బాలాంత్రపు నివాళులు

సుధాకర్

బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు

(ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!)

సంగీత గంగోత్రి

ఇరవయ్యేళ్ల క్రితం సంగతి…విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ‘సంగీత గంగోత్రి’ అనే విలక్షణమైన సంగీత రూపకం,’సంగీత,సాహిత్య సవ్యసాచి’ డాక్టర్ బాలాంత్రపు రజనీకాంతారావు గారి నిర్వహణలో రూపుదిద్దుకుంటోంది… శివుని సద్యోజాతాది అయిదు ముఖాల నుండి సప్తస్వరాల ఆవిర్భావం ఎలా జరిగింది? డమరుక నాదం నుండి అచ్చులు,హల్లులు ఎలాపుట్టాయి? రాగ,తాళాలు,సంగీత రచనలు ఎలా ఆరంభమైనాయి? మొదలైన ఎన్నో అంశాలను సోదాహరణంగా వివరిస్తూ రజనీగారు వ్రాసిన రూపకం,రికార్డవుతోంది.నెమలి కూత,ఎద్దు రంకె,ఏనుగు ఘీకారం… వంటి ఏడు శబ్దాల నుండి సప్తస్వరాల స్థాయిలు నిర్ణయమైనాయని వ్యాఖ్యాతచే చెప్పించి, ఆ ధ్వనులను శ్రోతలకు వినిపించేందుకు ప్రఖ్యాత మిమిక్రీ కళాకారులు సిల్వెస్టర్ గారిని స్టూడియోకి పిలిపించారు రజనీగారు.ఎంతో నేర్పుతో ఆ ధ్వనులన్నింటినీ తన గళంలో పలికించారు సిల్వెస్టర్ గారు.ఆ ధ్వనుల సేకరణకు ఆయన ఎన్నోరోజులు పరిశ్రమించారు.

ఇక, రూపకంలోని పాటలు పాడేందుకు అస్మదాదులమంతా మ్యూజిక్ స్టూడియోలో కూర్చొని ఉన్నాం.వాద్య కళాకారులు శ్రుతులు చేస్తున్నారు.రజనీగారు వ్రాసిన పాటలు కొన్ని పాడాము మేము. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య రచించిన ఒక జానపద శైలిలోని చెంచిత పాటను ఆకాశవాణి నిలయ కళాకారిణి శ్రీమతి శిష్ట్లా శారద గారితో పాడించాలని నిర్ణయించారు రజనీగారు.పాట నేర్పడం పూర్తి అయింది. ‘కొండ మలహరి’ అనే రాగాన్ని ఆపాటకోసం సృష్టించారాయన!
ఆ పాట సాహిత్యం…
పల్లవి: మొల్లలేలె నాకు? తన్నే ముడుచుకొమ్మనవే..నే చెల్ల పువ్వు కొప్పు తావి చెంచుదాననే…
చరణాలు:
1.పట్టుచీరేటికే నాకు? పారుటాకులే చాలు, దట్టిగట్టుకొమ్మనవే, తన మొలను..పట్టెమంచమేలే నాకు? పవళించుమనవే, చెట్టు కింద పొరలాడే చెంచుదాననే….
2.సంది దండలేలే నాకు? సంకు కడియమే చాలు,ఇందవే ఎవ్వతెకైనా ఇమ్మనవే…గందమేలె నాకు?చక్కని తనకే కాక, నే చిందువందు చెమట మై చెంచుదాననే…
3.కుచ్చు ముత్యాలేలే నాకు? గురువిందలే చాలు, కుచ్చి తన మెడగట్టికొమ్మనవే…కచ్చుపెట్టి కూడె, వెంకటగిరీంద్రుడు నను,చీ చీ నేనడవిలో చెంచుదాననే…
ఎంతో చక్కగా కుదిరింది బాణీ..

రజనీగారు వాద్య కళాకారులకు నేపధ్య సంగీతం చెప్పి,సాధన చేయించారు.శారదగారు ఆపాటకు జీవం పోస్తూ…నిజంగానే ఒక అమాయకపు చెంచుపిల్లలాగా జానపద యాసచేర్చి, పాడుతున్నారు… కార్యక్రమ సంధానకర్తనైన నేను, ఇక రికార్డింగ్ ప్రారంభం చేద్దామని అనుకుంటుండగా…ఆకాశవాణి అధికారి వచ్చారు.ఆ పాటని, ఒకసారి వింటానన్నారాయన…శారదగారు ఎంతో శ్రావ్యంగా పాడారు.అయితే…అధికారి గారికి సందేహమొచ్చింది.ఒక కులంవారు, ఈపాటను ఆక్షేపించవచ్చని సందేహం వెలిబుచ్చారు.రజనీగారు చాలా ఓపికగా వారికి..శ్రీమహావిష్ణువు నృసింహావతారమెత్తడం… చెంచుపిల్లగా లక్ష్మీదేవి అవతరించడం…వారిమధ్య ప్రేమ అంకురించడం..ఆ నేపధ్యాన్ని వివరించి,అన్నమయ్య రచించిన ఆ సాహిత్యంలో ఎటువంటి ఆక్షేపణకు తావులేదని చెప్పారు.
అయితే,అధికారి గారు,ఆకాశవాణి ప్రభుత్వ సంస్థ కనుక,ఏకులం పేరూ ప్రస్తావించకూడదని,…గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ఉటంకించారు.అప్పుడు రజనీగారు, సాక్షాత్తూ సిరులనిచ్చే లక్ష్మీదేవే స్వయంగా ఒక చెంచుకులంలో పుట్టటమంటే..అది వారికి ఎంతో గర్వకారణమే కానీ..అవమానకరం ఎంతమాత్రమూ కాదని విశదీకరించారు.అయినా సమాధానపడక,చివరి ప్రయత్నంగా…అధికారి గారు,’ఆ కీర్తనలోని ‘చెంచుదాననే..’ అనే పదానికి బదులుగా ‘చిన్నదాననే..’ అని మార్చవచ్చుకదా!’ అంటూ ఒక సలహా ఇచ్చారు.
ఇక రజనీగారి సహనం నశించింది.’అన్నమయ్య సాహిత్యం మార్చేందుకు మనమెవరమండీ? ముగ్ధ చెంచులక్ష్మిలో తానే ప్రవేశించి,నాయికాభావంతో,ముచ్చటైన పదాలను అల్లి, మధురభక్తితో అన్నమయ్య పాడుకున్న పాట ఆక్షేపణీయమైతే..అసలు ఈ పాటనే రూపకం నుండి తొలగిద్దాం..అంతేకానీ..ఇందులో ఒక్క అక్షరాన్ని కూడా మార్చటానికి వీలులేదు.’ అన్నారు తీవ్ర స్వరంతో. అధికారి గారు అవాక్కయ్యారు.మారు మాట్లాడక, రజనీగారితో యధాతథంగా రికార్డింగ్ కొనసాగించమని చెప్పి, నిష్క్రమించారు.

అద్భుతంగా వచ్చింది ఆ పాట..ఎన్నోమార్లు రేడియోలో పునఃప్రసారం చేయబడిన ఆ పాట అన్నమయ్య రచనా వైశిష్ట్యానికి,రజనీగారి సంగీత వైభవానికి,శారదగారి గాన కౌశలానికి నిదర్శనంగా నిలిచిపోయింది. కులాలు మనం సృష్టించుకున్నవేగాని, భగవంతుడి దృష్టిలో, అందరూ సమానులే! సుమారు ఆరు వందల ఏళ్లక్రితమే అన్నమయ్య ఈ విషయాన్ని తన కీర్తనల ద్వారా చాటారు.ఆమాటకొస్తే, ఒక్క అన్నమయ్య కీర్తనే కాదు… అనాదిగా వస్తున్న మన తెలుగు సామెతలు,పద్యాలు,నాటకాలు,పిట్టకథలు, తత్వాలు,నానుడులు…ఇవన్నీ మన సంస్కృతిలో భాగాలే..నీతి ప్రబోధకాలే!వాటిలోని మంచిని గ్రహించాలే కానీ… కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా..మనోభావాల పేరిట వాటిని అపార్థాలు చేసుకుంటే…కొన్నాళ్లకి… అసలే క్షీణ దశలోనున్న మన తెలుగుభాష..సంస్కృతీ సాంప్రదాయాలు..ప్రజలలో ఐక్యత.. కొన్నాళ్లకు కనుమరుగౌతాయేమో!..విజ్ఞులు ఆలోచించాలి!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked