‘పూర్ణ పురుషుడు’, శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు
డా. ఉపాధ్యాయుల రాజ రాజేశ్వరి దేవి
మొదటి భాగం :
(2014 శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల తిరుపతి వారి ఆధ్వర్యంలో శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసవర్యుల 149వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన హరికథా సప్తాహంలో సమర్పించిన వ్యాసముల ఒకటి)
ఉపోద్ఘాతము
‘సంగీత సాహిత్య సార్వభౌమ’, ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖీ పరమేశ్వరుడు’, ‘హరికథా పితామహ’, ‘అట పాటల మేటి’ లాంటి ఎన్నో బిరుదులూ ఆయనను వరించాయి. ఆరున్నర దశాబ్దాల సంగీత, సాహిత్య, హరికథా కళా ప్రస్థానంలో ఆయన అందుకోని సన్మానం లేదేమో. రాజ సన్మానాలూ, పౌర సన్మానాలూ, బిరుద ప్రదానాలూ గజారోహణలు, సువర్ణ ఘంటాకంకణ ధారణలూ, గండపెండేర ధారణలూ ఇలా ఎన్నో, ఎన్నెన్నో గౌరవాలు ఆయనకు లభించాయి.
ఆదిభట్ల నారాయణ దాసుగారు తెలుగులో, అచ్చతెలుగులో, సంస్కృతంలో సుమారు ఏభై గ్రంధాలను రచించారు. వాటిలో స్వతంత్ర కావ్యాలు, ప్రబంధాలు, అనువాద గ్రంధాలు, వచన గ్రంధాలు, కవితా సంపుటాలు, శ