– శిష్ట్లా రాజేశ్వరశాస్త్రి
అంత్య క్రియలులేవు అశ్రువులు కనపడవు
భయం నీడన బరువెక్కిన మాటలతో
ఆన్లైన్లో కనపడేధ్యానాలు
శ్రద్ధాన్జలితంతులు వినిపించే విలక్షణ అనుభవాల ధ్వనులు
వైదికమంత్రాలు, పలుకుబడుల విశేషాలు!
దానం లేదు, ధర్మం లేదు,
చలనం లేదు దుఃఖం లేదు బాధ లేదు
వేదన తెలియదు మరణ భయం తప్ప మరే కేక వినిపించదు
కలవరం కనపించదు
కన్నవారు, ఉన్నవారు కట్టుకున్న వారు, హితులు, స్నేహితులు
దగ్గరి వారు, దగ్గరున్నా దూరమే ఉంటున్న మన అనుకున్న వారు
ఎందరో! మరెందరో!
అందరికీ గొడుగై ఆశ్రయమిస్తున్న వైరస్
అనుబంధాలని తనలో బంధించిన వైరి ఈ బ్రూటస్
మనిషి పతనానికి పచ్చ జెండా ఊపింది
అసలు శాస్త్రం ఇదే, ఇలానే బ్రతకాలని
కొత్త లోకాన్ని ఆవిష్కరించింది
ఆగమాగం అయోమయం చేసింది
బ్రతుకుల్ని బలి తీసుకుంది బతుకుతెరువు తెంచింది
అమ్మ నాన్న, అక్క, చెల్లి భార్య బంధువు
బంధాలూ నవ్వుల పాలయ్యాయి
మనసు మానవత్వం చతికెల పడ్డాయి
రోగుల తిప్పలు, శవాల తెప్పల కుప్పలు నిత్య మరణాలు
వైరస్ సరి కొత్త వేషాలు
దుర్మార్గ రాక్షస జాతులు చేసినద్రోహానికి అకృత్యానికి అ(బ)ద్దాలయ్యాయి
నరరూప రాక్షసకరాళ కర్కశ నృత్యాలకు అలరించే వేడు (ది )కలయ్యాయి
ఏ బంధమూ లేని వైద్య సిబ్బంది అన్నీ తామే అయ్యి
బాధల చెమటల్ని తుడిచారు
చావుకు వెరవక వైరుస్కు బెదరక సేవలు చేసారు
కొందరు ఆ యజ్ఞానికి సమిధలయ్యారు
ఈ త్యాగం లేకపోతే మానవత్వం మమకారం మనలేవు.
మనిషి మనుగడ కొనసాగించలేడు
త్యాగమూర్తులారా మీకు ఇవే మా జోహార్లు!!