కథా భారతి

సలలిత రాగ సుధారస సారం

-ఆర్. శర్మ దంతుర్తి

లోపలకి వస్తున్న బాలమురళీని చూస్తూ ఇంద్రుడు ఆసనం మీద నుంచి లేచి “రండి, రండి” అంటూ అహ్వానించేడు. అక్కడే ఉన్న నారద తుంబురులూ, అప్సరసలూ కూడా నవ్వుతూ ఆసనం చూపించేక అందరికీ నమస్కారం పెట్టి చుట్టూ చూసేంతలో నారదుడి కంఠం వినిపించింది, “ఇంతకాలం అద్భుతంగా భూలోకంలో సంగీతాన్ని పంచిపెట్టిన మీకు స్వాగతం. ఇప్పుడెలా ఉంది సంగీత కళ భూలోకంలో? త్యాగరాజుల వారు మొదలుపెట్టిన సంగీత యజ్ఞం బాగా సాగుతోందా?”

బాలమురళీకి ఏమనాలో తోచలేదు. వచ్చిన ఐదు నిముషాల్లో ఇక్కడంతా ఏమీ పూర్తిగా పరిచయం అవకుండానే నారదుల వారు తనని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారప్పుడే. బాలమురళీ ఏమీ సమాధానం చెప్పకపోవడంతో ఈ సారి తుంబురుడు అడిగేడు, “త్యాగరాజ స్వామి ఆరాధనా, ఉత్సవాలు బాగా జరుగుతున్నాయని వింటున్నాం. ఆయన పంచిచ్చిన సంగీత సుధ, ఆ రాములవారి అనుగ్రహంతో అలా నిరాటంకంగా సాగుతోందా?”

ఇంద్రుడికేసీ అక్కడ సభలో అందరికేసీ చూశాడు బాలమురళి. అందరూ తన సమాధానం కోసం చూస్తూండడం తెలిసాక ఇంక తప్పలేదు. “త్యాగరాజ స్వామి ఇచ్చిన సంగీతం సాగుతోంది, కానీ ఆయన కీర్తనలని సినిమాలలో వాడుకుంటున్నారు మార్చేసి. ఆ స్వామి ఆరాధన నామకః ఏడాదికో మారు చేస్తున్నారు కానీ అందులో సంగీత విద్వత్తు ఉన్నవాళ్ళెందరనేది మనకి మనమే చూసి తెలుసుకోవల్సిన విషయం. అంతకన్నా ఇంకేం చెప్పమంటారు?”

“అలా అంటున్నారేం? నేను ఈ మధ్య భూలోకానికి వెళ్ళలేదు కానీ మీరన్నట్టూ ఉంటే ఓ సారి చూడాలని ఉంది.” నారదుడు కాస్త ఆదుర్దాగా అన్నాడు ఇంద్రుడికేసి చూస్తూ.

“తప్పకుండా వెళ్ళి రండి, మీకే తెలుస్తుంది వాళ్ళు ఎలా, ఏం పాడుతున్నారో, అనే అన్ని విషయాలూను,” బాలమురళీ చెప్పేడు, “అయితే మీతో బాటు ఎవరినో కూడా తీసుకెళ్తే మంచిది.”

“ఎవరో ఎందుకు, మీరే రావొచ్చుగా?”

బాలమురళి ఇబ్బందిగా చూసాడు నారదుడికేసి, “ఇప్పుడే కదండి ఇక్కడకి వచ్చినది? మళ్ళీ అక్కడకి వెంఠనే వెళ్ళాలంటే…” నసిగేసాడు.

“సరే అయితే, మరి మీరో?” నారదుడు తుంబురుడికేసి చూసాడు.

ఏదో శాపం గుర్తొచ్చినట్టుంది, “అమ్మో, నాకు కుదరదు,” తప్పించుకున్నాడు తుంబురుడు.

“సరే అయితే నేను అలా మహావిష్ణువు దగ్గిరకెళ్ళి అక్కడ్నుంచి ఎవరో తోడు తీసుకుని వెళ్తాను లెండి,” లేచాడు నారదుడు.

* * * * * * * *

తన దగ్గిరకొచ్చిన నారదుణ్ణి చూసి ఆయనెందుకొచ్చాడో గ్రహించినా ఏమీ తెలియనట్టు నవ్వుతూ అడిగేడు లక్ష్మీపతి, “ఏమిటి విశేషాలు నారదా?”

అమ్మవారు కూడా నవ్వుతూంటే నారదుడు కొంచెం మొహమాటంగా అడిగేడు, “సంగీత కళానిధీ, అపర గంధర్వ గాయకుడూ అయిన బాలమురళీ తనువు చాలించాక ఆయనని ఇప్పుడే ఇంద్రలోకంలో కల్సి మాట్లాడి ఇలా వస్తున్నాను. త్యాగరాజ స్వామి అందించిన సంగీత సుధని ఇప్పుడు భూలోక ప్రజలు ఎలా ఆదరిస్తున్నారని ఆయన్ని అడిగితే కర్ర విరక్కుండా పాము చావకుండా సమాధానం చెప్పాడు ఆయన. మీ కళ్ళతో చూసి, మీ మటుక్కి మీరే విని అర్ధం చేసుకుంటే మంచిది కానీ ఇంకొకర్ని తోడు తీసుకెళ్లండి అని ఉచిత సలహా పారేశారు. ఇంద్రలోకంలో ఎవరికీ పెద్ద ఇంటరెస్ట్ ఉన్నట్టు కనబడదు నాతో రావడానికి. ఓ సారి త్యాగరాజ స్వామినే పంపించడం కుదురుతుందా అని అడుగుదామని ఇలా వచ్చాను.”

“త్యారాజ స్వామిని అడగడం కూడా శుద్ధ దండుగ, ఆయన నేను చెప్పినా నీతో రాడు కానీ ఇప్పుడు భూలోకంలో పరిస్తితులు అంత బావోలేవు కనకా, హనుమంతుడు నేను ఏది చెప్పినా చేయను అనడు కనకా ఆయన్ని తీసుకెళ్ళొచ్చు. నీకేదైనా జరిగితే హనుమంతుడి సహాయం కూడ అవసరం.”
“అవశ్యం, మీరేం చెప్తే అదే”

పిలుపు విని వైకుంఠం లోపలకి వచ్చిన హనుమంతుడితో చెప్పేడు మహా విష్ణువు, “హనుమా, నారదుల వారు ఓ సారి భూమ్మీదకి వెళ్ళి అక్కడ ప్రజలు సంగీతాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారో చూడ్డానికి ఉబలాటపడుతున్నారు. కలియుగంలో అధర్మం ప్రబలుతోంది కనుక నువ్వు ఆయనికి సహాయంగా వెళ్ళిరా. వచ్చాక మీరు చూసిన విషయాలు నాకు చెప్పాలి సుమా?”

అమ్మవారు కిసుక్కున నవ్వింది ఈ మాట విని.

హనుమంతుడికి కధ అంతా అర్ధమైంది. భూమ్మీదకి వెళ్ళాక అక్కడ నారదులవారు ఎక్కడైనా నోరు జారితే బడితపూజ జరక్కుండా తాను కాపాడాలి. “సరే” అని నారదుడికూడా బయల్దేరాడు.

అలా వైకుంఠంలోంచి బయల్దేరిన నారద హనుమంతులు తిన్నగా హైదరాబాదు చేరారు. ఎక్కాడికెళ్ళాలో తెలియని పరిస్థితి. రోడ్ల మీద ఆటోలు గుద్దుకోకుండా అటూ ఇటూ తిరుగుతూ, ఇక్కడో మనిషినీ అక్కడో మనిషినీ కనుక్కుని మొత్తానికి రవీంద్రభారతికి చేరారు మధ్యాహ్నం మూడింటికి.

బయట పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన బోర్డు నారదుడు చదువుతూంటే హనుమంతుడు చూసాడు ఆసక్తిగా “సుస్వాగతం. ఈ రోజు త్యాగరాజ ఆరాధన – రామకీర్తనలు – కుమారి వీరమణి. అందరూ ఆహ్వానితులే!” రాముడి పేరు చూసి నారదులవారికంటే హనుమంతులవారికి సంతోషం ఎక్కువైంది. లోపలకి నడిచేరు.

********************

ఓ గంట గడిచాక కచేరీ మొదలైంది. మొదట “వాతాపి గణపతిం భజే …” అంటూ గణపతి ప్రార్ధన చేసాక ఒకావిడ పాట పాడింది, “వరవీణా మృదుపాణీ..” అంటూ. ఆ తర్వాత పాట ఈవిడ శిష్యురాలు వీరమణి. వస్తూనే “జగదానంద కారకా…” అంటూ ఎత్తుకునే సరికి నారదుడూ, హనుమంతుడూ ఇద్దరూ సీట్లలో సర్దుకుని కూర్చున్నారు వినడానికి. కుమారి వీరమణి కొనసాగించింది.

జగదానంద కారకా జయ జానకీ ప్రాణనాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
మంగళకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమే ఇక పావనమౌగాక…

అదో రకం మొహం పెట్టి హనుమంతుడు నారదుడికేసి చూసాడు ఇదేమిటన్నట్టు. నారదుడు కూడా కనుబొమ్మలు పైకి ఎత్తి భుజాలు పైకి ఎగరేసి నాకేం తెలుసన్నట్టూ చూసాడు. వీరమణి పాట ఆపకుండా పాడుతూనే ఉంది. పక్కనే సంగీతం గురువు గారు చేత్తో తాళం వేస్తోంది.

రాజమకుటమే వొసగెలె నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం
సామ్రాజ్యలక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా…

నారదుడు హనుమంతుడి చెవిలో అన్నాడు, “ఇదేమిటి? గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర,
సుగుణాకర సురసేవ్య భవ్య దాయక, సదా సకల జగదానంద కారకా..” అని కదా త్యాగరాజ స్వామి పాడినది?

“అవును, నాకూ అర్ధం కావట్లేదు ఇదేమిటో. కచేరీ అయిపోనివ్వండి అడుగుదాం.” వాయుపుత్రుడు చెప్పేడు.

మరో రెండు గంటలు ఇలాగే అక్కడో తెలిసిన పాటా మిగతా పాత తరానికి తెలియని కొత్త పుంతలు తొక్కే సాహిత్యం, సంగీతం విన్నాక కచేరీ అయిపోవస్తూంటే సీట్లలోంచి లేచారు ఇద్దరూను. ప్రేక్షకుల చప్పట్లతో రవీంద్ర భారతి మారుమోగిపోయింది. నారదుల వారి మొహంలో ఈ సంగీతం విని కోపం తాండవిస్తోంది. హనుమంతుడు ఆయన్ని నడిపించుకుంటూ కుమారి వీరమణినీ ఆవిడ గురువుగార్నీ కలవడానికి స్టేజీ వెనక్కి తీసుకెళ్ళాడు. అలా వెళ్ళే దారంతా అప్పటిదాకా పాటలు విన్న వాళ్ళు చేసే కామెంట్లు వినబడుతూనే ఉన్నాయి ఇద్దరికీను, “అబ్బా ఏం కచేరీ అండీ, చితక్కొట్టేసింది కదా అమ్మాయి?”, “ఎన్నాళ్ళకి మళ్ళీ పంచరత్న కృతులు పాడే వాళ్ళు దొరికారు మనకి?”, “ఏం కంఠం, గానకోకిల!”

స్టేజ్ వెనక నారదుడు వీరమణి గురువుగారితో మాట్లాడ్డం మొదలుపెట్టాడు, “ఇదేమిటండీ త్యాగరాజ స్వామి పాట అలా మార్చేసారు?”
“ఎలా మార్చేసాం? మేము బాపు సినిమాలోదే కదా పాడినది?”

“సినిమా ఏవిటి? బాపు ఎవరు?” నారదుడు వెర్రిమొహం వేయడం చూసి అడిగింది వీరమణి గురువు,
“మీరో సత్తెకాలపు సత్తెయ్యలాగున్నారే? పంచరత్న కృతి అంటే తెలుసామీకు?”
నారదుడు దెబ్బతిన్నట్టు చూసాడు, “అదేవిటండీ, అలా అంటారు?
ఓంకార పంజర కీర పురహర సరోజభవ కేశవాదిరూప
వాసవరిపు జనకాంతక కలాధరాప్త కరుణాకర శరణాగత
జనపాలన సుమనోరమణ నిర్వికార నిగమసారతర
జగదానంద కారకా…..

అని కదా త్యాగరాజ కృతి? ఈ అమ్మాయి పాడినది త్యాగరాజ కృతి ఎలా అవుతుందీ?”

త్యాగరాజ కీర్తనలో చరణం గుక్కతిప్పుకోకుండా నారదుడు చెప్పేసరికి గురువూ, అక్కడే ఉన్న వీరమణీ కంగారు పడ్డారు. ఎవరికైనా ఇదంతా వినిపిస్తే తమ పరువు పోదూ? నారదుణ్ణి పక్క గదిలోకి తీసుకెళ్ళింది గురువుగారు, “చూడండి, మీరెవరో మరీ పాతకాలం సంగీతం మేష్టారిలా ఉన్నారు. ఇటువంటి అసలు సిసలు సంగీతం ఇప్పుడెవరూ నేర్చుకోవట్లేదు. ఓ పదిరోజులు సరిగమపదనిస ఆ తర్వాత పదిరోజులు సరళీస్వరాలు. మరో నెలలో మొదటి కచేరీ చేసి తీరవల్సిందే. లేకపోతే గురువుగారి పేరు ఎందుకూ పనికిరాదు. ఇది అసలే హైద్రాబాదు. మూడునెలల్లో ఎవరినైనా సరే రవీంద్రభారతిలో కచేరీ చేయించ గలిగినవాడే పనికొచ్చే గురువు. అసలు సిసలు త్యాగరాజ కీర్తనలు ఇప్పుడెవరూ పాడరు. పాడినా ఎవరికీ అర్ధం కావు. మీరైతే నోరు తిరక్కుండా అనగలిగేరు కానీ ఇప్పుడెవరికీ అంత ఓపికా కోరికా తీరికా లేవు. ఇది అసలే హై టెక్ యుగం. వీరమణి అంటే ఎవరనుకుంటున్నారు? బిజీ, బిజీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్! మేము పాడినది తప్పా ఒప్పా అనేది తెలుసుకోవాలంటే ఓ తెలుగు సినిమా చూడండి. ఇంక మేము వెళ్ళాలి. నమస్కారం.” సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంటే అదేదో బ్రహ్మ ప్రదార్ధం అయినట్టూ, ఆవిడ ఆకాశంలోంచి ఊడిపడ్డట్టూ చెప్పి వెనక్కి తిరక్కుండా వీరమణితో వెళ్ళిపోయింది గురువు నారదుణ్ణి అక్కడే వదిలేసి.

నారదుడు నోరుతెరిచి ఏదో అనబోయేలోపుల హనుమంతుడు ఆయన చుట్టూ చేయి వేసి బయటకి నడిపించుకొచ్చేడు. ఎందుకో నారదుడికి బాలమురళీ, భూమ్మీదకి వచ్చేముందు ఆయన అన్నమాటలు గుర్తొచ్చాయి. హనుమంతుడు నారదుణ్ణి రవీంద్ర భారతి దాటించి బిర్లా మందిర్ దగ్గిరకి తీసుకొచ్చేడు, మనఃశ్శాంతికోసం. పళ్ళ దుకాణాలూ, చెప్పుల స్టేండూ దాటి పైకి నడుస్తూంటే చెప్పాడు హనుమంతుడు నారదుడితో, “ఈ కచేరీ వల్ల బుర్ర పాడైంది కదా, ఇంతవరకూ వచ్చాము కనక అలా ఓ సారి అదిగో అల్లదిగో శ్రీహరి వాసంలో పైన అయ్యవార్ని చూసి వెళ్దాం.”

అన్నమయ్యని తల్చుకుంటూ నారదుడు హుషారుగా కొండమీదకి మెట్లు ఎక్కబోయేడు కానీ శనివారం అవడం వల్ల జనం వెనక్కి తోసేసారు నిర్దాక్షిణ్యంగా. మొత్తానికి మరో గంట కుస్తీ పట్టీ దర్శనం అయిందనిపించుకుని బయటకొచ్చారు. తర్వాత చూడవల్సింది వీరమణి గురువుగారు చెప్పినట్టూ ఓ సినిమా. అందులో తెలుగు సాహిత్యం అనబడే అద్భుతమైన పాటలూను. అందులోంచే కదా వీరమణి పాడినది పాట? దారిలో ఎవర్నో కుర్రాణ్ణి అడిగేరు “చూడ్డానికి ఏ సినిమా బాగుంటుంది? మంచి సినిమా ఏది” అనే విషయం.

కుర్రాడీ మధ్యనే ఏదో సినిమా చూసినట్టున్నాడేమో, వెంఠనే చెప్పేడు, “సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమా ఆడుతోంది. అందులో ఓ పాట విని తీరవల్సిందే, రాజ్యం గెలిసినోడు రాజవుతాడూ, రాజ్యం విడిసినోడు రామచంద్రుడూ.”

రామచంద్రుడనేసరికి హనుమంతులవారికి హుషార్ పుట్టూకొచ్చింది. వెంఠనే వెళ్ళి కుర్రాడు చెప్పిన సినిమా ఎక్కడాడుతోందో కనుక్కుని హాల్లో కూర్చున్నారు. సినిమా మొదలైనా పాట ఎప్పుడొస్తుందా అనే ఉత్కంఠ ఇద్దరికీను. కాసేపటికి అనుకున్న పాట రానే వచ్చింది,

రాజ్యం గెలిసినోడు రాజవుతాడూ, రాజ్యం విడిసినోడు రామచంద్రుడూ
యుద్ధం గెలిసేటోడు వీరుడు శూరుడూ, యుద్ధం ఇడిసేటోడే దేవుడూ
చలో చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చలో చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో…
పాట అలా నడుస్తూండగానే సినిమా హాల్లో చప్పట్లూ, ఈలలూ కేకలూను. రామచంద్రుడి పేరు పాటలో విని సినిమాకి రావడం ఎంత తప్పో ఇద్దరికీ అర్ధమైంది. ఎవర్నో అడిగితే చెప్పారు ఈ పాటలో కనిపించిన కుర్రాడు అలనాటి అల్లు రామలింగయ్యగారి ముద్దుల మనవడు!

పాట అయ్యేసరికి హనుమంతుడూ, నారదుడూ తలలు పట్టుకుని బయటకొచ్చేరు. రాత్రి అమృతాంజనం సీసా నుడిటి మీద పూర్తిగా రుద్ది వదిలితే గానీ పోలేదు ఇద్దరికీ పట్టిన తలనెప్పి. పొద్దున్నే హనుమంతుడు నారదుణ్ణి అడిగేడు “స్వామీ, మీరు త్రికాలజ్ఞలు. జనం అనేక భాషలు మాట్లాడ్డం విని ఉండొచ్చు. నాకైతే ఏదో రామనామం తప్ప ఏమీ తెలియదు. నిన్న రాత్రి పాటలో చలో చలో, లైఫ్ సే మిలో అనీ ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో అనీ విన్నాం కదా? అది తెలుగేనా?”

నారదుడు చెప్పేడు సమాధానం కాస్త గంభీరంగా, “వీరమణి గురువుగారు నిన్న చెప్పేరు విన్నావా? తెలుగనేది చచ్చిపోయి చాలాకాలమైంది. ఇప్పుడంతా ఇదో సంకర భాష. త్యాగరాజ కీర్తనని మార్పు చేసినట్టే ప్రతీ మూడు తెలుగు పదాలకీ ఒక ఇంగ్లీషు పదం చేర్చి తీరవల్సిందే. లేకపోతే ఎవరికీ అర్ధం కాదు. త్యాగరాజ కీర్తనలూ అన్నమయ్య పదాలూ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేవు ఇప్పుడంతా హై టెక్ యుగం, సాఫ్ట్ వేర్ ఇంజినీరింగూ అని చెప్పారు కదా? త్యాగరాజ స్వామి రోజులు వేరు ఇప్పుడు వేరు. నువ్వు అలాంటి ధర్మ సందేహం అడగరాదు నేను సమాధానం చెప్పరాదు.”

నారదుడి సమాధానం విని కాసేపు నోరు వెళ్ళబెట్టిన హనుమంతుడు తర్వాత అడిగేడు “అయితే ఈ రోజు ఏం చేద్దాం?”

“మరో చోట ఏదైనా మంచి కచేరీయో, సినిమానో దొరుకుతుందేమో చూద్దాం.”

కాసేపటికి రోడ్దుమీద కొచ్చిన ఇద్దరికీ ఓ జల్సా కుర్రాడు కనిపిస్తే నారదుడు ఆ కుర్రాణ్ణి ఆపి మంచి పాట ఉన్న సినిమా ఏదైనా ఉందేమో కనుక్కున్నాడు. కుర్రాడు అసలే ఇరవైఏళ్ళ వాడు. ఉరకలెత్తే ఉత్సాహంతో చెప్పేడు, “మీకు కొత్త సినిమాలూ, పాటలూ నచ్చట్లేదు కనక నేను చెప్పినట్టూ ‘మనుషులంతా ఒకటే’ అనే సినిమాకి వెళ్ళండి. అందులో ముత్యాలూ అనే పాట బాగుంటుంది. మీకు అల్లు గారి మనవడు నచ్చలేదు కనక అల్లుగారినే చూడొచ్చు!”

ముత్యాలు అనేసరికి అన్నమయ్య తన కీర్తనలో వాడిన “కంటి కంటి వాడే వాడే ఘనమైన ముత్యాలూ, కంఠమాలలవే పతకములునవే మింటి పొడవైనట్టిమించు కిరీటంబదే, జంటల వెలుగు శంఖ చక్రాలవే…” అనే ముత్యాలు కాబోలనుకుని ఈ సినిమాకి బయల్దేరారు ఇద్దరూ. హనుమంతుడికీ నారదుడికీ సినిమా ఎలాగా అక్కర్లేదు. కావాల్సింది పాట మాత్రమే కనక ఊరంతా తిరుగుతూ మొత్తానికి సినిమా హాలు దగ్గిరకొచ్చేరు. బయట జనంలో ఎవరో గొంతెత్తి పాడుతున్నాడు పాట.
లైటు తీసుకో భయ్యా, కాసేపు టెన్షన్సన్నీ లైటు తీసుకో భయ్యా…. ఒరె ఒరె ఒరె పతొక్క చూపూ తమ తమ పనులకి అతుక్కుపోయే, గల గల గల గలాట లేక విల విల విల దిల్ తరుక్కుపోయే… లైటు తీసుకో భయ్యా…

నారదుడు మొహం చిట్లించాడు ఈ కూతలు విని. కాసేపు అక్కడే బయట “ఇచ్చట పొగ తాగరాదు” అని రాసి ఉన్నచోట గుప్పు గుప్పు మని వచ్చే సిగరెట్ల పొగలో గడిపాక సినిమా మొదలౌతుంటే లోపలకి నడిచేరు. మరో అరగంటలో పాట మొదలైంది.
“ముత్యాలూ వస్తావా, అడిగిందీ ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ
చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయా”
……..
పెరిమినెంటుగాను నిన్ను చేసుకొంటాను.. ఉన్నదంత ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను
ఇంటా బయటా పట్టుకునుంటానూ.. అహా… ఒహో.. ఏహే.. ఏ..
ఏరుదాటిపోయాక తెప్ప తగల ఏస్తేను.. ఊరంతా తెలిసాక వదలి పెట్టి పోతేను
బండకేసి నిను బాదేస్తానయ్యో.. రేవులోన నిను ముంచేస్తానయ్యో…

సినిమాలో అల్లు రామలింగయ్యనీ జయలలిత నీ చూసి పాట అవకుండానే కళ్ళు తిరిగిపడిపోయిన నారదుణ్ణి ఎత్తుకుని బయటకి తీసుకొచ్చాక మొహం మీద నీళ్ళు జల్లితే లేచి అడిగేడు నారదుడు, “ఇప్పుడు నేనెక్కడున్నాను?”

హనుమంతుడు మాట మాట్లాడకుండా నారదుణ్ణి అక్కడ్నుంచి బయటకి తీసుకొచ్చాడు. ఇంత జరిగాక ఎక్కడికెళ్ళాలో, ఎవర్ని ఏమడగాలో తెలియని పరిస్థితి. పక్కనే ఎవర్నో కనుక్కుని ఓ రామాలయం దగ్గిర రెండు మూడు గంటలు గడిపాక నారదుడు చెప్పాడు, “హనుమా, మనం ఇంక ఈ సినిమాలు చూడ్డం దండగేమో ఆలోచించు.” రామాలయంలో అక్కడే కూర్చున్న పెద్దమనిషి వీళ్ళిద్దరితో మాటలు కలిపి రాబట్టేడు అసలు విషయం. తర్వాత తనకొచ్చిన సందేహం సంకోచంగా అడిగేడు, “రామలింగయ్య మనవడి పాటా చూసారు, రామలింగయ్య గారినీ చూసారు మరి ఈ మధ్యలో తరం వారి పాట చూడకుండా వెళ్ళిపోతే ఎలా? మూడు తరాల పాటలు చూస్తే బాగుండదూ?”

హనుమకీ నారదుడికీ ఇది నిజమేననిపించింది. ఇంతవరకూ వచ్చాక ఆ మిగిలినది కూడా చూసేస్తే పోలే? “సరే చెప్పండి అటువంటి సినిమా ఏదైనా ఉందా? మధ్యతరం ఆయన చేసినది?”

పెద్దమనిషి చెప్పాడు, “ఎందుకులేదు? ఈ మధ్యనే విడుదలైన అల్లు అల్లుడిగారి సరికొత్త బొమ్మ చూడవల్సిందే”

“ఏవిటి దానికున్న ప్రత్యేకత?”

“అల్లుడుగారు సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్ళారు కొంతకాలం క్రితం. అదేం దురదృష్టమో కానీ ఆయన పెట్టిన పార్టీ మట్టికొట్టుకు పోతే దాన్ని మరో పెద్ద పార్టీలో కలిపేసి అందులో మంత్రి పదవి సంపాదించారు. కానీ ఆ తర్వాత ఎన్నికల్లో ఆ పెద్ద పార్టీ నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. దాంతో ఇప్పుడు అల్లుడు గారు మళ్ళీ కొత్తగా సినిమాల్లోకి వచ్చారు. అలా తీసిన సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యి కాసుల వర్షం కురుస్తోంది. అందులో పాటలు అవీ నేను ముందు చెప్పేస్తే సస్పెన్సు పోతుంది. మీరే వెళ్ళి చూడండి. తెలుగు సాహిత్యం అంటే ఎంత అద్భుతంగా ఉందో అనేది అర్ధం అవుతుంది. దాన్ని ఇప్పుడు మాట్లాడే తెలుగులో “అదుర్స్” అనాలి. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే మీరిద్దరూ మరీ పల్లెటూరి బైతుల్లా కనిపిస్తున్నారు. పాటల్లో మీకు నచ్చితే సినిమా హాల్లోనే డాన్స్ చేయొచ్చు, “అదుర్స్, అదుర్స్” అని అరవొచ్చు. కానీ ఆ హీరో గారి మీద మాత్రం ఏమీ అనకండి. ఎవరైనా కాళ్ళో చేతులో విరగ్గొడితే ప్రమాదం.” ఏదో పనున్నట్టూ పెద్దమనిషి వెళ్ళిపోయాడు గుళ్ళోంచి బయటకి.

నారదుడు ఉన్న చోటునుంచే అరిచేడు పెద్దమనిషి వెళ్ళిపోతూంటే, “ఆ సినిమాలో పాట కూడా క్రితంసారిలాగే ముత్యాలు రాలుస్తుందా?”

పెద్దమనిషి వెనక్కి తిరిగి వంకరగా నవ్వుతూ చెప్పేడు, “చూడండి మీకే తెలుస్తుంది, తినబోతూ రుచులెందుకు?”

అలా పెద్దమనిషి మాట విని నారదుడు, వాయుపుత్రుడు సినిమా హాల్ దగ్గిరకొచ్చి పడ్డారు ఖైదీ నెంబర్ 150 సినిమా చూడ్డానికి. టికెట్లు దొరకడానికి రష్షు చూస్తే మరో మూడు నాలుగు రోజులదాకా దొరకవని తెలిసిపోతూనే ఉంది. హనుమంతుడు క్యూలో నిలబడి తన బలం చూపించి మొత్తానికి ఇద్దరికీ రెండు టికెట్లు సంపాదించి బయట పడ్డాడు. సినిమా మొదలయ్యేదాకా తెలియలేదు దీనికి ఇంత క్రేజ్ ఎందుకో. మొదట్లో హీరోగారు తెరమీద కనబడగానే ఈలలూ చప్పట్లూను. నారదుడు ఇదంతా మళ్ళీ ముత్యాలూ వస్తావా అనే పాటలా ఉంటుందేమో ఎలాగరా భగవంతుడా అనుకునేలోపునే పాట మొదలైపోయింది. హనుమంతుడూ, నారదుడూ తప్ప సీట్లలో కూర్చున్నవారెవరూ లేరు. పాట వస్తూంటే లేచి అక్కడే డేన్స్ చేస్తున్నారు. కొంతమంది సీట్లలోనూ, కిందా, కొంతమంది సీట్లమీద పైకెక్కీను. ఈ గోలలో అసలు పాట ఏవిటా అని నారదుడు చెవులు రిక్కించేడు.

బాస్ ఈజ్ బేక్… గెట్ రడీ ఫర్ డెడ్లీ డేన్స్… గెట్ రడీ
హొయ్…రత్తాలు రత్తాలు ఓసొసి రత్తాలు.. నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు…. రత్తాలు రత్తాలు ఓసొసి రత్తాలు.. నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు
… అందం చందం చెంగుమంటూ రావే తిరగరాసేద్దాం చట్టాలు నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు..
.. రావే రావే రత్తాలు.. … నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు…
… బాస్ ఈజ్ బేక్ గెట్ రడీ …..
యే…మై డియర్ బాస్ నువ్వు మాస్ ప్లస్ క్లాస్ నీ స్టైలు చూస్తే సింహమైనా నీతో దిగదా సెల్ఫీలు…
హే…..మిస్ యూనివర్స్ లాంటి నీ ఫీచర్సు చూస్తూ వుంటే రెచ్చిపొతాయ్ గుండెలోన గుర్రాలు…
నీ వాక్ చూస్తే ఓరయ్యో ఐ లూజ్ మై కంట్రోలు… నీ హీటు వుంటే చాలమ్మో… ఇక ఎందుకు పెట్రోలు…
నాకు నువ్వు నీకు నేను అప్పచెబుదాం పాఠాలు…
మాస్ డేన్స్ చేసేద్దాం రావే రావే…
హొయ్…రత్తాలు రత్తాలు ఓసొసి రత్తాలు.. నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు…. రత్తాలు రత్తాలు ఓసొసి రత్తాలు.. నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు ….
రత్తాలు …. రత్తాలు …
బాస్ ఈజ్ బేక్ గెట్ రడీ , గెట్ రడీ …..

పాట అవగానే పక్కసీట్లో నారదుడెలా ఉన్నాడా అని చూడబోయిన హనుమంతుడికి నారదుడు నేలమీద స్పృహ తప్పి పడిపోయి ఉండడం కనిపించింది. అలా పడడంలో ఒకటో రెండో పళ్ళు ఊడినట్టున్నాయి రక్తం కారుతోంది నోట్లోంచి. నారదుణ్ణి ఎవరైనా కొట్టారేమో వాణ్ణి చంపిపారేద్దాం అనుకున్న హనుమంతుడికి తమకి ఆమడదూరంలో ఎవరూ లేకపోవడం, ఉన్నవాళ్ళందరూ మాస్ డేన్స్ చేస్తూండడం కనిపించింది. ముక్కు దగ్గిర వేలుపెట్టి చూసి వెంఠనే నారదుణ్ణి ఎత్తి భుజం మీద వేసుకుని ఆటోలో గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు హనుమంతుడు.

“అబ్బే ఇంత సీరియస్ కేసు మేము చూడం. మరోచోటకి తీసుకెళ్ళండి,” డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ డాక్టర్ చెప్పేడు కాళ్ళు టేబిల్ మీదనుంచి తీయకుండా, చుట్టూ ఉన్న నర్సమ్మల్తో పరాచికాలాడుతూ.

అలా అపోలో హాస్పిటల్లో నారదుడు ఎడ్మిట్ చేయబడ్డాడు. ఎన్ని డబ్బులు లాగడం అన్నది ముఖ్యం గానీ పేషెంటు బతికాడా పోయాడా అనేది అంత ఇంపార్టంట్ కాదు కనక ముక్కులోకి గొట్టాలు దింపీ, చేతుల్లోంచి సూదుల్తో సెలైన్ పంపీ మొత్తానికి మూడుగంటల్లో అయిపోయే పనిని రెండురోజులు లాగి లాగి నారదుణ్ణి మామూలు మనిషిని చేసారు కానీ ఊడిపోయిన పళ్ళు సరిచేయడాకి ఇంకా డెంటిస్టు ఒకడు రావాల్సి ఉంది.
అలాగ మూడోరోజు డెంటిస్టు యాంగ్ సున్ గారు చిన్నగా విజిల్ వేసుకుంటూ వచ్చారు. ఎందుకో నారదుడికి ఆయన్ని చూడగానే గౌరవం అంకురించింది. సున్ గారి గదిలోకి నారదుణ్ణి తీసుకెళ్ళేసరికి ఆయన సిడిలో ఏదో పాట వింటున్నట్టున్నాడు; అది కట్టేసి, “రండ్రండి” అంటు శుద్ధమైన తెలుగులో ఆహ్వానించేడు. ఉత్తరోత్తరా తెలిసిన విషయాలు వింటే నారదుడికీ హనుమంతులవారికీ మతిపోయినంత పనైంది. తైవాన్ నుంచి సున్ గారి తల్లీ, తండ్రీ విజయవాడ వచ్చేర్ట ఈయన పుట్టకముందు. ఈ యాంగ్ సున్ గారు విజయవాడలో పుట్టి తెలుగునాటే డెంటిస్ట్రీ చదువుకున్నాడు; తెలుగు నేర్చుకుని తెలుగు సినిమాలు చూస్తూను. మన ఒకప్పటి నటసార్వభౌముడికీ, మాయాబజారు సినిమాల్లాంటివాటికీ ఎంతటి అపర భక్తుడంటే పక్కన సిడిలోంచి మంచి తెలుగు పాటలు రాకపోతే రోజువారి పన్నులు పీకడం కూడా చేయలేడు.

నారదుడి ఊడిపోయిన పళ్ళు కట్టడానికి మొత్తం మీద మరో రోజు పట్టేక నారదుడూ హనుమంతుడూ చూసిన ఈ సినిమాల సంగతి మాటల్లో సున్ గారే రాబట్టేడు – ఏయే సినిమాలు చూసారూ, ఎలా భంగపడ్డారూ అనేది. ఆయన్ని విడిచి వస్తూంటే ఆయన ఉచిత సలహా పారేశాడు, “మీలాంటి సున్నిత మనస్కులు ఇప్పుడిలాంటి సినిమాలూ, సంగీత కచేరీలు చూడరాదు. నేను చెప్పిన సినిమా చూడండి మీకు నచ్చుతుంది అంటూ సినిమా పేరూ అది ఎక్కడ ఆడుతోందో, ఎలా వెళ్ళాలో అన్నీ చెప్పాడు.

అది కూడా ఇలాగే ముత్యాలూ, రత్తాలూ అనేలాగ ఉంటుందనే భయంతో నారదుడు వణకడం చూసి ఆయనే చెప్పేడు నవ్వుతూ, “కంగారు పడకండి. నేనూ మీలాంటి సున్నితం గాణ్ణే. ఇప్పుడు వచ్చే సినిమాలు చూడ్డం మానేసి పాత సంగీతం మాత్రం విటున్నాను. అప్పుడప్పుడు ఇదే నా దగ్గిరున్న ఫిడేలు మీద వాయించడానికి ప్రయత్నం చేస్తాననుకోండి కానీ అంత బాగా రాదు. ఏం చేస్తాం?”

“ఇదే నేను చూడబోయే ఆఖరి సినిమా,” హనుమంతుల వారూ నారదులవారూ ఒకేసారి అరిచేరు ఒకరికి తెలియకుండా ఒకరు.

“నాదీ భరోసా,” వెళ్ళండి ఏమీ ఫర్వాలేదు.” సున్ గారు తన ఆఫీసులోకి మాయమైపోయేడు.

“ఔరా, స్వంత తెలుగు వాళ్ళు పట్టించుకోని తమ తెలుగు సాహిత్యాన్ని ఒక తైవాన్ డెంటిస్టు పట్టింఛుకుంటున్నాడంటే ఏం విచిత్రం?” అనుకుంటూ ఇద్దరూ బయల్దేరారు సినిమాకి.

హాలు బయటనే బోర్డు ఉంది, “నర్తనశాల, ఈ రోజే ఆఖరి ఆట”

లోపలకి వెళ్ళేసరికి మొత్తం హాలంతా ఖాళీగా ఉంది. వీళ్ళీద్దరే కాబోలు టికెట్లు కొన్నది. త్వరలోనే మంచి పాట వినబడింది ఇద్దరికీ.

సలలిత రాగ సుధా రస సారం, సర్వ కళామయ నాట్య విహారం
మంజుల సౌరభ సుమకుంజముల, రంజిలు మధుకర మృదు ఝుంకారం….. సలలిత!!
కల్పనలో ఊహించిన హొయలు శిల్పమనోహర రూపమునొందీ
పదకరణములా మృదుభంగిమలా ముద మారలయమీరు నటనాల సాగె….. సలలిత !!

…..
భువిలో దివిలో రవళింపగా, పదపమపా సనిదామద
నాట్యము తెలిపె నటరాయని నాట్యము తెలిపె నటరాయని ఆనంద లీలా వినోదమే….
సలలిత రాగ సుధా రస సారం, సర్వ కళామయ నాట్య విహారం

సినిమా అయిపోయాక బయటకొచ్చారు ఇద్దరూ. లైటు తీసుకో భయ్యా, ముత్యాలూ, రత్తాలూ అన్నీ మనసులోంచి పోయి మంచి పాట – అదీ తెలుగు సినిమాలో వచ్చే తెలుగు పాట – విన్నామన్న అనుభూతి ఏదో మనసులో ఆవరించుకుంది. అన్నం అంతా ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు నొక్కి చూస్తే చాలన్నట్టూ, ఇప్పుడు చూసిన సినిమాలు చాలు ప్రస్తుతం సంగీతం ఎలా ఉందో తెలియడానికి ఇంక వెళ్దాం అనుకుంటూ ఇద్దరూ వైకుంఠానికి బయల్దేరారు, భూమ్మీద వాసనలు అక్కడే వదిలేసి, యాంగ్ సున్ గారిని మనసులోనే అభినందిస్తూ.

వైకుంఠానికి వెళ్ళే దారిలో నారదుడు అడిగేడు హనుమంతుణ్ణి, “ఈ నర్తనసాల సినిమాలో పాట ఎవరయ్యా అంత బాగా పాడినది?”
“ఇంకెవరూ? మనని ఇలా భూమ్మీదకి వెళ్ళి సంగీతం, ఇప్పుడు వస్తూన్న అద్భుతమైన తెలుగు సాహిత్యం చూసి, విని తెలుసుకోమని చెప్పిన ఆ బాలమురళీ గారే!”

“అవునా? గట్టివాడే, ఇలా మనకి పరోక్షంగా చూపించాడన్నమాట ఇక్కడి పరిస్థితులు,” బిగ్గరగా నవ్వుతూ నారదుడు హనుమంతుణ్ణి అనుసరించాడు జగన్నాధుడికి తాము చూసి వచ్చినది ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ.

ఎందుకో చటుక్కున తాను మొదట్లో భూమ్మీదకి వెళ్తానంటే హనుమంతుణ్ణి తీసుకెళ్ళమని మహావిష్ణువు అన్నప్పుడు అమ్మవారు కిసుక్కున నవ్విన నవ్వు గుర్తొచ్చింది నారదుడికి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked