– డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం
నిన్నటి దాకా నిస్సంగ యోగినిలా నిలబడిన ప్లమ్ చెట్టు
ఉన్నట్టుండి తెల్లని పూవుల అంగీ తొడుక్కుంది.
మోడువారిన కొమ్మల మేపుల్ మొక్క
మోసులు వేసి పచ్చని ఆకుల పమిట వేసింది.
పురాతన పాంధుడు అనూరుడి రథం లో అవిశ్రాంతం గా తిరుగుతూ
పుడమి కాంతను చురుకు చూపులతో పలుకరిస్తున్నాడు.
వెచ్చని శరీరాలను కప్పుకుని చలి కాచుకున్న జాకెట్లు
కచ్చగా చూస్తున్నాయి క్లోజెట్ లో చేరి.
వసంతం వస్తోందని కబురందిన రాదారి తరువులు
ఒళ్ళంతా రంగులు అలదుకుని స్వాగతించడానికి సిద్ధపడ్డాయి .
మారుతున్న ఋతువులే మనిషికి ప్రకృతి చెప్పే పాఠములు కదా!
ఆరు రుచులను ఆస్వాదించ మంటూ ఆరుదెంచింది ఉగాది