వీక్షణం సాహితీ గవాక్షం-103 వ సమావేశం
-వరూధిని
వీక్షణం-103 వ సమావేశం అంతర్జాల సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా మార్చి 14, 2021 న జరిగింది.
ఈ సమావేశంలో ముందుగా శ్రీ,మతి గునుపూడి అపర్ణ “కృతి, భాషాకృతి, భావనాకృతి, శ్రవ్యాకృతి ” అనే అంశం మీద ప్రసంగించారు. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, భక్త రామదాసు మొ.న వాగ్గేయకారులు రచించిన అనేక కీర్తనల్ని అపర్ణ గారు సోదాహరణంగా ప్రస్తుతించారు. కర్ణాటక సంగీత కృతుల్లో ఉన్న సంగీత సాహిత్య విశేషాల గురించి వివరిస్తూ, కీర్తనల్ని రాగయుక్తంగా ఆలపిస్తూ దాదాపు గంటసేపు ప్రసంగించి సభికుల్ని మంత్రముగ్ధుల్ని చేసేరు.
ముందుగా ముత్తుస్వామి దీక్షితుల కృతిలో “గురుగుహ మాతుల కాంతాం లలితాం” అంటూ లక్ష్మీ దేవిని సంబోధించడం వెనుక అర్థాన్ని వివరించారు. త్యాగరాజ కృతుల్లో “మా జానకి చెట్టాపట్టగ మహారాజువైతివి”, “బ్రోవభారమా” మొ.న వాటి అర్థ వివరణ చేస్తూ భాషలోని భావానికి సరిపడా మంద్రం, హెచ్చు స్వరాల్లో సంగీతాన్ని సమకూర్చిన అద్భుతాల్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా త్యాగరాజ కృతుల్లో పరనింద, ఆత్మస్తుతి అక్కడక్కడ కనిపిస్తాయన్నారు.
భక్త రామదాసు “ఇక్ష్వాకు తిలకా..” కీర్తనలో “కలికితురాయిని మెలకువగా చేయిస్తి, నీవు కులుకుతూ తిరిగేవు ఎవడబ్బ సొమ్మని” అనడం భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉన్న చనువు, అధికారానికి ఉదాహరణ అని అన్నారు.
ఇక శ్రవ్యతలోని గొప్పదనానికి ఉదాహరణగా బాలమురళీకృష్ణ గారు తోడి రాగంలో ఆలపించిన “మా మానినీ నీ ధామము గని” కీర్తనని పేర్కొన్నారు. ఇందులో “నీ దాసరిని కదా” అన్నపుడు దా…స….రి… ని… అని స్వరస్థానాలకనుగుణంగా పలకడం అత్యంత విశేషమని అన్నారు.
చివరగా అపర్ణ గారు స్వయంగా రచించిన పాటలు, నృత్యరూపకాలలో పదాలు, స్వరాల మేళవింపుని సోదాహరణంగా వివరిస్తూ ముగించారు.
ఈ సందర్భంగా తరువాత జరిగిన చర్చలో శ్రీ ఆరి సీతారామయ్య, శ్రీ కిరణ్ ప్రభ , డా. కె.గీత, శ్రీమతి రత్నామూర్తి, శ్రీమతి ఉదయలక్ష్మి , శ్రీ ప్రసాదరావు గోగినేని, శ్రీ ప్రసాద్ నల్లమోతు, శ్రీమతి సుచేత, శ్రీ సుభాష్, శ్రీమతి షర్మిల, శ్రీమతి భవాని, శ్రీ వేమూరి మొ.న వారు పాల్గొన్నారు.
ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో దాలిరాజుగారు పేరడీ పాటను, డా. కె.గీత గారు వచన కవితని చదివి వినిపించారు.
ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులే కాకుండా, అంతర్జాతీయ ప్రముఖులు కూడా పాల్గొని సభను జయప్రదం చేశారు.
వీక్షణం-103 వ సమావేశాన్ని “వీక్షణం” యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు.
————