– అరాశ (అమరవాది రాజశేఖర్ శర్మ)
ఫోమును ప్రెస్ చేసి మోమంత చల్లేసి
కంపును కొంపంత నింపుతారు
క్రొవ్వొత్తులంటించి రివ్వుననూదుచు
నోర్పుగా దీపాల నార్పుతారు
కేరింతలనుగొట్టి కేకును ఖండించి
క్రీము ఫేసులకద్ది గెంతుతారు
సరదాలు పండించ సఖులంత వరుసగా
వీపుపై గ్రుద్దులు మోపుతారు
పిచ్చి కేకల బొబ్బల రెచ్చిపోయి
గాలి బుడగల పిన్నుతో కూలదోసి
అల్ల కల్లోల భావన నల్లుతారు
జన్మ దినమను పర్వమున్ జరుపువేళ
దేహమునిచ్చి పెంపుగొన దీవెనలిచ్చి సరాగమున్నిడన్
స్నేహితులై చెలంగి మది చింతలెరుంగని సౌఖ్యమిచ్చు స
మ్మోహన దేవతల్ గనగ మోదమగున్ తలిదండ్రులన్న దా
సోహమటంచు జన్మదిన శోభనమున్ ప్రణమిల్ల సౌఖ్యమౌ
వందనమిదె గొనుమా గో
విందా యని కోవెల జని వేడుక తోడన్
బృందా విహారిని జనన
పుం దినమున గన్న యమిత పుణ్యంబబ్బున్
వృద్ధ జనులకు సేవ సమృద్ధినిచ్చు
అర్థికోటికి సహకారమర్థమిచ్చు
మొక్కనాటిన మనసుకు ముదమునిచ్చు
జన్మదినమున యివ్విధి సలుప శుభము
-000-