– తాటిపాముల మృత్యుంజయుడు
డిసెంబర్ నెలంటేనే ఒక సంవత్సరం ముగుస్తున్నట్టు. అలాగే పండుగల కాలం. స్కూల్లకు, కాలేజీలకు కూడా సెలవులు. క్రిస్మ్మస్, నూతన సంవత్సరాది పండగల హడావుడి. మన భారతీయులైతే దీపావళీ పండుగను కూడా జతచేస్తూ నవంబర్ నెలంతా వివిధ కార్యక్రమాలతో వినోదంగా గడుపుతారు.
ఇంకా చెప్పుకోవాలంటే నవంబర్ నెల ఆఖరి గురువారం గొప్పగా జరుపుకునే ఉత్సవం ‘థాంక్స్ గివింగ్ డే’. ఆ వారం మొత్తం అమెరికాలో చాలావరకు అందరు తమ శక్తిమేరకు ఎంతో కొంత విరాళాలు ఇస్తారు. ఆ సదవకాశాన్ని వినియోగించుకోటానికి స్వచ్చంద సేవా సంస్థలు విరాళాల సేకరణ కార్యక్రమాలు మొదలెడతారు. ఈ క్రమంలోనే దాతలు సిలికానాంధ్ర కూచిపూడీ గ్రామంలో స్థాపించిన సంజీవని వైద్యాలయానికి విరివిగా ధన సహాయం చేసారు. అందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు!
ఈ సంవత్సరం మొత్తం వినూత్న రచనలతో విడుదలైన సుజనరంజని సంచికలను ప్రోత్సాహించిన పాఠకులకు, తమ రచనలను పంపించిన రచయిత(త్రు)లకు మా ధన్యవాదాలు. ఇదే సహకారాన్ని కొత్త సంవత్సరంలో కూడా కొనసాగించాలని మా విన్నపం.