కవితా స్రవంతి

స్వాతంత్ర్యం

-డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

ఎంతమంది వీరుల బలిదానమో
ఈ స్వాతంత్ర్యం
ఎంతమంది త్యాగమూర్తుల
రక్తతర్పణమో ఈ స్వాతంత్ర్యం

దేశం కోసం….
ప్రాణాలను అర్పించిన వీరులది
ఈ స్వాతంత్ర్యం
లాఠీ దెబ్బలు తిన్న దేశభక్తులది
ఈ స్వాతంత్ర్యం

స్వాతంత్ర్యం మేడిపండేమి కాదు
అనేక పోరాటాల త్యాగఫలం
స్వాతంత్ర్యం సూర్యోదయమేమి కాదు
అనేక త్యాగాల ఫలితం

శతాబ్ధాల పీడనకు సమరనాదం
ఈ ఉద్యమం
పరదేశి పాలనకు చరమగీతం
ఈ పోరాటం

ఆంగ్లేయులను ఎదిరించిన
దేశభక్తి మనది
అడుగడుగున పోరుసల్పిన
స్వరాజ్యకాంక్ష మనది

స్వాతంత్ర్యం….
మనదైన అస్తిత్వ నినాదం
తరతరాల వారసత్వానికి మార్గదర్శనం

ఏ గాయం కానిదే పోరాటం చిగురించదు
ఏ రక్తం స్రవించనిదే ఉద్యమం మొలకెత్తదు

కోట్లమంది భారతీయుల
వజ్రసంకల్పం ఈ స్వాతంత్ర్యం
దేశభక్తుల శంఖారావం
మనకు దక్కిన స్వాతంత్ర్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked