వీక్షణం

వీక్షణం – 93 వరూధిని


వీక్షణం-93-వరూధిని ఏప్రిల్ నెల సమావేశం లాగానే ఈ నెల వీక్షణం సమావేశం కూడా ఆన్ లైను సమావేశంగా మే 17, 2020 న జరిగింది.
కరోనా కష్టకాలంలో సాహిత్యమే ఊపిరైన బుద్ధిజీవులకు కాలిఫోర్నియాలోని “వీక్షణం” సేదతీర్చే చెలమ అయ్యింది. ఆన్ లైను సమావేశాలు కావడం వల్ల దూర ప్రాంతాల వారు కూడా సమావేశాలకు హాజరు కాగలుగుతున్నామని అంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మొదటి సెషన్ పరిచయ కార్యక్రమం. సమావేశానికి కొత్తగా వచ్చిన యువ కవి వెంకట్, బే ఏరియా నివాసి గోపినేని ప్రసాదరావు గార్ల పరిచయంతో సమావేశం మొదలయ్యింది.
రెండవ సెషన్ “ప్రసంగం” లో భాగంగా డా|| కె.వి.రమణరావు ‘ఆధునిక కవిత్వపు తీరుతెన్నులు ’ అనే అంశంపైన నలభై నిముషాలు ప్రసంగించారు. ఆ ప్రసంగ సారాంశం ఇది:-

“సంప్రదాయ కవిత్వానికంటే పూర్తిగా భిన్నమైన సాహిత్య ప్రయోజనం, వస్తుశిల్పాలతో ఇరవయ్యో శతాబ్దారంభంలో ఆధునిక కవిత్వం మొదలైంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కవిత్వంలో మార్పు వస్తూనే ఉంది.

మిగతా ప్రక్రియలతోపాటు ఆధునిక కవిత్వాన్నికూడా గురజాడే 1910 ప్రాంతంలో ప్రారంభించాడు. అంతేకాకుండా వస్తువులో నేటికీ స్వీకరించబడుతున్న వివిధ ఆధునిక ధోరణులనుకూడా ఆయనే మొదలుపెట్టాడు. వీటిలో దేశభక్తి, సంస్కరణ, అభ్యుదయ, భావకవిత్వాలు, దళిత, స్త్రీవాద దోరణులకు సంబంధించిన కవిత్వం, వ్యంగ్యగీతాలు, పిల్లల పాటలు ఉన్నాయి.
తరువాత 15 – 20 సంవత్సరాలకు ఆధునిక కవిత్వం ఊపందుకుని అనేక కవులు గురజాడ ప్రారంభించిన మార్గాలను ముందుకు తీసుకెళ్లి, పెంపొందించి, విస్తృతపరచి ఉత్తమ కవిత్వాన్ని సృజించారు. వీరిలో రాయప్రోలు, నాయని, జాషువ, దేవులపల్లి, అడవిబాపిరాజు, నండూరి, బసవరాజు అప్పారావు, విశ్వనాథ, కొడాలి, గరిమెళ్ల, శ్రీ శ్రీ, శిష్ట్లా, నారాయణబాబు, పఠాభి, తురగా, చదలవాడ, పెండ్యాల లో్కనాధం, అనిసెట్టి, బైరాగి, ఏల్చూరి, కేవిఆర్, దాశరధి, కుందుర్తి, పురిపండాలాంటి కవులెందరోవున్నారు.

శ్రీ శ్రీ కవిత్వప్రభావంతో యాభైల తరువాత ఆధునిక కవిత్వ తీరుతెన్నుల్లో రెండో పెనుమార్పు వచ్చింది. విప్లవ, అనుభూతి, మార్మిక, సర్రియలిస్టిక్ కవిత్వంలాంటి ధోరణులు మొదలయ్యాయి.

డెబ్భైలనుంచి ఒకవైపు విప్లవ కవిత్వం, మరోవైపు అభ్యుదయకవిత్వ నేపథ్యంలో తిలక్, అజంతా, వేగుంట మొదలైన కవుల రచనలతో నూతనకవిత్వం రూపుదిద్దుకుంది. ఇందులో అజంతారాసిన కవిత్వం భాష, వస్తుశిల్పాలరీత్యా ప్రత్యేకంగావుండి కొత్తదారులు తెరిచి ప్రస్తుతం వస్తున్న కవిత్వానికి ప్రేరణగా నిలిచింది.

ఐతే ఆధునిక కవిత్వంతోపాటూ సంప్రదాయ, భావకవిత్వాలుకూడా పాత కొత్త శిల్పాలతో సమాంతరంగా ఇప్పటికీ వస్తూనే ఉండడం గమనించాల్సిన విషయం.

ఇప్పుడు వస్తున్న ఆధునిక కవిత్వం అనుభూతి ప్రధానంగావుండి సరళ, క్లిష్ట ధోరణులు విడిగా, కలసి కనిపిస్తున్నాయి. భాషలో కొత్తదనం, అవధులు లేని భావావేశం, లోతైన గాఢత, విస్తృతమైన ప్రతీకలు, పదబంధాలు, చిత్రబంధాలు, భావచిత్రాలు, మార్మికత, మ్యాజిక్ రియలిజంలాంటి అనేక శిల్పమార్గాల్లో భావాలు అభివ్యక్తీకరింపబడుతున్నాయి.

ఆధునిక కవిత్వంలోని వస్తువు స్థూలంగా రెండురకాలుగా ఉంటోంది. విప్లవ, స్త్రీవాద, దళిత, కర్షక, మైనారిటి, ప్రాంతీయ ఇలాంటి ధోరణులలోనూ లేదా ఏధోరణికి చెందని అనిబద్ధ కవిత్వంగాను రాస్తున్నారు. కొన్ని ధోరణులు ఉద్యమస్థాయికికూడా చేరాయి. అవగాహన, చైతన్యం, పోరాటోద్వేగం విస్తరిస్తున్న కారణంగా ఈరకమైన కవిత్వంలో ప్రతీకాత్మక స్వానుభవ అనుభూతి ప్రకటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

అనిబద్ధ కవిత్వంలో ప్రకృతి, స్త్రీ, అమ్మ, నిరాశ, ప్రేమ. శృంగారం, విరహం, మానవసంబంధాలు, వలస, ఆకలి, కార్మికులు, బాలకార్మికులు, జీవితం, అంతరంగం, రాత్రి, వైరాగ్యం, కాలం, వయస్సు, ఙ్ఞాపకం, నగరం, స్వంతవూరులాంటి వైవిధ్యమైన వస్తువు కనిపిస్తూంది.

ఆధునికకవిత్వం ఛిద్రమౌతున్న జీవితపు, సమాజపు లోతుల్లోకి వెళ్లి ఇంతవరకూ కనపడని అనేక కొత్తవిషయాలను, గాఢమైన అనుభవాల అనుభూతులను కొత్తరూపాల్లో వెలికితీసి ప్రకటిస్తూ, పంచుతూ ఆధునికసాహిత్య ప్రయోజనమైన చైతన్య విస్తరణకు తోడ్పడుతూ ముందుకు కదులుతున్నది.”
ఆధునిక కవిత్వంలో ఒక శతాబ్ది కాలాన్ని ప్రతిభావంతంగా నలభై నిమిషాలలో పరిచయం చేసిన రమణారావు గారిని అంతా అభినందించారు.

తరువాత జరిగిన కవిసమ్మేళనం లో భాగంగా శ్రీధర్ రెడ్డి గారు “కరోనా ఉపకారం” అనే కవితను, డా|| గీత “బంగారమంటి” కవితను, వ్యాసరాజు గారు “మందుబాబుల మొర” కవితను, వెంకట్ “మలయ మారుతం” అనే కవితను చదివి వినిపించారు.
తరువాత కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో సాహితీ క్విజ్ అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది.
సమావేశం చివరి అంశంగా చక్కని లలితగీతం పాడి ముగింపు వాక్యం పలికారు శ్రీమతి సుభద్ర గారు.
ఇంకా ఈ సమావేశంలో బే ఏరియా సాహిత్యకారులు, సాహిత్యాభిమానులు అయిన శ్రీమతి అపర్ణ గునుపూడి, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి శారదా కాశీవజ్ఝల, శ్రీమతి ఉమావేమూరి, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి ఫణి రాధా కుమారి, శ్రీమతి పద్మ శానంపూడి, శ్రీ లెనిన్ , శ్రీ రాజా, శ్రీ సంపత్ రెడ్డి, శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు, శ్రీ ప్రసాద్ నల్లమోతు మొ.న వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked