-నాగలక్ష్మి N. భోగరాజు
ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవారికి ‘ప్రేమ’ అన్న పదం వినపడగానే స్ఫురణకు వచ్చే దైవం రాధాకృష్ణులు. ‘దేవీ భాగవతం’ ప్రకారం ఆ పరమేశ్వరికున్న పరిపూర్ణ అవతారాలలో రాధాకృష్ణ స్వరూపమొకటి! రాధను సేవించడంవల్ల శ్రీ కృష్ణ పరమాత్ముడి అనుగ్రహం సులభముగా పొందవచ్చునని అంటారు ఆధ్యాత్మికవేత్తలు. అంతేకాకుండా, భక్తులూ, సాధకులూ నిరంతరం రాధాదేవిని శ్రీ కృష్ణుడి సహితంగా స్మరించడమూ, ఆరాధించడమూ వలన, వారు రాధాదేవి కృపకు పాత్రులు కాగలరనీ, తద్వారా సామాన్యులకు దుర్లభమూ, పరమునందు అత్యున్నతమూ అయిన ఆ గోలోక నివాసం వారికి లభిస్తుందనీ పురాణాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టత కలిగిన ఆ రాధాదేవి, వృషభానుడి కుమార్తెగా ఈ భూమిపై అవతరించిన తిథిని మనము రాధాష్టమిగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం సెప్టెంబరు 14న వివిధ ప్రాంతాలలోని కృష్ణ భక్తులు రాధాష్టమిని ఘనంగా జరుపుకున్నారు. ఆ సందర్భంగా రాధాదేవిపై రాసినదీ ఈ క్రింది కవిత:
నిధివనమున రాధతో – నంద గోపబాలుని!
కన్నులార చూడాలని – తపియించెను నా మది!!
ముక్కోటి దేవతలు – వేచియుండు వైభవము!
గోపికా రూపమున – పరమ శివుని సోయగము!!
హితహరి వంశుని గానము – మీరా భక్తి జ్ఞానము!
నిండిన బృందావనము – ఇలపై గోలోకమూ!!
తరులన్నీ పరవశించి – విరులవాన కురియగా!
మునులందరి మనసులలో – ఆనందమునిండగా!!
రాధాకృష్ణుల జంట – ప్రేమకు ఆదిరూపమట!
కోటి తపస్సుల ఫలముగ – చూచువారు ధన్యులట!!
*****