మనబడి

సిలికానాంధ్ర మనబడి దశాబ్ది వేడుకలు

నమస్కారం!

పదేళ్ళ క్రితం, ఏప్రిల్ 2007లో, ఒక కలకి అంకురార్పణ జరిగింది. ఒక మహాయజ్ఞానికి తొలి సమిధ వెలిగింది. ఒక నలుగురి భాషాభిమానుల గుండెల్లో ఒక సంకల్పం కలిగింది. మన పిల్లలతో పాటూ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందిరి పిల్లలకీ తెలుగు నేర్పే మార్గం కావాలి అన్న ఆలోచన రేకెత్తింది. ఆ నలుగురి గుండెల అభిలాష నేడు, ఎన్నో కుటుంబాలలో,వారి వంశాలలో తెలుగు వెలుగయ్యింది. ఆ వెలుగుని పంచే కాంతిపుంజం “మనబడి” అన్న పేరుతో పదేళ్ళ క్రితం పుట్టింది. జగమంత తెలుగు కుటుంబంగా, తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో సాగే సిలికానాంధ్ర క్షేత్రంలో ఒక మహావృక్షానికి బీజం పడింది. అలా విరిసిన మొలకకి  పాదు కట్టి, ఎరువు పెట్టి , నీరు పెట్టి  పెంచారు, ఎందరో భాషాసైనికులు. వారి సేవానిరతికి ప్రతీకగా, ప్రతి ఏటా ఊరూరా ఈ మనబడి అనే అక్షరవృక్షాలు వెలుస్తున్నాయి.వందల కొద్దీ మనబడి కేంద్రాలు తెలుగు నందనవనాలై, తెలుగు సంస్కృతికి ప్రవాస భారతం ఆలవాలమయ్యేలా చేశాయి. ఆ వృక్షాల కొమ్మలపై కూర్చున్న చిలక పలుకుల్లా, ఎందరో వేల చిన్నారుల నోట తెలుగు పలుకుల పాటలు వినిపిస్తిన్నాయి. ఆ చిన్నారుల అమ్మానాన్నలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరూ “భాష ద్వారా బంధం” బల పడుతోందని ఆనందంతో పిల్లలకి తెలుగు నేర్పుతున్నారు. 2000 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన తెలుగు భాష ఇంకో రెండువేల సంవత్సరాల పాటూ సువర్ణ పథంలో సాగుతుంది అన్న నమ్మకం కుదిరింది.

 

దీనికంతా మూలం, సంపూర్ణంగా తెలుగు నేర్పించాలి, ప్రణాళికా బధ్ధంగా నేర్పించాలన్న ఆలోచన, ఆ ఆలోచనాసరళికి కార్యాచరణలో పుట్టిన పుస్తకాల మాల! అంచెలంచెలుగా తెలుగు నేర్పించే తెలుగు భాషాభ్యాస సోపానం. నాలుగేళ్ళ వయసులో బాలబడితో మొదలు పెట్టి, ఆరేళ్ళ  వయసు తర్వాత ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం,ప్రభాసం అన్న అంచెల ద్వారా, పిల్లలకి తెలుగు నేర్పించే ఏకైక భాషాబోధనా విధానం. 27 అద్భుతమైన పుస్తకాల ద్వారా సాగే ఏడేళ్ళ చదువు, ప్రతి ఏటా మూడు త్రైమాసికాలు, 12 వారాల పాఠ్యాంశాలు, మూడు పరీక్షలు, రోజుకు 10 నిమిషాల ఇంటిపని. ఉపాధ్యాయులందరికీ ప్రశీక్షణ కార్యక్రమాలు, అత్యున్నతమైన తెలుగు బోధనా పధ్ధతులు, ఇవి మనబడి విజయానికి ముడి సరుకులు. ఆ పాఠ్య పుస్తకాలలోని సారాన్ని పిల్లలకి సరైన రీతిలో చేరేలా చూసుకుంటూ ప్రతి ఏటా భాషాసేవకి అంకితమవుతున్న ఉపాధ్యాయినీఉపాధ్యాయులు, సమన్వయ కర్తలు మనబడి ప్రగతికి ఆయువుపట్టులు. మనబడి చుట్టూ పెట్టని కోటలా నిలిపి, పిల్లలకి వారి తెలుగు సాధనకి ఏర్పాటు చేయబడ్డ సరైన పాఠ్యేతర కార్యక్రమాలు, పిల్లలపండుగ, బాలానందం, తెలుగు మాట్లాట, పలుకుబడి, తెలుగుకు పరుగు, నాటకోత్సవం, పద్యనాటకం, మనపద్యం, మన పిల్లలని భావి తెలుగు నాయకులుగా తీర్చిదిద్దే కర్మాగారాలు.

 

మనబడి పాఠ్యప్రణాళికని గుర్తించిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, ప్రకాశం, ప్రభాసం స్థాయులలో వార్షిక పరీక్షలు నిర్వహించి, పిల్లలు యూనివర్సిటీ పట్టాలు ఇవ్వడం ఒక ఎత్తైతే, వాస్క్ (WASC – Western Association of Schools and Colleges, Accrediting Commission for Schools) గుర్తింపు దొరకడం, మనబడి తరగతుల నిర్వహణ తీరుకి, ఉన్నత ప్రమాణాలకి ఒక  గీటురాయి. వీటితో పాటు, ఇప్పటికి 12 స్కూల్ డిస్ట్రిక్ట్ లలో “ప్రపంచ భాష”గా తెలుగుకి, మనబడి ప్రణాళికకి గుర్తింపు సాధించి, “ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాష దాకా తెలుగు” అన్న లక్ష్య సాధనలో విజయాలు సాధిస్తూ ఉన్నాము.

 

150 మంది పిల్లలతో మొదలైన మనబడి ప్రతియేటా వందలకొద్దీ, వేలకొద్దీ పిల్లలని కలుపుకుంటూ ఇప్పటికి 27,000 మంది పిల్లలకు పైగా మనబడిలో తెలుగు నేర్చుకొనే అవకాశం కలిగించాం . కాలిఫోర్నియా, బే ఏరియాలో మొదలైన మనబడి ఇప్పుడు పది దేశాల్లో, అమెరికాలో 35 రాష్ట్రాల్లో, 220 కేంద్రాలలో తెలుగు నేర్పుతోంది. కొన్ని వేల పుస్తకాలు, సంచీలు, టీ షర్ట్లు, సామాగ్రి, ప్రశ్న పత్రాలు, ప్రచార సాధనాల ప్రపంచ వ్యాప్త రవాణా! కొన్ని వేల గంటల సాంస్కృతిక ప్రదర్శనలు, 5 ఏళ్ళుగా మాట్లాట పోటీలు, 8 ఏళ్ళుగా నిరాటంకంగా బాలానందం రేడియో కార్యక్రమాలు, వేసవిలో పలుకుబడి, వీటన్నిటికీ వెన్నెముక లా అత్యాధునిక సాంకేతికత కూడిన అంతర్జాల పరికరాలు, పోర్టల్ ద్వారా వివిధ కార్యనిర్వహణ సాధనాలు. ఇవ్వనిటికీ 1200+ పైగా భాషాసైనికులు, “భాషాసేవయే భావితరాల సేవ” అన్న ఆశయంతో సాగుతూ, తెలుగు భాషాభివృద్ధికి బంగారు పునాది వేస్తున్నారు.

 

ఈ భాషా యజ్ఞంలో చేయూతనిస్తున్న భాషాసైనికులందరికీ అభినందనలు, ఈ పదేళ్ళ పండగ సంబరాల శుభాకాంక్షలు!! ఈ ప్రయత్నాలకి అడుగడుగునా సహకారం ఇస్తున్న భాషాభిమానులందరికీ మా ధన్యవాదాలు.

 

ఈ పదేళ్ళ పండగ సందర్భంగా, గర్వంగా సిలికానాంధ్ర మనబడి సాధించిన ప్రగతి గురించి, విజయాల గురించి కథలు కథలు గా పదిమందికీ చెబుదాం!. #ManaBadi10 అన్న నినాదంతో సోషల్ మీడియాలో స్పందన ఎలుగెత్తి చెబుదాం!

 

Facebook.com/ SiliconAndhraManaBadi

youtube.com/ SiliconAndhraManaBadi

Twitter: @manabadi

ఈ సాంఘిక మాధ్యమాలలో మాతో చెయ్యికలపండి. అక్కడి సందేశాలని జగమంతా చేరేలా పంచుకొని, మీ స్పందన విరివిగా తెలిపి మీ సహకారాన్ని ఇవ్వమని ప్రార్థన.

దశాబ్ది ప్రయాణం – శతాబ్దాల ప్రభావం!

భాషాసేవయే భావితరాల సేవ!!

 జయహో మనబడి!!

జయహో  తెలుగు!!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked