– గాదిరాజు మధుసూదన రాజు
తరతరాల నరజాతికి
ఆస్తిగా మారిన
గుండ్రని
మన్నుండలాంటి
పుడమిని
చుట్టేస్తూ….
పొంగుతు క్రుంగుతూ
ఆటుపోట్లందుకుంటున్న
నీటిమడుగులాంటి కడలిని
గమనిస్తూ…..
‘ఆదీ తుదీ లేని
లలనల ఆశలఊహారచనం లాంటి గగనం’
తన బాధ్యతగా
హరితవర్ణపు పర్ణతివాచీని
పరిచేందుకు
ప్రయత్నిస్తోంది
పరిపరివిధాలుగా
పట్టుదలగా
జీవజాతులను బ్రతికిస్తున్నందుకు
ప్రకృతిసమస్తాన్ని
సన్మానిస్తూ తృప్తిగా
** ** **
కాలుష్యాన్ని
అదేపనిగా
సృష్టిస్తూ
హరితాన్ని హరిస్తూ
అడ్డొస్తోంది
నవమానవయాంత్రికతత్త్వం
తమ ఆస్తిని
అస్తిత్వాన్ని
అపహాస్యం పాలుచేస్తూ
స్వయంనాశనాన్కి తానే మద్దతిస్తూ