-డా.బి.బాలకృష్ణ
నిలకడ నేర్వని నా నడకలకు జీవితమింకా సుదూరంగానే తోస్తున్నది
నరాల దారులలో ధారలుధారలుగా ప్రవహిస్తున్న చైతన్యం
తన మూలాలను వెతుక్కుంటున్నది
తల్లికడుపులో, చీకటిలో, చీమూనెత్తురుల అశుద్ధంలో
అణువుగానో, పరమాణువుగానో ప్రవేశించి
రక్తపు బంతినై, మాంసపు ముద్దనై ఎదుగుతున్నప్పుడు
ఎక్కడినుండో ఓ కదలిక
నా అస్తిత్వానికి ఊపిరూలుదుతుంది
మూసలో దాచబడిన ఈ జీవం
తరతరలా ఆలోచనలకు తెరతీస్తుంది
నేను ఎవరు? నా గమ్యమేమిటి?
నా అస్తిత్వమెక్కడిది?ఇప్పుడున్న స్పృహ ఏనాటిది?
ఉలి, శిలను తొలిచినట్లు ఏవేవో ప్రశ్నలు
నన్ను తొలుస్తూనే ఉంటాయి
సంద్రంలో ఎగసిన అల విసురుగా
తీరాన్ని తాకి, వెనుతిరిగినట్టు
అడుగంటిన నీటిబొట్టు ఆవిరై గాలిలో కలసినట్టు
ఎందుకో పుట్టి, ఎందుకో గిట్టి
ఉన్నన్నినాళ్ళు ఏదేదో వెలగబెట్టి
అన్నీ నావనుకొని, అన్నింటినీ వదిలేసి
రిక్త హస్తాలతో ఏ శూన్యాలకో సాగే పయనంలో
ఒక్కోసారి నిన్ను గుర్తు చేసుకుంటాను
అసలు నువ్వెవ్వరు? నా, నీ మధ్య బంధమేమిటి?
పుట్టుక నాదైనప్పుడు, అనుభవం నాదైనప్పుడు
చావు కూడా నాదే ఐనప్పుడు
నా జీవితంలో నీ ప్రమేయమేమిటి?
జీవిక నువ్వాడే ఆటే అయితే, కర్మఫలం నాకేందుకు?
జీవన్మరణ చక్రభ్రమణాలలో జన్మజన్మల దాగుడుమూతలెందుకు?
రూపాలు వేరైనా, చైతన్యమొక్కటైనప్పుడు గుణాదులలో తేడాలెందుకు?
నీ, నా అస్తిత్వాలను ప్రశ్నార్థకం చేసే ఊహలెన్నో ఉసిళ్ళై చెలరెగుతాయి
అన్నింటికీ సమాధానం నీవని తెలిసినా
నీ ఉనికిని తెలుసుకోలేక సతమతమౌతాను.
****