రచన: శ్రీధరరెడ్డి బిల్లా
ఆటవెలదులు :
పచ్చదనము తోను, పక్షుల గూళ్ళతోఁ,
పాఱు యేర్ల తోను, పరుగులెత్తు
జీవజాలములతొ, చేరి ప్రకాశించు
అడవి సొబగు జెప్ప నలవికాదు !
అగ్గిపుల్ల గీసి అంటించిరో యేమొ,
చుట్ట తాగి విసిరి కొట్టి రేమొ,
పచ్చదనము జూసి మ్రుచ్చినారో యేమొ,
రాజుకుంది నిప్పు రవ్వ యొకటి !
చిన్న నిప్పురవ్వ చెలరేగుతూ పోయి
బాడబాగ్ని అయ్యి ప్రజ్వరిల్లె !
అడవి చుట్టుముట్టి ఆహుతి కోరగా,
మాన్ప తరముగాలె మానవులకు!
భీకరముగ పాఱు పెద్దనదియు కూడ
మొదలు చిన్న నీటి బిందువేను!
తగుల బెట్టుచుండు దావానలము కూడ
మునుపు చిన్న నిప్పు కణిక యేను !
అడవులందె యుండి అలరారు చున్నట్టి
జంతుజాల మంత చింతచెందె!
మింగివేయ వచ్చు మెఱుపు నిప్పును జూచి
భీషణముగ గట్టి ఘోషపెట్టె!
దయనెఱుగని యట్టి దావానల సడిలో
ఆర్తనాద మంత ఆవిరయ్యె !
కంట నీరు పెట్టి కానతల్లి నడుగఁ
కాచలేక తల్లి, కాలబట్టె !
కరుణలేని యట్టి కార్చిచ్చు వేడికి
కంటతడియు కూడ క్రాగిపోయె!
పాపమెవ్వరిదని ప్రశ్నించనేలేక
పాపఫలిత మందు భాగమయ్యె !
వేలఏండ్ల వృక్ష మూలసంపద యంత
కాలి బూడిదయ్యె కాలగతిన !
సస్య శ్యామలమది శ్మశానమున్ తలపింపఁ
పొగలురేగి కప్పె గగనమంత !
పగలె మసక జూచి భానున్కి పట్టింది
గ్రహణ మనుకునేరు గగనసీమఁ!
క్యాలిఫోర్నియాలొ కాలిపోయె నడవి
నిండుకున్నది పొగ అంబరమున!
చెలిమిజేయు నిప్పు చలితో వణుకువేళ
కూర లొండు వేళ కూర్మి నిప్పు !
చచ్చి అమరపురికి సాగిపోవునపుడు ,
ముక్తి నిచ్చు దేహములను గాల్చి !
అట్టి నిప్పు కక్షగట్టి జ్వలించిన
జీవముండగానె చితికి పంపు !
మూడవ కను తెరవకుండుటే శివశక్తి!
తెరిచినాక ఆప హరుని తరమె ?