వీక్షణం-77
-- విద్యార్థి
వీక్షణం 77వ సమావేశం జనవరి 13, 2019 నాడు, శ్రీమతి విజయా ఆసూరి, శ్రీ వేణు ఆసూరి దంపతుల స్వగృహమునందు జరిగినది. భోగి పండుగ నాడు జరిగిన ఈ సమావేశం సంక్రాంతి సాహిత్య సభగా, ఒక ఆత్మీయ సమావేశంగా సాగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన వారు ఆచార్య చెన్న
కేశవ రెడ్డి గారు. ఈ సభలో మొదటి అంశం రావి శాస్త్రి గారి "పిపీలికం" కథా పఠనం మరియు చర్చ. కథ ఎంత బాగుందో, వేణు ఆసూరి గారి కథా పఠనం కూడా అంత ఆసక్తికరముగా సాగింది. ఈ కథ గురించి వేణుగారు వివరిస్తూ, "రావి శాస్త్రి గారు ఆంధ్ర జ్యోతి పత్రిక వారివద్ద అప్పు తీసుకుని, ఆ అప్పు తీర్చటం కోసం వ్రాసి ఇచ్చిన బాకీ కథలలో పిపీలకం ఒక కథ" అని వివరించారు. ఈ కథ శ్రామిక వర్గాలలో చైతన్యం నింపే కథ. వేరే వారెవరూ కాకుండా, పీడిత ప్రజలు తమకు తాము చైతన్యవంతులై దోపిడీవర్గాలను ఎదుర్కోవటాన్ని తెలిపే కథ. కథా శైలి గురించి విపులంగా జరిగిన చర్చ ఆసక్తికరముగా సాగింది.