రామాయణ సంగ్రహం
యముడితో రావణుడి యుద్ధం
ఇక అప్పుడు యముడు స్వయంగా రావణుడితో యుద్ధం చేశాడు. మృత్యుపాశం, కాలదండం ధరించి రావణుడిపైకి వచ్చాడు. ఇట్లా ఏడు రోజులు రాత్రింబవళ్ళు యముడికీ, రావణుడికీ జగద్భయంకరమైన యుద్ధం జరిగింది. ఎవరూ వెనక్కు తగ్గటం లేదు. అప్పుడు దేవతలు భయపడి బ్రహ్మదేవుడితో అక్కడకు చేరుకున్నారు. మృత్యుదేవత వీణ్ణి కబళిస్తానని ముందుకు రాగా, యముడు వారించి వీణ్ణి నా కాలదండంతో హతమారుస్తానన్నాడు. ఇంతలో బ్రహ్మ అక్కడకు వచ్చి యముడితో 'నా వరాలు వ్యర్థమైపోతాయి. వీణ్ణి ఇట్లా చంపవద్దు' అని జోక్యం చేసుకున్నాడు. అప్పుడు యముడు అసహనంతో అంతర్థానమైనాడు. ‘నేనే జయించాన'ని రావణుడు లోకం దద్దరిల్లే గర్జనలు చేస్తూ పుష్పకం ఎక్కి తన నివాసానికి వెళ్ళాడు.
ఆ తరువాత రావణుడు పాతాళలోకం పైకి దండెత్తాడు. భోగవతి దాని రాజధాని. రావణుడు అక్కడకు చేరాడు. వాసుకిని వశపరచుకొన్నాడు. అక్కడ నుంచి నివాతకవచులనే క్రూరరాక్షసులు ఎవరికీ కనపడకుండా నివా