కథా భారతి

అసలుది తప్ప!!

– సముద్రాల హరిక్రృష్ణ

“ఎండను పడి వచ్చారు ఏం తీసుకుంటారు?!”

“అబ్బే, ఏమీ వద్దండీ,
అది ఇచ్చేస్తే,తీసుకెళ్దామనీ…..”

“మజ్జిగ పుచ్చుకుంటారా!అయినా, పేరుకె కానీ,ఏం మజ్జిగ లేండి,తెల్లటి నీళ్ళు తప్ప….”

“సరిగ్గా చెప్పారు,ఒక్క వస్తువు ససిగ ఉండట్లేదు
పాలు బాగుంటే కద మజ్జిగ రుచి సంగతి..”.

“బుర్రలో మాట అందిపుచ్చుకున్నట్టు చెప్పారు.దాణా
బాగుంటే కాదుటండీ పాడి ,అదీ వదలట్లేదుగా
మహానుభావులు!”

“అవు న్నిజమేనండీ,సామాన్య జనం మనం ఏం చేయకల్గుతాం,…
మరి అది కాస్తా ఇప్పిస్తే….”

“ఏం సామాన్యమో ఏం జనమో, చురుకు లేదు ఒక్క శాల్తీలో, నిలదీసి అడిగి,కడిగి పారేయద్దండీ, వెధవ పిరికితనం కాకపోతేనూ!!మనిషన్నాక ఆ మాత్రం ఖలేజా ఉండద్దూ!”

“ఎట్లా ఉంటుందండీ ఖలేజా?!వాళ్ళా-
డబ్బు, దస్కమ్; మందీ మార్బలం ఉన్నవారు,జనం దగ్గర ఏముంది? రెక్కాడితే గాని డొక్కాడని బతుకులాయె!”

“అదిగొ, ఈ చేతకాని మాటలే నాకు నచ్చవు.మనదైన దానిని ముక్కు పిండి మరీ వసూలు చేయాలి,మనది కాని దాని.జోలికే పోకూడదు. అదీ నికార్సైన మనిషి లక్షణం అంటే.”

“చిత్తం, అందరూ మీలా ఆలోచిస్తే సమస్య ఏం ఉందీ,పనులన్నీ చకచక సాగిపోవూ!
మరి నాది నాకిప్పిచ్చేస్తే,సెలవు తీసుకుంటాను.”

“అద్గదీ,మూల ప్రాణం పట్టుకున్నారు!
ఆలోచన అన్నిటి కన్నా ముఖ్యం అని గ్రహించరు ఒక్కరూ!! ఉన్నది నలుగురూ పంచుకుని వాడుకుంటే తప్పేంటి చెప్పండి.
ఉన్నదే కదా వాడతాం,లేనిదాని జోలికి ఎవడు వెడతాడు?!

నీ దగ్గర ఉన్నదీ ఆంటే,నువ్వేమన్నా స్రృష్టించావా,లేదే! మరింకెందుకయ్యా అంత ఇది,పక్కవాడు వాడేస్తున్నాడని!పంచుకోవటంలోని హాయి తెలిస్తేనా!!

కనక ఇదొక చిన్న వెసులుబాటు.మనలో మనకి ఆ మాత్రమ్ సర్దుబాటు లేకపోతే ఎట్లా చెప్పండి.
అంతా అనుకోవటంలో ఉందండీ,
అదే “ఆలోచనలో”!

ఇంగ్లీషువాడు అందం గురించి చెప్తూ,”అందం” చూసే వాడి చూపులో ఉంది”, అని కదూ చెప్పటం! దానికిది మనం మహారాజుగా జోడించవచ్చు,

“వస్తువు విలువ, చేసే ఆలోచనలో ఉందని!!”

మనది మాత్రమే అనుకోవటం,సంకుచితత్త్వం! నాకు చెడ్డ చిరాకు!!
అందరిదీ అనుకోవటం,దొడ్డ వారి లక్షణం!!

ఏమంటారు?!!”

*****

ఏమి అనటానికీ అక్కడ ఆయన ఉంటేగా!

ఈ వాలకం తెమిల్చేది కాదని, ‘మన’ అనుకొని వచ్చినది, ‘పర’ అయిపోయిందనీ, ఇంటి ముఖం పట్టినట్టున్నాడు.

తెల్లవో, నీళ్ళవో, ఆ మజ్జిగ నీళ్లయినా తాగాడు కాదు పాపం!!

******

భలేవారే,మజ్జిగ నీళ్ళైనా,నీళ్ళ మజ్జిగైనా,తాగడానికి ఈయన ఇస్తేగా!

వఠ్ఠి మాటల, నీటి మూటల ఆసామి!

ఎట్నుంచి ఎటోగాడు!!ఎగేసే జోగినాథం కంటే నాల్గాకులు
ఎక్కువే చదివిన మోతుబరి!

మొహమాటం ఎందుకూ, శుధ్ధ “మోసబరి! ”

మరే!!

*****. ******** *****. ********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked