ధారావాహికలు

అమెరికా ఉద్యోగ విజయాలు-2

సత్యం మందపాటి చెబుతున్న
ముఖాముఖీయం

కృష్ణ ఆదివారం మధ్యాహ్నం ఖాళీగా కూర్చుని బేస్బాల్ గేమ్ చూస్తుండగా ఫోన్ మ్రోగింది.
అర్జున్ పిలుస్తున్నాడు.
ఆ ఆట కూడా ఎటూ తెగకుండా నెమ్మదిగా నడుస్తుంటే బోరు కొట్టి, వెంటనే ఫోన్ తీసుకున్నాడు కృష్ణ.
‘నేను బావా.. అర్జున్ని’
‘అవును. కాల్ ఐడీలో చూశాను. ఏదన్నా శుభవార్త వుందా?’ అడిగాడు కృష్ణ.
‘నువ్వు చెప్పినట్టే రెస్యూమే తయారుచేసి నాకు తెలిసిన, తెలియని కంపెనీల అన్ని సైట్లలోనూ అప్లోడ్ చేశాను. మా నాన్న అంటుండేవాడు పది రాళ్ళు వేస్తే, ఒకటైనా తగలక పోదా అని’
‘అవును మా పాండురంగం మామయ్య, అదే మీ నాన్న, ముందు రాళ్ళ వ్యాపారం చేసేవాడులే. అందుకనే అలా చెప్పుంటాడు. ఆ వ్యాపారంలో దివాలా తీశాకనే గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాడు! అవన్నీ ఇప్పుడు ఎందుకుగానీ, ఎన్ని రాళ్ళు తగిలాయి ఇప్పటికి?’ అడిగాడు కృష్ణ నవ్వుతూ.
‘బాగానే తగిలాయి. ముగ్గురు పిలిచి ఫోన్ ఇంటర్వూ చేశారు. నువ్వు చెప్పినట్టు రెస్యూమే తయారు చేయటం దగ్గరనించీ, ఫోన్ ఇంటర్వూ దాకా తూచా తప్పకుండా అలాగే చేశాను. వాళ్ళు ఇంకా ఒకరిద్దరితో మాట్ల్లాడి, ఫేస్ టు ఫేస్ ఇంటర్వూకి పిలిచేదీ, లేనిదీ చెబుతామన్నారు’
‘నీ ఉద్దేశ్యంలో వాళ్లు పిలుస్తారంటావా, లేదా’ అడిగాడు కృష్ణ.
‘ఏమో.. మాట్లాడటం మరి బాగానే మాట్లాడారు. తర్వాత ఎలా వుంటుందో…’ అన్నాడు అర్జున్.

‘ఆశ జీవితానికి శ్వాస అన్నారు ప్రముఖ సాహితీవేత్త ఆరుద్రగారు. మనకి కావలసింది ఒక్క ఉద్యోగం. రాకుండా ఎలా వుంటుంది’ అన్నాడు కృష్ణ.
‘ఒకవేళ ఇంటర్వ్యూకి పిలిస్తే, ఎలా మాట్లాడాలో ఏం చెప్పాలో చెప్పు బావా. మన భారతదేశంలో కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాల ఇంటర్యూలకి వెళ్ళాను. కౌరవుల వందమందిలో దుర్యోధనుడి అరవై ఆరో తమ్ముడి పేరు ఏమిటిలాటి పిచ్చి ప్రశ్నలు అడుగుతారు. అడిగేవాడికి కూడా అది తెలియదని నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం, అడిగేవాడికి చెప్పే వాడు లోకువ కదా!’
‘అవును. గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా అలాటి చెత్త ప్రశ్నలు అడగరు ఇక్కడ. ఇక్కడ దాదాపు అన్నీ ప్రైవేట్ కంపెనీలే కదా. వాళ్ళు ఇవ్వబోయో ఉద్యోగం నువ్వు చేయగలవా లేదా అనే చూస్తారు కానీ టామ్ హాంక్స్ పుట్టినరోజు ఎప్పుడు, సెంటీపీడుకి కాళ్ళు ఎన్ని వుంటాయి అని ఎవరూ అడగరు’ అన్నాడు కృష్ణ.
‘అవునులే. కానీ ఇదిగో ఇదీ నువ్వు ఉద్యోగంలో చేయాల్సింది. చేయగలవా అని అడిగితే అందరూ చేయగలమనే అంటారు కదా.. నాకు చేత కాదు, నాకీ ఉద్యోగం వద్దు అని అనరుగదా..’ అన్నాడు అర్జున్.

‘బాగా చెప్పావు బావా.. బావేమిటి? నాకంటే చిన్నవాడివి కదా, ఇకనించీ బామ్మరిది అంటానులే. మంచి ప్రశ్నే అడిగావు బామ్మరిదీ. నేను రిటైర్ అయాక క్వాలిటీ, లీన్ మాన్యుఫాక్త్యరింగ్, హెచ్ ఆర్ మొదలైన వాటిల్లో కన్సల్టింగ్ చేస్తున్నాను కదా. వాటిల్లో ఒకటి హ్యూమన్ రిసోర్సెస్ ట్రైనింగులో ఇంటర్వూ చేసే మానేజర్లకి నేనిదే చెబుతుంటాను. ఇప్పుడు ఇలాటి అర్ధం లేని ప్రశ్నలు కొంతమంది చేతకాని వాళ్ళు అడుగుతారు కానీ, ఇంటర్వ్యూ ఎలా చేయటమో ట్రైనింగ్ తీసుకుని, బిహేవిరల్ ఇంటర్వూల పధ్ధతిలో చేసే వాళ్ళు అలా అడగరు. నేను చూస్తున్నాగా ఎన్నో పెద్ద కంపెనీలలో నేను చెప్పిన బిహేవిరల్ ఇంటర్వూ పధ్ధతిలోనే చేస్తున్నారు ఇప్పుడు. ఇంటర్నెట్లో గూగులమ్మని అడిగి చూడు. ఆవిడే చెబుతుంది ఈ బిహేవిరల్ ఇంటర్వూ కథా కమామిషులు ఏమిటో’ అన్నాడు కృష్ణ.
‘బిహేవిరల్ ఇంటర్వ్యూనా.. ఎప్పుడూ వినలేదే. అదెలా వుంటుంది?’ అడిగాడు అర్జున్.
‘అంటే నీ ఉద్యోగరంగంలో ఒక సమస్యని ఇచ్చి, దాన్ని నువ్వు ఎలా ఎదుర్కుంటావో, ఎలా బాగు పరుస్తావో చెప్పమని అడిగి, నీ మాటలు వినటానికి సిధ్ధంగా కూర్చుంటారన్నమాట’
‘నాకు సరిగ్గా అర్ధం కాలేదు. ఒక ఉదాహరణతో చెప్పు బావా’ అన్నాడు అర్జున్.

కొంచెం ఆలోచించి అన్నాడు కృష్ణ. ‘సరే.. ఒకే రంగానికే పరిమితం కాకుండా, చాల రంగాలకు పనికివచ్చే ఒక జనరల్ ఉదాహరణ చెబుతాను. నిన్ను ఒక ప్రాజెక్ట్ గ్రూపులో ఇంజనీరుగా తీసుకుంటున్నారనుకో. నువ్వు ఒక టీం ప్లేయరుగా వుండటం అవసరం. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా, ఆ ప్రాజక్టులో వున్న అందరూ ఒకరితో ఒకరు సహకరించి ముందుకు తీసుకువెడితేనే, అది అనుకున్న సమయానికి సక్రమంగా పూర్తవుతుంది. మీ ప్రాజెక్టులో వున్న పదిమందీ ఒక పిరమిడ్ లాగా నుంచునప్పడు, ఏ ఒక్కరు దానిని నిలపలేక పోయినా, మొత్తం కూలిపోతుంది. అదన్నమాట. అది చెప్పి, నీ ప్రాజెక్టులో వున్న వారిలో రకరకాల మనుష్యులు, వారి రకరకాల ప్రవర్తనలూ చెబుతారు. కొంతమంది చక్కగా ఇచ్చిన సమయం ప్రకారం చేసేవాళ్ళు, కొంతమంది ఇష్టులూ, కొంతమంది బధ్ధకిష్టులూ, కొంతమంది ప్రతి చిన్న విషయానికీ అడ్డం వచ్చేవాళ్ళు.. ఇంగ్లీషులో చెప్పాలంటే, గుడ్, బాడ్ అండ్ అగ్లీ ప్రవర్తనతో వుండేవాళ్ళతో నువ్వు ఎలా పని చేస్తావు, నీ పని ఎలా పూర్తి చేస్తావు, మిగతా వాళ్ళని నీ వేపుకి ఎలా తిప్పుకుంటావు అని.. అడుగుతారు. అడిగి నీ ముఖం చూస్తూ, కుర్చీలో వెనక్కి వాలి, చెవులు రిక్కించుకుని కూర్చుంటారు. అదన్నమాట’ ఆగాడు కృష్ణ.
‘అమ్మో.. మరెలా.. ఆ టీములో వాళ్ళు కదలమని మొండికేస్తే నేనేం చేస్తాను? నాకు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారో ఎలా చేస్తారో కూడా తెలియదాయ..‘ అడిగాడు అర్జున్.

చిన్నగా నవ్వాడు. ‘అది అంత కష్టమేమీ కాదు. చెప్పే ముందు.. ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఒక కంపెనీకి ఇంటర్వూకి వెళ్ళేటప్పుడు, ముందుగా ఆ కంపెనీ వెబ్ సైటుకి వెళ్ళి ఆ కంపెనీ గురించీ, వారి ప్రాసెసుల గురించీ, ప్రాడక్టుల గురించీ.. ఒకటేమిటి అక్కడ వున్నవన్నీ తెలుసుకోవటం చాల అవసరం. అది ఇంటర్వూలో ఎంతో ఉపయోగ పడుతుంది. ఇహ.. అలాటి సమస్యకు నువ్వెలా స్పందిస్తావు అని చూస్తారు. అలాటి సమస్యలో నువ్వు నిజంగా ఇరుక్కుంటే, నీ ప్రవర్తన ఎలా వుంటుందో తెలుసుకోవాలనుకుంటారు. అంతేకానీ నువ్వు వెళ్ళి ఒక మంత్రదండం వూపి అన్నిటినీ సవ్యంగా పరిష్కరించి, అందరినీ అధిగమించేస్తావని కాదు. ఉదాహరణకి నువ్వు మీటింగుల్లోనూ, వేరువేరుగా మిగతా టీం సభ్యులతోనూ, టీం లీడర్లతోనూ, ఆ ప్రాజెక్ట్ సమయానికి అనుకున్న బడ్జెట్లో పూర్తవకపోతే ఎన్ని కష్టనష్టాలకు మీ కంపెనీ గురవుతుందో చెబుతాననీ, ఎవరికైనా కొంచెం వెనకపడితే, వారికి ఏదైనా అవసరం వస్తే, మిగతా వారిలో కొంచేం సమయం వున్నవారు ఆ పనిని భర్తీ చేస్తామనీ, తనవల్ల ఏమీ కాకపోతే ప్రాజెక్ట్ మానేజర్నో, డైరెక్టర్నో కలిసి చర్చిస్తాననీ.. ఇలాటివి చెబితే చాలు. ఇది ఇంటర్వూనే కనుక, వాళ్ళు నీ పూర్తి పరిష్కారం కోసం చూడరు. ఇలాటి వాటి పరిష్కారం కోసం నీ ఆలోచన, నీ ప్రవర్తన ఎలా వుంటుంది అని చూస్తారు, అంతే’
‘అమ్మయ్య.. అంతే కదా.. అలాటివి చెప్పగలనులే..” అని ఊపిరి పీల్చుకున్నాడు అర్జున్.

‘ఇంకొక విషయం. ప్రతి ఇంటర్వూలోనూ సాధారణంగా అడిగే ప్రశ్న ఇంకోటి వుంది. నీకు వున్న బలాలు బలహీనతలు ఏమిటి అని. అంటే ఆ ఉద్యోగం చేయటానికి నీకు వున్న Strengths and Weaknesses ఏమిటి అని. చాలమంది, ముఖ్యంగా మనవాళ్ళు, వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవటానికి సిగ్గు పడతారు. కొన్ని బిలియన్ డాలర్ల వ్యాపారం చేసే కోకోకోలా కంపెనీ కూడా, ప్రతి ఏటా ఎన్నో మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి తమ గురించి ప్రకటనలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటుంది. అటువంటప్పుడు, ఉచితంగా అడిగినప్పుడు కూడా మన గురించి మనం, మానవమాత్రులం, చెప్పుకోకపోతే ఎలా? కాకపోతే ఒకటో రెండో నీకు నీలో బాగా నచ్చినవి చెప్పు. ప్రపంచ అందాల సుందరి పోటీలో, ఇదే ప్రశ్నకి వాళ్ళు, అదేమిటో తెలియకపోయినా ‘World Peace’ అని చెప్పటం మనం చూస్తూనే వున్నాం కదూ. అలాగే, నాది Positive Attitude అనో, నేను గొప్ప Team Playerని అనో, చక్కటి Analystని అనో చెబితే నీకు కిరీటం పెట్టే అవకాశాలు ఎక్కువ. అలాగే Weaknesses అనగానే, నీకు తెలియనివన్నీ పెద్ద లిస్ట్ ఇవ్వకు. సిగ్గుపడి ‘అబ్బే, నాకేమీ తెలియదు’ అని తల వంచుకోకు. కట్టె విరగకుండా, పాము చావకుండా చెప్పు. అది ఎలాగంటే, ‘నాకు చాల ప్రాసెస్ నాలెడ్జ్ వుంది కానీ, మీరు తయారు చేసే ప్రాడక్టుల గురించి ఇంకొంచెం తెలుసుకుంటే బాగుంటుంది’ లాటివి. అర్ధమయిందా?’ అడిగాడు కృష్ణ.
‘ఓ యస్. బాగా అర్ధమయింది. నేను ఏం చెప్పాలో ముందుగానే ప్లాన్ చేసుకుని సిధ్ధంగా వుంటాను’ అన్నాడు అర్జున్.
‘నువ్వు ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణగారి పేరు ఎప్పుడైనా విన్నావా?’ అడిగాడు కృష్ణ.

నవ్వాడు అర్జున్. ‘అదేమిటి బావా. ఆయన పుస్తకాలు చదువుతూ పెరిగాను. ఆయన నాఅభిమాన రచయిత కూడాను. నేను ఇంజనీరింగ్ కాలేజీదాకా తెలుగు మాధ్యమంలోనూ, తర్వాత ఇంగ్లీష్ మీడియంలోనూ చదివాను. రెండు భాషల్లోనూ ఎన్నో పుస్తకాలు చదివాను’ అన్నాడు అర్జున్.

‘శహభాష్. నా బామ్మరిదివనిపించావు. రమణగారిది ఒక జోకు వుంది. అనగాఅనగా ఒక చిన్న వూరిలోని ఒకాయన భార్యతో మొట్టమొదటిసారిగా అమెరికా వెళ్ళి వచ్చాడు. ఆరోజుల్లో అసలు అమెరికా వెళ్ళేవారే చాల తక్కువ. అందుకని కొందరు పెద్దలు ఆయన్ని సభాముహంగా సన్మానించారు. అమెరికా గురించి నాలుగు మాటలు చెప్పమన్నారు. ఆయనకి అవకాశం వస్తే ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా, నోటికి వచ్చినట్టు వాగుతుంటాడు. ఆయన అమెరికాని తెగ పొడుగుతూ నేను చూసిన వైట్ హౌస్ బిల్డింగ్ ఒక మైలు పొడుగు, రెండు మైళ్ళు వెడల్పు.. అంటుండగానే పక్కనే కూర్చున్న భార్య ఈయన అతివాగుడు చూసి, కాలితో ఆయన కాలిని ఫెడేల్మని తన్నింది. ఆయన వెంటనే దారి తప్పుతున్నానని గ్రహించి.. వైట్ హౌస్ ఎత్తు మాత్రం ఆరంగుళాలే అన్నాడుట’
అర్జున్ పకపకా నవ్వి, నవ్వటం అయిపోయాక ‘అవును. నేను కూడా చదివాను ఆ జోకుని. మరి ఆ జోకు ఇప్పుడెందుకు చెప్పావ్ బావా?’ అన్నాడు.
‘చాలమంది ఇంటర్వూలలోను, ఆడిట్లలోనూ, ఆఫీసు బయట కూడా.. వాళ్ళకి ఎంతో ఇష్టమైన విషయం గురించి, అదే ఇంగ్లీషులో Passionate Subject అన్నమాట, ఏదన్నా అడిగితే ఒళ్ళు మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు ఆగకుండా మాట్లాడతారు. అది వినేవాళ్ళకి బోరు కొట్టించటమే కాక, ఇంటర్వూ చేసే వాళ్ళకి నువ్వు చెప్పిన దాని మీద ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడగి, నీ మనసులోకి తొంగి చూసే అవకాశం కూడా ఇస్తుంది. కనుక ఎంత తక్కువగా, అడిగిన దానికి మాత్రమే సూటిగా తగినంత సమాధానం ఇవ్వటం మంచిది. కొంతమంది అయితే, ఇంటర్వూ చేసే వాళ్ళని తమ వేపుకి తిప్పుకోవటానికి దాన్ని ఒక ట్రంపు కార్డులా (పాఠకులారా, ఇప్పటి అమెరికా అధ్యక్షుడికి, ఈ కార్డుకి ఏమాత్రం సంబంధం లేదు) వాడుకోవటం కూడా చూస్తుంటాం. కాకపోతే మనం వాళ్ళని తీసుకు వస్తున్న వేపు మనకి విషయపరంగా ఎంతో తెలిసివుండటం అవసరం’
ఫోనులో అవతలి పక్కన అవునని తల వూపాడు అర్జున్.
ఒక్క క్షణం అర్జున్ దగ్గరనించీ జవాబు రాకపోయేసరికీ, అది ఊహించిన కృష్ణ, పెద్దగా నవ్వుతూ, ‘నేను చెప్పినదాన్ని ఒప్పుకుంటూ ఇప్పుడు ఫోనులో తల వూపావు కదూ’ అన్నాడు.
అర్జున్ ఒక్కసారిగా హాశ్చర్యపడిపోయి, ‘నీకెలా తెలిసింది బావా?’ అని అడిగాడు.

‘ఆ సంభాషణల పద్ధతుల గురించి చెబుదామని ఆలోచిస్తుంటే, నువ్వే ఇంకో పక్కకి లాక్కువెళ్ళావ్. సంభాషణల్లో జనాలు ముఖ్యంగా మూడు రకాలుగా మాట్లాడటం మనం చూస్తుంటాం. అదో పెద్ద సైన్సులే. అవన్నీ వచ్చేసారి తీరిగ్గా చెబుతాను. భారతదేశంలో కక్కొచ్చినా, కల్యాణమొచ్చినా ఆగదని ఒక సామెత వుంది. అదే అమెరికాలో అయితే, ఆ రెండిటికీ ఉద్యోగం కూడా కలపుకోవాలి. చటుక్కున ఎవడో పిలిచి, ‘ఏం బాబూ, ఎలా వున్నావ్? నీతో మాట్లాడాలి. ఎప్పుడు కలుద్దాం?’ అనే ఇంటర్వ్యూకి పిలిచే అవకాశాలు చాల ఎక్కువ. అందుకని నిన్ను ఎవరో పిలిచేలోగా, కొన్ని టిప్పులు ఇద్దామని..’ ఆగాడు కృష్ణ.
‘నువ్వు చెప్పేదానికి టిప్పులేమీ ఇచ్చుకోలేను కానీ, జీవితమంతా ఋణపడి వుంటాను. చెప్పు బావా’
అన్నాడు అర్జున్.

‘వారినీ.. అప్పుడే నీ క్రెడిట్ స్కోరు పెంచేసుకుంటున్నావ్. సరే విను. భారతంలో కళ్ళల్లో కళ్ళు పెట్తి మాట్లాడటం సాంస్కృతికపరంగా మంచిది కాదు. కొండొకచో, అది ప్రేమికులకే పరిమితం. ఇక్కడ అలా కాదు. అలా కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడకపోతే నువ్వు ఏదో దాస్తున్నావని అర్ధం. అందుకని అలా కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడటం అవసరం. మన భారతీయులు, వాళ్ళల్లో కూడా తెలుగు వాళ్ళు, ఎంతో వేగంగా మంత్రాలు చదువుతున్నట్టో లేదా ఎవరో తరుముతున్నట్టో మాట్లాడటం ఎక్కువ. నేను అమెరికాలో దాదాపు నలభై ఏళ్ళుగా వుంటున్నా, నాకు అమెరికన్ ఇంగ్లీష్ వచ్చింది కానీ, ఆ యాస రాలేదు. అది ఇక్కడే పుట్టి పెరిగిన మన పిల్లలకు వచ్చినట్టుగా నాలాటి వాళ్ళకు రావటం కష్టం. అందుకే వాళ్ళకి అర్ధమయేటట్టు నెమ్మదిగా, మాటలు ఎక్కడ విరచాలో అక్కడ విరిచి, కళ్ళల్లోకి చూస్తూ చెప్పటం అవసరం. అంతేకాదు ధైర్యంగా అంటే assertiveగా వివరించటం కూడా మన వ్యక్తిత్వాన్ని బాగా చూపిస్తుంది. అలాగే ఇక్కడ శరేరవాణి.. అదే బాడీ లాంగ్వేజ్ ఎక్కువగా చూస్తారు. దీని గురించి కూడా వచ్చే సంచికలో వివరంగా చెబుతాను. అప్పటిదాకా ఓపిక పట్టు’ కృష్ణ చెప్పటం ఆపాడు.
మళ్ళీ ఫోనులో సరే అన్నట్టుగా తలూపుతూ, వెంటనే అది గ్రహించి అర్జున్ అన్నాడు, ‘సరే బావా. అలాగే. నువ్వు చెప్పింది నాకు బాగా అర్ధమయింది. నువ్వు చెబుతున్నప్పుడు నోట్స్ కూడా వ్రాసుకున్నాను. మరి ఈలోగా నాకు ఇంటర్వూ వస్తే నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాకు విజయం కలగాలని దీవించు బావా’ అన్నాడు.
‘శుభమస్తు! త్వరలో ఉద్యోగ ప్రాప్తిరస్తు!’ ఫోనులో అంటూ అసంకల్పితంగా, చేయి పైకెత్తి ఆశేర్వదించాడు కృష్ణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked