కథా భారతి

నాకు నచ్చిన కథ – ఒక్కనాటి అతిథి

కథారచన – ఆచంట శారదాదేవి
శీర్షిక నిర్వహణ: తమిరిశ జానకి

ఈ కథ నాకెందుకు నచ్చిందంటే

శ్రీమతి ఆచంట శారదాదేవి ఆ తరం రచయిత్రులలో మంచి వాసిగల రచయిత్రి. ఆవిడ రాసిన కథ ల ఆణిముత్యాలు. భావుకతని, వర్ణనల్ని జోడించి ఎంత బాగా రాస్తారో కథలావిడ, వాటిలో కొన్ని హారమై ‘ఒక్కనాటి అతిథి’ కథల సంపుటి రూపంలో మెరిశాయి 1965లో సున్నితమైన మనసుని సుందరంగా లలిత లలితంగా చిత్రీకరించి కనుల ముందు నిలబెట్టిన కథ శారదగారి ‘ఒక్కనాటి అతిథి’ మనిషి శరీరంలో అతుకుపెట్టలేని భాగం మనసొక్కటే అని నా అభిప్రాయం ఎంత డబ్బు పోసినా కొనుక్కోలేనిది మనసు. ఆ మనసు లోతుల్లోకి తుంగిచూస్తే కథలంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకే ‘ఒక్కనాటి అతిథి’ కథ ఎంతో ఇష్టం నాకు.

ఈ కథలోని కేతకి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అప్పుడే విరిసిన పువ్వల్లే అతి నాజూకుగానూ, భావనాలోకంలో విహరిస్తూనే భాధ్యత తెల్సిన భారపు రూపం గానూ కనిపిస్తూ ఉంటుంది నాకు. ప్రతి మనిషి మనసుకీ ఈ రెండు లక్షణాలూ ఉండటం మంచిదనిపిస్తుంది. నాజూకు తనం ఎందుకంటే… ఇతరుల్ని నొప్పించే మాటలు అనకుండా, కష్టపెట్టే చేతలు చెయ్యకుండా ఉండేటందుకు మనిషి మనసుకి నాజూకుతనం ఉండాలి. బండతనం ఎందుకంటే తన ఇబ్బందులూ తన కష్టాలూ ఇతరులకి పంచి పెట్టకుండా సహనంతో కూడిన బాధ్యతతో భరించగలిగేటందుకు తగిన శక్తితో బరువుగా ఉండాలి. ఈ రెండు లక్షణాలూ పుణికి పుచ్చుకున్న కేతకి పాత్ర నాకెంతో ఇష్టం. కేతకి శ్రావణ మేఘంలాంటిది. లేత వయసులో ఎంతో నిగ్రహాన్ని చూపిస్తుంది. కారుమబ్బులా కురవని కన్నీళ్లతో బరువుగా సాగిపోతుంది. జీవనాకాశంలో.

తన ఎనిమిదవ ఏటనించీ ప్రతి సంవత్సరం ఊరికి దూరంగా చలివేంద్రంలో తండ్రికి సహాయపడే కేతకికి శ్రీనిత్యం తానుండేది పొగడచెట్ల మధ్యనే అయినా పొగడ పూలదండల అందం తెల్సినది మాత్రం ఆ రోజు వచ్చిన ఓ బాటసారి వల్లనే. అతని పేరు తెలియదు. ఊరు తెలియదు, మళ్లీ ఎప్పుడైనా అటువైపు వస్తాడో రాడో కూడ తెలియదు. అతడే కథానాయకుడు ‘ఒక్కనాటి అతిధి’ ఆ అపరిచిత వ్యక్తితో ఎన్నాళ్లనుండో పరిచయం ఉన్నట్టనిపించి, ఇన్నాళ్లు ఎదురు చూసింది ఈ నిమిషం కోసమేననిపించింది కేతకి నాజూకు మనసుకి.

తర్వాత కొన్నాళ్లకి కేతకికి నాగప్పతో పెళ్లి కుదిరింది.

మనిషిని చూస్తే గుండెల్లో దడపుట్టే రూపంలో నాగప్పది. అతని తల్లికి నోటిదురుసుతనం ఎక్కువ. అయినా కూడా నాకీ సంబంధం వొద్దు అని చెప్పాలనిపించలేదు కేతకి బాధ్యతాయుత మనసుకి. మనసులో ఎంత బరువైనా మోయగల కేతకి చేతిలో పొగడదండల మూట మోయలేక విసిపారేస్తుంది.
”బరువుగా ఉంది. నేనే మోయలేను” అంటుంది నాగప్పతో. అలా ఎందుకందో కథ చదివితే మీకే తెలుస్తుంది. ఈ ఒక్క వాక్యం చాలు ఈ కథ శాశ్వతంగా మన మనసుల్లో నిలిచిపోవటానికి!

కథ

ప్రొద్దువాలుతోంది. జనసమ్మర్థం ఏమీలేదు. కనుచూపు దూరంలో బాటసార్లు కూడా ఎవరూ వస్తున్నట్టు కనుపించలేదు. ప్రొద్దువాలి, చెట్లసందుల్లో నీడలు దట్టమై మసకమసకగా ఉన్నప్పుడు మనస్సు దిగులు దిగులుగా ఉంటుంది. ఆ కాస్సేపు ఒంటరితనం భయంకరమైనది. ఆ నిమిషం తప్పనిసరిగా ఎవరైనా దగ్గరగా ఉండాలి, నవ్వుతూ గలగలా కబుర్లు చెప్పడానికి… కమ్ముకు వస్తూన్న చీకట్ల భయాన్ని తొలగించడానికి.

కానీ రోజూ ఎవరూ ఉండరు. అది బాటసార్లు వచ్చే సమయంకాదు. తిరిగి వెళ్లిపోయే సమయం. కాని కాస్సేపు మసకచీకటి. ఈ తరువాత దట్టంగా చీకటి కమ్ముకుంటుంది. ఆకాశం నక్షత్రాలతో నిండిపోతుంది. సాయంత్రం ఆర్తనాదంలా అంతటా వ్యాపించిన పక్షుల గలగల సుద్దుమణిగి అంతటా ప్రశాంతమైన నిశ్శబ్దం నిండుకుంటుంది. అప్పుడిక భయంలేదు. తలుపులు వేసుకుని నిద్రలో ప్రపంచాన్ని మరిచిపోవచ్చు. కాని ఆ మసక చీకటికీ ఈ కటిక చీకటికీ మధ్య క్షణాలు ఆనందంగా సాగిపోతున్నట్టుంటుంది కేతకికి. ఆ కాస్సేపు ఏదో ఆరాటమూ, ఆవేదన, దేనికోసమో ఎదురు చూస్తున్నట్లు ఆతృత! హృదయంలో నిండిన ఈ దిగులు స్వరూపమేమిటో ఆమె చెప్పలేదు. వేదన ఏదో లోలోపల దాగి ఉన్నట్లు మాత్రం తెలుసు. మూతపెట్టన గిన్నెలో పైకి ఉబకకూండ లోలోపల కుతకుతమని ఉడికినట్లు హృదయం ఏదో బాధతో ఆరాటపడుతుంది.

ఆ ప్రదేశం అసలు నిర్మానుష్యమైనది. ఎవరూ అక్కడ ఇళ్లు కుట్టుకుని కాపరాలు లేరు. అది నాలుగు పల్లెలకు మధ్య ఉంది. నాలుగు వేపులకు అక్కడినుంచి కాలిబాటలున్నాయి. ఏ త్రోవన వెళ్లినా రెండు మూడు మైళ్లు నడిస్తేనేగానీ అది తగలదు. ఇక దగ్గరగా ఉన్ననవన్నీ చిన్నచిన్న గుట్టలు. బండలు, విశ్రాంతిగా పెరిగి పెద్దవై దగ్గరదగ్గరగా పెద్ద పందిరిలా అలముకొన్న పొగడచెట్లు. అక్కడక్కడా దూరాన ముళ్ల కంపలు. ఆ ప్రదేశంలో ఉంటే ప్రకృతికి చేరువగా, ప్రకృతి ఒడిలో పుట్టి పెరుగుతున్నట్లుంటుంది. పొగడచెట్టు ఎక్కువ ఉండడంచేత ఆ చుట్టుపక్కల ఆ ప్రదేశానికి పొగడతోట అని పేరు.

నాలుగు కాలిబాటలు కలిసిన చోట కొంచెం ఎత్తయిన గుట్టమీద ఓ చిన్నపాక వుంది. పాకకు ముందు ఓ చిన్న పందిరి, చుట్టూ నున్నని ఖాళీస్థలం, ఆ తరువాత అంతటా పెద్ద పెద్ద పొగడచెట్లు, వాటికింద విశాలమైన నున్నని రాతిబండలూ వున్నాయి. అది కేతకి ప్రస్తుత నివాసం. చిన్నప్పటి నుంచీ ప్రతి వేసవికీ అక్కడే మకాం. ఆమె తండ్రి గౌరయ్య.

అక్కడికి దగ్గరగా ఉన్న పల్లె సుమాల ఆమె ఊరు. ఆ ఊరు ఆట్టే పెద్దదికాదు. అయినా ఆ ఊళ్లో కొందరు మోతుబరి రైతులున్నారు. డబ్బున్న ఆసాములున్నారు. చేతి కడ్డం లేకుండా దానధర్మాలు చేసే దాతలూ ఉన్నారు. ఊరికి పడమరగా పంటకాలవ ఉంది. పెద్దది, ఎప్పుడూ ఎడతెగకుండా ప్రవహించేది. ఈ కాలువకు చేరువగా మరొకదిక్కనే వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. అది చాలా పురాతనమైంది. ఎప్పుడు ఎవరు కట్టించారో తెలియదు ఏవో కథలు మాత్రం చాలా చెబుతారు దాన్ని గురించి. ఈ దేవాలయం అతి విశాలమైనది. దాని ఆవరణ చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం వేళ ఈ ఊరివారంతా అక్కడికే చేరుతారు, కాస్సేపు విశ్రాంతిగా కూచుని మాట్లాడుకోడానికి… స్వామి దర్శనానికి.

ఆ ఊళ్లోకల్లా ధనవంతుడు కేశవయ్య ఆయనకున్న వ్యసనాలలో ముఖ్యమైనది దానధర్మాలు చేయాలనే విపరీతమైనది. దానధర్మాలు చేయాలనే విపరీతమైన కోరిక, తాను ఏదో ధర్మకార్యం చేయ్యాలి. నలుగురూ దాన్ని గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఇది ఒక చపలత్వం. ఆయన విధిగా జరిపే ధర్మకార్యాలలో ప్రతి వేసవికి చలిపందిరి నడపటం ఒకటి, ఆ పొగడతోట దగ్గర నాలుగు పల్లెలకు మధ్యగా.

ఆ నాలుగు కాలిబాటలు కలిసే చోట చక్కగా చిన్న పందిరి, పాక వేయించి వచ్చే పోయ్యేవాళ్లకు చల్లని నీళ్లు, పుల్లని మజ్జిగ ఇచ్చే ఏర్పాటు చేయిస్తాడు. అక్కడ ఉండి ఆ భారం వహించల్సిన భాద్యత మాత్రం గౌరయ్యది. అతను కేశవయ్యను కనిపెట్టుకున్న వారిలో ఒకడు. ఎన్నో ఏళ్లుగా ఆ చిన్న పాక అతని వేసవి విడిది. ఎనిమిదేళ్ల వచ్చినప్పటినుంచి అతనితోపాటు కేతకి కూడా అక్కడే మకాం చేస్తుంది, అతనికి వండిపెట్టడానికి, ఆమె తల్లి సుముఖ ఇంటిదగ్గరే ఉంటుంది. ఇంటిపనులు, పాడివగయిరా చేసుకోడానికి.

చీకటితో లేచి గౌరయ్య పల్లెకు వెళతాడు మజ్జిగ కుండలు తెవడానకి, పొద్దెక్కబోతుండగా తిరిగి వస్తాడు. చీకిటితో లేచి కేతకి పందిరిపాక ఊడ్చి బాగుచేస్తుంది. కుండలన్నీ కడుగుతుంది. గుమ్మంలో ముగ్గులు పెడుతుంది. దూరంగా ఉన్న మచినీళ్ల బావినుంచి నీరు తెచ్చి కుడలు నింపుతుంది. గౌరయ్య రాగానే రాత్రి వండిన అన్నం అతనికి పెట్ట తానూ తింటుంది.

కొంచెం ఎండ ఎక్కినకొద్దీ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. దాహమని ఆయసపడుతూ వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్లిపోరు చల్లటి నీళ్లు తగి, కాస్సేపు పందిట్లో ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. గౌరయ్య చుట్టకాల్చుకుంటూ వాళ్ల కబుర్లు వింటూ ఉంటాడు. మధ్యమధ్య తనూ మాటలు కలుపుతాడు. వచ్చే వాళ్లల్లో చాలామంది అతనికి తెలిసిన వాళ్లే. ఎవరో కొందరు కొత్తవాళ్లు.

కేతకి ఎవరితోను మాట్లాడదు. పరకరిస్తే జవాబు చెప్పడం తప్ప వేరే మాట్లాడటం ఆమెకు అలవాటు లేదు. మౌనంగా అందరికీ కావలసినవి. అందిస్తుంది. కొంచెంసేపు వాళ్ల కబుర్లు వింటుంది. ఏమీ తోచకపోతే వెనకాల పాకలోకో లేక దాని వెనకాల ఉన్న పొగడచెట్ట దగ్గరకో వెళ్లిపోతుంది.

పొద్దువాలేవేళ బాటసార్ల తాకిడి తగ్గుతుంది. క్రమంగా ఎవరూ రారు. గౌరయ్య గుమ్మంలో చుట్ట కాల్చుకుంటూ దిక్కులు చూస్తూ కూర్చుటాడు. కేతకి మరొకసారి పాక పందిరి ఊడ్చి కుండలు, కడుగుతుంది. అన్నం వండుతుంది. చీకటి పడేవరకు భయం భయంగా దిగులు దిగులుగా అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ ఉంటుంది. చీకటిపడ్డాక తండ్రికి అన్నం పెట్టి తాను తింటుంది. భోజనం కాగానే గౌరయ్య దుప్పటి పరచుకుని నిశ్చింతగా నిద్రపోతాడు. కేతకికి ఎంతకూ నిద్రరాదు. చాలాసేపు నక్షత్రాలను చూస్తూ పడుకుంటుంది. ఎప్పుడో ఆమెకు తెలియకుండానే నిద్రపడుతుంది.

ఆవేళా అంతే జరిగింది. పొద్దువాలుతూ ఉండగా గౌరయ్య గుమ్మంలో కూర్చున్నాడు, చుట్టపొగ వదులుతూ, మండువేసవి వేడి గాలి ఉండి ఉండి తపన రేపుతుంది. పాకలో కేతకి పొయ్యిమీద పెట్టిన అన్నం కుతకుతమని చప్పుడు చేస్తోంది. పాకకు దూరంగా తండ్రికి ఎదురుగా పొగడచెట్టు క్రింద పెద్ద రాతిబండమీద దిగులుగా కూర్చుంది కేతకి. దూరంగా నల్లని కొండలకు వెనుకగా అస్తమిస్తున్న సూర్యుని చుట్టూ కావిరంగు అందంగా మెరుస్తోంది.

కేతకి నలువైపులా చూసింది. దూరాన చెట్ల గుంపులోని కాలిబాట మీదుగా ఎవరో మెల్లగా వస్తున్నారు. ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించడంలేదు. వేషం విచిత్రంగా ఉంది. ఎర్రనిపంచ, తెల్లనిచొక్క తలమీద గాలికి కదలిపోతున్న పచ్చనిపాగా, చేతిలో నీలిరంగు సంచి ఏదో జాతర వేషంలా ఉంది.

కేతకి తండ్రిని చూసి అంది ”నాన్నా ఎవరో వస్తున్నారు?” అని.

గౌరయ్య చుట్ట పారేసి లేచి నుంచున్నాడు. అతనికి మనిషి పోలిక తట్టలేదు. ఈ ప్రాంతంవాడు కాడులా ఉంది అనుకున్నాడు. అస్పష్టంగా, కేతకి లోపలికి వెళ్లిపోయింది.

అతను దగ్గరకు వచ్చాడు. సంచీ ఓ మూలపెట్టి కండువా తీసి ముఖం తుడుచుకున్నాడు కేతకి ఖాళీచేసిన రాతిబండ ఆక్రమించుకున్నాడు. గౌరయ్యను చూసి నవ్వుతో ”ఈ తోవ సరాసరిపోతే ఊరేదైనా వున్నదా? ”అని అడిగాడు.

”నాలుగు వేపులా వున్నాయి. అయితే ఇంకో కోసెడు దూరం పోవాలి. ” అని చెప్పాడు గౌరయ్య.
”అయితే ఇంక ఇప్పెడు నేను పోలేను, ఈ పూట ఉండి పొద్దునే పోతాను. ఉండవచ్చా” అతను విసుగ్గా అన్నాడు.

గౌరయ్య అతనికి జవాబు చెప్పలేదు. కేతకిని కేకవేసి చెప్పాడు. ”ఇతను ఈ పూట ఇక్కడే ఉంటాడుట” అని. మళ్లా కొత్త చుట్టముట్టంచాడు.

అ్పటికి బాగా చీకటిపడింది. ఆకాశమంతా నక్షత్రాలు మెరుస్తున్నాయి. అతను అలసిపోయినట్టు ఆ రాతిబండమీద పడుకున్నాడు. పక్కన చెట్టుమీదనుంచి రాలిన పొగడపూలు గుట్టలుగా ఉన్నాయి. అతను ఆ పూలు గుప్పిడినిండా తీసుకుని ముఖాని కద్దుకున్నాడు.

”పాపం! అలసిపోయినట్టున్నాడు” అనుకున్నాడు గౌరయ్య.

కాస్పేపటికి చల్లని నీళ్ళు తెచ్చి ఇచ్చింది కేతకి, అతను ఉలిక్కిపడి లేచాడు. కాళ్లుచేతులు, ముఖం కుడుకున్నాడు. ఆమె కుండలలో మిగిలిన మజ్జిగ ఒక పాత్రలో పోసి తెచ్చి పెట్టింది. అతను అందుకున్నాడు. ఆమె వెళ్లిపోయింది. అతను గౌరయ్యకేసి చూశాడు. ప్రశ్నార్థకంగా, గౌరయ్య చెప్పాడు ”నా కూతురు” అని మాటలురావా? అన్నాడు అమాయకంగా, ఆమె యంత్రంలా వచ్చి వెళ్లిపోవడం తలచుకుంటూ పరధ్యానంగా ఉన్న గౌరయ్య ఆ మాట వినిపించుకోలేదు. దూరంగా ఉన్న కేతకి ఈ మట విని నవ్వింది. అతన్ని చూడగానే ఆమెకు ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న బంధువు వచ్చినట్లు తోచింది. హృదయం సంతోషంతో నిండిపోయింది. గౌరయ్య బాతాఖానీ ప్రారంభించి ఆ చుట్టుపక్కల విశేషాలన్నీ చెప్పాడు.. ఇంతలో కేతకి భోజనం తెచ్చింది. ఇద్దరికీ మధ్యగా దీపం పెట్టింది. రెండు కంచల్లో అన్నం రెండు చెంబుల్లో నీళ్లు తెచ్చింది. భోజనం చేస్తున్నంతసేపు అతను కేతకినే వింతగా చూశాడు. పాలలోకి బయటికి నిశ్శబ్ధంగా తిరుగుతున్న ఆమె ఆ మసక చీకట్లో ఏదో నీడ కదులుతున్నట్టుంది. అతనకి ఆశ్చర్యం వేసింది. భోజనమై లేవబోతూ అతను ఇంకొంచెం నీళ్లు కావాలన్నాడు. ఆమె తెచ్చి పోసింది. చెంబులో నీళ్లు సోస్తున్న ఆమె ముఖాన్ని అతను తదేకదీక్షగా చూశాడు. అది గమనించి కేతకి కంగారుపడింది. చాటుకు వెళ్లి నవ్వుకుంది.

గౌరయ్య భోజనం కాగానే యథాప్రకారంగా మామూలుచోట దుప్పటి పరచుకున్నాడు.

”నీవు ఆ రాతిబండమీద పడుకుంటావా? అన్నాడు అతనితో.

అతను నిర్లక్ష్యంగా ”ఎక్కడో పడుకుంటాలెండి. ముందు అలా కాస్సేపు తిరిగి వస్తాను” అన్నాడు.

”ఈ చీకట్లో ఎక్కడ తిరుగుతావు?” అన్నాడు గౌరయ్య భయంగా.

అతను నవ్వాడు.

”ఫరవాలేదులెండి. ఊరికే కొంచెం దూరం వెళ్లి వస్తాను” అన్నాడు. గౌరయ్య నిశ్చింతగా నిదురపోయాడు.

ఆ వెల్ళిన మనిషి గంటయినా రాలేదు. పాక ముందర చాపవేసుకు నక్షత్రాలను చూస్తూ పడుకున్న కేతకికి అతనిని గురించిన ఆలోచన లేదు. ఇలాంటి మనిషినెప్పుడూ చూడలేదు. ఎంత అందంగా ఉన్నాడో అనుక్నుది. అతని రంగు బట్టలు ఎంత బాగున్నాయనుకుంది. అతని నవ్వు ఎంత మధురంగా ఉన్నదనుకున్నది. అతను తనకేసి చూసినప్పుడల్లా తన్ను గాఢంగా కౌగలించుకొన్నట్లనిపించింది.అది తలచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఏదో భయం వేస్తుంది.

”నిద్రపట్టలేదా?” అన్నాడతను ఉన్నట్టుండి. కేతకి అదిరిపడ్డది. అతను అంత దగ్గరగా రావడం ఆమె గమనించనేలేదు. ఎంత నిశ్శబ్దంగా వచ్చాడు?! అనుకుంది. కంగారుగా లేచి కూర్చుంది. అతని కేసి చూస్తూ. అతను చిరునవ్వుతో చూశాడు. ఆమెకు ఈ చూపు తన ఒళ్ళంతా తడచినట్టనిపించింది. రెండు చేతులతో గుండెలు కప్పుకుంది. అతను మళ్ళా చిరునవ్వుతో అన్నాడు. ”నాకూ నిద్ర రావడంలేదు. అలా రారాదూ! ఈ రాతిబండమీద కూర్చుందాం. ఏవైనా కబుర్లు చెప్పుకోవచ్చు” అని. ఆమె యాంత్రికంగా లేచి మంత్రముగ్ధలా అతనితో నడిచివెళ్లింది. ఈ అపరిచిత వ్యక్తికి ఇంత చనువేమీ అన్న స్పృహ ఆమెకా నిమిషాన లేదు. అతనితో ఎన్నాళ్ళనుంచో పరిచయం ఉన్నట్టనిపించింది. ఇన్ళాళ్ళు ఎదురుచూసినంది. ఈ నిమిషంకోసమేననిపించింది.

ఆ రాతిబండకు ఒక అంచున అతను కూర్చున్నాడు. మరొక అంచున ఆమె కూర్చుంది. ఇద్దరికి మధ్యగా రాలిన పొగడపూలు దట్టంగా నిండివున్నాయి. కబుర్లు చెప్పుకుందాం అని ఉత్సాహంగా పిలిచిన అతనికి ఏ కబుర్లూ తోచలేదు. దిగులుగా చూస్తూ ఊరుకున్నాడు. కబుర్లు విందామని ఆసక్తితో వచ్చిన ఆమెకు తను మాట్లాడడం లేదని తెలయలేదు. చీరకొంగులు మెలిపెట్టుకుంటూ ఎంతో సరసమైన మాటలు వింటున్నట్టు సిగ్గుపడుతూ కూర్చుంది. గాలీ కదలినప్పుడల్లా పొగడపూల వాసన ముంచెత్తుతుంది.

అప్పుడు అతను అన్నాడు. ” ఈ పొగడచెట్టు చాలా ఏళ్ళుగా ఉందా? ఎంత పెద్దదో?” అని కేతకి ఏంచెప్పాలో తెలియలేదు. బిత్తరపోయి ఊరుకుంది. తాను ఇక్కడికి వచ్చినప్పటినుంచి ఈ చెట్టు ఇంత పెద్దదిగానే ఉంది. ఎన్నాళ్లుగా ఉందో ఎవరికి తెలుసు! తనకు చెట్టుకింద కూర్చోవడం గుప్పిళ్ళతో పువ్వులు ఏరుకోవడం వేళ్ళసందుల్లోంచి జారవిడవడం మాత్రమే తెలుసు?

అతను మళ్ళీ అన్నాడు. ”ఈ పువ్వులు ఎంతమంచి వాసనో! ఇవి బారులుగా దండలు కట్టీ నీ జడలో వేలాడగడితే ఎంత బాగుంటాయో! ఎందుకు పెట్టుకోలేదు?

ఇది మరి ఇక అర్థంలేని ప్రశ్నగా తోచింది కేతకికి, ఆ పువ్వులు దండలు గుచ్చాలని, పెట్టుకోవాలని ఎప్పుడూ అనిపించలేదు. తనకు ఊరికే దోసిలి నింపుకోవాలని తప్ప.

అతను మళ్ళా అన్నాడు. ”నా సంచిలో దారం ఉంది. నేను గుచ్చనా!” అని. కేతకి నవ్వింది. ఈ రాత్రివేళ ఈ నక్షత్రాల మినుకు మినుకుమనే కాంతిలో అతను పువ్వులు గుచ్ఛగలడా అనుకుంది. అతనూ నవ్వాడు. ఇద్దరికీ మధ్యగా వున్న పూలు అతను దోసిలితో తీసి ఆమెకిచ్చాడు. ఆమె మెలికలు తిప్పుతున్న పమిటకొంగు సరిచేసి అందుకుంది. కొంగున నిండిన పూలు చేత్తో తీసి వాసన చూస్తూ బద్ధకంతో ఆవులిచింది. ”నిద్ర వస్తోంది” అంటూ లేచి నిలబడింది. అతను ఎంతో దిగులుగా ఆమెకేసి చూశాడు. ఆమె వెళ్ళిపోయింది. అతని కళ్ళకు నిద్ర రాలేదు. వేళ్ళతో లెక్కలు పెట్టుకున్నాడు. తెల్లవారింది. కుండలతో నీళ్లు తెస్తున్న కేతకి అతనిని చూసి నవ్వంది. అతను దిగులుగా ముఖం వాల్చుకున్నాడు. అతనూ, గౌరయ్య ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. కేతకి బిక్కుమొహం వేసుకుంది. గౌరయ్య అన్నాడు.
”మా ఊరు వస్తారా?” అని.

”లేదు. నేను సరాసరి పోతాను. ఏ ఊరు తగిలితే ఆ ఊరు” అన్నాడతను.
గౌరయ్య కాస్త ఆగి అన్నాడు.

”మళ్ళా ఈ తోవన వస్తారా?” అని అతను నవ్వుతూ అన్నాడు.

”నేను వచ్చిన తోవను మళ్ళారాను. వెళ్లినచోటికి మళ్ళా వెళ్ళను. ప్రస్తుతం నా ప్రయాణం ఇలాగే సాగుతోంది. కొన్నాళ్ళ దాకా ఇంతే. ఇలాగే తిరగదలచుకున్నాను ” అని అంటూ కేతకికేసి చూసి నవ్వాడు. ఆ చూపు ఆమెను ఆఖరుసారి హృదయానికి హత్తుకుని సెలవు తీసుకుంటున్నట్టుంది. కేతకి దిగులుతో తల వంచుకుంది. అతను సంచి తీసుకువెళ్ళిపోయాడు. గౌరయ్య కావడి తీసుకువెళ్ళాడు.

కేతకి నిండుకుండలో నీళ్లు కింద పారపోసింది. ఖాళీకుండ కింద పడవేసింది. తడిసిన కాళ్ళతో తడిసిన కుచ్చెళ్లు తడుపుకుంటూ నీరసంగా ఆ రాతిబండమీద వెళ్ళి కూర్చుంది. కష్టపడి మోసి తెచ్చిన నీళ్ళు ఎందుకు పారబోసిందో ఆమెకే అర్థంకాలేదు. చెమర్చుతున్న ముఖం పమిటచెంగుతో తుడుచుకుంది. పక్కన పొగడపూల దండలు వరసగా పేర్చి కనబడ్డాయి. ఆమె తెల్లబోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. అతనికి రాత్రి ఎట్లా గడిచిందో ఆమెకు అప్పుడు తెలిసింది. దండలు మెళ్లో వేసుకుంది.
పొద్దెక్కేదాకా అలాగే కూర్చుంది. పందిట్లో కుండలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఆమె మళ్ళీ తేలేదు. కమ్ముకుని వస్తోన్న శూన్యాన్ని ఎలాగూ నింపలేనని నిస్పృహతో ఊరుకుంది.

ఎండ కొరకొరమని వస్తున్నా ఆమె ఉన్న చోట వదలిపోలేదు. ఆమె శరీరంలో శక్తి లేదు. మనస్సులో ఉత్సాహంలేదు. భూమిలో వేళ్ళు పాదుకుని సుఖంగా ఎదుదుతున్న లేత మొక్కను ఎవరో విలాసంగా పెకలించి శ్యూంలోకి విసరివేసినట్టనిపించింది. కేతకికి, తాను ఎన్నాళ్లుగానో గుప్తంగా దాచుకున్న మమతను ఒక్కసారి కదిపి అతను తన తోవను తాను సాగిపోయాడు. నిన్నటివరకు జీవితంలో దేనికోసమే ఎదురుచూస్తోంది. ఇవ్వాళ కేవలం నిరాశమాత్రం మిగిలింది. అతను ఎవరో తెలియదు. రాత్రి అతనితో తాను మాట్టాడినది లేదు. అయినా జీవితం అతని ఎదుట ఒక్కసారి పుష్పించి శాశ్వతంగా ముకుళించినట్టుంది.

గౌరయ్య తిరిగివచ్చి చిందరవందరగా వున్న పందిరిపాక, ఖాళీకుండలు,ఎండలో శూన్యంగా కూర్చున్న కూతుర్ని, చూశాడు.కావిడిదింపి, కంగారుపడుతూ ”ఒంట్లో బాగుండలేదా? అని అడిగాడు కూతుర్ని. ”జర్వంగా ఉంది” అంది కేతకి పరధ్యానంగా.

కూతుర్ని లోపలికెళ్ళి పండుకోమని తానే అన్నీ సర్తుకున్నాడు. నీళ్ళు తెచ్చుకున్నాడు. ఇంతలో ఎవరో దారినపోయే వాళ్ళు వచ్చి పందిట్లో కూర్చున్నారు. కబుర్లు చెబుతూ. పొద్దుపోయేకొద్ది కేతకికి భయమూ, బెంగా ఎక్కువైయ్యాయి. మసకచీకట్లో ఇంక అక్కడ తాను ఉండలేననీ, ఆ పొగడచెట్లను చూడలేననీ అనుకుంది. ప్రతి సంవత్సరమూ అక్కడికి ఎంతో ఉత్సాహంతో ఏదో ఆశతో వస్తోది. ఒక్కసారిగా ఇంక ఎదురుచూడడానికి ఏమీ లేదనిపించింది. గుండెలో ఉండి ఉండి బాధిస్తున్న ఈ శూన్యం ఇక్కడ నుంచి వెళ్ళితేనేగాని తగ్గదేమోననుకుంది. తల దువ్వుకుని, ముఖం కడుక్కుని తండ్రితో అంది. ”నాకు ఒంట్లో బాగుండలేదు. ఇంటికి వెళ్ళిపోదాం” అని గౌరయ్య కూడా అదే అనుకున్నాడు. ”అవును నేనూ అదే ఆలోచిస్తున్నాను. పదపోదాం” అన్నాడు.

రోజులు గడిచేకొద్ది సుముఖకి కేతకి ఏదో మారపోయినట్లు తోచింది. ఇదివరకు ఎవరితో మాట్లాడకపోయినా ఉత్సాహంగా పనులు చేస్తూవుండేది. ఇప్పుడు ఏదైనా పని చెప్పినా మరిచిపోతుది. ఎంతసేపూ పెరట్లో పొగడపూలు ఏరుకుని సన్నజాజి పందిరి దగ్గర దండలు కడుతూ కూర్చుంటుంది.అవన్ని రోజూ తన పెట్టేలో నింపుకుంటుంది.

చూడగా చూడగా సముఖకి ఈ పిల్లకు పెళ్ళిచేయడం తప్ప వేరు గత్యంతరం లేదని తోచింది. గౌరయ్య కుటుంబం కేశవయ్యగారిమీద ఆధారపడి ఉంది. అన్నీ ఆయన సలహా ప్రకారం జరగడమే అలవాటు. కేతక పళ్ళి విషయం ఆయనా ఆలోచిస్తూనే ఉన్నాడు. చివరకు ఓ సంబంధం చెప్పాడు. పొగడతోటకు దక్షిణంగా దేవనగరి అనే పల్లే ఉంది. అక్కడ నాగప్న అని ఓ రైతు ఉన్నాడు. అక్కడ బాగా కేశవయ్యగారికి కావలసిన వాడు. అతనికి భార్యపోయింది. తల్లి ఒకత్తే చాకిరి అంతా చేసుకోలేకుండా ఉంది. అంచేత మళ్ళా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కేశవయ్యను అగిగాడు పిల్లను చూసిపట్టమని, కేశవయ్యకు కేతకిని ఇవ్వవచ్చునని తోచింది. గౌరయ్యతో చెప్పాడు. అతను సరేనన్నాడు. కౌశవయ్య పెళ్ళి ఏర్పాటు చేశాడు.

సుముఖ మాత్రం అంతగా సంతోషించలేదు. ఆమె నాగప్పను ఎరుగను, నల్లగా ఒడ్డు పొడుగు పోతవిగ్రహంలా ఉంటాడు. చూస్తేనే ఏదో గుండెల్లో దడ పుడుతుంది. ఇంక నాగప్ప తల్లి నొటిదురుసు అందరికీ తెలిసినదే. అయినా గౌరయ్య, కేశవయ్య ఇద్దరూ కలిసి నిశ్చయించాక ఇంక చేసేదేముంది! కేతకి అమాయకురాలు. దేవుడే కాపాడతాడని ఊరుకుంది.

పెళ్ళి నిశ్చయమయిందని విన్నా కేతకి ఏమీ మాట్లాడలేదు. ఎవరూ చూడకుండా కాస్సేపు ఏడ్చి ఊరుకుంది. నాకీ పెళ్లి వద్దని చెప్పలేదు. ఏమని చెపుతుంది!

”ఎప్పుడో ఒకరోజు, మసకచీకట్లో ఒక బాటసారి వచ్చాడు. అతను నన్ను పలకరించాడు. మళ్ళా తనతోవన తాను వెళ్ళాడు. అతని పేరు నాకు తెలియదు. ఊరు తెలియదు. అతను మళ్ళా కనిపిస్తాడని నమ్మకమూ లేదు. అయినా ఆజన్మాంతమూ అతనికోసం అని చెబితే సుముఖ ఏమంటుంది? ”అయ్యో పిచ్చితల్లీ” అంటుంది అంతకన్నా ఏముంది! అందుకే కేతకి మాటాడలేదు.

పెళ్ళయిన పదిరోజులకు నాగప్ప తిరిగివచ్చాడు కేతకిని తీసుకుపోవడానికి, సుముఖ కేతకికి తలంటి నీళ్ళుపోసి, కొత్తచీర కట్టి కళ్ళకు కాటుక, కాళ్లకు పసుపూ పారాణీ పెట్టింది. తల్లో పువ్వులు పెట్టింది. పిండి వంటలతో సహా భోజనం పెట్టింది. సాగనంపింది. వెళ్లబోతుండగా కేతకి దాచుకున్న పొగడదండలన్నీ తెల్లని గుడ్డలో చుట్టి ఇచ్చింది. కేతకి అవి అందుకొని కంటతడి పెట్టుకుంది తుడిచేసుకుని వెళ్ళిపోయింది.

పొద్దు వాలుతుండగా పొగడతోట చేరారు. ఇదివరకు కేతకి ఉన్న పాతకులు రాలి ఏదో పాడుపడ్డట్టు భయంకరంగా ఉంది. దాన్ని చూడగానే కేతకికి ఒక్కసారిగా జీవితమంతా ఎడారి అయినట్టు తొచింది. తాను కూర్చోవడానికి అలవాటుపడ్డ రాతిబండమీదే నాగప్ప వెళ్లి కూర్చున్నాడు. ఆ పొగడచెట్టు పూలు అలాగే రాలివున్నాయి. కేతకి దాని దగర్గకు పోలేకపోయింది. దూరంగా చతికిలపడింది. నాగప్ప బడాయిగా తన ఊళ్ళో తన కెంత పలుకుబడి, గౌరవం వున్నదీ గర్వంతో చెప్పుకున్నాడు. తన గౌరవానికి తగినట్టు మసలు కోవాలన్నాడు. ”మా అమ్మకు కొంచెం నోటిదురుసు, నువ్వు తొందరపడకూడన్నాడు” కేతకి ఆ మాటలు వింటూ తోవతప్పిన లేడిపిల్లలా బెదురుచూపులు చూస్తూ కూర్చుంది. పరధ్యానంగా ఇంక ఈ మాటలు జీవితాంతమూ వింటూ ఉండాలి కాబోలు అనుకుంది. అమాయకంగా.

మళ్ళా నాగప్ప అన్నాడు. ”ఇంకో రెండు మైళ్ళుపోతే మన ఊరు వస్తుంది. లేపోదాం” అని. కేతకి యాంత్రికంగా లేచి నిలబడింది ప్రయాణానికి పోతూపోతూ ఆ పొగడపూల మూట ఆ రాతిబండమీద విసిరిపారేసింది. అదేమిటని ప్రశ్నార్థకంగా చూశాడు నాగప్ప ”బరువుగా ఉంది. నేను మోయలేను” అంది నిస్పృహగా కేతకి నాగప్ప మళ్ళీ మాట్లాడలేదు. కేతకి మళ్ళా తిరిగి చూడలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked