ఈ మాసం సిలికానాంధ్ర

అత్యాధునిక తెలుగు సాహిత్యం

అత్యాధునిక తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020)

తెలుగు అధ్యయన శాఖ, బెంగళూరు విశ్వవిద్యాలయం & నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, కాలిఫోర్నియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన

మూడు రోజుల అంతర్జాల సదస్సు నివేదిక

జనవరి19-21, 2021

-ఆచార్య ఆశాజ్యోతి & డా. కె. గీత

అత్యాధునిక తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020) అన్న అంశంపై 19.01.2021 నుండి 21.01.2021 వరకు మూడు రోజుల పాటు అంతర్జాల అంతర్జాతీయ సదస్సును తెలుగు అధ్యయన శాఖ, బెంగళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు మరియు నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ సంయుక్తంగా అత్యంత విజయవంతంగా నిర్వహించింది.

మొదటి రోజు (19.01.2021) ఆరంభ సభకు విచ్చేసిన బెంగళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.ఆర్. వేణుగోపాల్ గారు ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ, బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఉన్న ఇతర భాషా విభాగాలతో పోల్చుకుంటే తెలుగు భాషా విభాగం అభివృద్ధి దిశగా చాలా కృషి చేస్తోందని తెలియచేస్తూ, తెలుగు విభాగాధిపతి ఆచార్య ఆశాజ్యోతి గారి నిరంతర కృషిని అభినందిస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. అంతర్జాల అంతర్జాతీయ సదస్సు సందర్భంగా పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారిని, డా.కె.గీత గారిని, శ్రీ నందిని సిధారెడ్డిగారు తదితరులందరినీ కలుసుకోవడం ఆనందదాయకమన్నారు. పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు కీలకోపన్యాసం చేస్తూ సాహిత్య వస్తువు దైవీయం నుండి మానవీయంగా రూపం మార్చుకోవడమే మొట్టమొదటి మార్పు అనీ, చరిత్ర మారినప్పుడంతా కొత్త సాహిత్యం వస్తుందని, ప్రతి ఒక్క పరిస్థితిలోనూ కలిగే మార్పు అత్యాధునికతైతే ఆ మార్పును అందిపుచ్చుకొని ప్రతిబింభించే సాహిత్యం అత్యాధునిక సాహిత్యమనీ తెలియచేస్తూ భిన్న సంస్కృతిలో, భిన్న దేశాల్లో, భిన్న సమయాల్లో వున్న ఇద్దరు స్త్రీ మూర్తులు అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానం మొత్తాన్ని ఉపయోగించుకుంటూ అత్యాధునిక తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామాలను పరిశీలించే బాధ్యతను తీసుకొని మూడు రోజుల అంతర్జాతీయ అంతర్జాల సదస్సును నిర్వహించడం చాలా గొప్ప విషయమనీ, ఇది అత్యంతాధునికతకు నిదర్శనంగా పరిగణించాలని, వారి కృషి అభినందనీయమని అన్నారు.

తెలుగు విభాగాధిపతి ఆచార్య ఆశాజ్యోతిగారు సదస్సు లక్ష్యాన్ని వివరిస్తూ తెలుగు సాహిత్యంలో అత్యాధునికతను వివరించారు. తెలుగు సాహిత్యం వస్తు-రూప పరిశీలనకు, పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని తెలియచేస్తూ శాస్త్ర, సాంకేతిక రంగాలను ఉపయోగించుకుంటూ సాహిత్య వ్యాప్తిని పరిశీలించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు నొక్కి చెప్పారు. అత్యాధునికత పాశ్చాత్య దేశాలలో 1960లో ప్రారంభమై 1980లో స్థిరపడిందనీ, జాక్సస్ డెరిడా “Deconstruction” తో అత్యాధునిక సిద్ధాంతం ప్రారంభమైందనీ, తెలుగులో స్త్రీ, దళిత వాదాలు 1980 లలో జెండర్, కులం వంటి పదజాలంతో అత్యాధునికత ప్రారంభమై, 2000-2021 నాటికి ప్రపంచీకరణ, డయాస్పోరా, ప్రాంతీయ స్పృహ అత్యాధునిక తత్వ నిదర్శనాలుగా తెలిపారు.

నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక సంస్థాపక సంపాదకులు, కంప్యుటేషనల్ లింగ్విస్ట్ డా.కె.గీత గారు మాట్లాడుతూ నెచ్చెలి అంతర్జాల పత్రికను గురించి వివరించారు. సాహితీ ప్రియులందరికీ స్వాగతం పలికారు. సంకల్పబలం వు౦డాలే కానీ ఎంతటి మహత్తర కార్యమైనా నిర్వహించగలమన్న సందేశాన్నిచ్చారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షులు శ్రీ నందిని సిధారెడ్డి గారు సమకాలీనత పేరుతో సాహిత్య చర్చ చేస్తున్న ఈ సదస్సు సదుద్దేశాన్ని అభినందించారు. ఒకే భాష, ఒకే జాతి, ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే మార్కెట్ నేడు దేశమంతా ఒకటయ్యిందనీ, అందుకోడానికి కూడా వీలు కానన్ని రూపాలలో కవిత్వం వస్తోందనీ, అంత మార్పును పరిశీలించాలి అంటే, ఆ వేగాన్ని పట్టుకోవాలి అంటే ఇటువంటి సదస్సులు చాలా ఉపయుక్తంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

కవిత్వం, కథ సదస్సుల్లో ప్రధాన వక్తలు కొండేపూడి నిర్మల గారు, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు, ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు, ఆచార్య ఎం. ఎం. వినోదిని గారు, డా. అనిల్ డ్యాని గారు, మహెజబీన్ గారు, వాసిరెడ్డి నవీన్ గారు, ఆచార్య రాచపాళె౦ చంద్రశేఖరరెడ్డి గారు, ఆచార్య మధురాంతకం నరేంద్ర గారు, వాడ్రేవు వీరలక్ష్మి గారు, ఆచార్య ఎం. రామనాథం నాయుడు గారు, ఆచార్య పి. ఆర్. హరినాథ్ గారు, గత రెండు దశాబ్దాల వస్తు, రూప పరిణామాలను సమీక్షిస్తూ భిన్న కోణాల్లో నాటి నుంచీ, నేటి వరకూ మారినటువంటి కవిత్వం, కథ వస్తు రూపాలను గురించి పరిశోధనాత్మక విషయాలను ప్రసంగించారు.

రెండవ రోజు సమావేశాల్లో భాగంగా వరసగా మూడు, నాలుగు, అయిదవ సమావేశాలలో నవల, అస్తిత్వవాద, జానపద గిరిజన సాహిత్యాలలో వస్తు, రూప పరిణామాలను విశ్లేషిస్తూ దాదాపుగా ఇరవై మంది ప్రధాన వక్తలు, పత్ర సమర్పకులు పత్ర సమర్పణ చేశారు. నవలా సాహిత్యంలో ప్రధాన వక్తలు చంద్రలత గారు, పెద్డింటి అశోక్ కుమార్ గారు, ఆచార్య అరుణ కుమారి గారు, అస్తిత్వవాద సాహిత్యంలో ప్రధాన వక్తలు ఆచార్య శిఖామణి గారు, జ్వలిత గారు, జానపద గిరిజన సాహిత్యంలో ప్రధాన వక్తలు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు, ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి గారు వస్తు, రూప పరిణామాలను విశ్లేషిస్తూ లోతైన సమీక్ష చేశారు. జానపద గిరిజన సాహిత్యాల విశ్లేషణలో వీరగాథల పరిణామాన్ని తంగిరాల మాస్టారు గారు కళ్ళకు కట్టిస్తే, రాయలసీమ జానపద గేయాల పరిణామాన్ని సమీక్షిస్తూ చిగిచర్ల మాస్టారు గారు గేయాలను ఆలపిస్తూ సమీక్షించడం విశేషం.

మూడవ రోజు, ఆరవ సమావేశం ప్రపంచీకరణ తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామంతో మొదలై వరసగా ఏడవ, ఎనిమిదవ సమావేశాలు డయాస్పోరా, నాటకం, అంతర్జాల తెలుగు పత్రికల వస్తు, రూప పరిణామాల సమీక్ష జరిగింది. ఆరవ సమావేశంలో ప్రధాన వక్తలు అట్టాడ అప్పల నాయుడు గారు ఉత్తరాంధ్ర కథల వస్తు, రూప పరిణామ విశ్లేషణ చేస్తూ, ఉత్తరాంధ్రలో చాలా ప్రతిభావంతమైన సాహిత్యం వెలువడుతోందనీ, పరిశోధనల మూలంగానే సమాజానికి ఆ సాహిత్యం చేరువవుతుందనీ తెలియచేశారు. నాళేశ్వరం శంకరం గారు ప్రపంచీకరణ కవిత్వ వస్తు, రూప నవీనతను, ఆచార్య ఎన్. వి. కృష్ణారావు రెక్కలు-రూప, వస్తు విశ్లేషణను, పరిణామాలను లోతుగా చర్చించారు.

ఏడవ సమావేశంలో ప్రధాన వక్తలు డా.కె.గీత గారు డయాస్పోరాకవిత్వంపై, దాసరి అమరేంద్ర గారు ట్రావెలోగ్స్ – యాత్రాకథనాలపై సమీక్షిస్తూ ప్రవాసా౦ధ్రుల సాహిత్య సృజనను, పరిణామాలను తెలియచేశారు.

ఎనిమిదవ సమావేశంలో ప్రధాన వక్తలు డా. డి. విజయ భాస్కర్ గారు అత్యాధునిక నాటకం-పరిణామక్రమాన్ని గూర్చి మాట్లాడారు. శ్రీ జి. బలరామయ్య, ఐ.ఏ.ఎస్ గారు పడమటి గాలి నాటకం-సమకాలీనత పై విశ్లేషణ చేస్తూ అప్పట్లో కన్యాశుల్కంతో పోలుస్తూ పడమటి గాలి ఎంత గొప్ప నాటకమో తెలియ చేశారు. ఇదే సమావేశంలో అంతర్జాల పత్రికల గురించి కొండవీటి సత్యవతి గారు ప్రధాన ప్రసంగం చేసారు.

ఎనిమిది సదస్సుల్లో ప్రధాన వక్తలతో పాటు, దాదాపు ఇరవై మంది పత్ర సమర్పకులు ఆయా అంశాలలో సాహిత్య వస్తు, రూప పరిణామాలను సమీక్షించారు, లోతైన పరిశోధనాత్మక పత్రాలను సమర్పించారు.

అత్యాధునిక తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామం(2000-2021) అన్న అంశంపై తెలుగు అధ్యయన శాఖ, బెంగళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు మరియు నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ సంయుక్తంగా ప్రారంభించిన మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్ గురువారం(21.01.2021) నాడు ఎనిమిదవ సమావేశంతో పరిపూర్ణంగా అన్ని సమావేశాలను పూర్తి చేసుకున్న తరువాత విజయవంతంగా సమాపనోత్సవ సభ జరుపుకుంది.

సమాపనోత్సవ సభకు విచ్చేసిన ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ కె. శివారెడ్డి గారు సదస్సును వుద్దేశించి వారి ఆత్మీయ సందేశాన్ని అందించారు.

మూడు రోజులు, ఎనిమిది సమావేశాలు, దాదాపు ముప్ఫై మంది పత్ర సమర్పకులతో సభ చాలా అద్భుతంగా, అత్యంతాధునికంగా సాగిందని, సమాజంలో, జీవితాల్లో వచ్చిన పరిణామాలు, మార్పులను ఉద్దేశించి చాలా చక్కని సదస్సు జరిపారని ప్రశ౦సించారు. దీనికి ముఖ్య కారకులైన ఆచార్య ఆశాజ్యోతి గారిని, డా.కె.గీత గారిని ప్రశ౦సించారు. సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖాధ్యక్షులు ఆచార్య కె. ఆశాజ్యోతి గారు సదస్సు గురించిన నివేదికను అందిస్తూ, కవిత్వం, కథ, నవల, ఒక పక్క పెడితే బింబ, ప్రతిబింబాలైన సమాజ సాహిత్యాలు ఆధునికత నుండి, అత్యంతాధునికతను ఏరకంగా ప్రతిబింబించాయి అన్న దిశగా చూస్తే ముఖ్యంగా ప్రపంచీకరణ, డయాస్పోరా, అస్తిత్వ సాహిత్యం, ఉత్తరాంధ్ర సాహిత్యం, ట్రావెలాగ్ మొదలైన అనేక నూతన అంశాలు ఈ సదస్సులో పత్ర సమర్పకులు అందించారని పేరు పేరునా గుర్తు చేశారు. అస్తిత్వవాద సాహిత్యం, జానపద గిరిజన సాహిత్యం, ప్రపంచీకరణ సాహిత్యం, డయాస్పోరా సాహిత్యం, నాటక సాహిత్యం, అంతర్జాలంలో తెలుగు సాహిత్య పరిశీలన మొదలైన అనేక అంశాలను వినూత్న దిశగా పరిశీలించ వలసిన, పరిశోధించవలసిన ఆవశ్యకతను గుర్తించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తూ, అత్యాధునిక తెలుగు సాహిత్యంలో వచ్చిన వివిధ కోణాల్ని ఆవిష్కరించడానికే ఈ మూడు రోజుల అంతర్జాల సదస్సును నిర్వహించడం జరిగిందనీ, వారు ఆశించిన ఫలితం దక్కిందనే భావిస్తున్నానని, వివిధ విశ్వవిద్యాలయాలు ఈ దిశగా పరిశోధనలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా వుందనీ నొక్కి చెప్పారు. ఈ సదస్సు ముఖ్యంగా నూతనంగా వృద్ధుల సమస్యలపైన, వికలాంగుల సమస్యలపైన పత్ర సమర్పణ జరగడం ముదావహం అనీ వస్తు-రూప నవీనతపై వారు చేసిన ప్రయత్నం నెరవేరిందనీ వ్యక్తపరిచారు. అత్యాధునికత అనే అంశం సమాజంలోకి, ముఖ్యంగా విద్యార్థినీ-విద్యార్థుల్లోకి, పరిశోధక విద్యార్థుల్లోకి తీసుకెళ్ళడం

ముఖ్యమైన విషయంగా భావించానని, ఆధునికత అనగానే కందుకూరి, గురజాడల నుండీ మొదలు పెడ్తున్నాము అన్ని విషయాల్లోనూ, వాళ్ళను మనం మన చిన్నప్పటినుండీ చదువుకుంటూనే వచ్చాము. ఇప్పుడు ఆధునిక సాహిత్యమని దేన్నైతే అనుకుంటున్నామో ఆ సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయవలసినటువంటి స్థితిలో ప్రస్తుతం సాహిత్యం కానీ, సమాజంకానీ ఉంది. మేథో వర్గం ఏం చెబితే అది విన్నామింతవరకు, దాన్ని పునాదులుగా చేసుకుని ఇంకొంత ముందుకు ఆలోచించవలసిన అవసరాన్ని గుర్తించి అత్యాధునికత సాహిత్యం గురించిన చర్చను చేసే దిశగా 2000-2020 మధ్య కాలంలో వచ్చిన తెలుగు సాహిత్యంపై దృష్టి సారించి చేసిన ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం నెరవేరిందని ఆచార్య ఆశాజ్యోతి గారు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

సదస్సు సమన్వయ కర్త, ప్రముఖ కవయిత్రి, కంప్యుటేషనల్ లింగ్విస్ట్(ఆపిల్), కాలిఫోర్నియా, యు. ఎస్. ఏ., నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక సంస్థాపక సంపాదకులు డా. కె. గీత గారు మాట్లాడుతూ సదస్సు విజయవంతం కావడం వెనక వున్న అందరి కృషిని ప్రశ౦సించారు. వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు.

తెలుగు అధ్యయన శాఖ, బెంగళూరు విశ్వవిద్యాలయం అతిథి ఉపన్యాసకులు డా. ఎం. గిరిబాబు, మూడు రోజుల అంతర్జాల సదస్సుకు విచ్చేసి, విజయవంతం కావించిన సాహితీ వేత్తలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ వందన సమర్పణ చేశారు.

తెలుగు అధ్యయన శాఖ, బెంగళూరు విశ్వవిద్యాలయం సహాయకాచార్యులు డా. డి. కె. ప్రభాకర్, డా. బూసి వెంకటస్వామి, డా.శాంతి లక్ష్మి తదితరులు సాంకేతిక సహకారం అందించి సమన్వయ కర్తలుగా వ్యహరించారు.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked