-వరూధిని
వీక్షణం-110 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా అక్టోబర్ 10, 2021 న జరిగింది.
ఈ సమావేశంలో శ్రీమతి రాధికా నోరి గారు ” సి నా రె – యుగళగీతాలు” అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు.
రాధిక గారు ముందుగా సి.నారాయణరెడ్డి గారి గురించి, ఎన్నుకున్న ప్రసంగాంశం గురించి మాట్లాడుతూ “నారాయణరెడ్డి గారు గొప్ప కవి, రచయిత, నాటకకర్త, సంగీతకర్త, గాయకులు, సాహితీవేత్త, ప్రొఫెసరు, రాజ్యసభ మెంబరు, సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీత, అంతేకాకుండా మన సాహిత్య ప్రపంచంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడా. ఈవేళ నేను చలనచిత్రాల కోసం ఆయన రాసిన గీతాల గురించి మాట్లాడదాము అనుకొంటున్నాను. ఆయన మన చలనచిత్రాలలో సుమారుగా మూడు వేలకు పైగా పాటలు రాశారు. అన్ని జానర్స్ లోనూ రాశారు. వాటన్నిటి గురించి చెప్పటం కూడా సాధ్యం కాదు. అందుకని కేవలం ఆయన రాసిన కొన్ని యుగళగీతాల గురించి మాత్రం చెప్పదలచుకున్నాను. యుగళగీతాలు అంటే రెండు గళాలు వున్న పాటలన్నమాట. అసలు నారాయణరెడ్డి గారు చలనచిత్రాలలో తన ప్రవేశమే ఒక చక్కటి యుగళగీతంతో మొదలెట్టారు. 1962 నుంచి రాసిన యుగళగీతాలు ఇప్పటికీ నవనూతనాలే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.” అని ప్రారంభించారు.
రాధిక గారు తమ ప్రసంగం ఆద్యంతం గొప్ప గానమాధురిమతో అన్ని గీతాల్ని గొంతెత్తి రాగయుక్తంగా ఆలపిస్తూ సభలోని వారందరినీ అలరించారు.
ముందుగా సి నా రె గారి యుగళగీతాల్లో శృంగార గీతాల గురించి ప్రస్తావిస్తూ
“నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని / పూలదండవోలె / కర్పూర కళికవోలె /ఎన్ని యుగాలైనా / ఇది ఇగిరిపోని గంధం”
“ఏమో ఏమో ఇది / నాకేమో ఏమో అయినది/ ఈ వేళలో / నా గుండెలో / ఏదో గుబులవుతున్నది”
“సొగసైన కనులేమో నాకున్నవి / చురుకైన మనసేమో నీకున్నది/కనులేమిటో / ఈ కథ ఏమిటో / శృతి మించి రాగాన పడనున్నది / పడుతున్నది”
“బుగ్గ గిల్లగానే సరిపోయిందా / గిలిగిలి గిలిగిలి నవ్వగానే అయిపోయిందా”
వంటి గీతాల్ని ఉదహరించారు.
“అటు సందర్భానికి తగ్గట్లుగా, ఇటు అందరికీ సులభంగా అర్థం అయ్యేలా, ఇంకోపక్క ప్రాస బాగాకుదిరేట్టుగా, ఇలా అన్ని విధాలా నప్పేట్లుగా రాయటం ఆయన ప్రత్యేకత. అలాగే ప్రేమ గురించి నారాయణరెడ్డిగారి పాటలు వింటూ వుంటే ఇదే కదా నిజమైన ప్రేమ అనిపిస్తుంది.” అంటూ
“జడలోన మల్లెలు జారితే / నీ ఒడిలో ఉన్నాననుకున్నా.. /చిరుగాలిలో కురులూగితే / నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో/ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా..!!/హసీనా.. ఓ.. హసీనా.. ”
పాటని పాడి వినిపించారు.
చిన్నప్పుడు నారాయణరెడ్డిగారి చదువంతా ఉర్దూ మీడియం లో జరిగింది. అందుకని ఆయనకి ఆ భాష మీద చాలా గొప్ప ప్రావీణ్యత వుంది. అవసరమైనపుడు సందర్భానికి చక్కగా అతికేటట్లుగా ఆయన ఉర్దూ పదాలు వాడేవారు. అవి అన్యభాషా పదాలుగా కాకుండా ఆ పాటలో కలిసిపోయేవి. అలాంటిదే ఈ పాట. ఈ పాటలో సిపాయి, హసీనా అన్నవి ఉర్దూ పదాలు. కానీ అవి సందర్భానికి సమకూరాయి కాబట్టి, ఆపాట పాడేవారు ముస్లిములు కాబట్టి ఆ ఉర్దూ పదాలని ఆయన తెలివిగా అక్కడ వాడుకున్నారు.
మరికొన్ని ప్రేమపాటలకి ఉదాహరణలుగా
“నీ నడకలోన రాజహంస అడుగులున్నవి”
“తడిసీ తడియని నీలికురులలో / కురిసెను ముత్యాలూ” మొ.వి పేర్కొన్నారు.
సినారె గారి పదమాధుర్యాన్ని వివరిస్తూ –
“లలిత లలిత యువ పవన చలిత పల్లవ దళాలలోనా/రమణీయ కుసుమ రమణీరంజిత భ్రమరగీతిలోనా”
“కెరటానికి ఆరాటం / తీరం చేరాలని/తీరానికి వుబలాటం / ఆ కెరటం కావాలని”
ఈ పదాలు వింటేనే చాలు, మనం తేలికగా చెప్పెయ్యచ్చు, ఈ పాట నారాయణరెడ్డి గారు రాసారని. ఆయన ముద్ర అన్నమాట. ” అన్నారు.
నారాయణరెడ్డిగారు సంభాషణ రూపం లో కూడా పాటలు రాశారు. 1963 లో అలాంటిదే ఈ పాట చాలా జనాదరణ పొందింది. ఇది ఇద్దరి ప్రేమికుల మధ్య పాటలాగా జరిగిన అతి సరళమైన, రాగయుక్తమైన సంభాషణ.
“మబ్బులో ఏముంది/ నా మనసులో.. ఏముంది/
మబ్బులో..కన్నీరు/నీ మనసులో..పన్నీరు
నేనులో ఏముంది../నీవులో..ఏముంది
నేనులో..నీవుంది / నీవులో..నేనుంది”
వంటివి ఇందుకు ఉదాహరణలు.
నారాయణరెడ్డిగారి అత్యంత జనాదరణ పొందిన యుగళగీతాల్లో తోటలో నా రాజు పాట ఒకటి. విశ్వనాధగారి ఏకవీరను చలనచిత్రంగా తీసినప్పుడు నారాయణరెడ్డిగారు మొదటిసారిగా దానికి సంభాషణల తో పాటు కొన్ని పాటలు కూడా రాశారు.
తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
నవ్వులా అవి కావు నవ పారిజాతాలు
రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా
అపరంజి కలలన్ని చిగురించునా
హీరో, హీరోయిన్ల ఉదాత్తమైన పాత్రలకి యుగళగీతాలు రాయటమే కాకుండా ఒక ప్రతినాయకునికి, అంటే, ఒక విలనుకి అన్నమాట, ఒక మంచి పాట రాసి అందరి మెప్పును పొందారు ఆయన. ఇప్పటిదాకా చలనచిత్ర చరిత్రలో దుర్యోధనుడి గురించి ఇంత అద్భుతమైన పాట రాసినవారు మరొకరు లేరు. హీరో, హీరోయిన్ల పాటలతో సమానమైన జనాదరణను పొందింది ఈ పాట.
మచ్చలేని నెలరాజువు నీవే
మనసులోని వల రాజువు నీవే
రాగభోగ సుర రాజువు నీవే
రాజులకే రారాజువు నీవే
ధరణి పాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా
స్వాగతం సుస్వాగతం
అంటే దుర్యోధనుడిలో ఏవైనా కాస్త మంచి గుణాలు వుంటే వాటిని బయటికి వెలికి తీసి, అందరికీ తెలిసేలాగా వాటిని వర్ణించి, కాస్సేపు ఆయన దుర్గుణాలని మనందరం మర్చిపోయేలాగా చేసిన ఆ పాటని అంత జనాదరణ పాలు చేసిన ఘనత ఖచ్చితంగా నారాయణరెడ్డిగారికి చెందుతుంది.
ఇలా ఒకదాని మించి ఇంకొకటి ఎన్నో యుగళగీతాలు, ఎన్నో జానర్స్ లో నారాయణరెడ్డిగారు రాశారు. అన్నీ ఆణిముత్యాలే! అన్నీ జనరంజకాలే!
నారాయణరెడ్డి గారు రాసిన ఏ పాటైనా మన ఆత్మలను సంపూర్తిగా ఆకట్టుకుని వాటి చేత అనేక తీరుల పలికించాయి. అలాగే ఈ యుగళగీతాలు కూడా సున్నితంగా మన మనసులను తాకి వాటి భావాలు అక్కడ శాశ్వతంగా తిష్ఠ వేసేట్టు చేసాయి. చాలా సులభ రీతిలో, చాలా తేలికైన పదాలు వాడి, సందర్భానికి తగిన పాటలు, మనందరినీ సమ్మోహనపరిచే పాటలు రాసి నారాయణరెడ్డి గారు మన మనసులలో చెరగని ముద్రలు వేశారు.” అని ముగించారు.
ఆ తర్వాత జరిగిన కవిసమ్మేళనంలో డా||కె.గీత, శ్రీమతి భవాని, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ దాలిరాజు వైశ్యరాజు, శ్రీ టి. పి.ఎన్. ఆచార్యులు, శ్రీమతి రాధికా నోరి మొ.న కవులు పాల్గొన్నారు.
ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో స్థానిక సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొని సభను జయప్రదం చేశారు.
వీక్షణం-110 వ సమావేశాన్ని “వీక్షణం” యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు.
******