– (మనబడి స్వచ్చంద సేవకుల బృందం – భాస్కర్ రాయవరం, మల్లిక్ దివాకర్ల, కిశోర్ నారె, శైలజ కొట్ర, సుజన పాలూరి)
రైలు ప్రయాణం అంటేనే అదో వింత సరదా
మనసులోన పొంగిపొరలే జ్ఞాపకాల వరద!
రిజర్వేషన్ ఆఫీసులో మొదలుకదా ఆ సరదా
అది ఉంటే ప్రయాణమే హాయి కదా సోదరా!
సెలవంటూ సరదాగా సాగనంపు బంధువులు
వెళ్ళవద్దు ఉండమంటు కన్నీళ్లతో బంధాలు
ఉండలేని వెళ్ళలేని మనసు ఊగులాటలు
ఇంత రైలు ప్రయాణాన అంతులేని అనుభూతులు
అన్నీ మరచి చుట్టూ చూస్తే ఎన్ని తమాషాలు!
కిటికీ పక్కన సీటుకోసం పిల్లల కుస్తీపట్లు,
ఎంత వింత అంత స్పీడు వెనక్కెెళ్ళే చెట్లు
ఊయలూపు పయనంలో ఇట్టే కునికిపాట్లు!
నేల తుడుస్తూ డబ్బులు అడిగే పిల్లల జాలి చూపులు
గుండెను పిండే గొంతుకతోటి కబోది పాడే గీతాలు
అందరుచేరి లాగించేసే చాయ్, సమోసాలు
ఎదురు సీట్లో సీతను చూసి బాబాయ్ వేసే ఈలలు
అది గమనించిన వాళ్ళ నాన్న కొరకొర చూసే చూపులు!
అప్పటిదాకా తెలియనివారితొ ఎక్కడలేని కబుర్లు
పక్కనకూర్చుని ఉన్నవారే చక్కని కొత్త నేస్తాలు
అపరిచితులతో ఆడే ఆటలు, పెరిగే ఆత్మీయతలు
తగవులు, గొడవలు, అలకలు అన్నీ నీటి బుడగలు!
గమనించారో గ్రహియిస్తారు అందమైన ఓ సత్యం
నీదీ, నాదీ అందరిదీ జీవితమే ఒక రైలుప్రయాణం
ఎవ్వరి పయనం ఎందాకన్నది ఎవరూ ఎరుగని విచిత్రం
గమ్యం ఒకటే కాదు ఆశయం, ప్రయాణమవాలి అతి మధురం
ఆస్వాదిస్తూ అనుక్షణం ఆనందిద్దాం ప్రతీదినం!