ధారావాహికలు

అన్నమయ్య శృంగార నీరాజనం

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

కరేణ కిం మాం గృహీతుం

ఇది ఒక సంస్కృత శృంగార సంకీర్తన. అమ్మ పద్మావతి శ్రీనివాసునితో సరసమాడుతూ, దశావతార వర్ణన చేస్తున్నది. ఆ విశేషాలు చూద్దాం.

కీర్తన:
పల్లవి: కరేణ కిం మాం గృహీతుం తే
హరే ఫణిశయ్యా సంభోగ ॥పల్లవి॥
చ.1. జలే తవ సంచరణ మిహాధస్
స్థలే భవనం తవ సంతతం
బలె రూప ప్రకటన మతులా
చలే స్థానం చల చల రమణా ॥కరేణ॥
చ.2. పదే భువన ప్రామాణ్యం తవ
హ్రదే ప్రచుర విహరణ మిదం
ముదేమునీనాం మోహనం తనుం
మదే తవ నర్మ చ మాం విసృజ ॥కరేణ॥
చ.3. స్మరే విజయ స్తవ విమలతురగ
ఖురే రతిసంకుల రచన
పురే తవ విస్ఫురణం వేంకట
గిరే:పతే తే ఖేలాఘటిత ॥కరేణ॥
(రాగం: ఆహిరి, రేకు 40-6; సం.6-171)
విశ్లేషణ:
పల్లవి: కరేణ కిం మాం గృహీతుం తే
హరే ఫణిశయ్యా సంభోగ
ఓ శ్రీహరీ! క్షీర సాగరంలో శేషశయనుడవై, జలసంచరణంతో, అందరిని ఈ సంసార సాగరం నుండి తరింపజేస్తున్న నాధా! నా చేయి పట్టుకోడానికి వచ్చావు కదా! అని అమ్మ అంటోంది.

చ.1. జలే తవ సంచరణ మిహాధస్
స్థలే భవనం తవ సంతతం
బలె రూప ప్రకటన మతులా
చలే స్థానం చల చల రమణా
ఇక్కడ నీటిలోపలే నీవు చరించడం, అక్కడే స్థిర నివాసమేర్పరుచుకోవడం, శౌర్యంతో నీ లీలలను చూపడం అనే విషయాలు ఒకదానికొకటి ఎక్కడా పొంతన లేనివిగా కనిపిస్తున్నాయి.
చ.2. పదే భువన ప్రామాణ్యం తవ
హ్రదే ప్రచుర విహరణ మిదం
ముదేమునీనాం మోహనం తనుం
మదే తవ నర్మ చ మాం విసృజ
నీ మూడడుగులతోనే ముల్లోకాలను చుట్టేశావు. ఎందరో చక్రవర్తుల రక్తపు మడుగుల్లో ఆనందంగా విహరించావు. మునుల సంతోషానికై చక్కని రూపాన్ని ధరించావు. నీ మధుసేవనంతో మత్తెకించావు. నన్ను పట్టుకోకు. విడచిపెట్టు.
చ.3. స్మరే విజయ స్తవ విమలతురగ
ఖురే రతిసంకుల రచన
పురే తవ విస్ఫురణం వేంకట
గిరే:పతే తే ఖేలాఘటిత

నీకు యువతులతో గొల్లెతలతో భోగవిలాసాలతో జీవించావు. రతి విహారం చెయ్యడంలో మంచి ప్రావీణ్యం ఉన్నది. నీవధిరోహించే గుర్రం వాహనం యొక్క గుర్రపు డెక్కలలో భక్తి భావాన్ని అనుసరించే అద్భుత శక్తి ఉంది. నీ లీలా విహారంలో నాకు అవతారస్ఫూర్తి కనుపిస్తున్నది. ఓ శ్రీనివాసా నీలీలలు అత్యంత మనోహరమైనవి.

విశేషాంశాలు: జలసంచరణం అనే పదంతో మత్స్యావతారాన్ని, అధస్థలే భవనం అనే పదం ద్వారా కూర్మావతారాన్ని మరియూ భూమి ఉద్ధరణతో వరాహవతారాన్ని, శౌర్యం గురించి చెప్పడం నరసింహావతారాన్ని, మూడడుగులతో ముల్లోకాలను కొలిచావనడం వామనావతారాన్ని, రక్తం మడుగులో వీరోచిత పోరాటం అనడం పరశురామావతరాన్ని, మునులకు సంతోషం కలిగించడం రామావతారాన్ని, మధుసేవనం బలరామావతారాన్ని, యువతులతో కామ లీలా విహారం చెప్పి బుద్ధావతారాన్ని, గుర్రపుడెక్కల భక్తిభావం కల్క్యావతారాన్ని స్ఫురింపజేస్తున్నది.

ముఖ్య అర్ధములు: చలరమణ = సంసారంలో అందరిని తరింపజేసేవాడు; ఫణిశయ్యా = ఆదిశెషుని పడగలమీద; గృహీతం = పట్టుకోవడానికి; సంచరణం = చరించడం; అతుల = సాటిలేని; పదే = పాదాలతో; భువన ప్రామాణ్యం = ముల్లోకాలను కొలవడం; హ్రదే = రాజుల నెత్తురు మడుగుల్లో; మునీనాం ముదే = మునుల ఆనందానికై; మదే = మదుపానీయంతో; నర్మచ = సుఖంపొందడం కోసం; విసృజ = విడచిపెట్టు; విమల తురగ ఖురే = నీ గుర్రపు డెక్కల యందు; విస్ఫురణం = స్ఫూర్తి గోచరమవడం.
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked