శ్రీరామరాజ్యం గూర్చిన ప్రశంసలు సర్వకాలాల్లో జనులు చెప్పుకున్నారు. ( ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు). యజ్ఞయాగాలు ఎప్పుడు నిర్వహించినా బంగారు సీతాదేవి విగ్రహాన్ని తనతోపాటు ఉంచుకొని ఆ పుణ్యకార్యాలు నిర్వర్తించాడు శ్రీరాముడు.
శ్రీరామరాజ్వంలో అతివృష్టి, అనావృష్టులు ఉండేవికావు. పంటలు పుష్కలంగా పండేవి. భూమి సస్యశ్యామలంగా ఉంటూ వచ్చింది.
ఆ తరువాత కొంతకాలానికి కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయీదేవి పరమ పదించారు. శ్రీరాముడూ, శ్రీరామసోదరులూ వారికి భక్తిప్రపత్తులతో పితృకర్మలు నిర్వర్తించారు. పదకొండువేల సంవత్సరాలు శ్రీరాముడు రాజ్యం చేసి ప్రజలను సుఖపెట్టాడు.
భరతుడి మేనమామ యుధాజిత్తు శ్రీరాముడికి తన పురోహితుడు అయిన గార్గ్యుడితో రత్నరాశులు, శ్రేష్టమైన వేల సంఖ్యలో గుర్రాలు, వెలలేని ఆభరణాలు కానుకగా పంపించాడు. గార్గ్యుడు ఆంగిరసుడి పుత్రుడు. చాలాదూరం ఎదురు వెళ్ళి శ్రీరాముడు ఆ మహర్షిని గౌరవించి ప్రీతుణ్ణి చేశాడు.
రఘువంశం
అప్పుడు గార్గ్యుమహర్షి సింధునది ఉభయతీరాలలో గంధర్వులు కోట్ల సంఖ్యలో ఒక నగరం ఏర్పరచుకొని లోకోపద్రవం కలిగిస్తున్నారనీ, వాళ్ళను నిర్జించి వాళ్ళ నగరాన్న నీవు వశపరచుకోవలసిందనీ శ్రీరాముడిని కోరాడు. అప్పుడు శ్రీరాముడు భరతుని ఆతని కుమారులైన ‘తక్షుడు, పుష్కలుడు” అనే వారిని పంపగా యుధాజిత్తు సహాయంతో ఆ గంధర్వులను వాళ్ళు పారద్రోలారు. ఆ రాజ్యాన్ని భరతుడు స్వాధీనం చేసుకొని
అక్కడ తక్షశిల, పుష్కలావర్తము అనే రెండు మహానగరాలు నిర్మింపచేసి తన కుమారులను అక్కడ రాజ్యాభిషిక్తులను చేశాడు.
ఈ విధంగా భరతుడి కుమారులు రాజ్యాభిషిక్తులైన తర్వాత శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడి కుమారులైన అంగదుడు, చంద్రకేతువులకు కూడా రాజ్యాలు ఏర్పరచాలని కోరిక కలిగింది. భరతుడితో, లక్ష్మణుడితో సంప్రదించి ‘కారుపథం” అనే అత్యంతశ్రేష్టమైన, సారవంతమైన నేలలు గల దేశంలో ‘“అంగదీయము’ ‘చంద్రకాంతము’ అనే నగరాలు నిర్మింపచేసి అక్కడ వాళ్ళను పట్టాభిషిక్తులను చేశాడు. భరతుడు కారుపథంలో ఒక సంవత్సరకాలం ఉండి తమ్ముడి కుమారులను రాజ్యపరిపాలనలో సుప్రతిష్టితులను చేసి మళ్ళీ అయోధ్యకు తిరిగి వచ్చాడు. లక్ష్మణభరతులతో కలసి శ్రీరామచంద్రుడు ప్రజాక్షేమంకరుడై అయోధ్యాపాలనం చేస్తున్నాడు.
తాపసవేషంతో యమధర్మరాజు ఆగమనం
ఇట్లా శ్రీరాముడు శుభకరుడై పరిపాలన చేస్తుండగా యమధర్మరాజు ఒక రోజు తాపసవేషం ధరించి శ్రీరామచంద్రుణ్ణి దర్శించటానికి వచ్చాడు. ఆ సమయంలో కోటద్వారం వద్ద లక్ష్మణుడున్నాడు. యముడు లక్ష్మణుడితో ‘నేను అతిబలుడనే మహర్షి శిష్యుణ్ణి. గురువు పంపగా శ్రీరాముణ్ణి చూడటానికి వచ్చాను” అని లక్ష్మణుడికి తన రాకకు కారణం వివరించాడు. వెంటనే శ్రీరాముడి కీ విషయం తెలియజేసి ఆయన్ను అన్నగారి సమక్షానికి తీసుకొని వెళ్ళాడు లక్ష్మణుడు.
ఆ వచ్చిన తపస్వి శ్రీరాముణ్ణి జయోస్తు’ అని దీవించాడు. ఆ తపస్వివరేణ్యుడికి నమస్కరించి, అర్ఘ్యపాద్యాది విధ్యుక్త సత్కారాలు చేసి ‘సేలవీయండి మీ అభిమతం’ అని ఆయన్ను కోరాడు శ్రీరాముడు. అప్పుడా తాపసి ‘శ్రీరామా! మనమిద్దర మిప్పుడు ఏకాంతంగా మాట్లాడుకోవాలి. అది పరమరహస్యమైన దేవకార్యం. మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా ఇక్కడకు వస్తే అతడు వధార్హుడు. ఈ కఠోరనిబంధనను అక్షరాలా పాటిస్తే కాని నేను వచ్చిన పని ఏమిటో చెప్పటానికి వీలుపడదు” అని నియమం విధించాడు ఆ ప్రచ్చన్నముని. శ్రీరాముడప్పుడాయనకు ప్రతిజ్ఞాపూర్వకంగా అంగీకారం తెలిపాడు.
శ్రీరామచంద్రుదప్పుడు ‘భవనద్వారం వద్ద నా దగ్గరకు ఎవరినీ రానీయకుండా నీవు కాపలా ఉండు. అట్లా ఎవరైనా వస్తే అతడు మరణ దండనకు పాత్రుడవుతాడని కూడా కాఠినంగా చెప్పు’ అని లక్ష్మణుణ్ణి నియోగించాడు ‘మా ఏకాంతాన్ని ఎవరు చెరచినా ఆ వ్యక్తికి మరణదండన తప్పదు అని నేను ప్రతిజ్ఞ చేశాను అని కూడా లక్ష్మణుడికి చెప్పాడు శ్రీరాముడు. లక్ష్మణుడు అక్కడనుంచి వెళ్లిన తర్వాత ఆ
ప్రచ్చన్నవేషధారి తాను శ్రీరాముణ్ణి దర్శించటానికి బ్రహ్మ పనుపున వచ్చాననీ “తాను యముడిననీ” శ్రీరాముడికి విన్నవించుకున్నాడు. “స్వామీ! దుర్ఘటమైన దేవకార్యం నీవల్ల పూర్తి అయింది. రావణుణ్ణి సంహరించటానికే నీవు శ్రీరాముడిగా అవతరించావు. అదితికశ్యపుల వంటి కౌసల్యాదశరథుల గర్భవాసాన అవతరించావు. పదకొండువేల సంవత్సరాలు భువనరంజకంగా పరిపాలించావు. కాబట్టి నీవు యథాస్థానానికి విచ్చేయవలసింది’ అని బ్రహ్మదేవుడి విన్నపం తాను సందేశహారిగా తీసుకొని వచ్చినట్లు శ్రీరాముడికి కాలుడు చెప్పాడు.
దుర్వాసుడి ఆగమనం
ఇట్లా వాళ్ళిద్దరూ సంభాషించుకుంటున్న సమయంలో హఠాత్తుగా దుర్వాసుడు శ్రీరాముడిని అంతఃపురభవనద్వారం దగ్గరకు వచ్చాడు. వస్తూ వస్తూనే శ్రీరాముణ్ణి ఈ క్షణం అంటే ఈ క్షణంలోనే చూడాలని లక్ష్మణుణ్ణి తరుముతున్నట్లు ఆదేసించాడు “మహానుభావా! ఇప్పుడు తననెవరూ చూడటానికి రాకూడదని శ్రీరాముడు నన్నుఆదేశించాడు కదా”! అని లక్ష్మణుడు విన్నవించినా దుర్వాసమహర్షి వినిపించుకోలేదు. వెంటనే శ్రీరాముణ్ణి చూడవలసిందేనని భీష్మించాడు. లేకపోతే కోసలదేశాన్ని, అయోధ్యానగరాన్ని, నిన్ను, శ్రీరామచంద్రుణ్ణి, భరతుణ్ణి, మీ వంశాన్నీ కూడా శపించి వేస్తానని హెచ్చరించాడు. లక్ష్మణుడు విషణ్ణుడై లోనికి పోతే మరణదండనకు తానొక్కడే కదా గురి అయ్యేది? లేకపోతే అయోధ్యారాజ్యానికి భయంకరమైన విపత్తు దాపురిస్తుందని దుర్వాసమహర్షిని శ్రీరాముడి సమక్షానికి తీసుకొని వెళ్ళాడు. కాలుడప్పుడు అంతర్జానమైనాడు. శ్రీరాముడు తన ప్రతిన తలచుకొని దురపిల్లాడు. కాని ఏం చేయగలడు? దేశబహిష్కారం మరణశిక్షకు సమానమే కనుక లక్ష్మణుణ్ణి, తనకు ప్రాణంవంటి వాణ్ణి దేశబహిష్కార శిక్షకు గురిచేశాడు శ్రీరాముడు. లక్ష్మణుడు దీనిని భరించలేకపోయినాడు. వెంటనే సరయూనదికి వెళ్ళి ప్రాణాయామపురస్సరంగా అందులో మునిగి అదృశ్యమై పోయినాడు. ఇంద్రుడు దివ్యరథంతో వచ్చి లక్ష్మణుణ్ణి స్వర్గలోకానికి తీసుకొని పోయినాడు. శ్రీరాముడిక తాను అయోధ్యలో ఉండలేననుకున్నాడు.
భరతుడికి పట్టాభిషేకం చేసి తాను కూడా లక్ష్మణుణ్ణి అనుగమించాలని సంకల్పించాడు. భరతుడు పరమదుఃఖితుడై శ్రీరాముడు లేని రాజ్యం తనకు వద్దుగాక వద్దు అని శోకపరితప్తుడై తాను కూదా శ్రీరాముణ్ణి అనుసరించేట్లు ప్రార్థించాడు.
శ్రీరామచంద్రుడు దక్షిణకోసలప్రాంతానికి కుశుణ్లీ, ఉత్తరకోసల ప్రాంతానికి లవుణ్ణీ పట్టాభిషిక్తులను చేసి తన మహాప్రస్థానానికి పూనుకున్నాడు.
అయోధ్యవాసులందరూ శ్రీరాముడు కనపడని రాజ్యం తమకు వాసయోగ్యం కాదనీ, ఆయనతోపాటే తాము కూడా ప్రస్థానిస్తామనీ అయోధ్యలో ఉండలేమనీ చెప్పారు. అప్పుడు శ్రీరాముడు శత్రుఘ్నుడిని అయోధ్యకు తీసుకొని రమ్మని దూతలను మధుపురికి పంపాడు. అయోధ్యలో జరిగిన సంగతులన్నీ విని శత్రుఘ్నుడు తీవ్ర విషాదం పొందాడు. దూతలు ఇంకా ఇట్లా శత్రుఘ్నుడితో చెప్పారు. శ్రీరామచంద్రుడు కుశలవులను
పట్టాభిషిక్తుల్ని చేసి వాళ్ళకు కుశావతి, శ్రావస్తి అనే రాజధానులను ఏర్పాటుచేశాడనీ, ఇప్పుడు లక్ష్మణుడి వినాశం తర్వాత శ్రీరాముడి మహాప్రస్థానం సంభవించబోతున్నది అని కూడా చెప్పారు. శత్రుఘ్నుడు తన అన్నలను అనుగమించటమే తనకు పరమగతి అని నిశ్చయించుకున్నాడు. ముందుగా తన రాజ్యాన్ని రెండుగా విభజించి తన పెద్దకుమారుడు సుబాహువుకు, చిన్న కుమారుడు శత్రుఘాతికీ మధుపురిలో,
విదిశానగరంలో రాజధాను లేర్పరచాడు.