కబుర్లు

చెన్నబోయిన కమలమ్మ

– రమా సుందరి

చెన్నబోయిన కమలమ్మ మరణ వార్త పొద్దునే కలవరపెట్టింది. తెలంగాణ సాయుధ పోరాటదళాలలో ఉంటూ పోలీసుల నిర్బంధానికి తనకు పుట్టిన బిడ్డను కూడ అడవి బయట వదిలేసి వచ్చిన ఆమె చరిత్ర అజరామరం. 2015 సెప్టెంబర్ లో ఆమెను కలిసి పీవోడబ్ల్యూ బృందం ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు ఆమె పాడిన పాట ఇంకా చెవుల్లో మార్మోగుతుంది.

కొండల్లో కోయిల కమలమ్మ

కాటమా రాజు కధ కాదురన్న
పెద్ది రాజుల వారి సుద్దులు ఇవి కావు రన్నో
వీర తెలుగోళ్ల పోరాట కధరన్నా
సిరికొండ బేతవోల్ వీరుడా
యాదగిరి వెంకటేశ్వరులా
మరిచావా తెలంగాణ వీరా
కోయ వీరుడు విల్లునంబుల శత్రువ
కూల్చినా ముచ్చటా మరిచావా
ఓ తెలుగు వీరుడా
తెలంగాణ యోధుడా
లేవయ్య, లేచి రావయ్యా

తొంబ్బై రెండేళ్ల చెన్నుబోయిన కమలమ్మ కళ్ళు మూసుకొని గొంతెత్తి గొల్ల సుద్దులు పాడుతోంది. డెబ్భై ఏళ్ళ క్రిందటి జ్ఞాపకం పాటలాగా ఆమెను ఆవహించింది. ఆమె చుట్టూ ఉన్న శ్రోతలం నిశ్శబ్ధంగా వింటున్నాము. పాట ముగించి కళ్ళు తెరిచి చూసింది. పొడి ఆరి ఉన్నాయి అవి. ఆ కళ్ళు తొంభై ఏళ్ల జీవితానుభవాన్ని చెబుతున్నాయి. గుండెలు చెరువయ్యే మాతృ శోకాన్ని వెల్లడిస్తున్నాయి. కానీ అదేమీ విచిత్రమో ఆ కళ్ళలో ఇంకా ఉద్యమం పసిపాపలాగా నవ్వుతోంది. ఆ పసిపాప గురించే తెల్సుకోవటానికే మేమక్కడికి చేరుకొన్నాము. ఆసక్తిగా ఆమె నోటి మాటలు ఏరుకోవటానికి సిద్దంగా ఉన్నాము.
ఆమెకు ఊహ తెలిసే నాటికే ఆమె అన్నలు మందాటి వెంకటయ్య, నారాయణ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన అప్పన్నతో ఆమె వివాహం ఎనిమిదో ఏట జరిగింది. వాళ్ళిద్దరికి పదేళ్ళు తేడా. పెళ్లయ్యే నాటికి ఆమె నాలుగవ తరగతి వరకు చదివింది. అప్పన్న కూడా తెలంగాణా సాయుధ పోరాటం వైపు ఆసక్తి చూపాడు. తెలంగాణా గ్రామాల్లో రజాకార్ల ఆగడాలు పెరిగి కమలమ్మ కూడా అడవి బాట పట్టింది. అప్పటికి ఆమె వయసు పదహారు. పుట్టిన బిడ్డను వదినకు అప్పగించింది. గోసి పెట్టుకొని అంగీ తొడుక్కొని తుపాకి పట్టుకొనింది. విప్లవ ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నది. అయితే అజ్ఞాత జీవితంలో మళ్ళీ ఆమె గర్భవతి అయ్యింది. ఈ సారి కూడా మగ పిల్లవాడు పుట్టాడు.
చెప్పటానికి ఏడుపు వస్తది – కమలమ్మ
‘అడవిల మంత్రసాని లేక పోతే నా మగడు బయట నుండి మంత్రసానిని పిలిపించాడు. ఆవిడ వచ్చి కాన్పు చేసి పోయింది. చెప్పటానికి ఏడుపు వస్తది. ఆరు నెల్ల దాకా ఉంచుకొన్నా పిలగాడిని. ‘పిలగాడితో లోపల ఉండుట కుదరదు. ఎవరికైనా యివ్వు.’ అని చెప్పింది పార్టీ. అక్కడే ఎవరికైనా యిద్దామనుకొన్నా. కోయోళ్ళు ‘మా కొద్దమ్మ. పిలగాడు తెల్లగా ఉన్నాడు. మాకు పోలీసోళ్ళ నుండి లేని పోనీ బదనాయం వస్త’ దన్నారు. ఎవ్వరూ తీసుకోలా. ‘పిలగాడు ఏడ్చినడనుకో, అటువైపు పోలీసులు వెళుతుంటే మన పానాల మీదకు వస్తది. మందికియ్యాల్సిందే’ అన్నరు. ఒక నడీడు కామ్రేడును తోడు యిచ్చి గార్ల జాగీరుకు పోయి అటు నుండి బొగ్గుట (ఇప్పటి యిల్లెందు)కు బోయి పుట్ పాతు మీద పండబెట్టిరా’ అన్నరు. సరేనని ఒప్పుకొని బిడ్డను సంకలేసుకొని బయలుదేరి పోయినా. తెల్లారిందాక నడిచినం. అక్కడ ఎర్రగోపయ్య అని ఒక కామ్రేడు ఉండే. ‘ఈ పిచ్చి నీకు ఎట్టబట్టిందే. ఈ పిచ్చి ముచ్చట నీకెవరు పట్టించిడ్రు? బయట ఎట్ట పండపెడతరు?’ అని తిట్టిండు. అక్కడ ప్రజలను అడిగినం. ఒకాయనకు ముగ్గురు కొడుకులు పుట్టి చచ్చిపోయిరట. ‘నేను సాదుకొంటా పిలగాడ్ని’ అని ఒప్పుకొన్నడు. వాని చేతిలో బెట్టి బయలుదేరినా. అడవి నుండి బయటకు వచ్చాక పిల్లగాడి కోసం ప్రయత్నం చేద్దాము అనుకొంటే నేనే వద్దన్నాను. ఇన్ని నాళ్ళు పిల్లగాడు మనతో లేడని మనం బాధ పడ్డాము. ఇప్పుడు మనం వెళ్ళి వాడిని తెచ్చుకొంటే వాళ్ళు బాధ పదరా అన్నాను’ నిర్లిప్తంగా చెప్పింది కమలమ్మ.
‘దళంలో మాట్లాడుకొనే అవకాశం లేదు. నిర్భధం ఎక్కువగా ఉండేది. చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. దళంలో నలుగురు కంటే ఎక్కువ ఉండరు. సాయక్క, వెంకటక్కఅనే మహిళలు మా దళంలో వుండేవారు. మా ఆయన అప్పుడప్పుడు బయటకు వెళ్ళేవాడు. వంట మేమే చేసుకొనే వాళ్ళం. అప్పుడప్పుడు జనం దగ్గర తినేవాళ్లం. అడవిలో మాకు ప్రజలు అండగా ఉండేవాళ్లు. మేము ఎక్కువ రక్షణ ప్రాంతంలోనే ఉండేవాళ్లం. మా దళంమీద ఎప్పుడు దాడి జరగలేదు. నా మీద కేసులు లేవు. మా ఆయన మీద మస్తు కేసులు ఉండేవి. తరువాత కొట్టేశారు.’
సాయుధ విరమణ తరువాత జీవితం
ఐదు సంవత్సరాల అజ్ఞాత వాసం ముగిసింది. కమ్యూనిష్టు పార్టీ ఎన్నికల బరిలోకి దూకింది. ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా రాజేశ్వరరావు నిలబడ్డాడు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంది కమలమ్మ. రాష్ట్రమంతా తిగిగింది. అప్పన్న స్థానిక ఎన్నికల్లో గెలిచాడు. జీవితం మారిపోయింది. బతుకు పోరాటం మొదలయ్యింది. తరువాత మహిళా సంఘంలోను, బీడీ కార్మిక వర్గంలోను పని చేసింది కమలమ్మ.
‘మా ఆయన నక్సలైట్ల వైపు వెళ్లాలంటే నేనే ఆపాను. అప్పుడు తరిమెళ్ళ నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి మా యింటికి వచ్చారు. చంద్ర పుల్లారెడ్డి మా యింటను పుట్టినట్టే. మా కుటుంబం మొత్తం సిపిఐలో చేరాము. అందరం ప్రజానాట్య మండలిలో పని చేశాము. గొల్ల సుద్దులు చెప్పేదాన్నినేను. ముగ్గురం కలసి చెప్పాలి. జత గాళ్ళు ఇద్దరు. నేను కత చెప్తాను. నా దళంలో ఉన్న వెంకటమ్మను మగడు చంపిండు.’ ఎన్ని చెప్పినా మళ్ళీ దళం దగ్గరే ఆమె జ్ఞాపకాలు ఆగాయి. దళ జీవితాన్ని ఆమె ఇప్పటికీ మర్చిపోలేదు. అడవి జీవితంలోనే ఆమె అతి సంతోషంగా ఉండింది. ఆ రోజుల్లో ఉద్యమం తప్ప ఆమెకు వేరే ధ్యాస లేదు. దళాల్లో మహిళలను తక్కువగా చూస్తారా? అన్నమాటను కొట్టిపారేసింది.
‘అబద్దపు ముచ్చట’ – కమలమ్మకు కోపం వచ్చింది.
‘ఇగో బయట ఎన్నో పుడుతుంటాయి. రోజుకొక్కరి దగ్గర పండాం అని కూడా అన్నారు. పార్టీలో క్రమశిక్షణ వారికేమి ఎరుక? మనం ఉండే పద్దతి వాళ్ళకు తెలవదు. లోపల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఉద్యమం నాకేమీ తక్కువ చేయలేదు. చచ్చిపోయిన దాకా నన్ను ఆయన వదల లేదు. పార్టీలోకి పోయి కష్ట పడ్డా, విలువ దక్కింది. ఇప్పటికీ విలువ ఉంది. పార్టీతోనే బతకాలని అనుకొన్నాము.’
సౌత్ ఆఫ్రికా ఫోటో ఎగ్జిబిషన్ లో కమలమ్మ ఫోటో, చాకలి ఆయిలమ్మ ఫోటోలు పెట్టారు. ఎనిమిదివ తరగతి సోషల్ సైన్స్ యింగ్లీషు మీడియంలో కమలమ్మ గురించిన పాఠం ఉన్నది.
‘పని ఎప్పుడు చెడదు. పార్టీలో పనిలో మజా ఉంది.’ అంటుంది కమలమ్మ.
ఇంతలో దళంలో అమరుడైన గోపాలరెడ్డి ఆమెకు గుర్తుకు వచ్చినట్లుంది. కళ్ళు మూసుకొని మళ్ళీ పాడటం మొదలు పెట్టింది.
సై సై గోపాలా రెడ్డి
రెడ్డీ నువ్వు నిలిచావు ప్రాణాలొడ్డీ
ఔరౌరా నీ పేరు చెప్పితే హడలు దోపిడీ ధనిక దొంగలకు
పౌరుషం గల తెలుగు జాతి గౌరవం నిలిపినావు
సై సై గోపాలా రెడ్డి
రెడ్డీ నువ్వు నిలిచావు ప్రాణాలొడ్డీ !

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked