కవితా స్రవంతి

రామప్ప దేవాలయం

– అమరవాది రాజశేఖర శర్మ

ఘనమైన రామప్ప దేవాలయం
మన రామలింగేశ్వరుని ఆలయం

నాటి చరితకు ఋజువు మేటి కళలకు నెలవు
కోటి కాంతుల కొలువు తేట తెలుగుల పరువు
సాటిలేదనిపించి పాటిగా చాటించి
దిటవుగా కీర్తి నల్దిశలు పలికించినది

కాకతీయులరేడు రేచర్ల రుద్రుడు
లోకప్రశస్తిగా కట్టించె నీ వీడు
లోకైకనాథు సుశ్లోక నామము గాక
శ్రీకరమ్ముగ నిలుపుశిల్పి పేరున వెలుగు

ఎత్తైన పీఠికన ఏలికల శైలిగా
చిత్తరపు నక్షత్ర చిత్రమై నిలిచింది
చిత్తములనలరించు శివలింగ రూపము
చిత్తినొసగగ నునుపు శిలలాగ వెలిసింది

మండపము స్తంభములు మెండైన ఇతిహాస
దండి శిల్పాలతో ధన్యులను గావించు
నిండైన రమణీయ నాగిని మదనికల
అందాల శిల్పములు నలరించనలరింది

ఏవైపు నిలిచినా మనవైపు గనునను
భావమై ఆ నంది ప్రాణమై నిలిచింది
చెవిని రిక్కించి ఈ భువిని అడుగును నిలిపి
శివుని ఆనతి కోరి చిత్రమై తోచింది

జలముపైనను దేలు బలముగల ఇటుకలను
అల కోవెలను గట్ట వెలయించినారట
అలనాటి రాజుల అభిరుచుల రూపము
అలనాటి శిల్పుల అభినివేశపు గుణము

గుడిపైన శిఖరమై కొలువైన రూపాలు
గుడిగోడ చెలువమై కులుకైన నాట్యాలు
అడుగడుగు శిల్పాలు అణువణువు శిల్పాలు
నడయాడు అందాలు నయగారమొలకించు

నయనాల కనువిందు నాట్యభంగిమలు
హొయలెన్నొ కురిపించు నటనాంగనామణులు
లయ మృదంగ ధ్వాన లలన శిల్పాలు
రయమునిడుమోదమును రమణీయరాగాలు

సైకతము పైనిల్చు సత్యమై సత్వమై
కాకతీయుల కళల కావ్యమై గానమై
భారతీయుల మేటి భాగ్యమై భావమై
వారసత్వపు హోద స్వాగతించింది
గిరి శిఖరమై జగతి నుతులనందింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked