ఏవం దర్శయసి హితమతిరివ
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
ఇది ఒక సంస్కృత శృంగార సంకీర్తన. అన్నమయ్య, చెలులలో ఒకచెలికత్తెగా మారి శ్రీ మహావిష్ణువు ప్రియురాలైన తులసి మాతను ఆ తల్లి వైభవాన్ని కీర్తిస్తూ అన్నమయ్య చెప్పిన చక్కని కీర్తన. ఆ విశేషాలు చూద్దాం.
కీర్తన:
పల్లవి: ఏవం దర్శయసి హితమతిరివ
కేవలం తే ప్రియసఖీ వా తులసీ ॥పల్లవి॥
చ.1 ఘటిత మృగమద మృత్తికా స్థాసకం
పటు శరీరే తే ప్రబలయతి
కుటిలతద్ఘనభారకుచవిలగ్నంవా
పిటర స్థలే మృత్ప్రీతా తుళసీ ॥ఏవం॥
చ.2 లలిత నవ ఘర్మలీలా విలసనో-
జ్జ్వలనం తవ తనుం వంచయతి
జల విమలకేలీవశా సతతం
అలిక ఘర్మాంచిత విహరా తులసీ ॥ఏవం॥
చ.3 సరస నఖచంద్రలేశా స్తే సదా
పరమం లావణ్యం పాలయతి
తిరువేంకటేశ తత్కరుణా గుణా వా
వరరూప నవచంద్రవదనా తులసీ ॥ఏవం॥
(రాగం: ధన్నాసి ; రేకు: 30-1, కీర్తన; 5-167)
విశ్లేషణ:
పల్లవి: ఏవం దర్శయసి హితమతిరివ
కేవలం తే ప్రియసఖీ వా తులసీ
స్వామీ! నాహితం కోరే వాడిలా కనబడినప్పటికీ, వాస్తవానికి నీకు తులసీ మాతయే అత్యంత ప్రియమైన ఇష్టసఖిగా కనబడుతున్నది. “నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే” అని పుండరీకృత తులసీ స్తోత్రంలో చెప్పినట్టు తులసీ మాత సదా విష్ణుప్రియయై ఉంటుంది.
చ.1 ఘటిత మృగమద మృత్తికా స్థాసకం
పటు శరీరే తే ప్రబలయతి
కుటిలతద్ఘనభారకుచవిలగ్నంవా
పిటర స్థలే మృత్ప్రీతా తుళసీ
గడారుతో త్రవ్విపోసిన ఎత్తైన మట్టి కుప్పలకు ప్రీతిచెందే అమ్మ తులసీదేవిని చూస్తే నీకు ఆమె ఎత్తైన వక్షోజాలం గుర్తొచ్చినట్టుగా నీవుకూడా కస్తూరి అనే మృత్తికనే తిలకంగా ధరిస్తున్నావు.
చ.2 లలిత నవ ఘర్మలీలా విలసనో-
జ్జ్వలనం తవ తనుం వంచయతి
జల విమలకేలీవశా సతతం
అలిక ఘర్మాంచిత విహరా తులసీ
అత్యంత పరిశుభ్రమైన నీటిలో జలక్రీడలలో మునిగితేలుతూ పరవశం పొందుతున్నటువంటి తుమ్మెదల యొక్క స్వేదామృతంలో నిరంతరం తేలియాడుతున్న ఆ తులసీమాత నీ మేని ఆలింగం వలన కలిగిన స్వేద బిందువులను ప్రకాశ వంతంగా చేసి మోసగిస్తున్నట్లు తోస్తున్నది.
చ.3 సరస నఖచంద్రలేశా స్తే సదా
పరమం లావణ్యం పాలయతి
తిరువేంకటేశ తత్కరుణా గుణా వా
వరరూప నవచంద్రవదనా తులసీ
స్వామీ! కారుణ్యమే నీ గుణముగా కలిగి, చంద్రబింబమువంటి మోముతో ప్రకాశించే శ్రీనివాసా! ఆ తులసి మాత రసభరితమైన నఖక్షతాలు కనిపించకుండా చేసి నీ సౌందర్యాన్ని చక్కగా పాలిస్తున్నట్లున్నది.
విశేషం: తులసిలేని ఇల్లు కళావిహీనమని పెద్దలు చెప్తారు. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు.మన సనాతన ధర్మంలో తులసి అత్యంత పూజ్యనీయమైనది.
ముఖ్య అర్ధములు: దర్శయసి = చూపిస్తున్నావు; హితమతిరివ = నాకు హితాన్ని అనుగ్రహించేవాడిలా; ప్రియసఖివా = అత్యంత ప్రియముగా ఉన్నదా? పిటరస్థలే = నేలను త్రవ్వడానికి వినియోగించే చిన్న పారవంటి పరికరము; మత్ప్రీలా = మట్టినే ఇష్టపడే తూలసీమాత; పటు శరీరే = అందమైన శరీరమందు; ప్రబలయతి = ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది; అలీక ఘార్మాంచిత విహార = తుమ్మెదల యొక్క చెమటతొ సదా ఉన్నటువంటి; వంచయంతి = మోసగిస్తున్నది; సరసనఖ చంద్రలేశా: శృంగారభరితమైన నఖక్షతాలుగల; పాలయతి = పాలించుచున్నది.
-0o0-