-డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
జీవితంలో సంతోషాలు అరుదెంచిప్పుడల్లా
ఆనందభాష్పాలు కళ్ళల్లో కాంతులీనుతాయి
కన్నీరు కళ్ళల్లో మొలిచే వెన్నెలపూలు
ఆత్మీయమైన బంధువులు దూరమైనప్పుడల్లా
మనసంతా మూగరోదనల సంధ్రమవుతుంది
కన్నీరు హృదయవేదనను దించే ఉపశమనమాత్ర
కష్టాల కడలిని నిరంతరం ఈదుతున్నప్పుడల్లా
మనసులో కన్నీటి అలజడులే ఎగిసిపడుతుంటాయి
కన్నీరు బతుకుపోరాటంలో భాగమైన ఆత్మీయనేస్తం
అనంతమైన విషాదజీవితాన్ని గడుపుతున్నప్పుడల్లా
మనసు తెగిన కాలువలా మౌనంగా రోదిస్తూంటుంది
కన్నీరు బాధలను మరిపించే ఉద్వేగ జలపాతం
దుఃఖాన్ని దాటుకుంటూ అడుగులు వేస్తున్నప్పుడల్లా
జీవితం ఆనందవిషాదాల చదరంగమవుతుంది
కన్నీరు జీవితాన్ని దాటవేసే అసలైన పన్నీరు