వీక్షణం

వీక్షణం ఆరవ వార్షికోత్సవం

-జయమాల & దమయంతి

వీక్షణం ఆరవ వార్షికోత్సవం సెప్టెంబరు 16, 2018 న మిల్పిటాస్ లోని స్వాగత్ రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది. సభను ప్రారంభిస్తూ వీక్షణం సంస్థాపకురాలు డా||కె.గీత ఆరేళ్ల ప్రస్థానాన్ని తల్చుకుంటూ ఇప్పుడు వీక్షణం ఇక్కడి వారి జీవితంలో భాగస్వామ్యమైపోయిందనీ, ఆపాలనుకున్నా ఆగని నిరంతర సాహితీ వాహిని గా అందరినీ అలరిస్తూందని, ఈ సంవత్సరం శేక్రమెంటో లో మరో శాఖతో విస్తరిస్తూ సాహితీ సేవలో మరో అడుగు ముందుకేసిందనీ అంటూ అందరికీ ఆహ్వానం పలికారు. ఉదయం సెషన్ కు శ్రీ చుక్కా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా సాహిత్య సమావేశాలు జరుపుకుంటున్నామంటే మనందరిలో సాహిత్యాభిరుచి, సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తి కారణమని అందరినీ అభినందిస్తూ సభను ప్రారంభించారు. ముందుగా శ్రీ తాటిపామల మృత్యుంజయుడు “భగవద్గీత ను ఎలా చదవాలి, ఎందుకు చదవాలి?” అనే అంశం పై ప్రసంగిస్తూ, తాను చెప్పదలుచుకున్నది మత ప్రచారం కాదని సభకు విన్నవించారు. కేవలం మరణ సందర్భాల్లో మాత్రమే భగవద్గీత వినాలని ఎలా జన సామాన్యంలో ముద్రపడిపోయిందో వివరించారు. భగవద్గీత లోని తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయని ఉదాహరణగా ఐనిస్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ని విశ్వజనీయతతోను, ఎనర్జీ ప్రసరణ ను ఆత్మ ప్రసరణ తోను, థియరీ ఆఫ్ ఎవిరీథింగ్ ను సుప్రీమ్ పవర్ తోనూ పోల్చి చూడవచ్చని ముగించారు.

తర్వాత శ్రీ మధు బుడమగుంట “సంపాదకీయం- నిశిత పరిశీలన” అనే అంశం పై ప్రసంగిస్తూ తమ శ్రీమతి ఉమ సహకారంతో గత మూడేళ్ళుగా నడుపుతున్న “సిరిమల్లె” వెబ్ మాస పత్రిక వల్ల తనకి ఈ వేదిక మీద ప్రసంగించే అర్హత కలిగిందని భావిస్తున్నానని ప్రారంభించారు. సంపాదకీయం ఒకప్పుడు ఎంతో ఉన్నత విలువలు కలిగి ఉండి కాలక్రమేణా పొగడ్తలకు, స్వార్థ ప్రయోజనాలకు లోబడిందని సంపాదకులు సాహిత్యానికి తద్వారా సమాజానికి మేలు సమకూర్చాలన్నదే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. తన సంపాదకీయంలో వెలువడిన ఆణిముత్యాలను సభకు పరిచయం చేస్తూ ఒకే పద్యాన్ని అచ్చ తెనుగు లోనూ, సంస్కృత భూయిష్ట సమాసాలతోనూ రాసి పాఠకులు పంపిన ఆటవెలదిని సభకు వినిపించారు.

ఆ తర్వాత శ్రీ అప్పాజీ పంచాంగం “ప్రహ్లాదుడు” అనే అంశంపై ప్రసంగిస్తూ ముందుగా వరాహ, నృశింహ అంశాలని సభకు ఆసక్తిదాయకంగా వివరించారు. జీవన ప్రవాహంలో కొట్టుకుపోతూ మనకు మనం ఎవరమనే సృహను కోల్పోతూ ఉన్నామని, నేనెవరు? అనే ప్రశ్న మనకు మనం గా వేసుకున్నపుడే అంతరంగ అన్వేషణ ప్రారంభమవుతుందని అన్నారు. వరాహ మంటే శ్రేషమైన రోజని, హిరాణ్యాక్షుడంటే కదిలే వస్తువు ఆకర్షణలో ఉన్నవాడని వివరించారు. ఆసక్తులు రెండు విధాలని, మొదటిది కర్తృత్వ ఆసక్తి, రెండు భోక్తృత్వ ఆసక్తి అని, భోక్తృత్వ ఆసక్తి ని విడిచి నిష్కామ కర్మ చేసిన నాడే ఏ పనైనా సుకరము అవుతుందని అన్నారు. ఆహ్లాదము, సంహ్లాదము, ప్రహ్లాదము, అనుహ్లాదము అని ఆహ్లాదం నాలుగు రకాలని అందులో ప్రహ్లాదము అంటే అన్ కండిషనల్ హ్యాపినెస్ అని హిరణ్యకశ్యపత్వమనే అహాన్ని జయించడానికి ప్రహ్లాదత్వమనే దితిత్వాన్ని ఉపయోగించి నృశింహత్వం ఆవిష్కరింపబడుతుందని ముగించారు.

భోజన విరామానంతరం జరిగిన రెండవ సెషన్ కు శ్రీ రావు తల్లాప్రగడ అధ్యక్షత వహించారు. ముందుగా వీక్షణం ప్రత్యేక సంచికల ఆవిష్కరణ శ్రీ అక్కిరాజు రమాపతిరావు, శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ, శ్రీ లక్కిరెడ్డి హనిమిరెడ్డి గార్ల చేతుల మీదుగా జరిగింది. అనంతరం శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారి సహస్ర చంద్ర దర్శన ప్రత్యేక సందర్భంగా వీక్షణం తరఫున ఘన సన్మానం జరిగింది. ఆ సందర్భంగా వారి సోదరులు శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ ప్రసంగించారు.

తర్వాత “తెలుగు రచయిత” తొమ్మిది వందల రచయితల పేజీలతో దిగ్విజయంగా మూడు సం.రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యులు డా||కె.గీత, శ్రీ వేణు ఆసూరి, శ్రీ సుభాష్ పెద్దు సభకు తెలుగు రచయిత. ఆర్గ్ ను పరిచయం చేసారు. ఈ సందర్భంగా వెబ్సైటు కి తగిన చేయూతనివ్వాలని రచయితలందరికీ గీత విజ్ఞప్తి చేశారు. తర్వాత శ్రీ సుభాష్ పెద్దు వేంకటాధ్వరి రచించిన “గుణాదర్శం” గ్రంథ సమీక్ష చేశారు. ఈ గ్రంథం ఒక యాత్రా చరిత్రమని, ఈ గ్రంథ ప్రధానోద్దేశ్యం లోకాన్ని చదవడం, మనుషుల్ని అర్థం చేసుకోవడం, నిజాల్ని వెలిబుచ్చడం అన్నారు. గ్రంథ కాలం నాటి సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు రచయిత వర్ణించారని, మధుర మీనాక్షి దంతాలు మల్లెల్లా ఉంటాయని, శ్రీరంగంలో అంతా దొంగలే, అటువంటి చోట్ల దేవుడుండి ఏం లాభమని, జ్యోతిష్కులు, వైద్యులు ఆ కాలంలో చేస్తున్న మోసాలను గురించి విశేషాలను ఆసక్తికరంగా వివరించారు. తర్వాత శ్రీ పాలడుగు శ్రీ చరణ్ “అవధానాలు చెయ్యడం ఎలా?” అనే అంశమ్మీద ఉపన్యసించారు. అవధాని అని పివడం వెనక ఉన్న కారణాలతో మొదలు పెట్టి అవధానం లోని ఒక్కొక్క అంశాన్ని సోదాహరణంగా వివరిస్తూ ఆసక్తిదాయకమైన ఉపన్యాసాన్నిచ్చారు. ఆ తర్వాత, శ్రీమతి ఆర్ దమయంతి గారి ఆధ్వర్యాన సాహితీ క్విజ్ ఉత్సాహదాయకంగా జరిగింది.

తరువాత జరిగిన కవితా సమ్మేళనంలో శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ, డా|| కె.గీత, శ్రీ శశి ఇంగువ, శ్రీమతి షంషాద్, శ్రీ మేకా రామస్వామి, శ్రీమతి ఛాయాదేవి, శ్రీ హర్ నాథ్ మున్నగువారు పాల్గొన్నారు. ఆ తర్వాత సింగపూర్ తెలుగు సమితి ఉపాధ్యక్షులు శ్రీ వెంకటరమణ సభకు హాజరై తమ సందేశాన్ని వినిపించడం విశేషం.

చివరగా వీనుల విందుగా జరిగిన సంగీత లహరి కార్యక్రమం లో డా|| కె.గీత, శ్రీమతి ఆర్ దమయంతి, శ్రీమతి గీతా గురుమణి, చి|| ఈశా పాటలు పాడి అందరినీ అలరించారు. ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా, విశేషంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిమానులు విశేషంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked