సంగీత రంజని

సంగీత రాగాలు

-డా. కోదాటి సాంబయ్య

1. భీమ్ పలాశ్రీ \భీమ్ పలాసి \ అభేరి :
కాపి థాట్ కు చెందిన రాగం. ఔడవ-సంపూర్ణ రాగం. ఒక సంగీత విద్వాంసుడు పలాస (మోదుగు) చెట్టు కింద కూర్చుని భీమ్ రాగాన్ని పాడుతుంటే అనుకోకుండా కొన్నిస్వరాలను వర్జ్యం చేస్తే కొత్త రాగం వచ్చింది దానికే భీమ్ పలాసి అని పేరు పెట్టారని ఒక కథ ప్రచారం లో ఉంది. కర్ణాటక సంగీతం లో ఈ రాగానికి దగ్గరి రాగం అభేరి. అభేరి లో రిషభ,ధైవతాలు తక్కువగా వాడతారు, భీమ్ పలాసి లో తరుచుగా వాడతారు, అదొక్కటే తేడా రెంటికీ. ఈ రాగం పాడితే మానసిక ఆందోళనలు తగ్గి ప్రశాంతత నెలకొంటుందని పెద్దల మాట. భక్తి, శృంగార, విరహ భావాలను కలుగ చేస్తుంది.

ఆరోహణ: స గ మ ప ని స….అవరోహణ: స ని డ ప మ గ రి స …వాది స్వరం:
పంచమం,కొందరు మధ్యమం అంటారు, సంవాది: షడ్జమం.
పకడ్ మరియు చలన్….ని స మ, మ గ ప మ, గ మ గ రి స ..పాడవలసిన సమయం..మధ్యాహ్నం .

హిందీ చలన చిత్రాలలోని కొన్ని భీమ్ పలాసి పాటలు:
అఫ్సానా లిఖ్ రహి-దర్ద్; నైనో మే బదరా-మేరా సాయా; ఖిల్ తే గుల్ యహ-శర్మీలి; జియా బెఖరార్-బర్సాత్; చల్ ఉడ్ జారే పంచి-బాభీ; యే రాత్-ఝాల్ ; ఓ నిర్దయా ప్రీతం-స్త్రీ; నైనా బర్ సే-ఓ కౌన్ థీ; దిల్ కే తుకడే-దాదా; దూర్ గగన్ -దూర్ గగన్ కి చావో మే; జల్ తే హై-సుజాతా; మేరె పియా గయే -పతంగా; ఖోయా ఖోయా చాంద్-కాలా బజార్; ఇన్ అంఖో కి మస్తీ-ఉమ్రావ్ జాన్; కుచ్ దిల్ నే కహా -అనుపమ; ఖిలోన జానేకర్-ఖిలోన; తు మిలే దిల్ ఖిలే-క్రిమినల్;

నైనో మే బదరా ఛాయే-మేరా సాయా; రచన: రాజా మేహది అలీ ఖాన్; సంగీతం: మదన్ మోహన్;
గానం: లతా మంగేష్కర్; అభినయం: సాధన, సునీల్ దత్.

జయంత్ దేవకులే మరాఠీ లో రాసిన నవల ‘ ఆశా పరాత్ యేతే ‘ ఆధారంగా 1964 లో ‘పాత్లాగ్’ అనే మరాఠీ సినిమా వచ్చింది. ఈ సినిమా నే తమిళం లో ‘ ఇదయ కమలం ‘ గా తీశారు. హిందీలో ‘ మేరా సాయా ‘ గా వచ్చింది. తెలుగులో ఇల్లాలు గా తీశారు. తను బతికుండ గానే చనిపోయానని తన భర్త పడే బాధను చూసి ఒక ఇల్లాలు పడే మానసిక వేదనకు అక్షర రూపం ఈ పాట. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం , ఆప్యాయతలను చక్కగా రచించారు మెహదీ అలీ ఖాన్ గారు. మదన్ మోహన్ ఈ పాటకుభీమ్ పలాసి రాగం లో స్వర రచన చేసి ఒక హంటింగ్ మెలోడీ గా చేశారు. లతా దీది తన అమృత గాత్రం తో పాటకు ప్రాణం పోశారు.

పల్లవి:
नैनों में बदरा छाए, बिजली सी चमके हाए
ऐसे में बलम मोहे, गरवा लगा ले ||नैनों में||
చరణం: 1
मदिरा में डूबी अँखियाँ चंचल हैं दोनों सखियाँ
ढलती रहेंगी तोहे पलकों की प्यारी पखियाँ
शरमा के देंगी तोहे मदिरा के प्याले ||नैनों में||
చరణం: 2
प्रेम दीवानी हूँ में सपनों की रानी हूँ मैं
पिछले जनम से तेरी प्रेम कहानी हूँ मैं
आ इस जनम में भी तू अपना बना ले ||नैनों में||

2. హిందోళం \ మాల్కోన్స్ :
కర్ణాటక సంగీతం లో చాల ప్రాచుర్యం గల రాగం. 8 వ మేళకర్త హనుమత్తోడి జన్యరాగం.
చలన చిత్రాలలో ఈ రాగాన్ని విరివిగా వాడతారు.
కరుణ, భక్తి, శృంగార రసాలు కలిగించే రాగం. శంకరాభరణం సినిమాలో శారద –
చంద్రమోహన్ పెల్లిచూపుల్లో సామజవరగమనా అనే త్యాగయ్య కృతి ఉంటుంది. పాట ఆఖర్లో
..ఆలాప్ వద్ద శారద అనుకోకుండా , తన్మయత్వం తో రిషభ స్వరం పాడుతుంది. వెంటనే
శంకరశాస్త్రి కోపంతో…శారదా! శుద్ధ హిందోళం లో రిషభం ఎలా వచ్చింది ? అని
కోప్పడతాడు. ఈ రాగం లో రిషభం, పంచమం స్వరాలు ఉండవు. ఔడవ-ఔడవ రాగం. ఇందులోని
స్వరాల సమమిత అమరిక వల్ల ఈ రాగం వింటుంటే మనసు అలౌకిక ఆనందం పొందుతుంది. ఔడవ
రాగాల్లో ఎక్కువ జనరంజకమైన రాగం. అన్ని కోమల స్వరాలు అవడం వల్ల చాలా రుచిగా
ఉండే రాగం. గ ద ని లకు కంపిత గమకం ఇస్తారు. త్రిస్తాయి రాగం.
హిందుస్తానీ సంగీతం లో హిందోళం ను మాల్కోన్స్ అంటారు. భైరవి థాట్ కు చెందినది.
మాలా+కౌశిక్ నుండి మాల్కోన్స్ వచ్చింది. శివతాండవం చేసి శివుడు రౌద్రంగా
ఉన్నప్పుడు అతన్ని శాంతింప చేయడానికి పార్వతి దేవి ఈ రాగాన్ని పాడింది అని
పెద్దలు అంటారు.
మోహన, హిందోళ లాంటి రాగ చాయలు గల సంగీతం చైనా, జపాన్ వంటి తూర్పు దేశాల్లో
బాగా ప్రచారం లో ఉన్నాయి.

ఆరోహణ: స గ మ ద ని స …. అవరోహణ: స ని ద మ గ స ….. సాధారణ గాంధారం-శుద్ధ
మధ్యమం- శుద్ధ దైవతం -కైశిక నిషాధం
శాస్త్రీయ సంగీతం లో కొన్ని రచనలు:
సామజ వర గమనా, మనసులోని మర్మము-త్యాగరాజు; నీరజాక్షి కామాక్షి, గోవర్ధన
గిరీశం,సరస్వతి విధి యువతీ -ము. దీక్షితులు; పద్మనాభ పాహి-స్వాతి తిరునాళ్;
మామవతు శ్రీ సరస్వతి-మైసూర్ వాసుదేవాచార్య; దేవ దేవం భజే, కొండలలో నెలకొన్న
-అన్నమయ్య; రామ మంత్రవ జపిసో-పురందర దాసు; సామ గాన లోలనే- పాపనాశం శివన్;

తెలుగు చిత్రాలలో హిందోళ రాగం లో చాలా పాటలు వచ్చాయి.
కలనైనా నీ తలపే-శాంతి నివాసం; శ్రీకర కరుణాలవాల-బొబ్బిలి యుద్ధం; పిలువకురా
-సువర్ణ సుందరి; మనసే అందాల బృందావనం-మంచి కుటుంబం;
పగలే వెన్నెల-పూజాఫలం; గున్న మామిడీ కొమ్మ మీద-బాలమిత్రుల కథ; చూడుమదే
చెలియా-విప్రనారాయణ; మోహన రూపా గోపాల- కృష్ణ ప్రేమ;
మూగవైన వేమిలే-పెళ్ళిచేసి చూడు; సందేహించకు మమ్మా-లవకుశ; వీణ వేణువైన -ఇంటింటి
రామాయణం; శ్రిత జన పాలా-దేవాంతకుడు;
పిలవకురా-సువర్ణ సుందరి; మనసే అందాల-మంచి కుటుంబం; నేనే రాధనోయీ-అంతా మన
మంచికే; మావి చిగురు తినగానే-సీతా మహలక్ష్మి .

చూడుమదే చెలియా-విప్రనారాయణ; రచన: సముద్రాల సీనియర్; సంగీతం: S. రాజేశ్వర
రావు; గానం: AM. రాజా; అభినయం: భానుమతి, ANR.
1. సాహిత్యం: శ్రీ కృష్ణ కర్ణామృతం లోని కొన్ని శ్లోకాలను స్పూర్తిగా తీసుకుని
సముద్రాల గారు ఈ పాటను రచించారు. అప్పటికి విప్రనారాయణ దేవ దేవి మొహం లో
పడలేదు. ఆమెను కూడా ఒక భక్తురాలిగానే చూస్తాడు. ఆమెలో కూడా శ్రీ రంగపతి నే
దర్శిస్తాడు. శ్రీ కృష్ణ రాస లీలలను దేవ దేవికి వివరిస్తున్నాడు. చివరికి ఆ
తన్మయత్వం లో దేవ దేవినే శ్రీ కృష్ణుడుగా భావించి కాళ్ళు పట్టుకుంటాడు .
వైష్ణవ సాంప్రదాయం లోని నవ విధ భక్తి మార్గాలలో పాదసేవ ఒకటి.
2. సంగీతం: సాలూరి వారు హిందోళ రాగం లోని మాధుర్యాలను ఎన్నో పాటలలో
వాడుకున్నారు. అందులో ఈ పాట ఒక ఆణి ముత్యం. మధ్యలో వచ్చే
వేణు నాదం అపూర్వం.
3. గానం: అక్కినేనికి అప్పటివరకూ ఘంటసాల గారే నేపథ్య గానం చేసేవారు. ఈ చిత్రం
లో అన్ని పాటలు AM రాజా గారే పాడారు. పాటలు కూడా బహుళ జనాదరణ పొందాయి.
ముఖ్యంగా ఈ పాటలో నారీ నారీ నడుమ మురారి అన్నప్పుడు రాజా గొంతులోని మాధుర్యం
అంతా వినిపిస్తుంది.
4. అభినయం: భానుమతి గారిని కృష్ణుని వేషం లో చూడడం ఇదే మొదటిసారి. అక్కినేని
సహజంగా నాస్తికుడు. భక్తుని పాత్ర ఎలా చేస్తాడో అని అందరూ అనుకున్నారు .కానీ
చిత్రం విడుదల అయి అఖండ విజయం సాధించింది. ప్రేక్షకులు అక్కినేనిలో
విప్రనారాయణున్నే చూశారు.

పల్లవి:
చూడుమదే చెలియా..కనులా.
చూడుమదే చెలియా..
చరణం: 1
బృందావనిలో నందకిశోరుడు
అందముగా దీపించే లీలా…
చూడుమదే చెలియా..కనులా ||చూడుమదే||

చరణం:2
మురళీ కృష్ణుని మోహన గీతికి
పరవశమైనవి లోకములే..
విరబూసినవీ పొన్నలు పొగడలు
పరిమళ మెగసెను మలయానిలముల
సోలెను యమునా… ||చూడుమదే||

చరణం: 3
నారీ నారీ నడుమ మురారి
హరికీ హరికీ నడుమ వయ్యారీ
తానొకడైనా…ఆఆ.అ.అ.ఆఅ…
తానొకడైనా తలకొక రూపై
మనసులు దోచే రాధామాధవ కేళీ నటనా.. ||చూడుమదే||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked