కథా భారతి

అనగనగా ఆనాటి కథ

సత్యం మందపాటి

స్పందనః


మనుష్యులు ధనవంతులయితే, వారి మనసులు అంత గొప్పగా వుంటాయా? అలాగే బీదవారి విలువలు అంత తక్కువగా వుంటాయా? ఆరోజుల్లోనే కాదు, ఇప్పటి దాకా కూడా మనవారి ఆలోచనల్లో పెద్ద తేడా వచ్చినట్టు కనపడదు. ఎందుకని? మానవత్వపు విలువలు డబ్బుతో ముడిపడి వుంటాయా? ఆరోజుల్లో సాధారణంగా జరిగే ఇలాటి విషయాల మీద విశ్లేషణతో కూడిన ఆలోచనలే ఈకథకి స్పందన. స్పూర్తి. చదివే ముందు నా ప్రియ మిత్రుడు, ఈమధ్యనే మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఎంతో గొప్ప చిత్రకారుడు ‘చంద్ర’ ఈ కథకి వేసిన బొమ్మని నిశితంగా చూడండి. అందంగా వుండటమే కాక, నేను కొన్ని పేజీల్లో చెప్పిన కధని బహు కొద్ది గీతలతో ఎంతో అర్ధవంతంగా చిత్రించిన తీరు, నా కథకే చిరస్మరణీయమైన గుర్తింపుని అందించింది. జయహో మిత్రమా! ధన్యోస్మి!
0 0 0

నింగీ నేలా
(ఈ కథ ‘జ్యోతి’ మాసపత్రిక, ఆగష్ట్ 1977 సంచికలో ప్రచురింపబడింది)
“ఈ సముద్రపు ఒడ్డున ఇలా కూర్చుని, పైన వున్న ఆకాశాన్నీ క్రింద వున్న సముద్రాన్నీ చూస్తుంటే నాకో విషయం గుర్తుకొస్తున్నది” అన్నాడు రాజు అప్పటిదాకా అలుముకున్న మౌనాన్ని భంగపరుస్తూ.
“బోరు కొట్టక త్వరగా చెప్పు, మాలతీ వాళ్ళు వచ్చే టైమవుతున్నది” అన్నాడు రాధాకృష్ణ.
“ఇవాళ వీడి కథ వినక తప్పదు కాబోలు” సణుగుతున్నాడు మూర్తి.
రాజు చెప్పటం మొదలుపెట్టాడు.
“రెండేళ్ళ క్రితం జరిగినదీ కథ. మా మామయ్య బాగా డబ్బున్నవాడు. ఆ వూరిలో చాల గొప్ప పెద్దవాడుగా పేరు పొందినవాడు. మా మామయ్య కూతురు రేఖని చూసొద్దామని ఒక రోజు మామయ్య వాళ్ళింటికి వెళ్ళాను. అక్కడ అంతా గందరగోళంగా వుంది. మామయ్య అరుస్తున్నాడు. ‘అంత అజాగ్రత్త అయితే ఎలా’ అని. రేఖా, అత్తయ్యా ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని నుంచున్నారు. అత్తయ్య వెనకాలే ఆవిడ కాళ్ళని పెనవేసుకుని, భయం భయంగా చూస్తున్నాడు బాబీ. మామయ్య ఆఖరి కొడుకు. మూడేళ్ళవాడు.
నన్ను చూడగానే మామయ్య, ‘చూశావురా? మనవాళ్ళు ఎంత జాగ్రత్త మనుష్యులో!’ కోపంగా అని, ఒక్క క్షణం ఆగి, ‘నేను పోయాక ఎలా బ్రతుకుతారో వీళ్ళు’ అన్నాడు అదోరకంగా.
ఆయన మాటలకు నవ్వబోయి, పెద్దవాడు బాగుండదని వూరుకున్నాను.
‘నువ్వుకూడా ఒకసారి ఇల్లంతా వెతకరా రాజూ, దొరుకుతుందేమో’ అన్నది అత్తయ్య నాతో.
‘అసలింతకీ ఏం పోయినట్టు?’ అడిగాను.
మామయ్య అన్నాడు. ‘నేను చెబుతానుండరా. మొన్న సాయంత్రం బాబీ పుట్టినరోజు పండగ అయింది కదా. వాడి మెళ్లో రేఖకి చేయించిన గొలుసు వేశాము. పేరంటం, పార్టీ అంతా అయాక, వేసిన బంగారపు గొలుసు తీసేయటం మరచిపోయింది మీ అత్తయ్య. అసలు ఆ హడావిడిలో నిన్నటి దాకా, ఆ గొలుసు సంగతే గుర్తుకు రాలేదు. ఇవాళ హఠాత్తుగా గుర్తొచ్చి చూసుకుంటే వాడి వంటి మీదా లేదు, ఇంట్లోనూ లేదు. ఏమవుతుంది మరి?’
‘వాడినే అడిగితే పోలా! ఏం బాబీ, నీ మెళ్ళో గొలుసు ఎక్కడ పెట్టావు నాన్నా?’ లాలింపుగా అడిగాను వాడిని.
వాడు నన్నొక్క క్షణం దీనంగా చూసి భోరుమని ఏడ్చేశాడు.
వాడి తల మీద చేయి వేసి నిమురుతూ, ‘ఏడుస్తావెందుకురా నాగన్నా. నిన్నేమీ అననులే చెప్పు. గొలుసు ఎవరికిచ్చావూ?’ అడిగాను మళ్ళీ.
వాడు జవాబు చెప్పకుండా కారుతున్న ముక్కుని చొక్కాతో తుడుచుకున్నాడు.
‘వాడికేం తెలుసు కుర్రవెధవ, పెద్దవాళ్ళకే జాగ్రత్త లేనప్పుడు’ మామయ్య చిర్రుబుర్రులాడుతున్నాడు.
‘నువ్వూ ఇంట్లో ఒకసారి చూడు రాజూ’ అత్తయ్య మళ్ళీ అన్నది.
‘ఇప్పటికి పాతికసార్లు చూశాం. ఇంకేం వుంటుంది?’ మామయ్య అన్నాడు.
అయినా రేఖని ఆ వంకతో పక్కనే వుంచుకుని ఇల్లంతా వెతికాను.
నేను వెతుకుతున్నప్పుడు మామయ్య అన్నాడు, ‘ఆ గొలుసు మామూలు గొలుసు కాదురా. దాని లాకెట్లో మంచి ఖరీదైన రత్నం వుంది. అంటే గొలుసు ఏ నాలుగైదు వందలో అనుకుంటునావు కాబోలు. మూడు వేల రూపాయలు. దగ్గరుండి మద్రాస్ ఉమ్మిడియార్సులో చేయించాను. రేపు పదో తారీకుకి అది చేయించి నెలవుతుంది. జాగ్రత్త లేని మనుషులకు అది కొనివ్వటం నాదే తప్పు’ సణుగుతున్నాడు మామయ్య.
ఇంట్లో నాలుగు మూలలా వెతికినా అది కనపడలేదు.
‘నిన్న బాబీగాడు ఇంట్లోనించీ బయటకు ఎక్కడికైనా వెళ్ళాడా?’ అని అడిగాను రేఖని.
తన పెద్ద కళ్ళను ఒకసారి పైకెత్తి, చటుక్కున క్రిందకు వాల్చి, ‘ఉహుఁ!’ అన్నది.
పక్కన మామయ్యున్నాడు కానీ, లేకపోతే ఆమె అందాల పెదవులనించీ రాలిన ముత్యాలని ఏరి బాబీగాడికి లాకెట్ చేయించేవాడిని”
కథ వింటున్న మూర్తి అడ్డం తగిలాడు. “ఒరే రాజూ, గొలుసు కథ చెబుతూ ప్రేమ కథలోకి వెళ్ళకు. నీతో వచ్చిన చిక్కే యిది” అన్నాడు రాజుని అదలిస్తూ.
“అసలే మాలతి వచ్చే టైమవుతుంటే, వీడూ వీడి కథలూనూ..” సణుగుతున్నాడు రాధాకృష్ణ.
రాజు అదోలా నవ్వి, “ఇది ప్రేమ కథ కాదు మూర్తీ! డబ్బుల్లో తేలిపోతున్న మామయ్యలాటి వారి జీవితాల్లో ప్రేమ కథలుండవు. మామయ్య నన్ను కూర్చోబెట్టి అన్నీ విపులంగా చెప్పాడు. బాబీకి ఆరోజు ఒళ్ళు వెచ్చబడిందిట. అందుకని వాడిని బయటకు ఎక్కడికీ పంపించలేదుట. ఇంట్లో మామయ్య, అత్తయ్య, రేఖ, బాబీ మాత్రమే వున్నారు. మరింక ఎవరు తీస్తారు అని చెబుతున్న మామయ్యకి ఏదో ఆలోచన వచ్చింది. అత్తయ్యని అడిగాడు. ‘పనమ్మాయీ, పాలవాడూ, చాకలీ మనింటికి వచ్చారా?’ అని.
‘పాలవాడు ప్రొద్దున్నే అయిదింటికే వచ్చాడు. అతను తలుపు కొట్టాక నేనే వెళ్ళి తలుపు తీశాను. పాలు పోయగానే అట్నించీ అటే వెళ్ళిపోయాడు. నేనే మళ్ళీ తలుపు వేసేశాను’ అన్నది అత్తయ్య.
‘మళ్ళీ సాయంత్రం ఎన్నింటికి వచ్చాడు’ అడిగాను.
‘రాలేదు’ అన్నది అత్తయ్య,
‘అయితే వాడే తీసుంటాడు. ఆ చింపిరి ముఖమూ వాడూను. వాడిని చూస్తేనే తెలుస్తుంది వాడెలాటి వాడో’ మామయ్యకి అపరాధి దొరికిపోయాడు.
‘లేదు. పార్టీ కోసం తెప్పించిన పాలు మిగలటంతో నేనే అతన్ని సాయంత్రం పాలు తేవద్దని చెప్పాను’ అన్నది అత్తయ్య, కోర్టులో నిజంగా నిజం చెబుతున్న నిజమైన సాక్షిలా.
‘మరి పనిమనిషి?’ అడిగాడు మామయ్య.
‘అది ఎనిమిదేళ్ళనించీ మనింట్లో పని చేస్తున్నది. చాల నమ్మకస్తురాలు. మొన్నీమధ్య, ఇల్లు వూడుస్తుండగా మంచం క్రింద రేఖ బంగారపు గాజు కనపడితే తీసి జాగ్రత్తగా అప్పజెప్పింది. ఆ బుద్ధే వుంటే ఆ గాజుని ఆరోజే మాయం చేసేది’
‘ఇలా అందరినీ నమ్ముతావు కాబట్టే ఇవాళ ఆ గొలుసుపోయింది. ఒక జాగ్రత్తా లేదు, పాడూ లేదు. సరే చాకలి ఎప్పుడు వచ్చాడు?’ అడిగాడు మామయ్య.
‘అతను ప్రొద్దున్న ఎనిమిది గంటలకు వచ్చాడు. బట్టలు తీసుకుని వెంటనే వెళ్ళిపోయాడు. అతను సరిగ్గా పది నిమిషాలు వున్నాడిక్కడ. రేఖే వాడికి బట్టలు వేసి పద్దు రాసింది. తన బట్టలేవో అర్జంటుగా కావాలి, రేపే తెమ్మని చెప్పింది కూడాను. వాడికి తీసే అవకాశం వుందని నేననుకోను’ అన్నది అత్తయ్య.
‘ఏం, రేఖా?’ అడిగాను మృదువుగా.
పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేసి, నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తల ఆడించింది. తర్వాత నాకన్నా నేల అందంగా వుందనుకుందేమో నేల చూపులు చూసింది.
‘పనమ్మయో, చాకలాడో తీసుంటారు. నీతి లేని మనుషులు. వాళ్ళ బుధ్ధులే అంత!’ మామయ్య ఉవాచ.
‘వాళ్ళకి తీసే అవకాశం లేదంటున్నారు కదా అత్తయ్యా వాళ్ళు’ అన్నాను.
‘నీ ముఖం, వాళ్ళ ముఖమూను. ఆ అజాగ్రత్త మనుషుల కళ్ళు కప్పటం ఒక విద్యా? చితకదన్ని పోలీసులకి అప్పజెప్పలి ఇలాటి వాళ్ళని’ తిడుతున్నాడు మామయ్య.
‘ఇంకా ఎవరు వచ్చారు మనింటికి?’
రేఖ అన్నది. ‘మా ఫ్రెండ్ సుజాత వచ్చింది. బోటనీ రికార్దు పూర్తి చేసుకుని ఒక గంటలో వెళ్ళిపోయింది’ అని.
‘అది సరేలే. సుజాతకేం అవసరం గొలుసు తీయటానికి. వాళ్ళ నాన్న బాగా డబ్బున్న ఎం.ఎల్.ఏ. ఇలాటి గొలుసులు వంద కొనివ్వగలడు’ అన్నాడు మామయ్య.
ఇంతలో చాకలతను వచ్చాడు. ‘అమ్మగారూ, ఇవిగోనమ్మా మీరు వేగిరం తెమ్మన్న బట్టలు’ అంటూ చక్కగా యిస్త్రీ చేసిన బట్టలు రేఖకి అందించాడు.
‘ఏరా అప్పన్నా. ఇస్త్రీ చొక్కా వేశావ్. ఏమిటి విశేషం?’ వ్యంగ్యంగా అడిగాడు మామయ్య.
అతను సిగ్గుపడిపోయాడు. ‘ఇయ్యాల నా ఆడదాన్ని పెళ్ళాడి రెండేళ్ళవుతాదయ్యా’ అన్నాడు.
‘అంతేనా ఎక్కడయినా డబ్బులు కలిసొచ్చాయా?’ అడిగాడు మామయ్య. (చాకలతను ఇస్త్రీ బట్టలు వేసుకుంటే, అదీ తన జీవితంలో ఒక ముఖ్యమైన రోజు, అతనికి డబ్బులు కలసొచ్చినట్టు లెఖ్క అన్నమాట!)
అతనికి మామయ్య మాటలు సరిగ్గా అర్ధమైనట్టు లేదు. ‘మాకు డబ్బులేడ కలిసొత్తాయయ్యా. మీలాంటి దరమరాజులు యిచ్చే పావలా డబ్బుల్తోనే మేం గంజినీళ్ళు తాగాల’ అన్నాడతను. (చచ్చేటంత చాకిరీ చేయించుకుని డబ్బులిచ్చే వాడి పేరు ధర్మరాజు అన్నమాట!)
‘పావలా డబ్బులేమిట్రా.. మూడు వేల రూపాయలొస్తాయి ఆ గొలుసు అమ్మితే’, లూప్ లైన్లోనించీ మైన్ లైన్లోకి వచ్చాడు మామయ్య.
‘ఏ గొలుసు బాబూ?’ అప్పన్న అడిగాడు కొంచెం అర్ధంగాక, కొంచెం కంగారు పడుతూను.
‘ఎందుకు గొలుసు మాట ఎత్తితే అంత కంగారు పడతావ్? పోలీసు రిపోర్టు యివ్వనులే. ఆ గొలుసు యిచ్చేయి. నిన్ను క్షమించి వదిలేస్తాను’
అతను ఈసారి వణకటం కూడా ప్రారంభించాడు.
‘ఏ గొలుసు బాబూ.. నాకేం తెలవదు బాబూ..’ అంటున్నాడు.
రేఖ అమాయకంగా అంది. ‘అయ్యగారు మద్రాసునించీ తెచ్చారని, ఆరోజు నీకు చూపించలా, ఆ గొలుసు అప్పన్నా. కనపడటం లేదు’
‘మరింకేం. ఆ గొలుసు వీడికి ముందే చూపించావన్నమాట. వాడి కన్ను దాని మీద పడివుంటుంది. అప్పన్నా, ఆ గొలుసు యిచ్చేస్తే నిన్ను పోలీసులకి పట్టివ్వను. లేదా చాల హైరానా పడవలసి వస్తుంది’
అతను వెంటనే మామయ్య కాళ్ళ మీద పడ్డాడు. (తరువాత హైరానా పడటం కన్నా, ముందే పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడటం మేలు!)
‘నేను అసుమంటోణ్ణి కాను బాబూ. నాకేటీ తెలవదు. దొంగతనం మా యింటా వంటా లేదు. నన్ను నమ్మండి బాబూ’ అంటున్నాడు.
మామయ్యలో అప్పటిదాకా వున్న కోపం, ఒక్కసారిగా ఆయన కాళ్ళ ద్వారా బయటికి వచ్చి, అతన్ని బలంగా పొట్టలో తన్నింది. అతను వెల్లికలా పడ్డాడు, ‘అమ్మా’ అంటూ. (పేదవాళ్ళు కూడా బాధలో అమ్మా అనే అంటారు)
అతని చొక్కా పట్టుకుని పైకి లేపి, ఆ దవడా ఈ దవడా వాయించాడు.
నేను ఆ అమానుషాన్ని చూడలేక మామయ్య చేతులు పట్టుకుని ఆపాను.
‘వదల్రా రాజూ. ఇలాటివాళ్ళు నాలుగు తగిలిస్తే కానీ నిజం చెప్పరు’ మళ్ళీ కొట్టబోతుంటే వారించాను.
‘ఉండు మామయ్యా. ఇతనే తీసాడని ఏమిటి? తియ్యలేదని చెబుతున్నాడు కదా!’ అన్నాను.
అంత కోపంలోనూ నవ్వాడు మామయ్య. ‘దొంగతనం చేసినవాడు చేశానని చెబుతాడా? నీ పిచ్చికానీ. వీడే తీశాడు. నాకు తెలుసు’ అంటూ నేను తేరుకునే లోపలే గబగబా పోలీసులకి ఫోన్ కూడా చేశాడు.
అప్పన్న అమ్మగారితో చెప్పి ఏడిచాడు. (ఎప్పుడు త్రూ ప్రాపర్ చానల్లో పోవలయును)
ఓడిపోయిన మంత్రిలా అమ్మగారికి ఆ ఇంట్లో పవర్స్ లేనందున, ఆవిడ ఏమీ చేయలేకపోయింది.
అతను నా కాళ్ళ మీద పడి భోరున ఏడుస్తున్నాడు’
చెప్పటం ఆపి పైన వున్న ఆకాశం కేసి చూస్తున్నాడు రాజు.
“చెప్పు” అన్నాడు మూర్తి ఆసక్తితో.
“ఏం చెప్పను? నా మాట వినకుండా మామయ్య అప్పన్నని పోలీసులకి అప్పజెప్పాడు. పోలీస్ స్టేషన్లో అతన్ని చితకదన్నారు. అయినా అతను తీయలేదన్నాడు. నాలుగు రోజులు అతన్ని హింసించి, ఇక అతన్ని తన్నటానికి వాళ్ళకి శక్తి లేక, అతన్ని వదిలేశారు. మామయ్య అప్పన్ననీ పనమ్మాయినీ పని మానిపించాడు. తర్వత కొన్నాళ్ళకి ఈ కథకి అనుకోని విధంగా ముగింపు జరిగింది. మీరు ఊహించగలరా ఆ ముగింపుని?” అడిగాడు రాజు. అదే విషయం ఆలోచిస్తున్నాడేమో అతని కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
నారాయణ అన్నాడు. “నేను చెబుతాను ఆ ముగింపుని. ఒకరోజు మీ మామయ్య ఇంటికి వచ్చేసరికీ, బాబీ మంచం మీద కూర్చుని ఆ గొలుసుతో ఆడుకుంటున్నాడు. మీ మామయ్య గొలుసు దొరికిందని ఆశ్చర్యంతో గావుకేక పెట్టాడు. మీ అత్తయ్యా, నీ స్వప్నసుందరీ పరుగెత్తుకుంటూ వచ్చి, ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ ప్రకటించి బాబీని లాలించి ఎక్కడ దొరికిందమ్మా అని అడిగారు. వాడు నవ్వుతూ పక్కనే గోడకి వున్న కంతని చూపించాడు. మీ మామయ్య దాంట్లో వేలు పెట్టబోతే, ఆ కంతలో వున్న ఎలుక పెద్దగా నవ్వి, ‘నా బంగారు కొంపలో వేలు పెడితే కరుస్తా అంది. అదీ కథ”
“ఇది అలాటి కథ కాదు నారాయణా. ముగింపు ఇంకోలా జరిగింది” అన్నాడు రాజు.
“నేను చెబుతాను ఎలా జరిగిందో” అన్నాడు రాధాకృష్ణ.
“ఒకరోజు నీ స్వప్నసుందరి వాళ్ళ పిన్ని ఏవో నగలు కొనుక్కుంటానంటే, ఆవిడతో కలసి ‘సేట్ చమన్ లాల్ మరియు చంపక్ లాల్’ గారి షాపుకి వెళ్ళింది. అక్కడ ఆవిడ నగలు చూస్తుంటే, నీ రేఖమ్మగారి కళ్ళు అక్కడే వున్న మంచి రత్నం పొదిగిన లాకెట్ వున్న గొలుసు మీద పడింది. ఇది అచ్చం నా గొలుసులానే వుందే అనుకుంటుండగా, దాని వెనుక రేఖ అనే అక్షరాలు కనపడ్డాయి. ఆ విషయం నీకు మేఖసందేశం ద్వారా తెలిపింది. వెంటనే ఆఘమేఘాల మీద అక్కడ వాలావు. ఇటు చంపక్ లాల్నీ, అటు చమన్ లాల్నీ బెదిరించావు. వాళ్ళు ఫలానా అప్పారావు ఆ నగ తాకట్టు పెట్టి విడిపించుకోలేకపోతే, ఇక లాభం లేదని అమ్మకానికి పెట్టామన్నారు. నువ్వు ఆ అప్పారావు చొక్కా కూడా పట్టుకుని బెదిరిస్తే, డబ్బులు అవసరమై అతని డ్రీమ్ గర్ల్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురమ్మని ఆ నగ యిచ్చిందని చెప్పాడు. మళ్ళీ ఇంకోసారి అతని చొక్కా పట్టుకుని బెదిరించి, ఎవరా డ్రీమ్ గర్ల్ అని అడిగితే, ఆ అమ్మయి పేరు సుజాత అనీ, ఎం.ఎల్.ఏ.గారి కూతురనీ చెప్పాడు. నీ స్వప్నసుందరికి ఈ డ్రీం గర్ల్ ఫ్రెండు. ఆరోజు బోటనీ రికార్డు వ్రాయటం పూర్తయాక, ‘యాస్పరాగస్’ బొమ్మ గీసిన పేజీలో గొలుసుని దాచేసి ఇంటికి తెచ్చుకుంది. ఎం.ఎల్.ఏ. ధనవంతుడి కూతురికి ఇదేం ఖర్మ అని కదూ మీ అనుమానం. మరేం లేదు. ఆ అమ్మాయి అప్పారావు అనబడే అర్భకుడిని ప్రేమించింది కదా. వాళ్ళ నాన్నేమో ఆ అమ్మాయిని కోప్పడి, ఆ అమ్మాయి ఖర్చుల మీద ఆంక్షలు విధించి, ఆ ఇంట్లో ‘అత్యవసర పరిస్థితి’ ప్రకటించాడు. అందుకని డబ్బులు చాలక ఆ పిల్ల ఈ పని చేసింది. ఆ నగని అప్పారావు ద్వారా తాకట్టు పెట్టి డబ్బులు తెప్పించి వాడేసుకున్నది. అదీ కథ” అన్నాడు రాధాకృష్ణ.
“ముగింపు బాగానే వుంది కానీ, ఇలా కూడా జరగలేదు” అన్నాడు రాజు.
“మరెలా జరిగింది?” మూర్తి కుతూహలంతో అడిగాడు.
“నాలుగు నెలలు జరిగిపోయాయి. ఎండలకు బండలు కరిగిపోతున్నాయి. అప్పుడు ఒక రోజు మధ్యాహ్నం మా మామయ్య ఇంటి తలుపు కొట్టారెవరో. కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోతున్న మామయ్య విసుక్కుంటూ లేచి తలుపు తెరిచాడు. ఎదురుగా చెమటలు కక్కుకుంటూ నుంచుని వున్నాడు చాకలి అప్పన్న.
మామయ్యకి అతన్నీ, అతని చేతిలోని గొలుసునీ చూడగానే నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది.
‘ఏరా దొంగ వెధవా, ఇన్నాళ్ళకి తెచ్చి ఇస్తున్నావా గొలుసుని. వెధవన్నర వెధవా‘ అంటూ గొలుసుని అతని చేతిలోనించీ లాక్కుని, దానికి అంటుకున్న మట్టిని పైపంచెతో తుడిచి తృప్తిపడ్డాడు కానీ, దాన్ని తిరిగి ఇచ్చినందుకు హర్షించకపోగా, అప్పన్నని పోలీసులకి పట్టిస్తానని బెదిరించాడు. నింపాదిగా ఆయన వినటం మొదలుపెట్టాక, అతను చెప్పిన విషయం ఇంటిల్లిపాదినీ ఆశ్చర్యంలో ముంచివేసింది. మా వూరి చెఱువులో ఆ విపరీతమైన ఎండలకి నీళ్ళు పూర్తిగా ఎండిపోయాయి. తను ఎప్పుడూ బట్టలు వుతికే చోట, ఇతను నీళ్ళ కోసం పెద్ద గుంట తవ్వుతున్నాడు. తవ్వుతుంటే హరప్పా, మొహెంజోదారోల్లో నిక్షేపాల్లోలా ఈ నగ బయటపడింది. ఆరోజు రాత్రి బాబీ పడుకున్నప్పుడు గొలుసు మెడకు గుచ్చుకుంటుంటే, తీసి తన చొక్కా జేబులో వేసుకున్నాడు. బాబీని అడిగితే గుర్తు తెచ్చుకుని అవునన్నాడు. ప్రొద్దున్నే చాకలి రాగానే అన్ని బట్టలతోపాటూ అతని చొక్కా కూడా విప్పి చాకలికి వేశారు. అది అప్పన్న కూడా చూసుకోలేదు. రేవులో బట్టలు వుతికే సమయంలో అది జారి నీటిపాలయింది. గంగాదేవి దాన్ని తన గర్భంలో దాచుకుంది. ఎండల కారణంగా గంగాదేవి ఎండిపోతూ, ఆ నగని భూదేవి గర్భంలో దాచి మరీ ఎండిపోయింది. అప్పన్న అదృష్టం బాగుండి అతను గుంట తవ్వుతుంటే బయటపడింది. అది నమ్మలేనంత నిజంగా లేకపోయినా, నిజంగా జరిగింది మాత్రం ఇదే!” ముగించాడు రాజు.
“మీ మామయ్య వాడి మాటలు నమ్మక, మళ్ళీ పోలీసులకి అప్పజెప్పివుంటాడు. అతన్ని వాళ్ళు మళ్ళీ చితక్కొట్టి జైల్లో వేసుంటారు. అవునా?” నారాయణ అడిగాడు.
“ఈ కథ తర్వాత ఎలా ముగిసిందీ అని నేను ఆలోచించటం లేదు. అప్పన్న ఆ నగ తిరిగి ఇవ్వకపోయినా అడిగేవాడు లేడు. దాదాపు ఆ విషయం మరుగున పడిపోయింది. అతను దాన్ని ఇంకే వూళ్ళోనో అమ్ముకుని హాయిగా బ్రతకొచ్చు. కానీ ఎంతో నిజాయితీగా తిరిగి ఇచ్చేశాడు. అయినా అతన్ని అనుమానిస్తున్నాడు మీ మామయ్య. ఈ రెండు అంతస్థులలోని మా మామయ్యనూ, అప్పన్ననూ చూస్తుంటే, నీతీ నిజాయితీలలో కూడా ఈ అంతస్థులు ఇంకో రకంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు చూడు. ఆ వ్యత్యాసం నల్లగా వున్న నింగినీ, తెల్లగా వున్న నేలనూ చూస్తే మరింత స్పష్టమవుతుంది!” అన్నాడు రాజు, మబ్బులు పట్టిన ఆకాశాన్నీ, తెల్లటి యిసుక మీద ఆటలాడుతున్న పాల నురుగుల అలలనూ చూస్తూ.

౦౦౦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked