ధారావాహికలు

రామాయణ సంగ్రహం ఏప్రిల్ 2020

యయాతి చరిత్ర

నహుషుడి కొడుకు యయాతి. యయాతికి ఇద్దరు భార్యలు. వాళ్లు దేవయాని, శర్మిష్ఠలు. దేవయాని కుమారుడు యదువు. శర్మిష్ఠ కుమారుడు పూరుడు. తండ్రికి చాలా ఇష్టుడు.

తండ్రి తనను సవతి తల్లి కొడుకు పూరిడిలాగా ఆదరించడం లేదని తన వైమనస్యం తన తల్లి వద్ద యదువు వెలిబుచ్చాడు. అప్పుడు దేవయాని కూడా బాధపడి తండ్రిని తలచుకొన్నది. శుక్రుడు (తండ్రి) వచ్చి యయాతిని నిరసించి తన కూతురును నిర్లక్ష్యం చేస్తున్నందుకు యయాతి వెంటనే జరాభారం వహించేటట్లు (ముసలివాడై పోయేట్లు) శపించాడు.

యయాతి చాలా పరితాపం పొందాడు. ”నాకింక విషయసుఖాలను అనుభవించాలన్న కోరిక తీరలేదు. నేను ముసలితనాన్ని భరించలేదు.” అని తన పెద్దకుమారుడైన యదువును కొంతకాలం తన ముసలితనాన్ని తీసుకొని అతడి యవ్వనాన్ని తన కిమ్మని అర్థించాడు. అసలే తండ్రి పట్ల అసంతృప్తితో ఉన్న యదువు అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు యయాతి పూరుణ్ణి అడిగాడు. పూరుడు వెంటనే ఒప్పుకున్నాడు. యయాతి పూరుడి యవ్వనాన్నిస్వీకరించి చాలా యేండ్లు లౌకిక సుఖాలు అనుభవించాడు, యజ్ఞయాగాదులు చేసాడు. దేవసముడనిపించుకున్నాడు. తృప్తిపడ్డాడు. కామ్యసుఖాలతో , పూరుడికి మళ్ళీ యవ్వనం ఇచ్చి అతడి దగ్గర న్యాసంగా ఉంచిన తన జరాభారాన్ని తీసుకున్నాడు. పూరుణ్ణి వంశకర్త అయ్యేట్లు దీవించాడు. యదువును రాక్షసులలో కలిసి పోయేటట్లు శపించాడు. పూరుడికి పట్టాభిషేకం చేశాడు. యయాతి. పూరుడు ప్రతిష్టానపురం రాజధానిగా పేరు ప్రతిష్టలతో రాజ్యం పాలించి వంశకర్త అయినాడు. యదువు రాజకులం నుంచి బహిష్కృతుడై ‘క్రౌంచావనం’ అనే ప్రాతంలో రాక్షస చేష్టలతో జీవించాడు.” అని ఈ కథ లక్ష్మణుడికి శ్రీరాముడు చెబుతూ ‘చూడు లక్ష్మణా ! శుక్రుడు తనపట్ల \ క్రోధంతో శపించినా, యయాతి ప్రతిశాపం ఇవ్వలేదు. అతడి శాంతం అతడికి రక్ష అయింది, స్వర్గధామం లో ఇంద్రుడి మర్యాదలు పొందాడు. అదే నిమి, కులగురువు అని కుడా చూడకుండా వశిష్ఠుల వారికి ప్రతి శాపమిచ్చినాడు. అందువలన మనం రోషాన్ని దారికి రానీయకూడదు’ అని లక్ష్మణుడికి పూర్వరాజన్యుల చరితలు బోధపరచాడు. ఒక రోజు శ్రీరాముడు కొలువుకూటంలో ఉండగా సుమంత్రుడు వచ్చి ‘శ్రీరామ! యమునాతీరంలోని బ్రాహ్మణులు నీ దర్శనార్థం వచ్చి వేచి ఉన్నారు’ అనే సమాచారం విన్నవించుకున్నాడు.

శ్రీరామచంద్రుడు వెంటనే వాళ్ళను తీసుకొని రావలసిందిగా కోరాడు. వాళ్ళు తమకు అర్హమైన కానుకలు తెచ్చి శ్రీరాముడికి సమర్పించాడు. శ్రీరాముడు వాళ్ళకు అతిధి సత్కర్యాలు జరిపి వారి రాకకు కారణం తెలుసుకోగోరాడు. చేతులొగ్గి బ్రహ్మవేత్తలపై అయన చూపుతున్న పూజ్యభావం చూసి వాళ్ళు శ్రీరాముణ్ణి ఎంతగానో ప్రశంసించారు. అప్పుడు ఆ ఋషుల తరపున చ్యవనుడనే ముని శ్రీరాముడికి తమ బాధలు ఇట్లా విన్నవించుకున్నాడు. అందుకు పూర్వరంగం ఏమిటో ముందుగా ప్రస్తావించాడు. కృతయుగంలో ‘లోల ‘ అనే కాంతకు ‘మధువు ‘ అనే కొడుకుండేవాడనీ, వాళ్ళది రాక్షసవంశమే అయినా మధువు సాధుస్వభావంతో గొప్ప తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించగా ఆ మహాదేవుడు ప్రత్యక్షమైన తన శూలం నుంచి గొప్ప శక్తిగల ఇంకొక శూలం సృష్టించి మధువుకు అనుగ్రహించి దీనివల్ల శత్రుదమానం చేస్తూ నీవు

అజేయుడి వవుతావని మధువుకు వరప్రదానం చేశాడు . ‘అయితే దేవతలను, బ్రాహ్మణులను నీవు హింసించకూడదు’. అని నియమం విధించాడు. ‘వాళ్ళలో ఎవరిపై ఇది ప్రయోగించినా నిష్పలమవుతుంది’. అని కుడా చెప్పాడు. అప్పుడు మధువు దానిని తనకు వంశపారంపర్యంగా అనుగ్రహించ వలసిందిగా శివుణ్ణి అభ్యర్థించాడు. కాని అందుకు ఆయన ఆమోదించలేదు’. నీ కొడుకుకు మాత్రం ఇది శత్రుసంహారక మహాస్త్రంగా ఉపకరిస్తుంది’. అని గ్రహించాడు. మధురాక్షసుడి భార్య కుంభీనసి, విశ్రవో బ్రహ్మకు ఈమె అనల ద్వారా జన్మిచింది. మధువుకూ, కుంభీనసికీ పుట్టినవాడు లవణుఁడు. వాడు బాల్యం నుంచీ దుర్మార్గప్రవృత్తి నవలంభించాడు. పరమక్రూరుడైపోయినాడు. వాడి పాపప్రవృత్తిని తండ్రి అసహ్యించు కున్నా పుత్రవ్యామోహంతో ఏమీ చెయ్యలేక పోయినాడు. అయినా మధువు తన కొడుక్కు శివుడు తనకు అనుగ్రహించిన శూలాన్ని ఇచ్చి దాని ప్రభావాన్ని చెప్పాడు. ఇక ఈ శూలం కూడా వశం కావడంతో లవణుడు మరింత దుర్మార్గుడైనాడు. పేట్రేగి పోయినాడు. స్త్రీలనూ, ఋషులనూ వేధించసాగాడు. ”వీడి బాధలు మేము భరించలేకపోతున్నాము. సహించలేక పోతున్నాము. మేము భూవలయంలో భూపతులను ఎందరిని వేడుకున్నా వాళ్ళు ఉపేక్షించారే కాని మమ్మల్ని రక్షించే వాళ్ళే లేకపోయినారు. నీవు రావణ సంహారం చేసిన తర్వాత మాకు ఊరట కలిగింది. ధైర్యం వచ్చింది. ఇక నీదే భారం”- అని తమ బాధలను విన్నవించుకున్నారు. ఋషులు. అప్పుడు శ్రీరాముడు ఆ లవణుడి దినచర్యను, అలవాట్లను, నియమితమైన నివాసస్తానాన్ని గూర్చి ఆ ఋ షులనడిగి తెలుసుకున్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked