– భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
బిల్డింగులు రంగులు మార్చుకుంటున్నాయి,
పగుళ్ళను పాలిష్ లలోదాచుకుంటున్నాయి.
తెల్లబడిన మధ్య వయస్కుల తలలు,
తమ జుట్టును నల్లరంగుతో కప్పుకుంటున్నాయి.
ఈడొచ్చిన పిల్లల ఆలోచనలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి.
సాంప్రదాయాలను,కట్టుబాట్లను విడిచి
తమ ఇష్టం వచ్చిన వారితో ఎగిరిపోమంటున్నాయి.
కన్నవారి గుండెల్లో ఆ పనులు ఆరని మంటలౌతున్నాయి.
వేరుపడి పోవటాలు అనివార్యమౌతున్నాయి,
విచక్షణా రహితమైన వెర్రి చర్యలౌతున్నాయి.
బిల్డింగులు మనసు లేనివి కనుక,
తమ మనుగడను యాంత్రికంగానే సాగిస్తున్నాయి.
తల్లితండ్రుల మనసులు మాత్రం
పగిలిన తమ హృదయాలతో,
పరులకు చెప్పుకోలేని పరితాపంతో,
జీవితాలను కొనసాగిస్తున్నాయి.
మనసును చంపుకుంటున్న జంటలు మాత్రం
తామిద్దరే తమ లోకం,
తమతో పెద్దలుంటే శోకం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి.
స్కూళ్ళు రాంకులపేరిట పిల్లలను రాచిరంపాన పెడుతున్నాయి,
మార్కెట్లో పండగలోచ్చేసరికి పువ్వులు,పళ్ళ రేట్లను
అమాంతం రెట్టింపు అవుతున్నాయి.
ఏమేనా అంటే,మేమూ బ్రతకాలనే నినాదాన్ని వినిపిస్తున్నాయి.
బ్యాంకుల పనిదినాలు తరిగి జనాల అవస్థలను పెంచుతున్నాయి.
ఏటిఎం ల పనితీరులు పగలబడి నవ్వేటట్లు కనబడుతున్నాయి,
అవసరాలు తీరని జనాల ఏడుపులు కుయ్యో మొర్రో అంటూ వినబడుతున్నాయి.
సీట్లకు మించిన జనాలతో బస్సులు ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి
సమయానికి రాకుండా ఎదురుచూసే వారిని
తమ ఆలస్యంతో అసహనానికి గురిచేస్తున్నాయి.
పెద్ద చదువులు చదివినా రాని కొలువులు
కొందరికి అలుపును తెప్పిస్తున్నాయి.