళు చేసే రోజుల్లో రచయితలు “నేను సైతం,” అనీ “నువ్వుంటే, నేనుంటే,” “నే ఛస్తే, వాడు ఛస్తే,” ప్రక్షాళిత మామక పాప పరంపర, తారా నివహపు ప్రేమ సమాగం” “కవనఘృణీ! రమణీ! అనుపమితా! అపరిమితా!” అని భాషాధికారం చూపించే, అర్ధం ఏవిటో తెలియని, సామాన్య జనం చదివి జుట్టు పీక్కునే కవితలల్లలేదు. పద్యం ఎవరు రాసినా చదివేటప్పుడు కృష్ణమ్మ గల గల పారుతున్నట్టు, అలకనంద అలవోకగా హృదయాన్ని స్పృజిస్తున్నట్టు అనుభేకవేద్యం అయ్యేది. రచయితల్లో, కధకుల్లో, పాటలు రాసేవారిలో అలా ఎవరి పనిలోనూ పక్కవాడు చేయపెట్టలేదు. మీరోజు తో పోటీపడుతూ మిగతా పత్రికలూ అవీ తెలుగు మరింత బాగా రాసినై – గిడుగువారి వాడుకం లోనే. తెలుగు భాష దివ్య ప్రభల్తో ఏమీ ఆటంకం లేకుండా ఏనుగు మీద ఊరేగే మహారాజులా సాగింది.

ఇట్లా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయినై. ఓ రోజు ఎర్రగా బుర్రగా ఉన్న కాపీ ఎడిటర్ పనిలో వీలు చూసుకుని అల్పాచమానానికి బయల్దేరేడు. వెళ్ళేదారి ప్రింటర్ నీ, అచ్చు ఆఫీసునీ దాటుకుని వెళ్ళాలి. అలా వెళ్తూ ప్రింటర్ ల కేసి చూస్తూ మెల్లిగా నడుస్తూంటే చెమట్లు కక్కే ప్రింటరు పని ఆపి తనకేసి చూస్తూ చేయి ఊపడంతో వెళ్ళి అడిగాడు సంగతి ఏమిటో. ప్రింటర్ అన్నాడు కదా, “అబ్బాయి నువ్వు చాలారోజులగా పంకా కింద కడుపులో చల్ల కదలకుండా కూర్చోడమే, నేనేమో ఇక్కడ ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నాను. ఇలా ఎన్నాళ్ళు? ఇహ ఇక్కడ్నుంచి నువ్వు ప్రింట్ చేయి, నేను ఫంకా కింద కూర్చుంటా.”

కాపీ ఎడిటర్ కి చిర్రెత్తుకొచ్చి అరిచేడు, “ఆ, నువ్వేం కాపీ ఎడిటింగ్ చేయగలవు? నీకు చదువులేదు, ఏదో విధంగా అలా చేద్దామన్నా కుదరదు. నీక్కావాల్సింది ఫంకా అయితే అయ్యగారితో చెప్పుకో ఫో!”

“మహా నువ్వే కాపీ ఎడిటర్ వా? అలవాటైతే ఎవరైనా చేయొచ్చు.”

“నిజమే కానీ, నువ్వు చూడబోతే దాదాపు ముసలివాడిలా ఉన్నావు. నా అంత చదువున్నట్టు లేదు. అదీగాక నా అంత అలవాటు నీకెప్పటికీ కాదు. పోయి ప్రింటు పని చూసుకో”

ఈ తగాదా తెగింది కాదు. పదమంటే పదమని ఇద్దరూ సంపాదకుడు సుధర్ముడి దగ్గిరకొచ్చారు.

ఎప్పుడూ ఖాళీగా ఉండని మీరోజు సంపాదకుడు సుధర్ముడు ఆ రోజు ఎందుకో ఎవ్వో విఘ్నాలు వచ్చి, మర్నాడు పత్రికలో రావాల్సిన దానికోసం, ఆ కాయితాలు కోసం తన టేబిల్ దగ్గిర చూస్తూ కూర్చునున్నాడు. దూరంగా వీళ్ళిద్దరూ గంటు పెట్టుకున్న మొహాలతో రావడం చూడగానే విషయం అర్ధమైంది.

ఏదో నిశ్చయానికి వచ్చినవాడిలా ఆయన వాళ్ళిద్దరికీ ఎదురుగాపోయి చెప్పాడు, “అబ్బాయిలూ, మీ తగాదా నాకు తెలుసు. నేను చాలా రోజులగా సంపాదకత్వం చేసాను. ఇంక నేను విరామం తీసుకోవల్సిన సమయం వచ్చింది. మీ సంగతి నా తర్వాత వచ్చే సంపాదకుడికి చెప్పుకోండి.” అలా అని వెనక్కి తిరిగి చూడకుండా బయటకి నడిచేడు.

సుధర్ముడు ఇలా హఠాత్తుగా ఉద్యోగంలోంచి విరమించగానే ఆయన కొడుకు ధర్ముడు సంపాదకుడయ్యేడు తండ్రి వారసత్వం పుణికిపుచ్చుకున్నవాడే కనక. ఈ తగాదా ఆయన దగ్గిరకొచ్చింది. అయితే ధర్ముడు తండ్రిలా కోడికూయటం తోనే రావడం, పొద్దుపోయేదాకా పనిచేయడం, తర్వాత ఇంటికి కాయితాలు తెచ్చుకోవడం చేసేవాడు కాదు కానీ, పత్రిక నాణ్యత తగ్గకుండా మాత్రం నడిపించే స్థోమత ఉన్నవాడే. ఈ తగాదా తీర్చడానికి ఆయన మీరోజు ఆఫీసులో తల నెరిసిన ఉద్యోగస్తులనీ, తెలుసున్నవాళ్ళనీ పిలిపించి పంచాయితీ పెట్టి తీర్పు చెప్పాడు, “అబ్బాయులూ అలా వీల్లేదు, ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. మీరు పోట్లాటకూడదు. లేకపోతే పత్రిక వ్యవస్థ దెబ్బతింటుంది.” ఎవరిదారిన వాళ్ళు వెళ్ళారు. ఇలా కొంతకాలం గడిచింది.

రాజు దగ్గిరకి అప్పుడప్పుడూ ఇటువంటి తగాదాలు వస్తూనే ఉన్నాయి. ధర్ముడు ఎంత పూర్తిగా పత్రిక మీద దృష్టి పెడదామన్నా ఇటువంటి తగాదాల వల్ల ఆయనకి పత్రిక పనిమీదా, ఈ రాచకార్యాల మీదా తిరగడం అయింది. ఇలా మరి కొన్నేళ్ళూ గడిచినై. ఏదో విధంగా మీరోజు పత్రిక నడుస్తూనే ఉంది.

ఒకానొక రోజు ఓ ప్రింటరు కాయితం తెచ్చుకుందామని స్టోర్ రూములోకి వెళ్తూంటే బొజ్జలో చల్ల కదలకుండా చేతిలో పెన్నుతో కాయితం మీద ఏదో రాసుకుంటూ కనిపించేడు కాపీ ఎడిటరు. ఈయన సుఖంగా ఫంకా కింద కూర్చుని దబ్బపండులా ఉన్నాడు. మరి తానో? రెక్కలు ముక్కలు చేసుకుంటూ ప్రింటు మిషన్ మీద చెమట్లు కక్కుతున్నాడు. ఆ ప్రింటింగ్ ఇంకూ, అదీ తన బట్టలమీద పడితే ఎవరూ దిక్కు? ఇలా ఆలోచించి కాపీ ఎడిటర్ తో అన్నాడు, “ఏవండీ, నేనీ ప్రింటర్ పని చాలా ఏళ్ల బట్టి చేస్తున్నా. ఇంక నాకు శక్తి లేదు. ఇప్పట్నుంచి నేను మీ పని చేస్తా, మీరు ప్రింటర్ పని చేయండి.”

కాపీ ఎడిటర్ నివ్వెరపోయాడు కానీ చివరికన్నాడు, “అబ్బాయి, దానికేమి? నేను ఏదైనా చేస్తాను. నేనైనా నువ్వేనా ఇక్కడ ధర్ముడు గారు చెప్పినట్టు చేయాలి కదా? పోయి కనుక్కుందాం రా”

“ఇదిగో ఇదీ సందర్భం, మేము ఇందుకొచ్చాము.” అంటూ ఇద్దరూ ధర్ముడిగారి దగ్గిరకొచ్చారు. ఇటువంటివి ఆయన చాలాసార్లు చూసి విసుగెత్తి ఉన్నాడు ఇప్పటికే. మర్నాడు మరోసారి అందర్నీ కూడగట్టుకున్నాక ముందు తీర్పులు చెప్పినట్టే “అలాక్కాదు ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే,” అన్నారందరూ. ఈ పెద్దలేది చెపితే ధర్ముడు కూడా అదే చెప్పాడు. అయితే ప్రింటర్ కి ఇది నచ్చలేదు. “అయ్యా మీరూ మీరూ ఫంకాల కింద కూర్చుని పని చేసేవారే, నా సంగతి మీకు పూర్తిగా తెలియదు ఎంత చమట్లు కక్కుకుంటున్నానో రోజూను. నాకు న్యాయం జరగలేదు. ఈ తీర్పు బాగాలేదు,” అన్నాడు.

ధర్ముడు మాత్రం, “కాదు, వాళ్ళు తోచినది చెప్పినా తీర్పు ఇచ్చింది నేను, ఇంక వెళ్ళు,” అన్నాడు.

ప్రింటరు వెక్కిరించాడీసారి, “మీ బుద్ధి ఈ ఫంకాల కింద కూర్చువాళ్ల వల్లా, మీతో చల్ల కదలకుండా పనిచేసే వీరివల్లా కలుషితమైంది. మీరు మళ్ళీ మరొకరితో విచారించాలి.”

ఒక్కసారి ఏదో చటుక్కున గుర్తొచ్చినట్టు తండ్రి సుధర్ముడు మనసులో మెదలగా, చేతిలో కాయితాలూ, పెన్ను అక్కడే పెట్టి, “నేను విరామం తీసుకునే సమయం అయింది, ఈ సంగతి తర్వాత సంపాదకుడితో చెప్పుకోండి” అని ధర్ముడు బయటకి నడిచేడు మొత్తం ఆఫీసు విస్తుపోయి చూస్తూంటే. తగాదా మాత్రం ఎటూ తేలలేదు.

ధర్ముడు పోయాక ఆయన కొడుకు ధర్మరాజు సంపాదకుడయ్యేడు. తగాదా మళ్ళీ ఈయన దగ్గిరకి వచ్చింది. ఈయన కూడా తలనెరిసిన వాళ్లనీ అక్కడే పనిచేసే వాళ్లనీ తండ్రి అడిగినట్టే అడిగేడు. వాళ్ళు మళ్ళీ అదే తీర్పు ఇచ్చారు. ప్రింటర్ ఒప్పుకోనన్నాడు. సంపాదకుడికి చర్రున కోపం వచ్చి ఒప్పుకోకపోతే ఉద్యోగం ఊడగొడతాననే కత్తి బయటకి తీసి ఝాడించాల్సి వచ్చింది. ఇలా గొడవ తన పీకలమీదకి వచ్చేసరికి ప్రింటర్ కి ఒప్పుకోక తప్పలేదు; ఎందుకంటే సాహిత్యంలో పులుసు పలచబడుతూ ఒక్కో పత్రికా మూతపడుతూ ఉద్యోగాలు ఊడుతున్నాయి ఒక్కొక్కరికీ. అదీగాక తెలుగు చదవడం రాయడం నామోషీగా పరిగణించడం మొదలైంది ఆంధ్ర దేశంలో. స్కూల్లో చెప్పే తెలుగు తీసుకోవడానికి ఎవరికీ కారణం లేదు; మేష్టర్లు నన్నయ గారు వచ్చి పరీక్ష రాసినా నూటికి అరవై దాటి మార్కులు వేయరు కనక. అదే ఫ్రెంచి, సంస్కృతం తీసుకుంటే నూటికి దాదాపు నూరూ వేస్తున్నారు. సర్కారు తెలుగు స్కూల్లో తప్పనిసరి అన్నారు కానీ వాళ్లనడం వేరు, కుర్రాళ్ళు చదవడం వేరూ కదా? గుర్రాన్ని నీళ్ళ దగ్గిరకి తీసుకెళ్ళచ్చుగానీ నీళ్ళు తాగించలేమని తెలిసే రోజులొచ్చినై. కొన్నాళ్ళు ఇలా గడిచినై.

క్రమంగా మళ్ళీ మీరోజు ఆఫీసులో వాడి పని నేను చేస్తాననీ, నా పని వీడికివ్వమనీ దెబ్బలాటలు వస్తూనే ఉన్నయి. అయినదానికీ, కానిదానికీ సంపాదకుడు ఇలా ఉద్యోగం ఊడగొడతాననే కత్తి బయటకి తీయాల్సి వచ్చేది. కొన్నాళ్ళకి సంపాదకుడికి విసుగొచ్చి ఈ కత్తి బయటకి చూపించడం మానేశాడు. ఎప్పుడైతే ఈ కత్తి చూపించలేదో అప్పుడు సంపాదకుడు తమని ప్రోత్సాహిస్తున్నాడని ఉద్యోగస్తులు అనుకోవడం మొదలుపెట్టారు. సంపాదకుడి పని అటు నుయ్యి, ఇటు గొయ్యిలా తయారైంది.

ఈ సంపాదకుడికి ముగ్గురు కొడుకులు. తాతగారి పేరు సుధర్ముడని మొదటివాడికీ, తండ్రి ధర్ముడని రెండోవాడికీ, తనపేరే అయిన ధర్మరాజని మూడోవాడికీ పేర్లు పెట్టుకున్నాడు. పెద్దకొడుకు సుధర్ముడు తాతగారి వల్లే మీరోజు పత్రికని ఓ దారిలో తీసుకొస్తాడని, మీరోజు ప్రభ వెలుగుతుందనీ ఈ ధర్మరాజుగారి ఆశ. రోజులు గడుస్తున్నై.

సంపాదకుడికి తెలియకుండా పత్రికలో కొన్ని మార్పులు జరుగుతున్నై. ప్రింటర్లు కొందరు కవితలు రాస్తున్నారు. ఇంకు మార్చి మెషీన్లు పాడైతే బాగు చేసేవాళ్ళు కధలు రాస్తున్నారు. కాపీ ఎడిటర్లు కొంతమంది స్వంతంగా పత్రిక పెట్టుకుందామని, తామే ప్రింటు చేద్దామనీ ఆలోచనల్లో ఉన్నారు. రోజురోజుకీ దెబ్బలాటలు, పితూరీలు పెరుగుతున్నై. ఎంతకాలం ఇలా అని వచ్చిన ప్రతీ పితూరీకీ అందర్నీ కూర్చోబెట్టి చెప్పించిన తీర్పులనీ వాటినీ సంపాదకుడు కాయితాల మీద రాయించి జాగ్రత్త చేయడం మొదలుపెట్టాడు. కొత్త తగాదాలు వస్తే సంపాదకుడు విచారిస్తాడు. పాతవైతే ఇలా రాయించిన కాయితాలు బయటకి తీసి అందులోకి మల్లే చెప్పడం. ఈ కాయితాలు చదివి చెప్పడానికి సంపాదకుడు కొంతమందిని ఏర్పాటు చేసాడు. అయితే ఈ కొంతమంది, కాయితాల్లో ఒకలా ఉంటే తాము మరోలా చెప్పడం మొదలుపెట్టారు. గొడవలు తగ్గడానికి బదులు ఎక్కువైనై.

రోజురోజుకీ ఈ గొడవలు ఎక్కువౌతూంటే సంపాదకుడికి అసలీ గొడవలెలా వచ్చినాయో కూడా అర్ధం కాలేదు. అర్ధమవడం అటుంచి అసలీ గొడవలు వచ్చేందుకు అలాంటి పరిస్థితులు ఎట్లా కల్గినాయో కూడా తెలీలేదు. కనుక్కుంటే తను నియమించిన ఈ కొంతమంది వల్లా, తాను రాయించిన కాయితాల వల్లా అని తేలింది.

సంపాదకుడు దీర్ఘంగా విచారించాడు. మళ్ళీ ఎప్పటికైనా మీరోజు పత్రిక బాగుపడ్డం అసంభవం అని తేటతెల్లం అయింది. తండ్రీ తాతల వలె తానూ విరామం తీసుకుందామా అనుకున్నాడు కానీ ఇంతలో సంపాదకుడికి – ఈ గొడవల వలనో మరోటో – కడుపులో కేన్సర్ అని తేలింది. డాక్టర్లకి చూపిస్తే రాచపుండు వంట్లో మిగతా చోట్లకి పూర్తిగా పాకిందనీ, ఇంక తగ్గదనీ నిర్ధారించారు. దానితో తీసుకుని సరిగ్గా పదిహేనురోజుల్లో ఆయన గతించాడు. ఇంత అయ్యేక ఆయన పెద్ద కొడుకు సుధర్ముడు సంపాదకత్వం తీసుకోవాల్సిన పరిస్థితి. తండ్రి పెద్ద కర్మ అయ్యేసరికి సుధర్ముడి దగ్గిరకి వందా వేయీ గొడవలు రావడం మొదలైంది.

తండ్రి పోయాక మొదటి రోజు ఆఫీసులో ఆయన దగ్గరకీ గొడవ వచ్చింది. మీ రోజు ఆఫీసు ఈశాన్యం మూల గదిలో పనిచేసే ప్రింటర్ ఓ సగం కవిత రాసాడు. దాన్ని ప్రింటర్ మీద పనిచేయడం నేర్చుకుంటున్న కాపీ ఎడిటరు పూర్తిచేసి ప్రింటు చేసేడు స్వహస్తాలతో. అలా ఆ కవిత మీరోజు పత్రిక లో అచ్చైపోయి జనాల్లో కి చొచ్చుకుపోయింది. పాత సాహిత్యం అలవాటైపోయి కొత్తకొసం అర్రులు చాచే జనం ఇలాంటి కొత్త సాహిత్యాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు సాహిత్యం అలా కొత్త పుంతలు తొక్కుతోంది కాబట్టి దీన్ని “తవిక” అన్నారు. కాపీ ఎడిటరూ ప్రింటరూ ఇద్దరూ కల్సి రాసిన కధలని “ధక”లనీ, చిరు కవితలని – ఎలక్ట్రానికి పద్ధతిలో, మైక్రోలనీ, నానీలనీ పిలవడం మొదలుపెట్టారు. దీన్ని ఉదాహరణంగా తీసుకుని మిగతా పత్రికలు కొత్త కొత్త పద్య వృత్తాలు కనిపెట్టడం మొదలు పెట్టినై. అలాంటివాటిల్లో ఏ. తె అనేదొకటి. ఎవరైనా అదేమిటని అడిగితే “ఏలూరు తెలుగు” అని ఓసారి, “ఏమో తెలియదు” అని మరోసారీ, “ఏనుగు లక్షణకవి తెలుగు” అని ఇంకోసారీ నోటికొచ్చినట్టు చెప్పడం. కొండొకచో అసలు వృత్తం ఏమిటో పెట్టకుండా పద్యాల్రాయడం, రాసిన తెలుగు పద్యాల్లో చాలా మటుకు ఇంగ్లీషు పదాలు రాయడం అలవాటు అవుతోంది తెలుగు జనాలకి. ఓ ఏడు “అ నుంచి అః” అంటూ అప్పు దగ్గిర్నుంచి ఆవకాయ దాకా ఒకదానితో మరోదానికి పొంతనలేని పద్యాలతో రాసిన తవికా సంకరానికి మొదటి బహుమతి వచ్చింది సర్కారు వారూ ప్రతీ ఏడూ ఇచ్చే సాహిత్యపీఠం అవార్డుల్లో. ఆ సాహిత్య సంకరంలో వచ్చిన ఆవకాయ మీద పద్యం ఇలాగ అచ్చైంది.

శ్రేష్టంబిది పికెల్స్ లోన
టేష్టున ఇది ఫష్టునుండు డెఫినెట్ గానూ
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని “రోల్”నంత హేపీనెస్సుందా

ఈ అవార్డులెట్లా వస్తయ్యో అందరికీ తెలిసిందే కనక ఎవరికీ నోరు మెదపాలనిపించలేదు. అవార్డులిచ్చే సర్కారు వారికొచ్చిన తెలుగు ఎంతో సర్వులకీ అనుభవేకవేద్యం వల్ల, ఈ పద్యాలు నవ్వుకోవడానికి బాగుండడం వల్లా, తెలుగు నాశనం అయినా నోరిమెదిపే నాధుడు లేడు. వచ్చిన డబ్బు, పేరూ సగం సగం పంచుకున్నా ఇప్పుడు ప్రింటరు, కాపీ ఎడిటర్ అవ్వాలనీ ఆయన ఉద్యోగం ఈయనకివ్వాలనీ ఇద్దరికీ తగాదా వచ్చి పడింది కొత్తగా. ప్రింటింగూ, తవికల్రాయడం ఒకేసారి ఎలాగా అని ఆయన వాదన. ఇటువేపు కాపీ ఎడిటర్ కి కాస్తో కూస్తో వచ్చిన ప్రింటింగ్ తో వంటినిండా ఇంకు అంటుకునే ఆ ఉద్యోగం, చేతినిండా ఆ ఇంకు మరకల్తో ఈ కాపీ ఎడిటింగ్ చేయడం ఎలా?

సుధర్ముడీ తవికా ధకా అనే వాజ్యం విని తెల్లబోయేడు. పక్కనున్న అందరికీ తలలు తిరిగినై. సుధర్ముడేం చెప్తాడా అని ఆయనకే వదిలేసారు ఈ విషయం. ఆయన కాసేపు ఆలోచించి చెప్పాడు, “ఈ వాజ్యం నా తెలివికి అతీతంగా ఉంది. మా నాయనగారు హుందాగా ఉద్యోగం చేసి విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు కానీ ఆయనకి కేన్సర్ జబ్బు వచ్చి పోయేడు కనక ఆ విశ్రాంతి నేను తీసుకోవాలి. ఈ వ్యాజ్యం సంగతి నా తర్వాత సంపాదకుడితో చెప్పుకోండి.” ఇలా అనేసి చివాలున ఆయన కూర్చున్న కుర్చీలోంచి లేచి వెనక్కి తిరక్కుండా వెళ్ళాడు.

ఆయన పోయాక ఆయన తమ్ముడు ధర్ముడు సంపాదకుడయ్యేడు. చేతికి చముర్రాసుకోకుండా అప్పడాలపిండితో ఆటలాడితే అది చేతికంటుకున్నట్టు తాతల నాటి నుండీ వస్తున్న ఈ వాజ్యం ఈయన దగ్గిరకొచ్చింది. ధర్ముడిక్కుడా ఏం చెప్పాలో తెలియలేదు. సరే ఇప్పుడు పని వత్తిడి కనక వచ్చే వారం చూద్దాం అన్నాడు.

ధర్ముడీ వాజ్యం సంగతి ఇంటికెళ్ళాక ఆలోచించాడు. “ఇందులో ఈ తిరకాసేమిటి? వాడు కవితలు రాసాడు సరే, ఈయన అది పూర్తిచేసి దాన్ని తవిక అనీ ధక అనీ అనడమేమిటి? పోనీ ఏదో విథంగా అలా కొత్తపేర్లొచ్చాయనుకున్నా మైక్రోలేమిటి, నానీలేమిటి? అసలు సాహిత్యం, భాష ఎక్కడికెళ్తున్నాయి? ఏ. తె ఏమిటి? ఉన్న వృత్తాలే సరిగ్గా రాయలేని వారు అసలు తెలుగు ఏం నేర్చుకుంటున్నారు స్కూళ్ళలో? తెలుగు దేశంలో భాష ఇంత దిగజారుతుంటే ప్రజలూ, పత్రికలూ సర్కారూ ఏం చేస్తున్నై? ఎవరో ఏదో తలతిక్క రాస్తున్నా తమ తాతగారి నుంచి తన వరకూ వచ్చిన మీరోజు పత్రిక ఇలా ఎలా దిగజారిపోయింది? ఇలా దిగజారుతుంటే సహ సంపాదకులేం చేస్తున్నారు? ఈ సర్వ వృత్తాంతం అయోమయంగా ఉంది. అసలు ఈ తవిక రాసే ప్రింటర్ ని కాపీ ఎడిటర్ గా ఎలా నియమించటం? ఈ కాపీ ఎడిటర్ ని ప్రింటర్ గా వెళ్ళమనటం ఎట్లా? ఇలా ఝాము పొద్దుపోయేవరకూ ఆలోచించి ఏమీ తేల్చుకోక, “ఈ సంగతి సంపాదకుడనైన నేనే ఏమి తేల్చుకోలేకపోతే ఈ ఉగ్యోగం చేయడం అనవసరం. నేను ఈ ఉద్యోగానికి తగను” అని రాత్రికి రాత్రి, రిజర్వేషన్ ఉందా లేదా అని చూడకుండా గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కి, పుష్పకవిమానం లాంటి హైద్రాబాద్ లో దిగాడు. ఎంతమందొచ్చినా వాళ్ళకి ఓ ఏదో ఒక ఉద్యోగం ఇప్పించే హైద్రాబాద్ ఆయన్ని తన కడుపులో గుంభనంగా ఇముడ్చుకుంది. ఆయన కధ అలా ముగిసింది మీరోజు పత్రికలో.

అయితే సంపాదకుడు గోదావరి ఎక్కిన మర్నాడు ఆయన గురించి వెదికారు, వారం పదిరోజులు తిరిగిన చోటు తిరక్కుండా. సంపాదకుడు లేడు. సరే ఆయన పోయినాడంటే పోయినాడనుకుని ఆయన తమ్ముడు – అంటే మూడో కొడుకు ధర్మరాజు అన్నవాణ్ణి, సంపాదకుడిగా చేసారు.

ఈ సంపాదకుడు రావడంతోటే మీరోజు పత్రిక చక్కగా మారిపోయింది.

ఈయన అన్నల దగ్గిరకొచ్చిన వాజ్యం మళ్ళీ ఈయన దగ్గిరకొచ్చింది. అందరూ అన్నదేమంటే, “అయ్యా, ఈ వాజ్యం విచారించలేక మీ పెద్దన్నగారు విశ్రాంతి కెళ్ళిపోయినారు. చిన్నన్న గారు ఎవరితో ఏమాటా చెప్పకుండా పరారీ అయినాడు. ఎంతవెతికినా మాకు తెలియనే లేదు. మీరు న్యాయం చూసి సరిగ్గా చెప్పాలి లేకపోతే మీరోజు మూతపడే రోజు ఎంతో దూరంలో లేదు.” అని.

ధర్మరాజు ఇది విని పగలబడి నవ్వేడు. అన్నాడు కదా, “ఛీ, ఛీ ఈ మాత్రానికి వాడొక పెద్దన్నా వీడొక దద్దన్నానూ, మీరు మొదట్లోనే నన్ను సంపాదకుడిగా చేస్తే ఈ గొడవ ఉండేదా? చూసుకోండి నేను చెప్పే న్యాయం. ఈ ప్రింటర్ సగం రోజు తవికలు రాయడం సగంరోజు కాపీ ఎడిటింగ్ చేయడం. అలాగే ఈ కాపీ ఎడిటర్ సగం రోజు ప్రింటింగ్ పని చేయడం ఇంకు మార్చడం, చేతులు శుభ్రంగా కడుక్కుని మిగతా సగం రోజు కాపీ పని చేయడం. అలా చేస్తే ఒకడు చేసే పనిలో అవకతవకలు రెండో వాడు కనిపెట్టడం సులభం. దీన్నే “రోటేరేషన్ ఆఫ్ డ్యూటీ” అంటున్నారు ఇప్పుడీ మేనేజ్ మెంట్ కాలేజీల్లో. అదో రకం న్యాయం. రెండో రకం న్యాయం ఇలా ఉంది. ప్రింటరు పూర్తిగా ప్రింటింగ్ పనిచేస్తూ కాపీ ఎడిటర్ జీతం తీసుకోవడం; అలాగే కాపీ ఎడిటర్ తనపని చేసుకుంటూ ప్రింటర్ జీతం తీసుకోవడం. ఈ రెండో న్యాయంలో ఎక్కువ తక్కువ జీతాలవల్ల ఒకరి తిక్క రెండో వాళ్ళు తీరుస్తారు. ఇది తేలిక. ఇంత తేలిక పనికి ఇన్ని వాజ్యాలూ గొడవలూ, హడాడిడా? దీనమ్మ కడుపుకాల!”

మొత్తం మీరోజు పత్రికంతా ఇది విని జయజయధ్వానాలు చేసారు. ప్రింటరూ, కాపీ ఎడిటరూ ఓ నెల మొదటి న్యాయం, రెండో నెల రెండో న్యాయం ప్రకారం నడుచుకుంటామన్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఏది బాగుంటే అది అమల్లోకి తీసుకొస్తార్ట. ఆ తర్వాత సంపాదకుడు మిగిలిన గొడవలన్నీ సులువుగా తీర్పు చెప్పాడు. “సూత్రం ఇల్లాగోయి” అని తన సబ్ ఎడిటర్లకీ, మిగతా వాళ్ళకీ నేర్పించాడు. వాళ్ళు కూడా సంపాదకుడు చెప్పినట్టూ చేస్తున్నారు. ఎంత త్వరగా ఎన్ని గొడగలు పరిష్కారం చూపించి ఎన్ని తవికలూ ధకలూ రాసినవి ప్రచురుణకి స్వీకరిస్తే వాడు గొప్పవాడు మీరోజు పత్రికలో. సంపాదకుడిలా చేస్తున్నాడని తెలియగానే మిగతా పత్రికలూ ఇదే ధోరణి అవలంబించినై. తెలుగు భాష మూడు ధకలూ, ఆరు నానీ, పన్నెండు తవికల్తో, ధర్మరాజుగారి కొత్త సంపాదకత్వంలో మీరోజు పత్రికలో విజృంభించిన వ్యాపారంలాగా అవ్యాహతంగా పైపైకి నక్షత్రమండలాలకేసి ఎగసిపోతూంది.

ఎవడైనా ఎప్పుడన్నా సంపాదకుడితో, “మీ ముత్తాత గారు సుధర్ముడని ఉండేవారుట, వారి కాలంలో అసలు మీరోజు పత్రికలో తవికలనీ ధకలనీ, గొడవలంటూ లేవని చెప్పేవారుట” అంటే, సంపాదకుడు చెప్పేమాట, “అవన్నీ కల్లబొల్లి కబుర్లోయి, అసలు మా ముత్తాత అనేవాడే లేడు. ప్రపంచం, మీరోజు పత్రిక మా నాయనగారితో మొదలై ఉండాలి. నేనెరిగినప్పట్నుంచే అసలు మీరోజు వెలుగు ప్రభలు చూపించడం మొదలైంది. అసలు ప్రింటింగ్ అనేది ఆంగ్లేయిలు హిందూదేశాన్ని పాలించడం మొదలుపెట్టిన పదీ ఇరవై ఏళ్ళ దాకా రానేలేదు మనదేశంలోకి. కావలిస్తే చరిత్ర పుస్తకాలు చూసుకో. ఆ మాత్రం నాకు తెలుసు. నోరు మూసుకుని పోయి నీ పని చూస్కో.” అది విని అడిగినవాళ్ళూ కన్నవాళ్ళూ, విన్నవాళ్ళూ నిజమేననుకుని, ఊరుకుంటున్నారు.

అలా ఊరుకోలేని – మీరోజు పత్రికలో పనిచేసే, కొంతమందికి మరి తెలుగు భాషనెలా పూర్వ వైభవానికి ఉద్ధరించాలనే ప్రశ్న ఉత్పన్నమైంది. సంపాదకుడు అటువంటి వాళ్ళని ఉద్యోగాల్లోంచి పీకేసి ఒక్కదెబ్బతో అందరి నోర్లూ మూయించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked