కథా భారతి

అమెరికాలో యోగీశ్వరుడు-2

(రెండో భాగం)

-ఆర్. శర్మ దంతుర్తి

జరిగిన కధ – బతక నేర్చిన బడిపంతులు సుబ్బారావు గారు జాతక చక్రం వేయడం, పంచాంగం రాయడం నేర్చుకున్నాక, తననో పరమహంస గా భావించుకుంటూ, తన కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా అమెరికాలో దిగేక తానూ అమెరికా వచ్చేడు విజిటర్ వీసా మీద. అక్కడ ఒక ఎన్నారై హిందూ గుడిలో ఏర్పాటు చేసిన ప్రసంగంలో పరమహంస గారు మాట్లాడ్డం అయ్యేసరికి సుబ్బారావు గురూజీకి కొంతమంది శిష్యుల్లా తయారయ్యేరు. మరోసారి అమెరికా వస్తాననీ, ఈ లోపున కొడుకు తనకి తయారు చేసిపెట్టిన వెబ్ సైటు ద్వారా దేశం నుంచే శిష్యులని ఉద్ధరిస్థాననీ ఆ వెబ్ సైటు రోజూ చూస్తూ ఉండమనీ చెప్పి తాను ఇండియా వెనక్కి వచ్చేసేడు. మరి కొంత కాలానికి రెండో సారి అమెరికా వచ్చేడు సుబ్బారావు. ఇంక చదవండి.)

రెండో అమెరికా ట్రిప్పులో రోజులు అద్భుతంగా గడిచిపోతుండగా కాస్త చలి రోజుల్లో ఓ వీకెండు డిన్నర్ పార్టీలో ఒక శిష్యుడు ప్లేటులో ఫుడ్ తెచ్చుకోవడానికి హాల్లో ఇటునుంచి అటు నడుస్తూ ఎందుకో ఓ సారి పరమహంసగారి చేతులు అనుకోకుండా తాకాడు. చిన్న ఎలక్ట్రిక్ షాక్ తగిలనట్టైంది. ఆశ్చర్యపోయిన శిష్య పరమాణువు పక్కవాళ్లతో చెప్పేడు షాక్ గురించి. అందరూ నోర్లు వెళ్ళబెడితే అది పరమహంస గారికి చేరింది వెంఠనే. ఆయన దానికి చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. పై వారంలో సోమవారం అందరూ ఆఫీసుల కెళ్ళిపోయాక గూగిల్ చేస్తే గురువుగారికో కొత్తవిషయం తెలిసింది. ఒకానొకప్పుడు సన్యాసం తీసుకోకముందు వివేకానందులు ధ్యానం చేస్తూంటే పక్కనే ఉన్న అభేదానంద గారు వివేకానందగార్ని ముట్టుకున్నప్పుడు ఒక్క షాక్ తగిలిందిట. దాని గురించి రామకృష్ణులకి చెప్పారు. అలా మరో సారి చేయొద్దని ఇద్దరినీ హెచ్చరించారు రామకృష్ణులు. ఇది చూడగానే సుబ్బారావు తన వెబ్ సైటు లో క్రితం వీకెండ్లో తనని అంటుకున్న శిష్యుడికి కూడా తాను అటువంటి అనుభవాన్ని అనుగ్రహించినట్టూ రాసుకున్నాడు. నిజంగా షాక్ తగిలిన ఆ శిష్యుడూ, మిగతా శిష్యులూ ఆ విషయం చూసారు తర్వాత గురువుగారి వెబ్ సైట్లో – అవును ఆఫీసులో పనిచేస్తున్నప్ప్పుడే. షాక్ తగిలిన శిష్యుడి అదృష్టానికి మిగతా శిష్యులు ఈర్ష్య పడ్డారు. మళ్ళీ గూట్లే ప్రశ్నలు అడుగుతున్నారే? ఆఫీసులోంచి ఇలా అన్ని వెబ్ సైట్లూ చూడొచ్చా, ధ్యానం చేసేవారికి ఈర్ష్యాసూయలు ఉండకూడదూ అని? మరి మాట్లాడకండి. ఏది ఉండాలో ఉండకూడదో పరమహంస గారు వెబ్ సైట్లో చెప్తారు. ఆమధ్యన జాతకాలు చెప్తూ – ఆ శాస్త్రం నేర్చుకున్నది ప్రశ్నలు చెప్పడానికే అనీ, దాన్ని ఇష్టం వచ్చినట్టూ వాడుకోవచ్చనీ – చెప్పినట్టే. ఆఫీసులో పనిచేసేటప్పుడు ఇలా వెబ్ సైట్లు చూడొచ్చా అనేది ఆఫీసువాళ్ళు చూసుకుంటారు. ఏదైనా వెబ్ సైటు చూడరాదనుకుంటే, దాన్ని బ్లాక్ చేసే పని ఆఫీసు వాళ్ళది కదా? ఆ మాత్రం తెలియదా?

ఇలా శిష్యగణం దినదిన ప్రవర్ధమానమౌతూంటే, మరో వీకెండ్లో కొత్త శిష్యులు కలిసారు పరమహంసగారిని. అప్పటికింకా గురూజీ అంతరంగిక వర్గం లో జేరని ఓ పిల్ల కాకి ఎవరూ ఎదురుచూడని గూట్లే ప్రశ్నఅమాయకుడిలాగా అడిగేసేడు – “మీ శిష్యులిగా చేరాలంటే ఎలా, ఏం చేయాలి?“

“నా వెబ్ సైటు చూడండి. నా మనస్సు అర్ధం చేసుకోండి, నా తత్వం అర్ధమవ్వాలి. అప్పటిదాకా నేను మిమ్మల్ని జేర్చుకోలేను. అదంత ఈజీ, విజీ కాడు. ” సమాధానంగా గురువుగారు ఉవాచ.

“మీ వెబ్ సైట్ లో చాలా ఉన్నాయండి చదవడానికి. టైమ్ సరిపోవట్లేదు” రోజూ ఇంటర్నెట్టు మీద గంటలకొద్దీ టైమ్ తగలేసే పిల్లకాకి ఈ వెబ్ సైట్ అంతా ఎవడు చదువుతాడు అనుకుంటూ మళ్ళీ అడిగేడు.

“మీరు నాలాగే ఏక సంథా గ్రాహి అయితే ఒక్కసారి చదవగానే అర్ధమైపోతుంది” గురూజీ నోటికొచ్చిన సంస్కృతం మాట్లాడుతూ చెప్పేసేడు పిల్లకాకితో. ఎంత అర్థం కాని భాష మాట్లాడితే అంత గొప్పకదా?

పిల్లకాకి ఎన్నారై ఒకప్పుడు తెలుగు చదువుకున్నవాడే. అక్కడో ముక్కా ఇక్కడో ముక్కా సంస్కృతం వచ్చినవాడేను. కానీ ఎప్పుడైతే పై చదువులకి అమెరికా వచ్చాడో అప్పుడే మర్చిపోయేడు ఈ ముక్కలన్నీ. అందువల్ల “ఏక సంతా గ్రాహి అంటే?” వెర్రిమొహం వేసుకుని అడిగేడు “సంథా” అనే పదాన్ని “సంత” అనుకుని.

గురూజీ చిరునవ్వు నవ్వేడు పక్కనున్న తన అంతర్గత శిష్యులని చూసి. వాళ్లందరూ పిల్లకాకితో చెప్పేరు, ముక్త కంఠంతో “ఈ ప్రసంగం అయిపోయాక మేం చెప్తాం దానిగురించి. ఇప్పటికి ఊరుకోండి”

అక్కడితో పిల్లకాకి నోరు నొక్కుకోక తప్పలేదు. మిగతా వాళ్ళు అడిగిన ధర్మ సందేహాలు అన్నీతీరిపోయాక రెండువారాలలో గురువుగారికి పాద పూజ ఏర్పాటు చేయబడింది. పాదపూజలు హిందూ గుళ్ళో చేస్తామంటే తాట వలుస్తారు కనక ఒక స్థానిక డాక్టర్ గారింట్లో ఏర్పాటు చేసారు. పాద పూజ అయిపోయాక గుడి పూజారి చేత సత్యన్నారాయణ వ్రతం. తర్వాత అతి ముఖ్యమైన ఐటమ్ లేకపోతే పిల్చినవాళ్ళు ఎవరూ రారు కనక – విందు భోజనం, ప్రసాద వితరణ. ఆ ప్రసాదం పూజ అయిన వెను వెంఠనే తినకపోతే సత్యన్నారాయణ స్వామివారి ఆగ్రహం వస్తుందని వ్రత కధలో మనందరం చదువుకున్నదే కదా? అందరూ వెళ్లబోయేముందు మరోసారి పిల్లకాకి “ఏకా సంథా గ్రాహి” విషయం పైకి ఎత్తేడు. నలుగురి శిష్యుల్లో ఒకాయన గురువుగారు వింటూండగానే చెప్పారు. “ఏక సంథా గ్రాహి” అంటే “అన్నివిషయాలూ ఒకేసారి గ్రహించుట” అని.

పిల్లకాకి మొహం చూస్తే ఇది ఇంకా ఆయనకి అర్ధం కాలేదని తెలిసిపోతోంది. అందువల్ల మరో శిష్య పరమాణువు విశదీకరించి చెప్పేడు, “ఇప్పుడు మీరు పటేల్ స్టోర్ కి వెళ్తున్నారనుకోండి. ఏమి కావాలో అన్నీ కాయితం మీద రాసుకుని అన్నీ ఒకేసారి కొనుక్కుని వచ్చేస్తారు. ఆ తర్వాత మీ ఆవిడ నెలకి సరిపడా సరుకులన్నీ ఏవీ మర్చిపోకుండా తెచ్చినందుకు మీ కేసి ప్రేమ గా చూస్తుంది. అంటే సంతలో కూరలూ, వెచ్చాలూ అన్ని పనులూ ఒకేసారి అయిపోయాయి కదా? అదే…”

మరో శిష్యుడు దీనినే మరింత విశదీకరిస్తూ చెప్పేడు, “నేను మొదట్లో నెలకి మూడు నాలుగు సార్లు సంతకి వెళ్ళేవాణ్ణి. ఎన్ని సార్లు మా ఆవిడ చెప్పినా ఏదో ఒకటి మర్చిపోవడం. అంటే కరివేపాకు తెమ్మంటే అది మర్చిపోయి పటేల్ స్టోర్ వాడు చెప్పినట్టు అప్పుడే వచ్చిన మామిడి పళ్ళు కొనడం అలా అన్న మాట. ఒక సారి గురువు గారి వెబ్ సైటు చదవడం మొదలుపెట్టి ఆయన దగ్గిర జేరగానే ఇప్పుడు అన్నీ కాయితం మీద రాసుకుని నెలకి ఒక్కసారే సంత కి వెళ్తున్నాను.”

ఇలా అందరూ చెప్పేక పిల్లకాకి అర్ధమైందన్నట్టూ తలాడించేడు. ఇదన్నమాట, తానిప్పట్నుంచి పటేల్ కి వెళ్ళేది నెలకొక సారి మాత్రమే. తాను చేయబోయేది ఒకే ఒక “సంత”; అదీ నెలకొకసారి మాత్రమే. ఇంత సులువా ఏక సంతా గ్రాహి అవడం? మొహంలో ఆనందం చూపిస్తూ గురువుగారికి పాదాభివందనం చేసి, పాద పూజకి వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తానని పెళ్ళాం పిల్లల్తో ఇంటికి బయల్దేరేడు పిల్లకాకి.

* * * * * *

ఆ మర్నాడు అందరూ ఆఫీసులకెళ్ళిపోయాక పరమహంస గారు ఎప్పటిలాగానే వెబ్ సైటులో ఫోటోలు అన్నీ ఉంచారు శిష్యులు చూసి తరించడానికి.

అయితే ఈ వెబ్ సైటు, ఫోటోలు మన ఇండియన్స్ కానివాళ్ళు మరొకరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూస్తున్నారని ఎవరికీ తెలియలేదు. ఎలా తెలుస్తుంది? ఇంటర్నెట్టు పుణ్యమా అని ప్రపంచంలో నలుమూలనుంచీ వెబ్ సైటు ఎవరేనా చూడొచ్చు కదా? గురువుగారు అసలు ఇలా ఫోటోలు అవీ వెబ్ సైట్ లో పెట్టడం ప్రపంచంలో నలుమూలలా ఉన్న తన శిష్యులని ఉద్ధరించడానికీ, వాళ్ళని ఆత్మ జ్ఞానులుగా చేయడానికీ కాదూ? అయినా ఆ స్టాటిస్టిక్స్ అన్నీ చూస్తూ కూర్చుంటే గురువుగారు శిష్యులకి తన తేజస్సు, మేధస్సూ చూపించేదెప్పుడూ, వాళ్ళు ఉద్ధరించబడేది ఎప్పుడూ?

గురువుగారికి పాదపూజ ఏర్పాటు చేసిన డాక్టర్ గారు ఊళ్ళో పేరొందిన తీరికలేని సర్జను. మంచి పోష్ ఏరియాలో ఇల్లు, రెండు మెర్సిడెస్ కార్లూ అవీ ఉన్నాయన. పాద పూజ చేస్తూంటే వీడియో, సత్యన్నారాయణ పూజకి వీడియో నిడివి పెద్దదైపోతుంది కనక ఫోటోలు, తీసుకున్నారు. నాలుగింటికి మొదలైన ఈ పూజలు రెండూ గంట ఏడు కాకుండా పూర్తై పోయాయి. హెర్నియా సర్జరీ చేసినంత సులువుగా ఇదంతా అయిపోయినందుకూ, మనవాళ్ళు – అందులోనూ తెలుగువాళ్ళు అందరూ సమయానికి వచ్చినందుకూ ఆయన పేరు పేరునా ధన్యవాదాలు చెప్పి భోజనానికి పిల్చేడు అందర్నీ. అమెరికాలో వేసవి కాలం చీకటి పడ్డానికి దాదాపు రాత్రి తొమ్మిదౌతుంది కనక ఏడున్నరకి భోజనాలైపోయిన అందర్నీ పక్కనే ఉన్న చిన్న లేక్ దగ్గిరకి వ్యాహ్యాళికి తీసుకెళ్ళాడు సర్జన్. లేక్ దగ్గిర నడుస్తూంటే గురువుగారు శిష్యులకి ఒక ప్రశ్న వేశాడు ఓ సారి తాను చదివిన పుస్తకంలోదే గుర్తు తెచ్చుకుని “ఇలా నీలంగా ఉండే నీళ్ళని చూస్తే మీకేం తెలుస్తుంది?”

ఓ రాకెట్ సైంటిస్టు శిష్యుడు చెప్పేడు, “ఆకాశం నీలంగా ఉంటుందని.”

“కాదు” పరమహంస గారు కొట్టిపారేస్తూ అన్నారు.

మరొకాయన ఏదో చెప్పబోయి గురువు కి కోపం వస్తుందేమోనని నోరుమూసుకున్నాడు.

యోగీశ్వరులు అలా శూన్యంలోకి చూస్తూ అందరికీ హితబోధ చేస్తున్నట్టూ చెప్పేడు, “ఆకాశం చూడండి. నీలంగా ఉంటుంది; అది అనంతం. సముద్రంలో నీళ్ళని చూడండి, అవీ అనంతం. అలాగే ఈ లేక్ లో నీళ్ళూను. కాస్త విడమర్చి చెప్పుకోవాలంటే కృష్ణుడూ, రాముడూ కూడా నీలమేఘ శ్యాములు అంటే వారు కూడా అనంతం అయిన బ్రహ్మ స్వరూపులే. అందువల్ల నీలం రంగులో ఏది చూసినా భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవాలి. అందుకే అర్జునుడు భగవద్గీతలో కృష్ణుడి విశ్వరూపం చూసి ‘ఏవ ముక్త్వాతతో రాజన్మహా యోగీశ్వరో హరిః’ అన్నది.”

“అదేమిటండి, అలా అన్నది కృష్ణుడి విశ్వరూపం దూరంనుంచి అదృశ్యంగా చూస్తున్న సంజయుడు కదా?” ఓ శిష్యుడు అడిగేడు గురువు గార్ని అనుమానంగా చూస్తూ.

“చూసారా మీరెందరూ ఎంత అజ్ఞానులో? హిందువులమై ఉండీ భగవద్గీత కూడా గుర్తుండకపోతే ఎలా? అందుకే మీరంతా ఏక సంథా గ్రాహులవ్వాల్సిన అవసరం” అక్షింతలు జల్లేరు పరమహంస గారు.

ప్రశ్న అడిగిన శిష్యుడు ఈ సమాధానంతో అందరి ముందూ తల కొట్టేసినట్టై, నోరు మూసుకున్నాడు వెంఠనే. మిగతా శిష్య పరమాణువులు నీలం రంగు సంగతి గుర్తొచ్చి తమ కూడా వచ్చే ఆడవాళ్లలో నీలం చీరలున్న వాళ్ళకేసి చూసారు – ఈ సారి దొంగ చూపుల్తో కాక ధైర్యంగా. నీలం చీరలూ మాచింగ్ జాకెట్లూ, చెవులకి నీలం జూకాలూ, నీలం చెప్పులూ వేసుకున్న ఆడంగులు కాస్త సిగ్గుపడ్డారు, తాము నిజంగా ఆ రోజు ఆత్మ జ్ఞానం పొందిన యోగులైపోయినట్టు.

ఆ రోజు రాత్రి లేక్ నుంచి వ్యాహ్యాళి అయ్యి ఇంటికొచ్చేక గురువు ముందు గారి కార్యక్రమం ఏమిటా అని ఆలోచించారు శిష్యులు. మరో మూడు వారాల్లో గురువుగారి శెలవు అయిపోయి ఇండియా వెళ్ళిపోబోతున్నారు. ఈ లోపుగా కామధేనువు లాంటి పరమహంస గారి వద్ద ఎన్ని పాలు పితుక్కుంటే అంత మంచిది కదా? అందువల్ల శిష్యులంతా ఏం చేయాలో ఆలోచిస్తూంటే అక్కడే నిర్వికారంగా కూర్చున్న గురువుగారే చెప్పారు, “మనందరం ఒక రిట్రీటు ఏర్పాటు చేసుకోవచ్చు.”

“రిట్రీట్ అంటే పిక్నిక్కా?” ఒక ఇల్లాలు అడిగింది హుషారుగా.

“కాదు, అందులో నేను మీకందరికీ ధ్యానం, దోసకాయపప్పు చేయడం నేర్పుతాను.”

అమెరికా వచ్చి ఐదేళ్ళ పైన అయినా ఇంకా వంట రాని వాళ్ళావిడ రోజూ వండే ఉడకని పప్పు గుర్తొచ్చింది కాబోలు, పక్కనే ఉన్న మరో శిష్యుడు చెప్పేడు, “అవునండి, స్వామి వివేకానంద గారు కూడా వంట సరిగ్గా చేయడం వచ్చినవాడే ధ్యానానికి అర్హుడు అన్నారు.”

“ఎక్కడికెళ్దాం అయితే?” మరో శిష్యుడడిగేడు.

“మీరే చూడండి. ఏదైనా లేక్ పక్కనైతే బాగుంటుంది. నీలం రంగులో కనబడే నీళ్ళంటే అనంతం అని చెప్పుకున్నాం కదా?” గురువు గారు హెచ్చరించారు.

వెంఠవెంఠనే శిష్యులు స్మార్ట్ ఫోన్లు బయటకి తీసి గూగిలించేరు. లేక్ అంటే మొదటిగా గుర్తొచేది లేక్ మిషిగన్, దానికి ఆనుకునే ఉన్న లేక్ సుపీరియర్ అలా మిగతా పెద్ద పెద్ద సరస్సులు. లేక్ సుపీరియర్ దాకా వెళ్తే గురువుగారికి వీసా ఇబ్బంది రావొచ్చు అటువైపు కెనడా కనక. లేక్ మిషిగన్ అయితే ఇటు విస్కాన్సిన్ లోనూ అటు మిషిగన్ లోను బోల్డు వీలు. వెతగ్గా వెతగ్గా మొత్తంమీద గాంగెస్ అనే ఊరిలో ఒక చిన్నరామకృష్ణా ఆశ్రమం ఉందనీ అక్కడ తమకో ఇల్లో, హొటలో దొరుకుతుందనీ తెలిసిపోయింది.

సర్జన్ గారి ఇంటి పార్టీనుండి అందరూ వెనక్కి వెళ్ళిన గంటలో మొత్తం అంతా ఖరారు అయిపోయింది. గాంగెస్ లో రాబోయే రోజుల్లో గురువుగారితో రిట్రీటు! ఈ వార్త తమకి చేరగానే సోమవారం పొద్దున్న రాబోయే రిట్రీటు విషయాలూ, గత వారం పాద పూజ, వ్రతం ఫోటోలు అన్నీ పరమహంస గారి వెబ్ సైట్లోకి చేరిపోయాయి.

* * * * * *

మంగళవారం ఏమీ ఇబ్బంది లేకుండా గడిచింది. వెబ్ సైటు చూస్తున్న ఎవరికీ తెలియని మూడో అనామక పార్టీ సర్జన్ గారింట్లో జరిగిన పార్టీ ఫోటోలని సునిశితంగా పరిశీలించి నవ్వుకుంది. ఫోటోలలో అదిరిపోయే డైనింగ్ టేబిలూ, దానిమీద ఉన్న వెండి, బంగారు సామాన్లూ, గోడలకి ఉన్న పైంటింగ్సూ, ఆడంగులు వేసుకున్న చీరలూ, నగలూ సర్జన్ గారి ఆదాయం ఎంతో చెప్పకనే చెప్తున్నాయి. ముఖ్యంగా గోడమీద తగిలించిన ఎ.డి.టి వారి సెక్యూరిటీ ఎటువంటిదో ఫోటోలో అద్భుతంగా వచ్చింది మోడల్ నెంబర్ తో సహా. మరి ఫోటోలు తీసినందుకు వాడినది కేనన్ వారి లేటేస్ట్ మోడల్ డిజిటల్ కేమేరా కదా?

బుధవారం పొద్దున్నే సర్జన్ గారు హాస్పిటల్ కి వెళ్ళగానే వాళ్ళావిడ తన పనిలోకి లేటుగా వెళ్తూ ఆ రోజెందుకో కంగారుగా ఇంటికున్న ఎ.డి.టి వారి అలార్మ్ ఆన్ చేయడం మర్చిపోయింది. మళ్ళీ గూట్లే ప్రశ్నా? రోజూ గరాజ్ డోర్ వేయకపోవడం మర్చిపోయినా అమెరికాలో సాధారణంగా ఇటువంటి ఊళ్ళలో దొంగతనం జరగదని తెలియదూ? అదీ గాక పరమహంస గారి చల్లని చూపులు తమ మీద ఉండగా దొంగతనం ఎలా జరుగుతుంది? పిల్లలు స్కూళ్ళకి వెళ్ళేక వీధి వీధంతా నిర్మానుష్యంగా ఉన్నప్పుడు దాదాపు పదింటికి సర్జన్ గారి ఇంటిముందో వాన్ – లోకల్ మూవర్స్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉన్నది – వచ్చి ఆగింది. వచ్చిన ముగ్గురిలో ఇద్దరు చిన్న టూల్ బాక్సుతో లోపలకి వెళ్ళారు. ఒకాయన అక్కడే స్టీరింగ్ దగ్గిర ఫోన్ దగ్గిరగా పెట్టుకుని చుట్టూ చూస్తూ కాసుకుని కూర్చున్నాడు. సరిగ్గా గంటలో పనైపోయింది లోపలకి వెళ్ళిన ఇద్దరికీ సర్జన్ గారింట్లో. ఎ.డి.టి వారి సెక్యూరిటీ వల్ల ఏదో సమస్య వస్తుందనుకున్నారు కానీ అది ఆఫ్ చేసి ఉండడంతో పని మరింత సులువైంది. సర్జన్ గారి బెడ్రూమ్ లో దొరికిన కేష్, వాచీలు, గొలుసులూ, వాళ్ళావిడ చంద్రహారం, వడ్డాణం ఈ మధ్యే చేయించిన డైమండ్ నెక్లసూ, పిల్లలు గుడికు వెళ్ళినప్పుడు మాత్రం వేసుకునే నగా నట్రా, రెండు మూడూ లాప్ టేప్ కంప్యూటర్లూ, ఐ పేడ్ లూ అన్నీ వెంటబెట్టుకుని తలుపు ఎప్పటిలాగానే వేసేసి ఎవరికీ అనుమానం రాకుండా లోకల్ మూవర్స్ వేన్ ముందుకి కదిలిపోయింది.

సాయంత్రం ఇంటికొచ్చిన సర్జన్ వాళ్ళావిడమీద ఎగిరెగిరి కేకలు పెట్టాడు సెక్యూరిటీ ఆన్ చేయనందుకు. ఆవిడ ఆన్ చేసానని ఈయనతో పోటీగా వాదిస్తూనే ఉంది. ఏదైతేనేం ఓ పోలీస్ రిపోర్ట్ పారేశారు. “సెక్యూరిటీ ఆన్ చేయకుండా వెళ్తే మేం మాత్రం ఏం చేస్తాం?” అని పోలీసులు రిపోర్ట్ తీసుకుంటూ అన్నప్పుడే ఇద్దరికీ అర్ధమైపోయింది పోయిన సరుకు దొరుకుతుందో లేదో.

అదే సాయంత్రం సర్జన్ గారు పరమహంస గారికి ఫోన్ చేసి ప్రశ్న సంధించాడు, “ఇంట్లో దొంగతనం వల్ల పోయిన విలువైన వస్తువులు ఎప్పుడు దొరుకుతాయి?” అసలు మొదట్లోనే పరమహంస గారు చెప్పారుగా, జాతకం, ప్రశ్న చక్రం అవీ నేర్చుకునేది ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడానికే అని? అదీగాక పరమహంస గారు జాతక చక్రంతో పాటు ఆయన ధ్యానంలో కర్ణ పిశాచిని – ఎప్పుడు కావాలిస్తే అప్పుడు – పిలిచి అడగగలరు. ఆ పిశాచి ఈయన జన్మతః బానిస కనక ఏమడిగినా సమాధానం చెప్పితీరవల్సిందే. దీని గురించి క్రితం వారమే పరమహంస గారు ఉపన్యాసంలో శెలవిచ్చారు కూడా. ఇంకెందుకు ఆలశ్యం?

“ఒకటినుంచి నూట ఎనిమిది లోపుల మనసులో తోచిన అంకె చెప్పు.” సుబ్బారావు అడిగేడు ఫోనుమీదే.

పొద్దున్న నుంచీ సర్జరీ మీద సర్జరీలు చేసి ఒళ్ళు హూనమై, తిండీ తిప్పలూ లేకుండా ఇంటికొస్తే ఇప్పుడీ దొంగతనం, ఇవన్నీ బుర్ర తినేసాయి కాబోలు సర్జన్ “నూట ఇరవై మూడు” అన్నాడు.

“నూట ఇరవై మూడా? నేను అడిగినది నూట ఎనిమిది లోపు. ప్రశ్నలు వేసేటప్పుడు ఇటువంటి అంకెలు చెప్పేవాళ్ళకి ఒకటే సమాధానం. “అసంభవం. మీ పోయిన సామాను ఆరు నూరైనా, నూరు ఆరైనా దొరకదు.”

ఒక్కసారి కళ్ళు తిరిగినట్టైంది సర్జన్ గారికి. పోలీసులు చెప్పింది కూడా అదేనా? “సారీ అండి. పొద్దున్న నుంచీ మనసు బాగో లేదు. మరోసారి అడగొచ్చా?”

“ఇంక మరో ప్రశ్న వద్దు ఈ రోజుకి.” ఫోన్ కట్ చేశాడు పరమహంస.

సర్జన్ కి గానీ వాళ్ళావిడకి గానీ ఇలా పరమహంస గారు తమ ఇంట్లో తీసిన వీడియో, ఫోటోలు ఆయన వెబ్ సైట్లో పెట్టాక అవి చూసినవాళ్ళు జాగ్రత్తగా గమనిస్తూ పకడ్బందీగా దొంగతనానికి పూనుకున్నారన్న విషయం కలలో గానీ తట్టలేదు. గురువువారికీ ఈ విషయం పట్టలేదు ఎందుకంటే ఆయనకసలే కోపం వచ్చింది సర్జన్ మీద. ఒకటి నుంచి నూట ఎనిమిది లోపు నెంబర్ చెప్పమంటే నూట ఇవరై మూడా చెప్పేది? దారుణం! ఈయన పేరుకు సర్జన్, కానీ ఈ అంకె చెప్పడం చూస్తే చదువుకున్నవాడేనా అనిపించదూ? ఈయనా తన అంతర్గత శిష్యుడు?

* * * * * *

రెండో, మూడో రోజులు పోయాక పోలీసులు సర్జన్ ఇంటికొచ్చేరు దొంగతనం గురించి కనుక్కోవడానికి. అన్నీ చూసి ఎక్కడైనా లొసుగులు కనిపిస్తాయేమో వెదికాక ఒకాయన అడిగేడు, “మీ ఇంటి గదుల్లోకానీ లోపల సామాను కానీ ఫోటోలు తీసి ఏదైనా పబ్లిక్ వెబ్ సైట్ లో పెట్టారా? దొంగలు సాధారణంగా అన్నీ చూసి తెలుసుకుని వస్తారు దొంగతనానికి బయల్దేరే ముందు.”

“అవును మా గురువుగారు క్రితం వారం కొన్ని ఫోటోలు పెట్టారు.” సర్జన్ వాళ్ళావిడ చెప్పింది.

“సరే అయితే మేము చూస్తాం దానిగురించి, కానీ పోయిన సరుకులు దొరికే ఛాన్సు సున్నా,” పోలీసులు బయటకి నడిచేరు. పోలీసులు వాళ్ల ఆఫీసుకెళ్ళాక పరమహంస గారి వెబ్ సైటు చూసేరు. హారర్! అందులో సుబ్బారావు గారు రాసే రోజువారీ, నెలవారీ రాశి ఫలితాలూ, ఎవరెక్కడ ఎలా చావబోతున్నారో తాను ముందే ఎలా ఇవన్నీ పసికట్టగలడో అలాంటివన్నీ కనిపించేయి. ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు చచ్చిపోయారూ, చచ్చిపోబోతున్నారూ, ప్రముఖుల ఫోటోలు, ఆయన అమెరికా రోడ్లమిద నడుస్తూ తీసిన ఇళ్ళ ఫోటోలు, వీధుల ఫోటోలూ, తన శిష్య పరమాణువుల ఇళ్ళలో జరిగిన డిన్నర్ పార్టీ ఫోటోలు, పాద పూజ ఫోటోలు అలా తనకి నచ్చిన, తాను మెచ్చిన ఫుట్ బాల్, క్రికెట్, టెన్నిస్ ఆటగాళ్ల ఫోటోలు ఇలాంటివన్నీ చూసాక పోలీసులకి అనుమానం ధృడమైంది. అయితే వీటివల్ల ఇప్పటివరకూ ఎవరికి హాని జరిగిందో ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు, అదీగాక దీనివల్ల దొంగతనం జరిగిందా అనేది అప్పుడే చెప్పలేం. అంచేత ఏమీ చేయడానికి లేదు ప్రస్తుతానికి. అయితే పోలీస్ ఛీఫ్ ఇదంతా చూసి ఈ వెబ్ సైటునీ, పరమహంస గారినీ ఓ కంట కనిపెట్టి ఉండమని మొత్తం పోలిసులందరికీ ఒక నోట్ పెట్టేడు.

పోలీసులు వెళ్ళిపోయాక సర్జనూ, వాళ్ళావిడా నీది తప్పంటే నీది తప్పని మరో రెండు గంటలు వాదించుకుని, పీకలదాకా కోపం వచ్చేదాకా ఒకర్నొకరు తిట్టుకుంటూ, మొత్తానికి రాత్రికి భోజనాలు మానుకుని ఇలా గురూజీకి శిష్యులైనందుకు లెంపలు వేసుకుని మర్నాటికి ఎప్పటిలాగానే కాంప్రమైజు అయిపోయి ఇన్స్యూరెన్స్ కి ఫోన్ చేసి అన్నీ చెప్పారు. అప్పుడు తెలిసి వచ్చింది ఏమిటంటే సర్జన్ గారు ఇంటికి ఇన్స్యూరెన్స్ చేయించారు గానీ ఇంట్లో వస్తువులకి చేయించలేదు. అందువల్ల పోయిన వస్తువులకి నీళ్ళధారే. ఇన్స్యూరెన్స్ వారు ఏమీ ఇవ్వలేనందుకు చింతిస్తున్నారు. అయితే మరోసారి ఇలా జరిగితే ఇన్స్యూరెన్స్ ఏదైనా ఇవ్వడానికి ఏజెంటు గారు ఇంట్లో వస్తువులకి కూడా – అతి తక్కువ నెలవారీ ధరకి – ఇన్స్యూరెన్స్ పెంచుతారు. కావాలిస్తే ఫలానా నెంబర్ కి ఫోన్ చేయగలరు. అలాగ సర్జన్ గారు జీవితంలో అతి విలువైన గుణపాఠం నేర్చుకుని గురూజీ శిష్యరికంలోంచి బయటపడ్డారు – కాస్త ఖర్చుతో కూడిన విషయమైనా.

ఇదేమీ తెలియని గురువుగారు ఎప్పటిలాగానే శిష్యులని ఉద్ధరిస్తూ, తీసిన ఫోటోలలో ఎవరు ఉన్నా వాళ్ళ అనుమతి లేకుండా వెబ్ సైటులో ఆ ఫోటోలు పోస్టు చేస్తూ ఉల్లాసంగా కాలం వెళ్ళదీస్తున్నారు. శిష్యులు కూడా గురువుగారి పాదరేణువులు వీలున్నప్పుడు తలమీద జల్లుకుని రోజువారీ పాపాలనుంచి ఎప్పటికప్పుడు పవితృలౌతున్నారు.

ఇంత జరిగాక సర్జన్ గారికి ఇప్పటివరకూ తెలియని మరో విషయం తెరమీదకి వచ్చింది. ఆయనా వాళ్ళావిడా పూర్తిగా పరమహంస గారి శిష్యరికంలోంచి బయటపడ్డాక ఓ రోజు హై స్కూల్లో చదువుకునే సర్జన్ గారమ్మాయి చెప్పింది ఇద్దరితో, “మీరిద్దరూ ఇప్పుడు ఈయన శిష్యరికంలోంచి బయటపడ్డారు కానీ నాకు ఆయనంటే ముందునుంచీ అదో చెడ్డ ఫీలింగ్ ఉండేది ఆయన మంచివాడు కాదని.”

“అదేం అలా అంటున్నావు? నీకెలా తెలిసింది?”

కాసేపు మౌనంగా ఉన్నాక చెప్పింది ఆ పాప “ఆయన ఓ సారి పార్టీలో నా చేయి పట్టుకుని, వంటి మీదకి పోనిస్తూంటే నేను తప్పించుకుని వచ్చేశాను. అప్పట్నుంచీ పార్టీలలో ఆయన దగ్గరకి వెళ్ళాలంటే భయం, అసహ్యం”

ఇది విన్న సర్జన్ అగ్రహోదగ్రుడైపోయేడు. ఫోన్ తీసి పోలీసులని పిల్చి అప్పటికప్పుడే గురువుగార్ని జైల్లో పెట్టిస్తానని అరుస్తూంటే వాళ్ళావిడ అమ్మాయిని మరో రూములోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి సర్జన్ తో చెప్పింది, “అలా చేస్తే ఊరూ వాడా తెలుస్తుంది. అయినా ఇదంతా అయినట్టు ప్రూఫ్ లేదు. ఎవరున్నారు విట్ నెస్ గా ఇది జరిగినట్టు చెప్పడానికి?”

కోపం తగ్గేదాకా అరిచి అప్పటికి సర్దుకున్నా సర్జన్ ఊరుకోక రెండు రోజులు పోయాక సుబ్బారావు కొడుకుని పిల్చి చావో రేవో తేల్చుకుంటానని బెదిరిస్తూ మాట్లాడేడు.

అంతా విన్న కొడుక్కి కాలూ చేయీ ఆడలేదు. సర్జన్ గారి కాళ్ళా వేళ్ళా పడి మరెప్పుడూ ఇటువంటిది జరక్కుండా చూస్తాననీ, ఓ వారంలో తండ్రి ఇండియా వెళ్ళిపోతున్నాడు కనక ఈ తప్పు కాయమనీ అడిగేడు ఏడుస్తూ. అది అలా సమసిపోయింది అప్పటికి.

(ముగింపు వచ్చే సంచికలో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked