– సింహాద్రి (జ్యోతిర్మయి)
ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు!
(మనబడి బంధువు వ్రాసిన అద్భుత సాహిత్య ప్రక్రియ. అక్షరమాలతో తెలుగు వెలుగును చిందే తేటగీతులు)
1.తే. గీ.
అ మ్మ జోలపాటకు సమమైన తెలుగు
ఆ వు పాల కమ్మదనము లమరు తెలుగు
ఇ టలి భాషతో సమమని ఎనయు తెలుగు
ఈ డులేని మాధుర్యపు ఇంపు తెలుగు.
2.తే. గీ.
ఉ గ్గు పాలతో అబ్బెడి ఊసు తెలుగు
ఊ హకు తొలిపలుకు నేర్పు ఒజ్జ తెలుగు
ఋ ణము దీర్పలేము జనని ఇడిన తెలుగు
ఋా తొ మొదలగు పదముల నిడని తెలుగు.
3.తే. గీ.
ఎ న్న భాషల లోకెల్ల మిన్న తెలుగు
ఏ టి గలగల వినిపించు తేట తెలుగు
ఐ క మత్యాన ప్రాంతీయ ఆస్తి తెలుగు
ఒ. రుల భాషకు అచ్చుల ఊత తెలుగు
4.తే.గీ.
ఓ పు చుండె నిర్లక్ష్యము చూప తెలుగు
ఔ ర సహనాన భూదేవి, అమ్మ తెలుగు
అం త మవనీకు భవితపై ఆశ తెలుగు
అః వలదు నాకనకు మన ఆత్మ తెలుగు.
5.తే. గీ.
క. వన సామ్రాజ్య విభవమ్ము గన్న తెలుగు
ఖంగుమను బుర్రకథ వేయు ఛెంగు తెలుగు
గ తపు మన ప్రౌఢ కావ్యంపు గరిమ తెలుగు
ఘ నత గల అవధానంపు గడుసు తెలుగు
6.తే.గీ.
చ తుర చాటు పద్యమ్ముల చరిత తెలుగు
ఛ టల వెల్గు ప్రబంధాల సవిత తెలుగు
జ నులు పాడు జానపదాల జలధి తెలుగు
ఝ రుల తుళ్ళింత లిడియాడు ఝషము తెలుగు.
7.తే. గీ.
ట ముకు చాటించు విఖ్యాతి కొమరు తెలుగు
ఠ వర కవిలోక కంఠంపు రవళి తెలుగు
డ. గ్గరించిన ఆంగ్లంపు డాగు తెలుగు
ఢ క్క పగిలించు శ్రీ నాథ డమరు తెలుగు
8.తే. గీ.
త. ళుకు రేకుల శోభించు తమ్మి తెలుగు
థ. యను వర్ణ మారంభపు త్యక్త తెలుగు
ద ప్పి దీర్చెడి సాహిత్య దరియె తెలుగు
ధ వళ దరహాస భాసురా దయిత తెలుగు
9.తే. గీ.
న లువ చెలువకు సిగపువ్వు నాదు తెలుగు
ప. లుకు పలుకున పూదేనె లొలుకు తెలుగు
ఫ ణితి సురభాష దీటైన పదము తెలుగు
బ మ్మెర సుశబ్ద యుత ముద్దు గుమ్మ తెలుగు.
10.తే. గీ.
భ రత ఖండాన నుప్పొంగు పాడి తెలుగు
మ దిని రసడోల లూగించు మధువు తెలుగు
య క్ష గానాల విలసిల్లు యశము తెలుగు
ర సన చవులూర జాలించు రసము తెలుగు
11.తే. గీ.
ఱ ట్టు పడనీని వ్యంగ్యార్థ గుట్టు తెలుగు
ల లిత పదబంధ లాస్యంపు లతిక తెలుగు
వ డుకు చిక్కని భావాల పడుగు తెలుగు
శ తక పద్యాల ముత్యాల సరము తెలుగు
12.తే. గీ.
ష. ట్పదము చేయు ఝంకార సడియె తెలుగు
స. సహజ వైచిత్రి శతవిధా చాటు తెలుగు
హ. ల్లు చేయూత వినసొంపు హాయి తెలుగు
క్ష. తము కానీక బ్రోవు నీ బ్రతుకు తెలుగు