తపస్సమీరం..!
-శైలజామిత్ర
తారను అనుసరించి చదరంగ వ్యూహంలో
గగన తలంపై చందమామ బరువుగా ఇరుక్కుంది
ఒకవైపు ఆహ్వానం.. మరోవైపు వీడ్కోలు!
ఒక ఇంటి నుండి మరో ఇంటికి చేరినట్లు..
ప్రయాణం ఏదయినా రాత్రే కళ్ళు విప్పుతుంది
యానం ఎక్కడికైనా అందరితో మాట్లాడుతుంది
చిరుగాలికి తల పంకిస్తూ పాదు గుండెలోంచి
ముళ్ళమధ్య నుండి తీయని గులాబీ దర్శనమిస్తుంది..
ఆకలి పులి అవకాశానికై ఎదురుచూసినట్లు
ఇంటి ముందు బిక్షగాని స్వరం సైతం చరిత్రను సృష్టిస్తుంది .
బిడ్డను చంకనెత్తుకుని వచ్చే దారిలో అమ్మ కనే కలల దృశ్యం
రాబోయే సూర్యోదయానికి ముచ్చెమటు పట్టిస్తుంది..
గాయం మానిపోయి దాని స్థానంలో మరో గాయం చేరినట్లు
మనిషి కళ్ళకు ముఖాన్నీ వర్ణచిత్రాలై కనిపిస్తాయి
మాసిన దుస్తుతో కూర్చున్న విరామ సమయం
గెలుపు నుండి ఓటమి దాకా సంశయాల్ని నింపుతుంది..
చినిగిపోతుందని వస్త్రం, పగిలిపోతుందని కుండ
నలిగిపోతుందని గుండెను వాడటం మానేయలేము..
నిన్నటి మానవ సంకల్పం రేపటి రోజుల్ని సృజిస్తుందని
ఈ రోజే నడి రోడ్లమీద కాగితపు పడవల్ని నింపలేము..
సజీవ కల్పనలో స్పందన లేని మనిషి జీవితం
ఊహల్లో అందంగా, అనుభవంలో వికృతంగా కనిపిస్తుంది
అభిలాష అవసరమైనది.. ఆలోచన పోషితమైనది
తపస్సమీర యాత్ర సంపూర్ణంగా మనస్సుకే సంబందించింది
హృదయం కనిపించకున్నా పలకరిస్తూనే ఉంటుంది
నక్షత్రాల ముఖమల్ దుప్పటిని చూస్తూ అవని అనందిస్తూనే ఉంటుంది