తెలతెలవారున కలకూజితాల
—తమిరిశ జానకి
మధురమంజుల నాదమంటిది తెలుగు !
ఉదయించే రవి కిరణ శోభ సంతరించుకున్న
గగనమంతటి సుందర దృశ్యకావ్య సోయగమే తెలుగు !
తెలిమంచు బిందువుల తడిసి తళతళలాడు
తరువుల చిరునవ్వుల గలగలలే తెలుగు !
వివిధ వర్ణాల సుమాల వనాలతో విలసిల్లు
ధరిత్రి వికసిత వదన లాలిత్యమే తెలుగు !
కృష్ణా గోదావరి తరంగాల కదలాడు కమనీయ సొబగులు
తెలుగుపదాల పరవళ్ళలో తేలియాడేను !
ప్రకృతి రామణీయకతలా
ప్రపంచమంత పరిఢవిల్లు తెలుగు !
నన్నయ తిక్కన యర్రాప్రగడ పోతన శ్రీనాధ
దాశరధి దేవులపల్లి సి.నా.రె. మరెందరో మహాకవుల
కలాల జాలువారిన రసామృతధార మన తెలుగు !
పద్య సంపదకు అవధాన విద్య విశిష్ఠతకు పేరొందిన తెలుగు
తరిగిపోని భాషాగని తీయందనాల తేనెలసోన కురిసే వెన్నెలవాన
ఎన్నటికీ కాబోదది మృతభాష !
దేశభాషలందు తెలుగులెస్సయన్న కృష్ణదేవరాయని మాట
చెక్కు చెదరబోదు శిలాక్షరమె అది !
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటూ పొగడబడిన భాష
పొగడపూలధండ మన తెలుగు !