కవితా స్రవంతి

కృష్ణ పలుకు

– కృష్ణ అక్కులు

ఆ.వె||వంట చేయు వరకు మంట కావలయును
ఇంటిని మసి చేయు మంట వలదు
కోపమధిక మయిన కొంపలు ముంచును
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె||పేసు బుక్కు లోన పెరిగిన స్నేహము
వాట్స అప్పు లోన పలుకు తీరు
నాటి ఉత్తరముకు దీటుగా వచ్చునె
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె||నల్ల ధనము నేడు చెల్లదనుట సరి
వలదు హాని బీదవాని కెపుడు
కలుపు తీయు నపుడు తులసి పోరాదు
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె||ముద్దు చేయ రాదు మొద్దుబారు నటుల
చురుకు కలిగి పనికి ఉరుకు నటుల
పెంచినపుడె బిడ్డ మంచిగ బ్రతుకును
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె||కలసి బ్రతుకునపుడు కలహాములవి వచ్చు
కాని అందులోనె కలదు సుఖము
పెద్దలెపుడు మనకు బుద్ది భోధించరె
కృష్ణ పలుకు వినగ గెలుపు

ఆ.వె||పెద్ద నోట్లు రద్దు పేదవాడికి పాట్లు
కొత్త నోట్ల కొరత కొంప ముంచె
మోడి మాపైనేల మోపితివి బరువు
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె||కప్పు కొన్న యెడల తప్పు జరగకుండు
విప్పుకొని తిరిగిన ముప్పు వుండు
నిండు దుస్తులెపుడు మెండుదనమునిచ్చు
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on కృష్ణ పలుకు

ఎమ్ వి లక్ష్మి said : Guest 7 years ago

అక్కులు కృష్ణ గారు​వ్రాసిన ఆటవెలదులు (కృష్ణ పలుకులు) బాగున్నాయి.